మంత్రిమండలి
అంతర్జాతీయ ఇంధన సామర్ధ్య కూటమిలో భారత్ చేరేందుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్
ఇంధనానికి సంబంధించిన వ్యూహాత్మక పద్ధతులు, సృజనాత్మక పరిష్కారాలకు
16 దేశాల ప్రత్యేక కూటమిలోని వనరులను భారత్ వాడుకునేందుకు వీలు కల్పించనున్న ఈ నిర్ణయం
Posted On:
03 OCT 2024 8:25PM by PIB Hyderabad
అంతర్జాతీయ ఇంధన సామర్ధ్య కూటమిలో భారత్ చేరడానికి వీలు కల్పించే ఆసక్తి వ్యక్తీకరణ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై సంతకం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా సహకారాన్ని పెంపొందించుకోవడానికీ, ఇంధన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికీ అంకితమై పనిచేస్తోన్న అంతర్జాతీయ వేదిక- అంతర్జాతీయ ఇంధన సామర్ధ్య కూటమి (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్)లో భారతదేశం చేరనుంది. సుస్థిరాభివృద్ధి పట్ల భారత దేశపు నిబద్ధతను ఈ చేరిక బలపరుస్తుంది. అంతేకాకుండా హరిత గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే దిశగా తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది.
భారత్ సభ్యదేశంగా ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్య ఇంధన సహకారం (ఇంటర్నేషనల్ పార్ట్‌నర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోఆపరేషన్- ఐపీఈఈసీ) స్థానంలో 2020లో స్థాపించిన ఈ కూటమి విజ్ఞానం, ఉత్తమ పద్ధతులు, సృజనాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తుంది. హబ్‌లో చేరడం వల్ల విస్తారమైన నిపుణులు, వనరుల వ్యవస్థను వినియోగించుకునేందుకు భారత్‌కు అవకాశం కలుగుతుంది. ఇది దేశీయ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు వీలు కల్పిస్తుంది. జూలై 2024 నాటికి పదహారు దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, డెన్మార్క్, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, లక్సెంబర్గ్, రష్యా, సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్) ఈ హబ్‌లో చేరాయి.
హబ్‌లో సభ్యదేశంగా భారత్‌కు ఇతర సభ్య దేశాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు, సొంత నైపుణ్యాన్ని పంచుకోవడానికి, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా భారతదేశం ప్రయోజనం పొందనుంది. సమర్థవంతమైన ఇంధన సామర్థ్య- సాంకేతికతలు, పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ప్రయత్నాలకు కూడా దేశం తన వంతు సహాయం చేస్తుంది.
భారత్ తరఫున హబ్ కార్యక్రమాలు అమలు చేసే సంస్థగా చట్టబద్ధమైన సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ)’ని ఏర్పాటు చేశారు. హబ్ కార్యక్రమాల్లో భారత్ కార్యకలాపాలను చూసుకోవటంతో పాటు జాతీయ ఇంధన సామర్ధ్య లక్ష్యాలకు అనుగుణంగా భారత్ నడుచుకునే విషయంలో బీఈఈ కీలక పాత్ర పోషించనుంది.
కూటమిలో చేరడం ద్వారా మరింత సుస్థిర భవిష్యత్తు దిశగా భారత్ గణనీయంగా ముందడుగు వేయనుంది. ఈ ప్రపంచ స్థాయి సంస్థలో భారత్ భాగస్వామ్యం కావటం అల్ప కర్బన ఆర్థిక వ్యవస్థకు పరివర్తన చెందటాన్ని వేగవంతం చేయడానికి, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
***
(Release ID: 2061745)
Visitor Counter : 196
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam