నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రాంతీయ భాషల్లో ఉచిత ఆన్ లైన్ శిక్షణ: ఐటీఐ విద్యార్థుల కోసం ఎన్ఐఎంఐ యూట్యూబ్ చానళ్లు

Posted On: 12 SEP 2024 4:38PM by PIB Hyderabad

వృత్తి విద్యను మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్య శిక్షణ సంచాలక కార్యాలయం (డీజీటీ), నైపుణ్యాభివృద్ధి- ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ బోధన మాధ్యమ సంస్థ (ఎన్ఐఎంఐ) యూట్యూబ్ చానళ్లను ప్రారంభించింది. ఈ డిజిటల్ కార్యక్రమం దేశంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ) నైపుణ్యాలకు సంబంధించి లక్షలాది మంది అభ్యాసకులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన శిక్షణను వీడియోల ద్వారా అందిస్తుంది. తొమ్మిది భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

ఇంగ్లిష్, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాలం, తెలుగు, కన్నడ భాషల్లో కొత్త చానళ్లు అందుబాటులో ఉంటాయి. ఉచితంగా, సులభంగా అందుబాటులో ఉండే సాంకేతిక వనరుల ద్వారా సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో అభ్యాసకులకు సహాయపడడం వీటి లక్ష్యం. ప్రతీ చానల్ లో శిక్షణ పాఠాలు, నైపుణ్య ప్రదర్శనలు, ప్రయోగాత్మక పాఠాలు ఉంటాయి. నేటి శిక్షణ విధానానికి తగినట్టుగా ఆ రంగాల్లో నిపుణుల ద్వారా వాటిని రూపొందిస్తారు.

ముఖ్యాంశాలు:

తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ఉచితంగా పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి.
తయారీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ వంటి రంగాల్లో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోధన సామగ్రి.
ఎప్పటికప్పుడు నవీకరించిన సమాచారం ద్వారా, తాజా పారిశ్రామిక నైపుణ్య అంశాలను అభ్యాసకులకు తెలియపరచడం.
ఎన్ఐఎంఐ ప్రస్తుత కార్యక్రమం జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్, నూతన విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. వృద్ధి చెందుతున్న పరిశ్రమలకు దోహదపడేలా శిక్షణ అందించడం ద్వారా భారతీయ శ్రామిక శక్తిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం దీని లక్ష్యం.

వృత్తి విద్యలో పరివర్తన తేవడంలో డిజిటల్ వేదికలు కీలకపాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నట్టు ఎన్ఐఎంఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘పలు భాషల్లో పాఠ్యాంశాలను అందించడం ద్వారా, విద్య దేశ నలుమూలలకూ చేరేలా చూస్తున్నాం. తద్వారా అభ్యసనను సమ్మిళితం చేయడంతో పాటు, ఆవశ్యకమైన పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలను సాధించేలా అభ్యాసకులను సాధికారులను చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

తమకు కావాల్సిన ప్రాంతీయ ఛానళ్లను సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, నవీకృత సమాచారంతో తాజా పాఠ్యాంశాలను పొందేలా ఐటీఐ విద్యార్థులు, బోధకులు, నైపుణ్య ఔత్సాహికులను ఎన్ఐఎంఐ ప్రోత్సాహిస్తుంది.

మరింత సమాచారం కోసం ఎన్ఐఎంఐ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు లేదా ఎన్ఐఎంఐ డిజిటల్ చానల్ ను యూట్యూబ్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. 

 

***



(Release ID: 2054442) Visitor Counter : 22