రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల పక్కన అవసరమైన సదుపాయాలను సమకూర్చే సంస్థలకు ఉద్దేశించిన ‘హమ్ సఫర్ విధానాన్ని’ ఆవిష్కరించిన కేంద్ర రహదారి రవాణా - హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ
జాతీయ రహదారులను వినియోగించుకునే వారికి సురక్షిత ప్రయాణాన్ని, సుఖవంత ప్రయాణాన్ని అందించాలన్నదే ‘హమ్ సఫర్ విధానం’ లక్ష్యం: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ
ఆదరణకు నోచుకోకుండా ఉన్న వర్గాలకు ప్రయోజనాలను కల్పించడంతో పాటు పర్యావరణ మిత్రపూర్వక హైవే వసతి, సదుపాయాలను‘హమ్ సఫర్ విధానం’ ప్రోత్సహించనుందన్న కేంద్ర మంత్రి
మంచి ప్రమాణాలు కలిగిన హైవే సేవల అందజేత ద్వారా యాత్రికులకు మరింత చక్కని అనుభూతిని కలిగించనున్న హమ్ సఫర్ విధానం
ఎన్‌హెచ్ఏఐ కు చెందిన ‘రాజ్‌మార్గ్ యాత్ర’ ఏప్ సాయంతో సేవా ప్రదాత సంస్థలకు మరింత ఎక్కువ ఆన్ లైన్ సందర్శనల తాలూకు ప్రయోజనం
Posted On:
08 OCT 2024 4:08PM by PIB Hyderabad
‘హమ్ సఫర్ విధానా’న్ని కేంద్ర రహదారి రవాణా - హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ న్యూ ఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. జాతీయ రహదారులలో ప్రయాణించేందుకు మరింత అనుకూలతను కలుగజేయడంతో పాటు రహదారుల వెంబడి సదుపాయాలను అభివృద్ధి పరచడానికి మరింత జోరును జోడించే ఈ విధానం ప్రారంభ కార్యక్రమంలో రహదారి రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్‌టా కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర రహదారి రవాణా - హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ మాట్లాడుతూ, సమాజంలో అంతగా ఆదరణకు నోచుకోనటువంటి స్థానిక వర్గాల వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఈ పథకం వినియోగదారులకు వారి ప్రయాణాన్ని సాఫీగాను, సురక్షితమైందిగాను, సుఖవంతమైందిగాను మార్చివేయడంలో సాయపడనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానాన్ని పర్యావరణం, ఇంకా స్వచ్ఛత.. ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కారణంగా ఇది పరిసరాలకు మిత్రపూర్వకంగా ఉంటుందన్నారు. ఈ విధానాన్ని రూపొందించేటప్పుడు జల సంరక్షణ, భూ సంరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, సౌర శక్తిలపైన శ్రద్ధ వహించామని కూడా ఆయన అన్నారు.
ఈ విధానం అమలు ద్వారా తరచు ప్రయాణాలు చేసే యాత్రికులకు నాణ్యమైన సేవలు లభించేటట్లుగా జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ సూచించారు. ఇవే ఆశయాలతో అనేక సౌకర్యాలను భారత జాతీయ హైవేల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చాలా హరిత హైవేలను ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు.
జాతీయ రహదారుల పక్కన పెట్రోల్ పంపులను నడుపుతున్న యజమానులు వారి వారి పెట్రోల్ పంపుల వద్ద నియమాల ప్రకారం కనీస సౌకర్యాలు ఉండేటట్లు శ్రద్ధ వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ విధానం ముఖ్యోద్దేశం జాతీయ రహదారిలో ప్రయాణించే వ్యక్తులకు మెరుగైన అనుభూతి లభించేటట్లు చూడాలన్నదే. ఫుడ్ కోర్టు, కేఫెటీరియా, ఫ్యూయల్ స్టేషన్, విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం, వాహనాలను నిలిపి ఉంచడానికి అనువైన స్థలాలు, టాయిలెట్ ల సౌకర్యం, పసిపిల్లల సంరక్షణకు తోడ్పడే గది, ఏటీఎమ్, వాహనాల మరమ్మతు సదుపాయం, ఔషధ సేవలు వంటివి ఈ విధానంలో భాగంగా ఉన్నాయని ఆయన వివరించారు.
రహదారి రవాణా - హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్‌టా మాట్లాడుతూ, శ్రీ నితిన్ గడ్‌కరీ మార్గదర్శకత్వంలో ఒకటిన్నర లక్షల కి.మీ. మేర జాతీయ రహదారులను వేయడమైందన్నారు. దేశంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయల కల్పన సంబంధిత గతిని ప్రధాన మంత్రి దార్శనికతకు తోడు కేంద్ర రహదారి రవాణా - హైవేల శాఖ మంత్రి మార్గదర్శకత్వం మార్చివేస్తోందని కూడా శ్రీ అజయ్ టమ్‌టా అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్‌కరీ, సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్‌టా లు సందర్శించారు.
ఈ విధానం నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వే ల వెంబడి ఇప్పటికే సేవలను అందిస్తున్న వర్గాలకు తోడు త్వరలో ఆయా సేవలను అందించనున్న వర్గాల వారు సైతం మంచి ప్రమాణాలు కలిగిన, చక్కటి నిర్వహణకు పూచీ పడే, పారిశుధ్య ప్రధానమైన సదుపాయాల అండదండలు ప్రయాణికులకు లభించేటట్లుగా ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ను కొనితేనుంది. తినుబండారాలు, ఫ్యూయల్ స్టేషన్, ఇంకా చికిత్సా కేంద్రాలకు చెందిన కేటగిరీలలో ఈ సరికే సేవలను అందిస్తున్న వర్గాలతో పాటు త్వరలో ఈ తరహా సేవలను అందించనున్న వర్గాలు కూడా హంసఫర్ విధానంలో భాగంగా వాటి పేరులను నమోదు చేసుకోవడానికి అర్హతను పొందనున్నాయి. సంబంధిత వర్గాలన్నింటికీ ప్రయోజనం కలుగజేయాలని ఈ విధానం లక్ష్యంగా పెట్టుకొంది. పేరులను నమోదు చేసుకొన్న సేవా ప్రదాత సంస్థలు ఇప్పటికే వాటికి ఉన్న అనుమతి తాలూకు పునరుద్ధరణ సంబంధిత రుసుముల రద్దు తాలూకు లాభాన్ని అందుకోవడంతో పాటు తమ (సంస్థల) ఉనికిని చాటే బోర్డులను ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల పక్కన తగిన జాగాను కూడా పొందనున్నాయి. దీనికి అదనంగా, ఆయా వర్గాలు ఎన్‌హెచ్ఏఐ కి చెందిన ‘రాజమార్గ యాత్ర’ అనే మొబైల్ ఏప్ లో చోటును సంపాదించుకోగలుగుతాయి.
‘హమ్ సఫర్’ విధానం ప్రయాణికులకు మంచి ప్రమాణాలతో కూడిన, చక్కగా నిర్వహిస్తున్న, పరిశుద్ధత కలిగిన సౌకర్యాలను అందించనుంది. తరచు ప్రయాణించే వారికి, వారి సమీపంలో ఉన్న సేవా ప్రదాత సంస్థల వివరాలను - ‘రాజ్ మార్గ్ యాత్ర’ ఏప్ ద్వారా- అందిస్తారు. ఈ ఏప్ ఏవైనా అంశాలపై ప్రయాణికులు వారి అభిప్రాయాన్ని తెలియ జేయడానికి, వారు వినియోగించుకొనే సదుపాయాల విషయంలో అవి ఏ స్థాయి ప్రమాణాలలో ఉన్నదీ రేటింగును ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. పేర్లు నమోదు చేసుకొన్న సేవల ప్రదాత సంస్థలు మూడు లేదా అంతకు మించిన సగటు రేటింగును నిలబెట్టుకొనే పక్షంలో, పునరుద్ధరణ రుసుము రద్దు సంబంధిత ప్రయోజనాన్ని అందుకో గలుగుతాయి.
తరచు ప్రయాణించే వారికి నాణ్యమైన సేవలను, సదుపాయాలను అందించడానికి గాను నమోదైన సేవల ప్రదాతల విషయంలో ‘పర్యవేక్షణ, తనిఖీ’ లకు సంబంధించిన కఠిన నియమాలను సైతం ఈ విధానం వివరించింది. ప్రాధికార సంస్థ నియమించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ నియమిత కాలాల్లో తనిఖీలను నిర్వహిస్తుంది. సేవా ప్రదాత సంస్థల రేటింగుల సగటు మూడు నక్షత్రాల స్థాయి కన్నా కిందకు పడిపోతే గనుక ఇ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ లను అందుకొంటాయి. ఆ కోవకు చెందిన సదుపాయాలను మరిన్ని ఎక్కువ సార్లు తనిఖీ లకు గురిచేయనున్నారు.
ప్రయాణికుల కోసం ఉన్నతమైన నాణ్యత కలిగిన సౌకర్యాలను అందించడం ద్వారా జాతీయ రహదారుల వెంట ప్రపంచ శ్రేణి సేవలను అందించడంలో ‘హమ్ సఫర్ విధానం’ మంచి ఫలితాలను ఇవ్వనుంది. దీనికి తోడు జాతీయ రహదారులను వాడుకొనే వర్గాలకు మొత్తం మీద యాత్రానుభవాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న వారిలో మంత్రిత్వ శాఖ లో డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ డి. సారంగి, ఎన్ హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్, మంత్రిత్వ శాఖ, ఎన్ హెచ్ఏఐ, ఎన్ హెచ్ఎల్ఎమ్ఎల్ ల ఉన్నతాధికారులు, రహదారుల పక్కన సదుపాయాలను అభివృద్ధి పరచే సంస్థల ప్రతినిధులు, ఆతిథ్య వ్యాపార సంస్థలు, చమురు అమ్మకం వ్యాపార సంస్థలు, విద్యుత్తుతో నడిచే వాహనాలకు చార్జింగ్ ను సమకూర్చే వ్యాపార సంస్థలు, సలహాదారులు, విద్యా రంగ ప్రముఖులు ఉన్నారు.
పూర్తి విధానాన్ని ఈ కింది లింకు లో చదవవచ్చు: -
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2024/oct/doc2024108411501.pdf
***
(Release ID: 2063346)
Visitor Counter : 53