ప్రధాన మంత్రి కార్యాలయం
జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
Posted On:
31 AUG 2024 1:41PM by PIB Hyderabad
ఈ కార్యక్రమానికి హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ శ్రీ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, అటార్నీ జనరల్ శ్రీ ఆర్.వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కపిల్ సిబల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ మనన్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా జడ్జీలు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, సోదరసోదరీమణులారా!
మీరంతా ఎంత గంభీరంగా కనిపిస్తున్నారో ఈ కార్యక్రమం కూడా అంతే గంభీరంగా సాగుతున్నట్లు నాకు అనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట రాజస్థాన్ హైకోర్టు ప్లాటినమ్ జూబ్లీ వేడుకలలో నేను పాల్గొన్నాను. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల ప్రస్థానం కేవలం ఒక వ్యవస్థకు సంబంధించినది కాదు... ఇధి భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువల ప్రయాణం! ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిణతి వైపు భారత్ సాగిన పయనమిది! ఇందులో మన రాజ్యాంగ నిర్మాతలు, న్యాయవ్యవస్థలోని అనేక మంది దిగ్గజాలు పోషించిన పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. అలాగే లక్షలాది పౌరుల పాత్రను కూడా విస్మరించలేం. ఎందుకంటే- వారు ప్రతి సందర్భంలోనూ న్యాయవ్యవస్థపై తమ విశ్వాసాన్ని ఎన్నడూ సడలనివ్వలేదు. దేశ ప్రజానీకం సుప్రీంకోర్టును, మన న్యాయవ్యవస్థను ఏనాడూ అనుమానించింది లేదు. ఆ విధంగా 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రస్థానం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారత్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. ఈ మేరకు ‘‘సత్యమేవ జయతే, నానృతం’’ (సత్యమే గెలుస్తుంది.. అసత్యం కాదు) అనే మన సాంస్కృతిక నానుడిని మరింత బలోపేతం చేస్తుంది. మన దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించుకున్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగం 75వ వార్షికోత్సవం నిర్వహించుకోనుంది. అందువల్ల గర్వం, కీర్తి, ప్రేరణ ఈ ప్రాంగణమంతా నిండి ఉన్నాయి. ఈ సందర్భంగా న్యాయ నిపుణులందరితోపాటు జాతి మొత్తానికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇలాంటి తరుణంలో జిల్లా న్యాయవ్యవస్థ సదస్సుకూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థను రాజ్యాంగ పరిరక్షకురాలుగా పరిగణిస్తాం. ఈ భావనే ఎంతో గురుతర బాధ్యతను మోపుతుంది. తదనుగుణంగా కర్తవ్య నిర్వహణలో సుప్రీంకోర్టు, మన న్యాయవ్యవస్థ తమవంతు కృషి చేశాయని సగర్వంగా చెప్పవచ్చు. స్వాతంత్ర్యం వచ్చాక, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లోనూ దేశంలో న్యాయస్ఫూర్తిని కాపాడింది న్యాయవ్యవస్థే. ఆ మేరకు రాజ్యాంగ పరిరక్షణలో కీలక పాత్ర పోషించింది. ప్రాథమిక హక్కులపై దాడి సమయంలోనూ సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అంతేగాక జాతీయ భద్రతకు సవాళ్లు ఎదురైనప్పుడల్లా అన్నింటికన్నా జాతీయ ప్రయోజనాలే ప్రధానమని స్పష్టం చేస్తూ దేశ ఐక్యతను న్యాయవ్యవస్థ కాపాడింది. ఇన్ని విజయాల మధ్య ఈ 75 ఏళ్ల చిరస్మరణీయ పయనంపై ఇందుకు తోడ్పడిన న్యాయకోవిదులందరికీ నా అభినందనలు.
మిత్రులారా!
గడచిన పదేళ్లలో న్యాయప్రదాన సౌలభ్యం దిశగా దేశం ఎంతగానో కృషి చేసింది. కోర్టుల ఆధునికీరణకు ఉద్యమ స్థాయిలో పనులు సాగుతుండగా, ఇందులో సుప్రీంకోర్టుతోపాటు న్యాయవ్యవస్థ సహకారం గణనీయంగా లభిస్తోంది. ఈ కృషికి నేటి ఈ జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు మరో నిదర్శనం. లోగడ సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు సంయుక్తంగా ‘‘అఖిలభారత జిల్లా జడ్జీల సదస్సు’’ నిర్వహించినట్లు నాకు సమాచారం అందింది. న్యాయ ప్రదాన సౌలభ్యం కల్పనలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కీలకం. పెండింగ్ కేసుల నిర్వహణ, మానవ వనరులు, న్యాయ సమాజం మెరుగుదల వంటి అనేక ప్రధానాంశాలపై రెండు రోజులపాటు ఈ సదస్సు చర్చిస్తుందని నాకు సమాచారం వచ్చింది. అంటే- మీరు చర్చించాల్సిన అన్ని కీలకాంశాలనూ ఎంచుకున్నారు. మరోవైపు వీటన్నింటితో పాటు న్యాయవ్యవస్థ శ్రేయస్సుపై మరో రెండు రోజుల్లో చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారని తెలిసి నేనెంతో సంతోషిస్తున్నాను. సామాజిక శ్రేయస్సు దిశగా వ్యక్తిగత శ్రేయస్సు ఎంతో ప్రధానమైనది. ఇది మన ఆరోగ్యకర పని సంస్కృతికీ ప్రాధాన్యమిస్తుంది.
మిత్రులారా!
ఈ స్వాతంత్ర్య అమృత కాలంలో ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం), ‘నవ భారత్’ (నవ భారతం) స్వప్న సాకారమే 140 కోట్ల మంది భారతీయుల లక్ష్యమని మనందరికీ తెలిసిందే! నవ భారతం అంటే- సంకల్పం, సాలోచనతో కూడిన ఆధునిక భారతం! ఈ దృక్పథానికి మన న్యాయవ్యవస్థ... ప్రత్యేకించి మన జిల్లా న్యాయవ్యవస్థ బలమైన మూలస్తంభం. మరో మాటలో భారతీయ న్యాయవ్యవస్థకు జిల్లా న్యాయవ్యవస్థ పునాది వంటిది. న్యాయం కోసం సామాన్య పౌరుడు మొదట మీ తలుపులే తడతాడు. అందువల్ల, ఇది న్యాయానికి తొలి మెట్టు. దీన్ని పూర్తి సామర్థ్యంగలదిగా, ఆధునికంగా తీర్చిదిద్దడమే దేశ ప్రాథమ్యం. ఈ నేపథ్యంలో దేశం అంచనాలను అందుకునేలా ప్రస్తుత జాతీయ సదస్సు, ఇందులో సాగే చర్చలు దోహదం చేయగలవని విశ్వసిస్తున్నాను.
మిత్రులారా!
దేశ ప్రగతికి అర్థవంతమైన కొలబద్ద ఏదైనా ఉందంటే అది సామాన్యుల జీవన ప్రమాణాలే. వారి జీవన సౌలభ్యంపైనే ఆ ప్రమాణస్థాయి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. జీవన సౌలభ్యంలో సరళ, సులభ న్యాయ లభ్యత కూడా ఓ కీలక భాగం. ఇది సాధ్యం కావాలంటే మన జిల్లా కోర్టులు ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతికతలతో పనిచేయడం అవశ్యం. దేశవ్యాప్తంగా నేడు జిల్లా కోర్టుల స్థాయిలో దాదాపు 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మనందరికీ తెలుసు. న్యాయ ప్రదానంలో ఈ జాప్యం నివారణకు గత దశాబ్ద కాలంలో అనేక చర్యలు తీసుకున్నాం. గత 10 సంవత్సరాల్లో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనకు దేశం దాదాపు రూ.8,000 కోట్లు వెచ్చించింది. గడచిన పాతికేళ్ల ఖర్చుతో పోలిస్తే కేవలం పదేళ్లలో ఇది 75 శాతమని తెలిస్తే మీరు తప్పక సంతోషిస్తారు. ఆ మేరకు ఒక్క పదేళ్లలోనే జిల్లా న్యాయ వ్యవస్థ కోసం 7,500 కోర్టు హాళ్లు, 11,000 రెసిడెన్షియల్ యూనిట్లు సమకూర్చాం.
మిత్రులారా!
నేను ఇలా మీ మధ్యకు వచ్చినపుడల్లా ఇ-కోర్టుల అంశం సహజంగానే ప్రస్తావనకు వస్తూంటుంది. ఈ సాంకేతిక సదుపాయాలు/ఆవిష్కరణల ద్వారా న్యాయ ప్రక్రియలు వేగిరం కావడంతోపాటు న్యాయవాదుల నుంచి కక్షిదారుల దాకా ప్రతి ఒక్కరి ఇబ్బందులు వేగంగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా నేడు కోర్టుల డిజిటలీకరణ సాగుతోంది. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈ కృషిలో సుప్రీంకోర్టు ఇ-కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది.
మిత్రులారా!
ఇ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశకూ నిరుడు ఆమోదముద్ర పడింది. ఇందులో భాగంగా ఏకీకృత సాంకేతిక వేదిక రూపకల్పన దిశగా మనం పయనిస్తున్నాం. దీనికింద కృత్రిమ మేధ, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఒఎంఆర్) వంటి వర్ధమాన సాంకేతికతలను వినియోగిస్తారు. తద్వారా మనం పెండింగ్ కేసుల విశ్లేషణతోపాటు భవిష్యత్ వ్యాజ్యాలను కూడా అంచనా వేయగలుగుతాం. అలాగే పోలీసు, ఫోరెన్సిక్స్, జైళ్లు, కోర్టులు తదితరాలను ఈ సాంకేతికత ఏకీకృతం చేస్తుంది కాబట్టి, వాటి పనితీరు కూడా వేగం పుంజుకుంటుంది. ఆ విధంగా మనమిప్పుడు భవిష్యత్ సంసిద్ధ న్యాయవ్యవస్థ వైపు పయనిస్తున్నాం.
మిత్రులారా!
ఈ కీలక మార్పులలో మౌలిక సదుపాయాలు, సాంకేతికతలతోపాటు నియమనిబంధనలు, విధానాలు, సంకల్పం కూడా తమవంతు పాత్ర పోషిస్తాయన్నది మీకు తెలుసు. ఆ మేరకు స్వాతంత్ర్యానంతరం ఏడు దశాబ్దాల తర్వాత దేశం తొలిసారి న్యాయ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన, కీలక మార్పులు తెచ్చింది. తదనుగుణంగా భారతీయ న్యాయ సంహిత రూపంలో కొత్త భారతీయ చట్టబద్ధ స్మృతిని రూపొందించుకున్నాం. ‘‘పౌరులకే ప్రాధాన్యం, ఆత్మగౌరవమే ప్రథమం, న్యాయానికే ప్రాథమ్యం’’ (సిటిజన్ ఫస్ట్.. డిగ్నిటీ ఫస్ట్ అండ్ జస్టిస్ ఫస్ట్) అన్నదే ఈ చట్టాలకు స్ఫూర్తి. పాలకులు-పాలితులు అనే వలసపాలన నాటి ధోరణిని నుంచి మన కొత్త నేర విచారణ చట్టాలు దేశాన్ని విముక్తం చేశాయి. బ్రిటిష్ కాలంనాటి దేశద్రోహం తరహా చట్టాలు రద్దయ్యాయి. భారతీయ న్యాయ సంహిత పౌరులను శిక్షించాలని మాత్రమే కాకుండా వారికి భద్రత కల్పించాలని కూడా నిర్దేశిస్తుంది. ఆ మేరకు మహిళలు, బాలలపై నేరాలకు కఠినశిక్షలతో చట్టాలు రూపొందించటంతోపాటు స్వల్ప నేరాలకు సామాజిక సేవను శిక్షగా విధించే నిబంధనలను తొలిసారి పొందుపరిచారు. భారతీయ సాక్ష్య అధినియం కింద ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులకూ ఇకపై సాక్ష్యంగా గుర్తింపు లభిస్తుంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కింద నేడు సమన్లను ఎలక్ట్రానిక్ రూపంలో పంపవచ్చు. తద్వారా న్యాయ వ్యవస్థపై పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుంది. ఈ కొత్త వ్యవస్థపై జిల్లా న్యాయవ్యవస్థకు శిక్షణ దిశగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో కొత్త కార్యక్రమాలు చేపట్టాలని నా అభ్యర్థన. మన న్యాయమూర్తులు, న్యాయవాద సహచరులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఈ కొత్త వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు కూడా తమవంతు కీలక పాత్ర పోషిస్తాయి.
మిత్రులారా!
దేశాన్ని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్యను నేను ప్రస్తావిస్తున్నాను. మహిళలపై అఘాయిత్యాలు, బాలల భద్రత నేటి సమాజానికి తీవ్ర ఆందోళనకర అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత లక్ష్యంగా అనేక కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా 2019లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. దీనికింద కీలక సాక్షుల వాంగ్మూలం స్వీకరణ కోసం ‘డిపోజిషన్ సెంటర్లు’ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో జిల్లా పర్యవేక్షణ కమిటీలకూ గణనీయ పాత్ర ఉంటుంది. ఈ కమిటీలో జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ సభ్యులుగా ఉంటారు. నేర న్యాయ వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య సమన్వయంలో వీరి పాత్ర కీలకం. అయితే, ఈ కమిటీలను మరింత క్రియాశీలం చేయాల్సి ఉంది. మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటే, జనాభాలో సగంగా ఉన్న మన తల్లులు, సోదరసోదరీమణులకు తమ భద్రతపై అంతగా విశ్వాసం ఇనుమడిస్తుంది.
మిత్రులారా!
ఈ జాతీయ సదస్సులో చర్చలు వివిధ సమస్యలపై దేశానికి విలువైన పరిష్కారాలు చూపగలవని, ‘అందరికీ న్యాయం’ అనే ఆదర్శం బలపడగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ పవిత్ర కార్యక్రమం, చర్చలలో వివిధ అంశాలపై మథనం ఫలితంగా జ్ఞానామృతం లభిస్తుందనే ఆశాభావంతో మీకందరికీ నా శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు!
***
(Release ID: 2051985)
Visitor Counter : 65
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam