మంత్రిమండలి
2024-25 నుంచి 2028-29 వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన- IV అమలుకు కేబినెట్ ఆమోదం
ఈ పథకం మొత్తం వ్యయం రూ.70,125 కోట్లు
కొత్త రహదారులతో 25,000 అనుసంధానం కాని ఆవాసాలను కలిపేలా ప్రణాళిక; కొత్త వంతెనల నిర్మాణం/ఆధునికీకరణ
Posted On:
11 SEP 2024 8:16PM by PIB Hyderabad
2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన -4 (పీఎంజీఎస్ వై-4) అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
అనుసంధానం చేయవలసి ఉండీ ఇంతవరకూ చేయని 25,000 ఆవాసాలను కలిపేలా 62,500 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దాంతోపాటు కొత్త అనుసంధాన రహదారులపై కొత్త వంతెనల నిర్మాణం/ఆధునికీకరణను కూడా చేపడతారు. ఈ పథకానికి మొత్తం రూ.70,125 కోట్లు ఖర్చవుతుంది.
పథకం వివరాలు:
కేబినెట్ ఆమోదించిన వివరాలిలా ఉన్నాయి.
i. 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన-4ను ప్రారంభించారు. ఈ పథకం మొత్తం వ్యయం రూ.70,125 కోట్లు (కేంద్ర వాటా రూ.49,087.50 కోట్లు, రాష్ట్ర వాటా రూ.21,037.50 కోట్లు).
ii. 2011 జనాభా లెక్కల ప్రకారం మైదాన ప్రాంతాల్లో 500కు పైగా; ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేక హోదా ప్రాంతాల్లో (షెడ్యూల్-5లోని గిరిజన ప్రాంతాలు, అభిలషణీయ జిల్లాలు/బ్లాకులు, ఎడారి ప్రాంతాలు) 250కి పైగా; వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో 100కు పైగా జనాభా కలిగిన మొత్తం 25,000 ప్రాంతాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
iii. ఈ పథకం ద్వారా అనుసంధానం కాని ఆవాసాలకు 62,500 కి.మీ. మేర అన్ని రకాల రహదారి సదుపాయాలను కల్పిస్తారు. అన్ని రకాల రహదారుల అనుసంధానంతోపాటు అవసరమైన వంతెనల నిర్మాణం కూడా చేపడతారు.
ప్రయోజనాలు:
అనుసంధానం కాని 25,000 ఆవాస ప్రాంతాలను అన్ని రకాల రహదారుల ద్వారా కలపాలని నిర్ణయించారు.
అన్ని రకాల రహదారులు ఆవశ్యకమైన సామాజిక-ఆర్థికాభివృద్ధికి, మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రేరకాలుగా ఉంటాయి. వాటి ద్వారా జనావాసాలను కలుపుతూనే, స్థానికుల ప్రయోజనాల కోసం సమీపంలోని ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, మార్కెట్, వృద్ధి కేంద్రాలతో సాధ్యమైనంత వరకు అనుసంధానం చేస్తారు.
పీఎంజీఎస్ వై-4 రహదారి నిర్మాణాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు, ఉత్తమ విధానాలను పాటిస్తుంది. పరిసర ఉష్ణ సాంకేతికత (కోల్డ్ మిక్స్ టెక్నాలజీ), వ్యర్థ ప్లాస్టిక్, ప్యానెల్డ్ సిమెంట్ కాంక్రీట్, కణ పూరిత కాంక్రీట్, లోతట్టు ప్రాంత పునరుద్ధరణ (ఫుల్ డెప్త్ రిక్లెమేషన్), నిర్మాణ వ్యర్థాల వినియోగం, ఫ్లై యాష్, స్టీలు వ్యర్థాల వినియోగం వంటి విధానాలను ఉపయోగిస్తారు.
పీఎంజీఎస్ వై-4 రహదారి ప్రణాళికను ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ద్వారా రూపొందిస్తారు. పీఎం గతిశక్తి పోర్టల్ లోని ప్రణాళిక విభాగం డీపీఆర్ తయారీకి కూడా తోడ్పడుతుంది.
***
(Release ID: 2054010)
Visitor Counter : 197
Read this release in:
Punjabi
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Gujarati
,
Kannada