ప్రధాన మంత్రి కార్యాలయం
కార్గిల్ విజయ దినోత్సవం నాడు జమ్మూకాశ్మీర్ ద్రాస్‌లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
Posted On:
26 JUL 2024 1:26PM by PIB Hyderabad
భారత్ మాతాకీ - జై!
భారత్ మాతాకీ - జై!
మన గళం ఈ కొండల్లో మారుమోగేలా నినదించండి.
భారత్ మాతాకీ - జై!
భారత్ మాతాకీ - జై!
లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ బి.డి.మిశ్రా, కేంద్ర మంత్రి శ్రీ సంజయ్ సేథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ సాయుధ దళాల అధిపతులు, కార్గిల్ యుద్ధ సమయాన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జనరల్ వి.పి.మాలిక్ గారు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గారు, శౌర్య పురస్కారం అందుకున్న వీర సైనికులు, పదవీ విరమణ చేసిన సైనికులు, తల్లులు, వీర మహిళలు, కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబ సభ్యులు, సైనిక దళంలోని సాహస వీరులు, ప్రియమైన నా దేశవాసులారా!
నేటి కార్గిల్ విజయ రజతోత్సవానికి (25 ఏళ్లు) మహత్తర లద్దాఖ్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. దేశం కోసం అజరామర త్యాగం చేసిన వీరులను కార్గిల్ విజయ దినోత్సవం గుర్తుచేస్తుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోయినా, రుతువులు మారుతున్నా... దేశ రక్షణలో ప్రాణార్పణం చేసిన వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. సాయుధ బలగాల శౌర్యపరాక్రమాలకు యావద్దేశం సదా రుణపడి ఉండటమే కాదు... సర్వదా కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటుంది.
మిత్రులారా!
కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సాధారణ పౌరుడిలా మన సైనికుల మధ్య ఉండగలగడం నా అదృష్టం. ఇవాళ నేను ఈ కార్గిల్ గడ్డపై మళ్లీ నిలబడిన నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు మరోసారి నా మదిలో సజీవమయ్యాయి. ఇంత ఎత్తయిన ప్రదేశంలో మన బలగాలు అత్యంత కష్టమైన యుద్ధంలో ఎంత సాహసంతో పోరాడాయో నాకిప్పటికీ గుర్తుంది. దేశానికి విజయం సాధించిపెట్టిన వీర యోధులందరికీ సగౌరవంగా నమస్కరిస్తున్నాను. మాతృభూమి రక్షణలో ఎనలేని త్యాగం చేసిన కార్గిల్‌లో అమలకు నా శిరసాభివందనం.
మిత్రులారా!
కార్గిల్ యుద్ధంలో మనం గెలవడం మాత్రమే కాదు... ‘సత్యం, సంయమనం, సామర్ధ్యం’ ఎలాంటివో రుజువు చేశాం. ఆ సమయంలో భారత్ శాంతి సాధనకు కృషి చేస్తున్న సంగతి దేశవాసులందరికీ తెలిసిందే. కానీ, పాకిస్థాన్ మాత్రం తన నయవంచక వైఖరిని మరోసారి ప్రదర్శించింది. అయినప్పటికీ- సత్యం ముందు అసత్యం, ఉగ్రవాదం చిత్తుగా ఓడిపోయాయి.
మిత్రులారా!
పాకిస్థాన్ లోగడ పలుమార్లు దురుద్దేశపూర్వక చర్యలకు పాల్పడగా, ప్రతిసారి శృంగభంగం తప్పలేదు. ఇంత జరిగినా, తన అప్రతిష్టపూర్వక చరిత్ర నుంచి ఆ దేశం నేర్చుకున్నదేమీ లేదు. ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంతోపాటు దానితో అంటకాగేందుకే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది. అయితే, సదరు ఉగ్రవాద సూత్రధారులు నేరుగా నా గళాన్ని వినగల చోటు నుంచి నేనివాళ మాట్లాడుతున్నాను. వారి కుత్సిత కుట్రలు ఎన్నటికీ ఫలించవని ఉగ్రవాద పోషకులను హెచ్చరిస్తున్నాను. మన వీర సైనికులు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తారు.. శత్రువులకు తగురీతిలో బుద్ధి చెబుతారు.
మిత్రులారా!
అది లద్దాఖ్ లేదా కశ్మీర్- ఏదైనా కావచ్చు... అభివృద్ధికి ఎదురయ్యే ప్రతి సవాలునూ భారత్ దీటుగా అధిగమించగలదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేసి, మరికొద్ది రోజుల్లో... అంటే- ఆగస్టు 5నాటికి ఐదేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో సరికొత్త భవిష్యత్తుపై జమ్ముకశ్మీర్ ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ముందడుగు వేస్తోంది. కీలకమైన జి-20 ప్రపంచ సదస్సుకు ఆతిథ్యమివ్వడంతో జమ్ముకశ్మీర్‌కు కొత్త గుర్తింపు లభించింది. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు జమ్ముకశ్మీర్, లద్దాఖ్, లేహ్, ప్రాంతాల్లో పర్యాటక రంగం కూడా శరవేగంగా పురోగమిస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో ఒక సినిమా థియేటర్ కూడా పునఃప్రారంభమైంది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత మొహర్రం సందర్భంగా శ్రీనగర్‌లో తొలిసారి తాజియా ప్రదర్శన కూడా నిర్వహించారు. మన భూతల స్వర్గం ఇప్పుడు శాంతి, సామరస్యాల వైపు వేగంగా పయనిస్తోంది.
మిత్రులారా!
‘షిన్‌కున్ లా’ సొరంగ నిర్మాణం ప్రారంభంతో లద్దాఖ్ ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త ప్రగతి స్రవంతి ముందుకు సాగుతోంది. ఈ సొరంగం పూర్తయితే లద్దాఖ్ ప్రాంతానికి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతర అనుసంధానం ఉంటుంది. అలాగే లద్దాఖ్ పురోగమనానికి, మెరుగైన భవిష్యత్తుకు కొత్త అవకాశాలు అందివస్తాయి. కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇక్కడి ప్రజలకు ఎన్ని ఇబ్బందులున్నాయో మనందరికీ తెలిసిందే. ‘షిన్‌కున్ లా’ సొరంగం సిద్ధం కాగానే ఈ బాధలన్నీ తొలగిపోతాయి. సొరంగం పనులు ప్రారంభమైన నేపథ్యంలో లద్దాఖ్ సోదరసోదరీమణులకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
లద్దాఖ్ ప్రజల సంక్షేమమే మా ప్రాథమ్యం. కరోనా సమయంలో కార్గిల్ ప్రాంతం వారు చాలామంది ఇరాన్‌లో చిక్కుకుపోయిన విషయం నాకు గుర్తుంది. వారిని తిరిగి తీసుకురావడానికి నేను స్వయంగా గణనీయ స్థాయిలో కృషి చేశాను. ఇరాన్ నుంచి తీసుకొచ్చి జైసల్మేర్‌లో చికిత్స అనంతరం ఆరోగ్యం పూర్తిగా కుదుటబడిందని వైద్య నివేదికలు స్పష్టం చేశాకే వారిని స్వస్థలాలకు పంపించాం. ఇలా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి మాకుంది. ఇక్కడ సౌకర్యాలతోపాటు జీవన సౌలభ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
మిత్రులారా!
లద్దాఖ్ బడ్జెట్‌ను గత ఐదేళ్లలో రూ.1,100 కోట్ల నుంచి రూ.6,000 కోట్లకు... అంటే- దాదాపు 6 రెట్లు పెంచాం! ఈ నిధులు ఇక్కడి ప్రజల పురోగమనానికి, సౌకర్యాలను పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. రహదారుల నిర్మాణం, విద్యుత్తు/నీటి సరఫరా, విద్య/ఉపాధి పరంగా లద్దాఖ్ రూపురేఖలు, భౌగోళిక స్వరూపం అన్నివైపులా మారుతుండటం మీరు గమనించవచ్చు. ఇక్కడ తొలిసారి సమగ్ర ప్రణాళికతో అన్ని పనులూ సాగుతున్నాయి. ‘జల్ జీవన్ మిషన్’ వల్ల 90 శాతానికిపైగా ఎక్కువ గృహాలకు పైప్‌లైన్లు, కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. యువతకు నాణ్యమైన ఉన్నత విద్యనందించేందుకు సింధు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే లద్దాఖ్ ప్రాంతం మొత్తాన్నీ నాలుగో తరం (4జి) నెట్‌వర్క్ తో అనుసంధానించే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మరోవైపు 13 కిలోమీటర్ల పొడవైన ‘జోజిలా’ సొరంగ నిర్మాణం కూడా పురోగమనంలో ఉంది. ఇది పూర్తయితే జాతీయ రహదారి-1లో అన్ని కాలాల్లోనూ అనుసంధానానికి భరోసా లభిస్తుంది.
మిత్రులారా!
దేశ సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి దిశగా మేము అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. వీటి సాధనలో భాగంగా సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) సవాలు విసిరే అనేక పనులను ఎన్నడూ లేనంత వేగంగా పూర్తిచేస్తోంది. ఈ మేరకు మూడేళ్లలోనే 330 మౌలిక సదుపాయాల కల్పన పథకాలను పూర్తి చేసింది. వీటిలో లద్దాఖ్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులు సహా ఈశాన్య ప్రాంతంలో సెలా సొరంగ నిర్మాణం వంటి పనులు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. దుర్గమ భూభాగాల్లో ఈ ప్రగతి వేగం నవ భారత్ దిశను, సామర్థ్యాన్ని కూడా రుజువు చేస్తోంది.
మిత్రులారా!
మునుపటితో పోలిస్తే నేటి ప్రపంచ స్థితిగతులు భిన్నం కాబట్టి, మన సాయుధ బలగాలు మరింత ఆధునికంగా రూపొందాల్సిన అవసరం ఉంది. అంటే- ఆయుధాలు, యుద్ధసామగ్రి పరంగానే కాకుండా కార్యకలాపాలు, వ్యవస్థల రీత్యా కూడా ఆధునికం కావాలి. ఈ దిశగా రక్షణ రంగంలో గణనీయ సంస్కరణలు అవసరమని దేశం భావిస్తోంది. సైనిక బలగాలు కూడా చాలా ఏళ్లుగా ఇందుకోసం డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఈ దిశగా ప్రాధాన్యంగానీ, చొరవగానీ కనిపించలేదు. అటువంటి పరిస్థితుల నుంచి గత పదేళ్లలో రక్షణ రంగ సంస్కరణలకు మేము అత్యంత ప్రాధాన్యమిచ్చాం.
ఈ సంస్కరణలతో నేడు మన సాయుధ బలగాలు మరింత సమర్థంగా, స్వయం సమృద్ధంగా మారుతున్నాయి. రక్షణ కొనుగోళ్లలో గణనీయ భాగం ఇప్పుడు దేశీయ రక్షణ పరిశ్రమకు దక్కుతోంది. అలాగే ఈ రంగంలో పరిశోధన-ఆవిష్కరణల బడ్జెట్ నుంచి 25 శాతాన్ని ప్రైవేట్ రంగానికి కేటాయించాం. ఇలాంటి చర్యల ఫలితంగా భారత రక్షణ ఉత్పాదకత ఇప్పుడు రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ఒకప్పుడు భారత్‌ను ఆయుధాల దిగుమతిపై ఆధారపడిన దేశంగా ప్రపంచం పరిగణించేది. కానీ, ఇవాళ భారత్ ఆయుధ ఎగుమతిదారుగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక మనం దిగుమతి చేసుకునే అవసరం లేని 5,000కుపైగా ఆయుధాలు, సైనిక పరికరాల జాబితాను మన సాయుధ దళాలు రూపొందించడం నాకెంతో సంతోషం కలిగించింది. ఈ ఘనత సాధించినందుకు మన సాయుధ దళాల నాయకత్వాన్ని అభినందిస్తున్నాను.
మిత్రులారా!
రక్షణ రంగ సంస్కరణలపై మన సాయుధ దళాల నిబద్ధతకు అభినందనలు. ఇటీవలి కాలంలో మన సాయుధ బలగాలు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందుకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ. సాయుధ దళాల్లో యువరక్తం నింపడం గురించి దశాబ్దాలుగా పార్లమెంటులోనే కాకుండా అనేక కమిటీల సమావేశాల్లోనూ చర్చలు నడిచాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే మన సైనికుల సగటు వయసు ఎక్కువగా ఉండటం మనకు ఆందోళన కలిగించే అంశం! అందుకే ఏళ్ల తరబడి ఈ అంశం వివిధ సందర్భాల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. కానీ, ఈ జాతీయ భద్రత సంబంధిత సమస్య పరిష్కార సంకల్పమన్నది లోగడ కనిపించలేదు. సైన్యమంటే నేతలకు శాల్యూట్ చేయడం, కవాతు నిర్వహించడం మాత్రమేననే భావన బహుశా కొందరిలో ఉందేమో! కానీ, సైన్యమంటే మా దృష్టిలో- 140 కోట్ల మంది దేశప్రజల విశ్వాసం.. సైన్యమంటే-140 కోట్ల ప్రజానీకం శాంతికి హామీ.. సైన్యమంటే- దేశ సరిహద్దుల భద్రత.
మిత్రులారా!
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంతో దేశం ఈ కీలక స్వప్నాన్ని సాకారం చేసింది. సాయుధ దళాల్లో నవయువ తేజం నింపడం, నిరంతర యుద్ధ సామర్థ్యంతో నిలపడం ఈ పథకం లక్ష్యాలు. దురదృష్టవశాత్తూ.. కొందరు అత్యంత సున్నితమైన ఈ జాతీయ భద్రత అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యంలో ఈ సంస్కరణను వక్రీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి మన సాయుధ బలగాలను నిర్వీర్యం చేసింది వీరే. వైమానిక దళానికి అత్యాధునిక యుద్ధ విమానాలు సమకూర్చాలన్న ఆలోచన చేయనివారు వీరే. చివరకు దేశీయ యుద్ధ విమానం ‘తేజస్’ రూపకల్పనకు తెర దించడానికి సిద్ధమైందీ వీరే!
మిత్రులారా!
అగ్నిపథ్ పథకం వాస్తవానికి దేశాన్ని బలోపేతం చేయడంతోపాటు మాతృభూమి సేవకు సమర్థులైన యువతరం ముందడుగు వేస్తుంది. అలాగే ప్రైవేటు రంగం సహా పారామిలటరీ బలగాల్లోనూ అగ్నివీరులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రకటనలిచ్చాం. అయితే, దీనిపై కొందరిలో అవగాహన, సాలోచన అదృశ్యం కావడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. సైనిక సిబ్బందికి చెల్లించే పెన్షన్ సొమ్ము ఆదా కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందంటూ అపోహలు చేస్తున్నారు. ఈ ఆలోచన ధోరణి చూస్తే నాకే సిగ్గుచేటుగా అనిపిస్తోంది. అయితే, ఇప్పుడు మోదీ హయాంలో నియమితుడయ్యే వ్యక్తికి తక్షణం పెన్షన్ ఇచ్చే అవసరం ఉంటుందా? అని అలాంటి వారిని నిలదీయాలి. కానీ, 30 ఏళ్ల తర్వాతగానీ పెన్షన్ ప్రస్తావన వచ్చే అవకాశం లేదు. అప్పటికి మోదీకి 105 ఏళ్లు నిండుతాయి.. మరి మూడు దశాబ్దాల తర్వాత, మోదీకి 105 ఏళ్లు వచ్చాక కూడా అధికారంలోనే ఉంటారా? మరి 30 ఏళ్ల తర్వాత చేయబోయే పనికి ఈ రోజునే నిందలు మోసే రాజకీయ నాయకుడా మోదీ? ఏమంటున్నారు మీరు? అయితే, మిత్రులారా... నాకు పార్టీతో నిమిత్తం లేదు... దేశానికే నా ప్రాధాన్యం. ఇక సాయుధ బలగాల నిర్ణయాలను మేం గౌరవిస్తున్నామని మిత్రులందరికీ ఇవాళ సగర్వంగా చెబుతున్నాను. నేను ఇంతకుముందే చెప్పినట్లు మేము రాజకీయాల కోసం కాకుండా దేశ భద్రత వ్యూహం దిశగా కృషి చేస్తాం. మాకు దేశ భద్రతే ప్రధానం...140 కోట్ల మంది శాంతియుత జీవనానికే ప్రాధాన్యం.
మిత్రులారా!
దేశ యువతరాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వారి చరిత్రను చూస్తే వారు సైనికులను ఏనాడూ పట్టించుకోలేదని స్పష్టమవుతుంది. ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ (ఒఆర్ఒపి) కోసం కేవలం రూ.500 కోట్ల స్వల్ప మొత్తం ప్రకటించి ఎన్నో అవాస్తవాలు చెప్పిన వారు వీరే. అయితే, ‘ఒఆర్ఒపి’ అమలు కోసం రూ.1.25 లక్షల కోట్లు కేటాయించి, మాజీ సైనికుల డిమాండ్ నెరవేర్చింది మా ప్రభుత్వమే. ఎక్కడ రూ.500 కోట్లు... ఎక్కడ రూ.1.25 లక్షల కోట్లు! ఇంత పెద్ద అబద్ధంతో దేశాన్ని, సైనికులను మోసం చేయడం ఎంత పాపం!
మిత్రులారా!
అమరవీరుల కోసం యుద్ధ స్మారకం నిర్మించాలని సైన్యం, వీర జవాన్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నా స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాలు గడిచినా కమిటీలు, ప్రణాళికల పేరిట వాయిదాలతో పొద్దుపుచ్చిన వారు కూడా వీరే. సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు కనీసం సరిపడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేని వారూ వీరే. మిత్రులారా... ముఖ్యంగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని విస్మరించిన వ్యక్తులు కూడా వీరే. ఈ నేపథ్యంలో దేశంలోని అసంఖ్యాక ప్రజానీకం ఆశీర్వాదంతో నాకు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. కాబట్టే, ఇవాళ ఈ కీలక చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటున్నాం. ఒకవేళ వారే అధికారంలోకి వచ్చి ఉంటే ఈ యుద్ధ విజయం మాట ఎవరికీ గుర్తుండేది కాదు.
మిత్రులారా!
కార్గిల్ విజయం ఏదో ఒక ప్రభుత్వం లేదా ఏదో ఒక పార్టీకి సంబంధించినది కాదు. ఇది దేశం సాధించిన విజయం... జాతి వారసత్వం. ఈ వేడుక దేశానికి గర్వకారణం... ఇదొక ఆత్మగౌరవ ప్రతీక. అందుకే, 140 కోట్ల మంది దేశవాసుల తరపున నా వీర సైనికులందరికీ మరోసారి సగౌరవంగా నమస్కరిస్తున్నాను. కార్గిల్ విజయం 25వ వార్షికోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ మరోసారి నా శుభాకాంక్షలు. చివరగా- ‘భారత్ మాతా కీ జై!!!’ అని నాతో గళం కలిపి నినదించండి- భరతమాత వీరపుత్రుల త్యాగాలకు నివాళిగా ఈ నినాదాన్ని నలుదిక్కులా ప్రతిధ్వనింపజేద్దాం.
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
***
(Release ID: 2050667)
Visitor Counter : 34
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam