హోం మంత్రిత్వ శాఖ

ఐ4సీ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖామంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమం

సైబర్ నేరాల నివారణ కోసం నాలుగు ప్రధాన కార్యక్రమాల ప్రారంభం



ప్రధాని శ్రీ మోదీ చొరవతో సురక్షిత సైబర్ స్పేస్ ప్రచారంలో భాగంగా ప్రారంభమైన ఐ4సీ

నేడు దేశ సైబర్ భద్రతకు బలమైన మూలస్తంభంగా మారిన ఐ4సీ



ఈ రోజు ప్రారంభించిన నాలుగు 'ఐ4సీ' కార్యక్రమాలు సైబర్ భద్రతలో అత్యంత కీలకం

సైబర్ నేరాలపై మరింత పటిష్టమైన, ప్రభావవంతంమైన, విజయవంతమైన పోరాటంలో వీటి సహకారం అమూల్యం


సైబర్ భద్రత డిజిటల్ ప్రపంచానికే పరిమితమై లేదు, జాతీయ భద్రతకు ఎంతో ముఖ్యం

ఏ ఒక్క సంస్థ లేదా ఇనిస్టిట్యూషన్ సైబర్ స్పేస్‌ను సురక్షితం చేయలేవు,

వాటాదారులందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన హోంమంత్రి

రాష్ట్రాలకు అందుబాటులో జాతీయ స్థాయి అనుమానిత సమాచార నిధి

సైబర్ నేరాల నివారణకు ఇది ఉపకరిస్తుంది

రాబోయే అయిదేళ్లలో 5 వేల మంది సైబర్ కమాండోలను తయారు చేస్తాం

దేశాన్ని సైబర్ సురక్షితం చేసేందుకు

మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి

సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్

Posted On: 10 SEP 2024 3:50PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తొలి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణ కోసం నాలుగు ప్రధాన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎమ్ఎఫ్‌సీ)ని జాతికి అంకితం చేసిన హోం మంత్రి సమన్వయ్ ప్లాట్‌ఫామ్ (జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీ సిస్టమ్)ను ప్రారంభించారు. అలాగే 'సైబర్ కమాండోస్' కార్యక్రమాన్ని, నేర అనుమానిత సమాచార నిధి (సస్పెక్ట్ రిజిస్ట్రీ)ని కూడా అమిత్ షా ప్రారంభించారు. ఐ4సీ కొత్త గుర్తు (లోగో), దార్శనికత (విజన్), కార్యాచరణ (మిషన్) లను ఆవిష్కరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్, ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత), ముఖ్య కార్యదర్శులు అలాగే వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు డైరెక్టర్ జనరళ్లు /సీనియర్ పోలీస్ అధికారులు, వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు, వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, ఫిన్‌టెక్, మీడియా, సైబర్ కమాండోలు, ఎన్‌సిసి అలాగే ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో ‘సేఫ్ సైబర్ స్పేస్’ ప్రచారంలో భాగంగా 2015లో ఐ4సీ స్థాపించినట్లు చెప్పారు. ఇది అప్పటి నుంచి సైబర్ సురక్షిత భారతదేశం దిశగా ఎదుగుతూ నిరంతరం ముందుకు సాగుతోందని కొనియాడారు. 2015 నుండి 2024 వరకు, అంటే 9 సంవత్సరాల ప్రయాణంలో, ఈ ఆలోచన ఒక కార్యక్రమంగా, తరువాత ఒక సంస్థగా మారిందన్నారు. ఇప్పుడు ఇది సైబర్ సురక్షిత భారతదేశానికి అతిపెద్ద ఆధారంగా మారుతోందని ఆయన తెలిపారు.

సైబర్ భద్రత లేకుండా ఏ దేశమైనా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అన్నారు. మానవ జీవితానికి సాంకేతికత ఒక వరంగా మారిందనీ, నేడు అన్ని ఆధునిక కార్యక్రమాలలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. సాంకేతికత వినియోగం పెరుగుతున్న క్రమంలో అనేక ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందుకే సైబర్ భద్రత డిజిటల్ ప్రపంచానికే పరిమితం కాకుండా జాతీయ భద్రతలో ముఖ్యమైన అంశంగా మారిందని తెలిపారు. ఇటువంటి ముప్పులను ఎదుర్కోవడంలో ఐ4సీ వంటి వ్యవస్థలు అత్యంత సహాయకారిగా ఉంటాయని శ్రీ షా అన్నారు. సంబంధిత వాటాదారులకు అవగాహన కల్పిస్తూ, వారితో సమన్వయం చేసుకుంటూ, సమష్టిగా కృషి చేయాలని ఆయన ఐ4సీకి పిలుపునిచ్చారు. సైబర్ స్పేస్‌ను సురక్షితంగా ఉంచడం ఏ ఒక్క సంస్థ వల్ల అయ్యేపని కాదనీ, వాటాదారులంతా ఒకే వేదికపైకి వచ్చి ఒకే విధానంతో, ఒకే మార్గంలో ముందుకు సాగితేనే ఇది సాధ్యమవుతుందన్నారు.

ఐ4సీలో నాలుగు ప్రధాన సైబర్ వ్యవస్థలను ఈ రోజు ఇక్కడ ప్రారంభించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం అయిన సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎమ్‌సీ)ని ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు. దీంతో పాటు సైబర్ కమాండో, సమన్వయ్,  నేర అనుమానిత సమాచార నిధి (సస్పెక్ట్ రిజిస్ట్రీ)లను కూడా ప్రారంభించామన్నారు.

భారత్ వంటి సువిశాలమైన దేశంలో, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక సైబర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కేంద్ర హోం మంత్రి అన్నారు. రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్నా, సైబర్ నేరస్తులకు ఎలాంటి సరిహద్దులూ లేకపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్ట్రీని రూపొందించి, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు కోసం దానితో రాష్ట్రాలను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మనకు ఎంతగానో దోహదపడుతుందని శ్రీ అమిత్ షా తెలిపారు.

నేటి నుండి ఐ4సీ ప్రజా చైతన్య కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. దేశంలోని 72కి పైగా టీవీ ఛానళ్లు, 190 రేడియో ఎఫ్‌ఎం ఛానళ్లు, సినిమా హాళ్లు, అనేక వేదికల ద్వారా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్ నేరాలను నివారించే విధానం గురించి ప్రజలకు తెలిస్తే తప్ప ఈ ప్రచారం విజయవంతం కాదన్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 అలాగే ఐ4సీలోని ఇతర వ్యవస్థల గురించి అవగాహన కల్పించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే సైబర్ నేరాలను అరికట్టడంలో ఇది మనకు సహాయకారిగా ఉంటుందని శ్రీ అమిత్ షా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రచారంలో పాల్గొని గ్రామాలు, నగరాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని హోంమంత్రి కోరారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అలాగే పోలీసులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచనతోనే సీఎఫ్ఎమ్‌సీని ప్రారంభించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల నివారణకు ఇది ప్రధాన వేదికగా మారనుందన్నారు. వివిధ రకాల డేటాను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు నేరం చేసిన విధానాన్ని గుర్తించడం ద్వారా వారిని నిరోధించేందుకు సీఎఫ్‌ఎంసీ కృషి చేయాలన్నారు. సైబర్ కమాండో కార్యక్రమం ద్వారా రాబోయే 5 ఏళ్లలో దాదాపు 5 వేల మంది సైబర్ కమాండోలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ షా తెలిపారు.

‘తెలుసుకోవాల్సిన అవసరం’ కంటే ‘తెలిసినది విధిగా షేర్ చేయడం’ మన కర్తవ్యమనీ, దీనికోసం ‘సమన్వయ్’ను మించిందిలేదని శ్రీ అమిత్ షా తెలిపారు. సమన్వయ్ ను డేటా ఆధారిత విధానంతో ముందుకు తీసుకెళ్తున్నామనీ, షేర్డ్ డేటా సమాచార నిధికి రూపకల్పన దేశంలో మొదటిసారిగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన నాలుగు కార్యక్రమాలను ఐ4సీ, అలాగే దేశవ్యాప్తంగా గల పోలీసులు సమష్టిగా ముందుకు తీసుకెళ్తారన్నారు. సైబర్ నేరాలపై పోరాటాన్ని మరింత పటిష్టంగా, ప్రభావవంతంగా సాగించుటలో అలాగే దానిని విజయవంతం చేయడంలో ఈ కార్యక్రమాలు అత్యంత దోహదపడుతాయని హోంమంత్రి చెప్పారు.

2014, మార్చ్ 31 నాటికి 25 కోట్లుగా ఉన్న దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2024, మార్చి 31 నాటికి 95 కోట్లకు చేరిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. డౌన్‌లోడ్ స్పీడ్ పెరగడం, ఖర్చు తగ్గడం వల్ల డేటా వినియోగం కూడా బాగా పెరిగిందని తెలిపారు. మొదట్లో సగటు డేటా వినియోగం 0.26 జీబీగా ఉండగా, అది దాదాపు 78 రెట్లు పెరిగి నేడు 20.27 జీబీకి చేరుకుందని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా కారణంగా దేశంలో అనేక సౌకర్యాలు ఇంటర్నెట్ వేదికకు మారినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. 2024లో 35 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు, 36 కోట్ల రూపే డెబిట్‌ కార్డులు, 20 లక్షల 64 వేల కోట్ల రూపాయల లావాదేవీలు డిజిటల్‌ విధానంలో జరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 46% నేడు భారతదేశంలోనే జరుగుతున్నాయన్నారు. డిజిటల్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పుడు, డిజిటల్ మోసాల నుండి రక్షణ కల్పించే అవసరం కూడా పెరుగుతూనే ఉందని హోం మంత్రి తెలిపారు.

2014లో దేశంలోని 600 పంచాయతీలు మాత్రమే ఇంటర్నెట్‌తో అనుసంధానం కాగా, నేడు వాటి సంఖ్య 2,13,000 చేరిందని శ్రీ అమిత్ షా చెప్పారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ డేటా వినియోగం పెరగడంతో సైబర్ మోసాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత పెరిగిందన్నారు. సైబర్ నేరగాళ్ల ద్వారా ముఖ్యమైన వ్యక్తిగత డేటా విక్రయాలు, ఆన్‌లైన్ వేధింపులు, మహిళలు, పిల్లలపై దాడులు, నకిలీ వార్తలు, సాధనాలు, తప్పుడు సమాచార ప్రచారం వంటి విషయాలలో నేటికీ మనం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) అలాగే భారతీయ సాక్ష్యా అధినీయం (బీఎస్‌ఎ) అను మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో మన దేశాన్ని సైబర్ సురక్షితంగా మార్చే చట్టపరమైన ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. సాంకేతికత ఆధారితమైన అనేక కార్యక్రమాల ద్వారా వాటికి చట్టబద్ధమైన రూపం ఇచ్చామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా దర్యాప్తు జరిగేలా, విచారణ నాణ్యతను మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.

ఐ4సీ తన 9 సంవత్సరాల ప్రయాణంలో అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అధికారికంగా భాగమైన ఒక సంవత్సర స్వల్ప వ్యవధిలో ఎంతో అద్భుతంగా పని చేసిందని శ్రీ అమిత్ షా కొనియాడారు. 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు ఐ4సీ సాధించిన అతిపెద్ద విజయం అన్న ఆయన, దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలు, వాటాదారుల బాధ్యత అని గుర్తుచేశారు. 1930 హెల్ప్‌లైన్‌కు ప్రాచుర్యం కల్పించుటకు అవగాహన పక్షోత్సవాలు నిర్వహించాలని హోంమంత్రి సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, హోంశాఖ చొరవ తీసుకుని ఆరు నెలల్లో పక్షం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అన్ని వేదికలపై ఏకకాలంలో 1930 గురించి అవగాహనను  కలిగిస్తే, ప్రజలు మోసపోకుండా ఉంటారని, మోసగాళ్ళలో కూడా భయం ఏర్పడుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

ఇప్పటివరకు 600కి పైగా సూచనలను ఐ4సీ జారీ చేసిందనీ, అలాగే సైబర్ నేరగాళ్లు నిర్వహించే వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీలు, మొబైల్ యాప్‌లు అలాగే ఖాతాలను బ్లాక్ చేసినట్లు శ్రీ అమిత్ షా వివరించారు. ఐ4సీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేశామన్నారు. సైబర్ ఫోరెన్సిక్స్‌లో ఇప్పటివరకు 1100 మందికి పైగా అధికారులు శిక్షణ పొందారనీ, ఈ ప్రచారాన్ని జిల్లాలు, అలాగే మండలాలకు తీసుకెళ్లడం తమకు చాలా ముఖ్యమైన, ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అని శ్రీ అమిత్ షా చెప్పారు.

సైబర్ క్రైమ్ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని మేవాత్, జమ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గౌహతిలలో 7 ఉమ్మడి సైబర్ బృందాలను ఏర్పాటు చేశామనీ, అవి మంచి ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. సైబర్ దోస్త్ ద్వారా వివిధ సోషల్ మీడియాలో కూడా  ఐ4సీ సమర్థవంతమైన అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఇలాంటి అన్ని ప్రయత్నాల ద్వారా మనం కచ్చితంగా కీలక దశకు చేరుకున్నామని, అయితే మన లక్ష్యాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే కచ్చితమైన వ్యూహంతో ఒకే విధానంతో కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.

సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎమ్‌సీ): ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఐటీ సంస్థలు అలాగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల- లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల (ఎల్ఈఏ) ప్రతినిధులతో న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో సీఎఫ్ఎమ్‌సీ ని ఏర్పాటు చేశారు. నెట్ ఆధారిత ఆర్థిక నేరాలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు,  తగిన సహకారం కోసం వీరంతా కలిసి పని చేస్తారు. చట్టాల అమలులో సీఎఫ్ఎమ్‌సీ "సహకార సమాఖ్యవాద" స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది.

సమన్వయ్ వ్యవస్థ (జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్): ఇది ఒక నెట్ ఆధారితంగా పని చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్, డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్, డేటా అనాలిటిక్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల కోసం సమాచార నిధిని సేకరించేందుకు ఏర్పడిన కేంద్రీకృత పోర్టల్‌గా పనిచేస్తుంది.

'సైబర్ కమాండోస్' కార్యక్రమం: ఈ కార్యక్రమం కింద దేశంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో గల ముప్పులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ (సీపీఓ)లలో శిక్షణ పొందిన 'సైబర్ కమాండోల'తో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తారు. శిక్షణ పొందిన సైబర్ కమాండోలు డిజిటల్ స్పేస్‌ను సురక్షితంగా ఉంచడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే సెంట్రల్ ఏజెన్సీలకు సహాయం చేస్తారు.

సస్పెక్ట్ రిజిస్ట్రీ: ఈ కార్యక్రమంలో భాగంగా, ఆర్థికరంగ వ్యవస్థ కోసం మోసాల ముప్పును ఎదుర్కోగలిగే సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) ఆధారంగా వివిధ అనుమానితుల సమాచార నిధిని ఏర్పాటు చేస్తారు.

 

***



(Release ID: 2053735) Visitor Counter : 30