యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

‘వికసిత భారత్’ సాకారం దిశగా యువశక్తిని మళ్లించాలని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ పిలుపు


దేశ నిర్మాణం కోసం వ్యూహాత్మక చర్చల్లో పాల్గొనాలని యువ అధికారులకు విజ్ఞప్తి

జిల్లా యువజన అధికారుల రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి

Posted On: 04 SEP 2024 4:32PM by PIB Hyderabad

ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగే జిల్లా యువజన అధికారుల జాతీయ సదస్సును కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం – ‘వికసిత భారత్’ అనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో కీలకంగా వ్యవహరించేలా యువతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

 

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ఎంత కీలకమో ప్రారంభోపన్యాసంలో మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి అర్థవంతంగా దోహదపడేలా యువతను ప్రేరేపించి, వారిని సాధికారులను చేసి, భాగస్వాములను చేసే దిశగా జిల్లా యువజన అధికారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

‘‘దేశ యువతే మనకు గొప్ప బలం. సంపన్న, అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం దిశగా వారి శక్తిని మళ్లించాలి’’ అని డాక్టర్ మాండవీయ అన్నారు. 2047లో వందో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొనే నాటికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అయిన ‘వికసిత భారత్’ను సాకారం చేసేలా యువ శక్తిని ప్రేరేపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ, ఇటీవల ప్రారంభించిన మై భారత్ వేదిక ప్రాధాన్యాన్ని కూడా  డాక్టర్ మాండవీయ ప్రధానంగా ప్రస్తావించారు.  వేదిక ప్రస్తుతం సీవీ బిల్డింగ్, ప్రయోగాత్మక అభ్యసనం వంటి విస్తృత శ్రేణి అవకాశాలను అందిస్తోందనీ, భవిష్యత్తులో యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాల్లో అదనపు మార్గాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన స్పష్టంచేశారు. యువత కోసం అన్ని సేవలనూ ఒకేచోట అందించే వేదికగా ‘మై భారత్’ ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఇప్పటికే 1.5 కోట్ల మంది యువ వలంటీర్లు ఈ వేదికలో నమోదయ్యారని, 2024 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్యను 3 కోట్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన అమృత కాల ‘పంచ ప్రాణ్’ గురించి కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ఈ సూత్రాల స్ఫూర్తితో దేశ శ్రేయస్సుకు యువత అంకితం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సుసంపన్నం చేయడానికి యువతరం కట్టుబడి ఉండాలని, వారి కృషి వల్ల అంతిమంగా భవిష్యత్తులో వారికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువజన వ్యవహారాల శాఖ, మై భారత్ అధికారులతో – వికసిత భారత్ 2047, సేవా సే సీఖేన్, ప్రజాజీవితంలో యువత, ఫిట్ ఇండియా క్లబ్ లు, స్వచ్ఛ భారత్ మిషన్ - నయా సంకల్ప్ వంటి వివిధ ప్రాధాన్య అంశాలపై ముఖాముఖి సదస్సులకు కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు.

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2024 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  జాతీయ సదస్సు జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి యువజన అధికారులు హాజరై ఆరోగ్యం, పట్టణ పాలన, సైబర్ భద్రత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల తయారీ, యువ శక్తి వినిమయం, వైజ్ఞానిక మేళా సహా వివిధ అంశాలపై తమ భావాలను పంచుకుంటారు.

మై భారత్ వేదికను యువతకు చేరువ చేసి, వారి భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ దాని పరపతిని మరింత పెంచడంపై కూడా ఈ చర్చల్లో దృష్టి సారిస్తారు. జాతీయ యువోత్సవం, వైజ్ఞానిక మేళా వంటి ముఖ్యమైన అంశాలపై మేధోమథన సదస్సులు ఉంటాయి. వాటితో పాటు డాక్ చౌపాల్, సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, యువ వ్యవస్థాపకతపై ప్రదర్శనలు నిర్వహిస్తారు.

యువతకు నేతృత్వం వహించి, తమ సామర్థ్యాలను అత్యున్నతంగా ప్రదర్శించగలిగే అవకాశాలు కల్పించి ప్రేరేపించేలా క్షేత్రస్థాయి సంస్థల ప్రతినిధులకు సాధికారత కల్పించడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుంది. 

 

***



(Release ID: 2052101) Visitor Counter : 36