మంత్రిమండలి
ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా, కేంద్ర మంత్రి మండలి ఆమోదం
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా ద్వారా 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి
Posted On:
11 SEP 2024 8:08PM by PIB Hyderabad
ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమాను అందించాలనే ప్రతిపాదనకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ బీమాను అందిస్తారు.
ఈ ఆరోగ్య బీమాతో 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరేలా కుటుంబ ప్రాతిపదికన రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది.
ఈ ఆమోదంతో, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏబీ పిఎం -జేఏవై ( AB PM-JAY) ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. ఈ పథకం కింద అర్హులైన సీనియర్ సిటిజన్‌లందరికీ ప్రత్యేకమైన కార్డ్ అందిస్తారు. ఇప్పటికే ఏబీ పిఎం -జేఏవై ( AB PM-JAY) కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులు ఏడాదికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ లబ్ధిని పొందుతారు (దీనిని వారు 70 సంవత్సరాల కంటే తక్కువ vayasunna ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోవలసిన అవసరం లేదు).
70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్‌లందరూ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ 5 లక్షల వరకు కవరేజీ పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ,CGHS), మాజీ సైనికోద్యుగుల భాగస్వామ్య ఆరోగ్య పథకం (ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్‌లు వారి ప్రస్తుత పథకాన్ని కొనసాగించవచ్చు లేదా ఏబీ పిఎంజేఏవైని ( AB PMJAY) ఎంచుకోవచ్చు.
ప్రైవేట్ సంస్థల ఆరోగ్య బీమా పాలసీల ద్వారాను లేదా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే బీమా పథకం కింద ఉన్న70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్‌లు ఏబీ పిఎం జెఏవై (AB PM-JAY) కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏబీ పిఎం జేఏవై (AB PM-JAY) అనేది ప్రభుత్వ ఆద్వర్యంలో ప్రపంచంలోనే భారీగా నిధుల కేటాయింపు జరిగే ఆరోగ్య హామీ పథకం. ఇది12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది వ్యక్తులకు ప్రతి ఏడాది ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తుంది. ఆసుపత్రుల్లో చేరినవారికి ద్వితీయ, తృతీయ సంరక్షణ అందిస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలలోని సభ్యులందరూ పథకం కింద లబ్ధి పొందుతారు. ఈ పథకం ఇంతవరకూ 49 శాతం మంది మహిళా లబ్ధిదారులతో సహా 7.37 కోట్ల మందికి ఆరోగ్య సేవలందించింది. తద్వారా ప్రజలకు ఈ పథకం కింద రూ. లక్ష కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.
70 ఏళ్లు, అంతకుపైగా వయసున్న సీనియర్ పౌరులకు ఆరోగ్య బీమా విస్తరణ వుంటుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 2024న ప్రకటించారు.
ఏబీ పిఎం జేఏవై (AB PM-JAY) పథకం కింద లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే వుంది. మొదటగా ఈ పథకం కింద 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలు కవరయ్యాయి. అంటే దేశ జనాభాలో వీరు 40 శాతం. తర్వాత జనవరి 2022లో ఏబీ పిఎం జేఏవై (AB PM-JAY) పథకం కింద లబ్ధి దారుల బేస్ ను 10.74 కోట్లనుంచి 12 కోట్లకు సవరించారు. 2011 జనాభాతో పోల్చినప్పుడు దశాబ్ద కాలంలో జనాభావృద్ధి 11.7 శాతం పెరిగివుంటుందని భావించి ఈ సవరణ చేశారు.
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 37 లక్షల మంది ఆశాలు/ఏడబ్ల్యూడబ్ల్యూలు/ఏడబ్ల్యూహెచ్‌లు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య ప్రయోజనాల కోసం పథకాన్ని మరింత విస్తరించారు. ఈ మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెలుతూ..ఏబీ పిఎం జేఏవై కింద దేశవ్యాప్తంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల పౌరులందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించాలని నిర్ణయించారు.
****
(Release ID: 2054004)
Visitor Counter : 354
Read this release in:
Assamese
,
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam