ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం

Posted On: 07 OCT 2024 2:39PM by PIB Hyderabad

1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.


2. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ విధానం, సాగర్ లక్ష్యంలో భాగంగా మాల్దీవులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అలాగే మాల్దీవుల అభివృద్ధిలో సాయం చేయడానికి భారత్ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. తమ దేశానికి అత్యవసర ఆర్థిక సాయాన్ని సకాలంలో అందించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది మే, సెప్టెంబర్ నెలల్లో ఎస్‌బీఐ ద్వారా 100 మిలియన్ల అమెరికన్ డాలర్ల టీ-బిల్లులు అందించడమే కాకుండా తక్షణ ఆర్థిక అవరాల నిమిత్తం ఏడాది పాటు సాయాన్ని మాల్దీవులకు భారత్ అందించింది. తమ దేశానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ మొదట స్పందించేది భారతేనని ముయిజ్జు అన్నారు. మాలేలో 2014లో ఏర్పడిన  నీటి సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్ అందించిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు.

3. ప్రస్తుతం మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కీలకమైన ద్వైపాక్షిక కరెన్సీ  ఒప్పందంలో భాగంగా 400 మిలియన్ అమెరికన్ డాలర్లు, రూ.30 బిలియన్లను అందించేందుకు నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికి డా.మహ్మద్ ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టేందుకు ఇద్దరు నాయకులు అంగీకరించారు.

4. ద్వైపాక్షిక సంబంధాల్లో సమగ్ర మార్పులే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు రెండు దేశాలకు ఇదే సరైన సమయం అని నాయకులిద్దరూ అంగీకరించారు. సమగ్ర ఆర్థిక, నౌకా వ్యాపార భద్రతా భాగస్వామ్యానికి ప్రజలే కేంద్రంగా, భవిష్యత్తు ఆధారంగా హిందూ మహా సముద్ర ప్రాంతంలో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇది దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు తీసుకున్న నిర్ణయాలు:

I. రాజకీయ చర్చలు
నాయకులు, మంత్రుల స్థాయిలో చర్చలను ఉదృతం చేయడానికి, పార్లమెంట్ సభ్యులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను వాటిలో భాగస్వాములయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను ఉభయ పక్షాలు విస్తరింపచేస్తాయి. దీనికి అదనంగా, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో పరస్పర ప్రజాస్వామ్య విలువల తోడ్పాటును గుర్తిస్తూ, రెండు దేశాల పార్లమెంట్ల మధ్య సంస్థాగత సహకారాన్ని ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు.

II. అభివృద్ధి భాగస్వామ్యం

మాల్దీవుల ప్రజలకు ప్రయోజనాన్ని అందిస్తూ, ఇప్పటికీ కొనసాగుతున్న అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టుల పురోగతిని పరిగణనలోనికి తీసుకుని ఉభయపక్షాలు తీసుకున్న నిర్ణయాలు:
i. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గృహనిర్మాణం, ఆసుపత్రులు, రహదారి వ్యవస్థలు, క్రీడా సదుపాయాలు, పాఠశాలలు, నీరు, మురుగు పారుదల తదితర అంశాల్లో మాల్దీవుల అవసరాల ఆధారంగా అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించేలా కలసి పనిచేయాలి
ii. గృహనిర్మాణంలో సవాళ్లను పరిష్కరించేందుకు మాల్దీవులకు సహకారం అందించాలి. భారత్ సాయంతో నిర్మిస్తున్న సామాజిక గృహ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి.

iii. ప్రతిష్టాత్మక గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు (జీఎంసీపీ) సమయానికి పూర్తి చేసేందుకు అవసరమైన సాయం అందించడంతో పాటు థిలాఫుషి, గిరావారు దీవులను అనుసంధానించేలా ఈ ప్రాజెక్టు పొడిగించే విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలి.
iv. మాలే ఓడరేవులో రద్దీని తగ్గించడానికి, సరకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు వీలుగా థిలాఫుసీ ద్వీపంలో అత్యాధునిక నౌకాశ్రయ నిర్మాణానికి సహకారం అందించాలి.

v. మాల్దీవుల ఎకనామిక్ గేట్‌వే ప్రాజెక్ట్‌ కు దోహదపడేలా ఇహవంధిప్ఫోల్హు, గాధూ ద్వీపాల వద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాలు, బంకరింగ్ వ్యవస్థల అభివృద్ధికి భాగస్వామ్య అవకాశాలను అన్వేషించాలి.

vi. భారత సహకారంతో అభివృద్ధి చేస్తున్న హనిమాధూ, గన్ విమానాశ్రయాలతో పాటు మాల్దీవుల్లోని ఇతర విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు సంయుక్తంగా కృషి చేయాలి. ఈ దిశగా వాయు మార్గాలను బలోపేతం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, విమానాశ్రయాల సమర్థవంతమైన నిర్వహణకు సహకరించేలా ఉభయ పక్షాలు చర్యలు తీసుకుంటాయి.    

vii. "వ్యవసాయ ఆర్థిక మండలి", హా ధాలు దీవిలో పర్యాటక పెట్టుబడులు, హా అలీఫు దీవి వద్ద చేపల శుద్ధి, నిల్వ సదుపాయాలను భారత సహాయంతో ఏర్పాటు చేసే విషయంలో కలసి పని చేయాలి.

 viii. రెండు దేశాల మధ్య ఉన్న ప్రజా కేంద్రీకృత అభివృద్ధి భాగస్వామ్యాన్ని మాల్దీవుల్లోని ప్రతి మూలకు తీసుకెళ్లేందుకు గాను విజయవంతమైన, ప్రభావవంతమైన అభివృధ్ధి ప్రాజెక్టులకు అదనపు ఆర్థిక సాయం అందించి మరింత విస్తరించాలి.

III. వాణిజ్య, ఆర్థిక సహకారం.
ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడుల్లో ఇంత వరకూ ఉపయోగించని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు పక్షాలు అంగీకరించిన అంశాలు:

i. రెండు దేశాల మధ్య వస్తు, సేవల వ్యాపారంపై దృష్టి సారించేలా ద్వైపాక్షిక స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలి.

ii. భారత్, మాల్దీవుల మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగుపరిచేందుకు విదేశీ కరెన్సీపై ఆధారపడటం తగ్గించి స్థానిక కరెన్సీ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో లావాదేవీల పరిష్కారమార్గాన్ని అమలు చేయాలి.
iii. రెండు దేశాలకు చెందిన వ్యాపార వర్గాలు, సంస్థల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు, ఒప్పందాలను ప్రోత్సహించాలి. పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు, సులభతర వాణిజ్య విధానాలు అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
iv. వ్యవసాయం, మత్స్య రంగం, సముద్ర శాస్త్రం, బ్లూ ఎకానమీ తదితర రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేయడం ద్వారా ఆర్థిక రంగంలో వైవిధ్యాన్ని పెంపొందించేందుకు మాల్దీవులు చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించాలి. విద్య, పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని విస్తరించాలి.

 

***




(Release ID: 2063030) Visitor Counter : 39