ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఆంగ్ల అనువాదం: మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ స్థాయి 'పీఎం విశ్వకర్మ' కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 20 SEP 2024 3:17PM by PIB Hyderabad

భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

అమరావతి, వార్ధాతో సహా మహారాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.

రెండు రోజుల కిందట ‘విశ్వకర్మ పూజ’ పండుగను చేసుకున్నాం. ఈ రోజు, మనం పవిత్ర భూమి వార్ధాలో పీఎం విశ్వకర్మ యోజన విజయాన్ని వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ప్రత్యేకమైనంది. ఎందుకంటే, 1932లో ఇదే రోజు మహాత్మాగాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విశ్వకర్మ యోజన ఏడాది పూర్తవుతున్న సందర్బంగా వినోబా భావేకు చెందిన ఈ పవిత్రభూమి, మహాత్మాగాంధీ 'కర్మభూమి'. వార్ధాకు చెందిన ఈ ప్రాంతంలో జరుగుతోన్న ప్రస్తుత వేడుకలు 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్)కు సంబంధించి మన సంకల్పానికి కొత్త శక్తినిచ్చే సాధన, ప్రేరణల సంగమంగా ఉంటాయి. విశ్వకర్మ యోజన‌ ద్వారా శ్రమ, నైపుణ్యాన్ని ఉపయోగించి మెరుగైన భవిష్యత్తు అందేచేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ హామీలను నెరవేర్చడంలో మాకు వార్ధాలో బాపూజీ అందించే ప్రేరణ సహాయపడతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ, దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ నా అభినందనలు.

 

మిత్రులారా,

ఇవాళ అమరావతిలో పీఎం మిత్ర పార్కుకు కూడా శంకుస్థాపన చేశాను. నేటి భారత్ తన వస్త్ర పరిశ్రమను ప్రపంచ మార్కెట్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. భారత వస్త్ర రంగంపై వేల సంవత్సరాల గౌరవాన్ని పునరుద్ధరించడమే దేశ లక్ష్యం. అమరావతిలోని పీఎం మిత్ర పార్కు ఈ దిశగా మరో కీలక అడుగు. ఈ విజయం సాధించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

విశ్వకర్మ యోజన మొదటి వార్షికోత్సవం కోసం మేం మహారాష్ట్రను ఎంచుకున్నాం. విశ్వకర్మ యోజన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు కాబట్టి మేం పవిత్ర భూమి వార్ధాను ఎంపికచేశాం. ‘వికసిత్ భారత్’కు దేశంలో ఎంతో కాలం నుంచి ఉన్న ప్రాచనీ నైపుణ్యాలను ఉపయోగించడానికి ఈ కార్యక్రమం ఒక రోడ్ మ్యాప్‌. భారత వైభవాన్ని చాటిచెప్పే ఎన్నో అద్భుతమైన అధ్యాయాలు దేశ చరిత్రలో ఉన్నాయని గుర్తుంచుకోండి. ఈ సౌభాగ్యానికి పునాది ఏంటి? అది మన సంప్రదాయ నైపుణ్యాలు! ఆనాటి మన హస్తకళా నైపుణ్యం, ఇంజినీరింగ్, సైన్స్! అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ ఉత్పత్తిదారులం మనమే. మన లోహ సంబంధిత నైపుణ్యాలు ప్రపంచంలో సాటిలేనివిగా ఉండేవి. కుండల తయారీ నుంచి భవన నిర్మాణ డిజైన్ల వరకు మనతో పోలికే లేకుండా ఉండేది. ఈ విజ్ఞానాన్ని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికీ ఎవరు అందించారు? వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పాలు చెక్కటం, చెప్పులు కుట్టటం, తాపీ మేస్త్రీ మొదలైన వృత్తులు భారత వైభవానికి పునాదిగా నిలిచాయి. అందుకే వలస రాజ్యాల కాలంలో ఈ స్వదేశీ నైపుణ్యాన్ని నిర్మూలించడానికి బ్రిటిష్ వారు కుట్ర పన్నారు. ఈ కారణంగానే గాంధీజీ వార్ధా ప్రాంతం నుంచే గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించారు.

 

కానీ మిత్రులారా,

స్వాతంత్య్రానంతరం ఈ నైపుణ్యానికి దక్కాల్సిన గౌరవాన్ని గత ప్రభుత్వాలు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వాలు విశ్వకర్మ వర్గాన్ని నిరంతరం విస్మరించాయి. మన హస్తకళా నైపుణ్యాన్ని, నైపుణ్యాలను గౌరవించడం మరచిపోయిన భారత్ ప్రగతి, ఆధునికతలో కూడా వెనుకబడింది.

 

మిత్రులారా,

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల తర్వాత ఈ సంప్రదాయ నైపుణ్యాల్లో కొత్త శక్తిని నింపాలని మన ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా హామీలను నెరవేర్చేందుకు 'పీఎం విశ్వకర్మ' కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం ప్రధాన ఆలోచన.. 'సమ్మాన్' (గౌరవం), 'సామర్థ్య' (సామర్థ్యం), 'సమృద్ధి' (శ్రేయస్సు)! అంటే సంప్రదాయ నైపుణ్యాలకు గౌరవం, చేతివృత్తుల సాధికారత, విశ్వకర్మ సోదరుల జీవితాల్లో శ్రేయస్సు – అదే మా లక్ష్యం.

 

అంతేకాకుండా మిత్రులారా,

విశ్వకర్మ యోజన మరొక ప్రత్యేకత ఏమిటంటే, దీనిని అమలు చేయడానికి వివిధ శాఖలు ఏకతాటిపైకి వచ్చిన తీరు చాలా అద్భుతమైనది. దేశవ్యాప్తంగా 700కు పైగా జిల్లాలు.. 2,50,000 గ్రామ పంచాయతీలు, 5,000 పట్టణ స్థానిక సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే 18 రకాల వృత్తులకు చెందిన 20 లక్షల మందికిపైగా ఈ కార్యక్రమానికి అనుసంధానం అయ్యారు. కేవలం ఒక సంవత్సరంలో.. 800,000 మందికి పైగా హస్తకళానిపుణులు, కళాకారుల నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పొందారు. ఒక్క మహారాష్ట్రలోనే 60 వేల మందికి శిక్షణ అందింది. ఈ శిక్షణలో ఆధునిక యంత్రాలు, డిజిటల్ టూల్స్ వంటి కొత్త సాంకేతికతలు ఉన్నాయి. ఇప్పటివరకు 6,50,000 మందికి పైగా విశ్వకర్మ సోదరులు కూడా ఆధునిక పరికరాలను పొందారు. వీటివల్ల వారి ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడింది, వారి ఉత్పాదకత పెరిగింది. అంతేకాకుండా ఒక్కో లబ్ధిదారుడికి రూ.15 వేల విలువైన ఈ-వోచర్ ఇస్తున్నారు. వారు తమ వ్యాపారాలను విస్తరించడానికి పూచీకత్తు లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. విశ్వకర్మ సోదర సోదరీమణులకు ఏడాదిలోనే రూ.1,400 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపేందుకు సంతోషిస్తున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే విశ్వకర్మ యోజన ప్రతీ అంశాన్ని చూసుకుంటోంది. అందుకే విశ్వకర్మ యోజన అంత విజయవంతమైంది, ప్రజాదరణ పొందింది.

 

ఇప్పుడే మన జితన్ రామ్ మాంఝీ గారు ఎగ్జిబిషన్ గురించి వివరిస్తున్నారు. నేను ఎగ్జిబిషన్‌ను సందర్శించాను. మన ప్రజలు సాంప్రదాయకంగా చేసే నమ్మశక్యం కాని పనిని అక్కడ చూశాను. వాళ్ల వ్యాపారాలను పెంచుకునేందుకు కొత్త ఆధునిక సాంకేతిక సాధనాలు, శిక్షణ, మూలధనాన్ని అందించినప్పుడు, వారు అసాధారణ ఫలితాలను సాధిస్తారు. దీన్ని నేను ఇప్పుడే చూశాను. ఇక్కడున్న మీ అందరిని ఈ ఎగ్జిబిషన్‌ తప్పకుండా సందర్శించాలని కోరుతున్నాను. జరిగిన అమోఘమైన పరివర్తనను చూసి మీరు చాలా గర్వపడతారు.

 

మిత్రులారా,

మన సంప్రదాయ వృత్తులను ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఆచరిస్తున్నాయి. గత ప్రభుత్వాలు విశ్వకర్మ సోదరులను పట్టించుకుని ఉంటే ఈ వర్గాలకు గొప్ప సేవ జరిగేది. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పురోగమించకుండా అడ్డుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన దళిత, వెనుకబడిన వర్గాల వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థ నుంచి తొలగించాం. విశ్వకర్మ యోజన ద్వారా నేడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే ఎక్కువగా లబ్ది పొందుతున్నాయని గత ఏడాది గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంప్రదాయ హస్తకళల్లో నిమగ్నమైన విశ్వకర్మలు కేవలం చేతివృత్తుల వారుగా మిగిలిపోకూడదని నేను కోరుకుంటున్నాను. మీరంతా పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందుకే విశ్వకర్మ సోదరసోదరీమణుల పనులకు ఎంఎస్ఎంఈల హోదా ఇచ్చాం. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్), ఏక్తా మాల్ వంటి కార్యక్రమాల ద్వారా సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నాం. ఈ వృత్తుల్లోని వారు తమ వ్యాపారాలను విస్తరించి, పెద్ద కంపెనీల సరఫరా వ్యవస్థలో భాగస్వాములు కావడమే మా లక్ష్యం.

 

ఈ కారణంగా,

చేతివృత్తులవారు, కళాకారులు, చిన్న వ్యాపార యజమానులు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ఓఎన్‌డీసీ, జీఈఎం వంటివి తోడ్పడుతున్నాయి. ఆర్థిక పురోగతిలో వెనుకబడిన వర్గం భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ ప్రారంభం తెలియజేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ కూడా బలం చేకూరుస్తోంది. 'కౌశల్ వికాస్ అభియాన్' (స్కిల్ డెవలాప్మెంట్ కార్యక్రమం) కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు నేటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ లభించింది. దేశంలో నైపుణ్యాలకు సంబంధించిన స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునకు నోచుకుంటున్నాయి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా జితేంద్ర చౌదరి నేతృత్వంలో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. ఆయన సారథ్యంలో ఈ ఏడాది ఫ్రాన్స్‌లో ప్రపంచ నైపుణ్యాలకు సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం జరిగింది. మనం తరచుగా ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఫ్రాన్స్‌లో నైపుణ్యాలను ప్రదర్శించే ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. మన చిన్న తరహా చేతివృత్తులవారు, కార్మికులు చాలా మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇందులో భారత్ అనేక అవార్డులను గెలుచుకుంది.

 

మిత్రులారా,

మహారాష్ట్ర అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో వస్త్ర పరిశ్రమ ఒకటి. విదర్భలోని ఈ ప్రాంతం అధిక-నాణ్యత కలిగిన పత్తి ఉత్పత్తికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్, ఆ తర్వాత మహా కూటమి ప్రభుత్వాలు ఏం చేశాయి? పత్తి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగి మార్చి, మహారాష్ట్ర రైతులను చైతన్యవంతం చేయడానికి బదులు వారిని కష్టాల్లోకి నెట్టారు. ఈ పార్టీలు రైతుల పేరుతో కేవలం రాజకీయాలు, అవినీతి చేశాయి. 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పరిస్థితి మారటం ప్రారంభమైంది. అప్పట్లో అమరావతిలోని నందగావ్ ఖండేశ్వర్‌లో టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ గ్రామ పరిస్థితి ఏంటో గుర్తుందా? అక్కడకు రావడానికి ఏ పరిశ్రమ కూడా సుముఖంగా ఉండకపోయేది. కానీ ఇప్పుడు అదే ప్రాంతం మహారాష్ట్రకు ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది.

 

మిత్రులారా,

పీఎం-మిత్ర పార్కులో శరవేగంగా జరుగుతున్న పురోగతి.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ఇలాంటి ఏడు పీఎం-మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. "ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ (పొలం నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి వస్త్రం, వస్త్త్రం నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు)" అనేది మా విజన్. అంటే విదర్భ కాటన్ నుంచి ఇక్కడే నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయనున్నారు. ఫ్యాషన్ తీరుతెన్నులకు అనుగుణంగా ఇక్కడే దుస్తులు తయారు చేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. దీంతో రైతులు ఎదుర్కొనే వ్యవసాయ నష్టాలకు తెరపడనుంది. వారు పండించిన పంటలకు మంచి ధర లభించడంతో పాటు వాటికి విలువ చేకూరుతుంది. ఒక్క పీఎం-మిత్ర పార్కుకు రూ.8,000 నుంచి రూ.10,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉంది. దీంతో విదర్భ, మహారాష్ట్రలోని యువతకు లక్షకు పైగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడకు వచ్చేందుకు ఇతర పరిశ్రమలను కూడా ఇక్కడ ప్రోత్సహిస్తాం, కొత్తగా పరస్పరానుబంధ సరఫరా వ్యవస్థలను సృష్టించనున్నాం. తద్వారా దేశ ఎగుమతులు, ఆదాయాలు పెరుగుతాయి.

 

సోదర సోదరీమణులారా,

ఈ పారిశ్రామిక పురోగతికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని కూడా మహారాష్ట్ర సిద్ధం చేస్తోంది. కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్ రహాదారులు, సమృద్ధి మహామార్గ్.. జల, వాయు అనుసంధానాన్ని విస్తరించటం ద్వారా మహారాష్ట్ర కొత్త పారిశ్రామిక విప్లవానికి సన్నద్ధమవుతోంది.

 

మిత్రులారా,

 

మహారాష్ట్ర బహుముఖ ప్రగతికి నిజమైన కథా నాయకులు ఇక్కడి రైతులేనని నేను నమ్ముతున్నాను! మహారాష్ట్ర, ముఖ్యంగా విదర్భ రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకే రైతుల అభ్యున్నతి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6,000 అందిస్తోండగా, మహారాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6,000 ఇస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు మహారాష్ట్రలోని రైతులకు ఏటా రూ.12,000 అందుతోంది. రైతులు పంట నష్టాన్ని పొందకూడదనే ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయికే పంటల బీమాను ప్రవేశపెట్టాం. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసింది. ఈ ప్రాంతంలోని సాగునీటి సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం అనేక చర్యలను తీసుకోవటం ప్రారంభించింది. అయితే మధ్యంతర ప్రభుత్వం అన్ని పనులను నిలిపివేసింది. ప్రస్తుత ప్రభుత్వం మరోసారి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పనులను వేగవంతం చేసింది. వెన్‌గంగ, నల్‌గంగ నదులను అనుసంధానం చేసేందుకు రూ.85 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు ఇటీవలే ఆమోదం లభించింది. నాగ్‌పూర్, వార్ధా, అమరావతి, యావత్మాల్, అకోలా, బుల్ధానా.. ఆరు జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది.

 

 

మిత్రులారా,

మహారాష్ట్ర రైతుల డిమాండ్లను నెరవేరుస్తున్నాం. ఉల్లిపై ఎగుమతి పన్ను 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించాం. దిగుమతి చేసుకునే వంట నూనెలపై 20 శాతం పన్ను విధించాం. శుద్ధి చేసిన సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెరిగింది. ఇది మన సోయాబీన్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. వీటి ఫలితాలను త్వరలోనే చూస్తాం. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. రైతులను ఈ విపత్కర పరిస్థితుల్లోకి నెట్టిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మరో అవకాశం ఇవ్వలేం. కాంగ్రెస్ అంటే ఒకటే - అబద్ధాలు, మోసం, నిజాయితీ లేనితనం! తెలంగాణలో ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ వంటి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కోసం రైతులు నానా తంటాలు పడుతున్నా ఎవరూ వినడం లేదు. మహారాష్ట్రలో వారి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

 

మిత్రులారా,

 

మహాత్మాగాంధీ, ఇతర మహానేతలున్న కాంగ్రెస్ వేరు... ఇప్పుడు మనం చూస్తున్న కాంగ్రెస్ కాదు. నేటి కాంగ్రెస్ దేశభక్తిని కోల్పోయింది. దానికి బదులు ద్వేషమనే దెయ్యం పట్టుకుంది. కాంగ్రెస్ నేతలు మాట్లాడే తీరు, వారి ప్రకటనలు, విదేశాలకు వెళ్లి సొంత దేశానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సమాజాన్ని విభజించడం, దేశాన్ని విభజించడం, భారతీయ సంస్కృతి, విశ్వాసాలను అగౌరవపరచడం గురించి మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్‌ను ఇప్పుడు 'తుక్డే తుక్డే గ్యాంగ్' (వేర్పాటువాద శక్తులు), అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారు. నేడు దేశంలో అత్యంత అవినీతి, నిజాయితీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే. అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాచకుటుంబమే.

 

మిత్రులారా,

మన విశ్వాసాన్ని, సంస్కృతిని గౌరవించే ఏ పార్టీ అయినా గణపతి ఆరాధనను వ్యతిరేకించదు. కానీ నేటి కాంగ్రెస్‌కు గణేష్‌ పూజపై ద్వేషం కూడా ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో లోకమాన్య తిలక్ నాయకత్వంలో గణపతి పండుగ భారత ఐక్యతకు ప్రతీకగా మారిందనడానికి మహారాష్ట్రనే సాక్ష్యం. గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఒక్కటయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను అసహ్యించుకుంటుంది. నేను గణేష్ పూజకు హాజరైనప్పుడు, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను ప్రేరేపించింది. వారు గణపతి వేడుకను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాల కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంది. కర్ణాటకలో ఏం జరిగిందో మీరంతా చూశారు-అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గణపతిని కూడా ఖైదీగా చేసేంత వరకు వెళ్లింది! ప్రజలు పూజిస్తున్న విగ్రహాన్ని పోలీసు వ్యాన్‌లో పెట్టారు. ఒకవైపు మహారాష్ట్రలో గణపతిని పూజిస్తుంటే, మరోవైపు కర్ణాటకలో గణపతి విగ్రహాన్ని ఖైధీగా పోలీసు వ్యాన్‌లో ఉంచారు.

 

మిత్రులారా,

గణేషుడి పట్ల ఈ అగౌరవంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు సైతం ఈ విషయంలో మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు కూడా కాంగ్రెస్ ప్రభావానికి లోనయ్యారు, గణపతికి జరిగిన అవమానాన్ని ఎదిరించే ధైర్యం వారికి లేదు.

 

సోదర సోదరీమణులారా,

కాంగ్రెస్ చేసిన ఈ పాపాలకు మనమంతా ఏకమై సమాధానం చెప్పాలి. సంస్కృతి సంప్రదాయం, పురోభివృద్ధితో కలిసి నిలబడాలి. గౌరవం, అభివృద్ధి కోసం ఏకమై నిలబడాలి. అందరం కలిసి మహారాష్ట్ర గౌరవాన్ని కాపాడుదాం, అందరం కలిసి మహారాష్ట్ర వైభవాన్ని పెంచుదాం. మేం మహారాష్ట్ర కలలను సాకారం చేస్తాం. ఈ స్ఫూర్తితో ఈ ముఖ్యమైన పథకాలకు మీరు చూపించిన అపారమైన మద్దతును చూస్తే.. ఈ పథకాలు విదర్భ, భారత్‌ అంతటా ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో నేను అర్థం చేసుకోగలను. విశ్వకర్మ సోదరసోదరీమణులందరినీ.. విదర్భ, మహారాష్ట్రలోని నా తోటి ప్రజలందరినీ నేను మరోసారి అభినందిస్తున్నాను.

 

నాతో పాటు చెప్పండి

భారత్ మాతాకీ - జై!

 

రెండు చేతులూ పైకెత్తి పూర్తి శక్తితో చెప్పండి

భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

ధన్యవాదాలు.

 

****



(Release ID: 2058467) Visitor Counter : 11