కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనవరి 1 నుంచి దేశంలో ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పెన్షన్: డాక్టర్ మాండవీయ


· ఈపీఎస్ 1995 పెన్షన్ చెల్లింపుల కోసం సీపీపీఎస్ ను ఆమోదించిన కేంద్ర మంత్రి డాక్టర్ మాన్ సుఖ్ మాండవీయ

· 78 లక్షలకు పైగా ఈపీఎస్ పింఛనుదారులకు ప్రయోజనం

· తదుపరి దశలో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏబీపీఎస్)కి మార్పు

Posted On: 04 SEP 2024 2:43PM by PIB Hyderabad

 

కేంద్రీకృత పింఛను చెల్లింపుల విధానం (సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్- సీపీపీఎస్) ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈపీఎఫ్ చైర్ పర్సన్ ఈ రోజు ఆమోదించారు. జాతీయ స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచైనా, ఏ బ్యాంకు శాఖ ద్వారా అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు సీపీపీఎస్ కల్పిస్తుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ మాన్ సుఖ్  మాండవీయ మాట్లాడుతూ ‘‘ఈపీఎఫ్ఓ ఆధునికీకరణలో కేంద్రీకృత పింఛను చెల్లింపుల విధానం(సీపీపీఎస్) కీలక మైలురాయిగా నిలిచిపోతుంది. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న బ్యాంకు శాఖ నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే పెన్షన్ పంపిణీ సమర్థంగా చేసేందుకు వీలవుతుంది. ఈపీఎఫ్ఓను మరింత పటిష్టంగా, సత్వరం స్పందించే సాంకేతిక ఆధారిత వ్యవస్థగా మార్చడానికి చేపడుతున్న ప్రయత్నాల్లో ఇది కీలకమైన దశ. దీని ద్వారా సభ్యులు, పింఛనుదారులకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అన్నారు.

ఈ కేంద్రీకృత పింఛను చెల్లింపుల విధానం ద్వారా ఈపీఎఫ్ఓకు చెందిన 78 లక్షలకు పైగా ఈపీఎస్ పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. అధునాతన ఐటీ, బ్యాంకింగ్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా, పెన్షనర్లకు ఎలాంటి అవరోధాలు లేని, సమర్థమైన సేవలు లభిస్తాయి.

పింఛనుదారు ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్లినప్పుడు, బ్యాంక్ లేదా బ్రాంచ్ ని మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ (పీపీఓ)ను ఒక కార్యాలయం నుంచి  మరో  కార్యాలయానికి బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ చెల్లించేలా సీపీపీఎస్ వీలు కల్పిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్లే పింఛనుదారులకు ఇది ఊరటనిస్తుంది.

ప్రస్తుతం చేపడుతున్న ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్టు ‘సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్(సీఐటీఈఎస్ 2.01)’ లో భాగంగా జనవరి 1, 2025 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తారు. తదుపరి దశలో సీపీపీఎస్- ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)గా మారుతుంది.

వికేంద్రీకృత పాత పెన్షన్ చెల్లింపుల విధానంలో వచ్చిన మార్పే సీపీపీఎస్. ప్రతి జోనల్/ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయం 3 లేదా 4 బ్యాంకులతో మాత్రమే వేర్వేరు ఒప్పందాలు కొనసాగిస్తున్నాయి. పింఛను తీసుకోవడం ప్రారంభించిన సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం శాఖా కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఉండదు. అలాగే విడుదలైన వెంటనే పింఛను జమ అవుతుంది. వీటికి అదనంగా, కొత్త వ్యవస్థకు మారిన తర్వాత పెన్షన్ పంపిణీలో ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ఈపీఎఫ్ఓ ఆశిస్తోంది.

 

***


(Release ID: 2051859) Visitor Counter : 98