ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్(జీఎఫ్ఎఫ్) 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
“భారతదేశ ఫిన్‌టెక్ విప్లవం ఆర్థిక సమ్మిళితాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆవిష్కరణల దిశగా నడిపిస్తోంది”
“భారత్ ఫిన్‌టెక్ వైవిధ్యత ప్రతి ఒక్కరినీ ఆశ్చర్చపరుస్తోంది”
“ఆర్థిక సమ్మిళితాన్ని పెంచడంలో జన్ ధన్ యోజన కీలకపాత్ర పోషిస్తోంది”
“భారతదేశ ఫిన్‌టెక్ విజయానికి యూపీఐ గొప్ప ఉదాహరణ”
“మహిళల ఆర్థిక సాధికారతకు జన్ ధన్ కార్యక్రమం బలమైన పునాది వేసింది”
“భారత్‌లో ఫిన్‌టెక్ తీసుకువచ్చిన మార్పు కేవలం సాంకేతికతకే పరిమితం కాలేదు. సామాజిక ప్రభావం చాలా దూరం వెళ్లింది’’
“ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యీకరించడంలో ఫిన్‌టెక్ కీలక పాత్ర పోషిస్తోంది”
“భారతదేశ ఫిన్‌టెక్ వ్యవస్థ మొత్తం ప్రపంచ జీవికనే సులభతరం చేస్తోంది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’’
Posted On:
30 AUG 2024 1:45PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సైతం ప్రధానమంత్రి సందర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కలిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. ఫిన్‌టెక్ రంగంలో భారత్ సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు ఈ రంగంలోని కీలక భాగస్వామ్య పక్షాలను ఒక్కచోటకు చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశం పండుగ వాతావరణంలో ఉన్న ఈ వేళ, దేశ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు సైతం ఆనందోత్సాహాలతో ఉన్నాయని అన్నారు. కలల నగరమైన ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు, అతిథులకు ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముందు ప్రదర్శనను తిలకించినప్పుడు చర్చించిన అంశాలు, తన అనుభవాలపై శ్రీ మోదీ మాట్లాడుతూ.. యువత ఆవిష్కరణలు, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించి పూర్తిగా కొత్త ప్రపంచాన్ని ఇక్కడ వీక్షించవచ్చని చెప్పారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్(జీఎఫ్ఎఫ్) 2024ను విజయవంతంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు.
భారతదేశ ఫిన్‌టెక్ ఆవిష్కరణలను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ.. “గతంలో భారతదేశాన్ని సందర్శించే విదేశీ అతిథులు దేశ సంస్కృతిక వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయే వారు. ఇప్పుడు వారు ఫిన్‌టెక్ వైవిధ్యాన్ని సైతం చూసి ఆశ్చర్యపోతున్నారు.” అని అన్నారు. ఎయిర్‌పోర్టులో దిగిన క్షణం నుంచి వీధిలో ఆహారం, వస్తువులు కొనుగోలు చేయడం వరకు అంతటా భారతదేశ ఫిన్‌టెక్ విప్లవం విస్తరించిన తీరును వీక్షించవచ్చని చెప్పారు. “గత పదేళ్లలో ఈ పరిశ్రమ రికార్డు స్థాయిలో 31 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెట్టుబడులను అందుకోవడంతో పాటు 500 శాతం అంకుర సంస్థల అభివృద్ధి కూడా సుసాధ్యం అయింది” అని ఆయన పేర్కొన్నారు. సరసమైన ధరల్లో మొబైల్ ఫోన్లు, తక్కువ ధరకు డేటా లభ్యత, జీరో బ్యాలెన్సుతో జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు వంటివి ఈ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాయన్నారు. “ఇవాళ దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగింది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. డిజిటల్ గుర్తింపు - ఆధార్ లేని 18 ఏళ్ల వయస్సు గల యువకుడు దేశంలో కనిపించడం అరుదు అని అన్నారు. “ఇవాళ, దేశంలో 53 కోట్ల మంది ప్రజలకు జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. కేవలం 10 ఏళ్లలో మనం బ్యాంకులకు అనుసంధానం చేసిన వారి సంఖ్య మొత్తం యూరోపియన్ యూనియన్ జనాభాతో సమానం” అని పేర్కొన్నారు.
‘నగదు మాత్రమే రారాజు’ అనే ఆలోచనా విధానాన్ని జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రయం బద్ధలు కొట్టిందని, ప్రపంచం మొత్తంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం వరకు భారత్‌లోనే జరిగేలా ఇది బాటలు వేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశ యూపీఐ ఫిన్‌టెక్‌లో ప్రపంచానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచిందని ప్రధాని అన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ప్రతి గ్రామం, నగరంలో 27 X 7 బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఇది వీలు కల్పించిందని అన్నారు. కొవిడ్ పరిస్థితులను గుర్తుచేస్తూ, ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించకుండా ఉన్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు.
ఇటీవలే జరిగిన జన్ ధన్ యోజన 10వ వార్షికోత్సవాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, మహిళా సాధికారతకు ఇది భారీ మాధ్యమంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మహిళలు ఇప్పటివరకు 29 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా వారికి డబ్బు జమా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కల్పించిందని అన్నారు. జన్ ధన్ అకౌంట్ల ఆలోచనా విధానంపై ప్రారంభించిన అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ పథకమైన ముద్ర యోజన ద్వారా ఇప్పటి వరకు రూ.27 ట్రిలియన్ల రుణాలు జారీ అయ్యాయని తెలిపారు. “ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో 70 శాతం మంది మహిళలే”నని శ్రీ మోదీ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి సైతం జన్ ధన్ ఖాతాలు ఉపయోగపడ్డాయని, తద్వారా 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు లబ్ధి పొందారని అన్నారు. “మహిళల ఆర్థిక సాధికారతకు జన్ ధన్ కార్యక్రమం బలమైన పునాదులు వేసింది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రధానమంత్రి హెచ్చరిస్తూ, ఇలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఫిన్‌టెక్ ప్రభావవంతమైన పాత్ర పోషించిందని, పారదర్శకతను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భారత్‌లో డిజిటల్ సాంకేతికత పారదర్శకతను తీసుకువచ్చిందని, వ్యవస్థలోని లోపాలను నివారిస్తూ వందల సంఖ్యలో ప్రభుత్వ పథకాల అమలులో నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనాన్ని అందించే విధానానికి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. “ఇవాళ, ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం అవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తున్నారు” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఇది భారతదేశ సాంకేతిక ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగించడంలో విస్తృతమైన సామాజిక ప్రభావాన్ని చూపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో బ్యాంకింగ్ సేవలు పొందేందుకు రోజంతా సమయం పట్టేదని, ఇది రైతులు, మత్య్సకారులు, మధ్యతరగతి కుటుంబాలకు అడ్డంకిగా మారేదని, ఇప్పుడు వీరు ఫిన్‌టెక్ సాయంతో సులువుగా మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందగలుగుతున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యీకరించడంలో ఫిన్‌టెక్ పాత్రను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, అందుబాటులో రుణాలు, క్రెడిట్ కార్డులు, పెట్టుబడులు, బీమాను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఫిన్‌టెక్ వల్ల రుణాలను పొందడం సులువు అయ్యిందని, సమ్మిళితం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, ఈ పథకం వీధి వ్యాపారులు ఎలాంటి హామీ లేకుండానే రుణాలు పొందేందుకు వీలు కల్పించిందని, డిజిటల్ లావాదేవీల సాయంతో వారి వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, పెట్టుబడుల నివేదికలు పొందగలగడం, డీమాట్ ఖాతాలు తెరవడం సులువు అయ్యిందని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు, డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణ వంటివి ఫిన్‌టెక్ లేకుండా సాధ్యం అయ్యేవి కావని అన్నారు. “గౌరవప్రదమైన జీవనం, జీవన నాణ్యత పెంపులో భారతదేశ ఫిన్‌టెక్ విప్లవం ప్రధాన పాత్ర పోషిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారతదేశ ఫిన్‌టెక్ విప్లవం సాధించిన విజయాలు కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాలేదని, ఇవి ఆచరణకు సంబంధించినవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్లవం వేగాన్ని, స్థాయిని ఆచరణలోకి తీసుకురావడం పట్ల భారతదేశ ప్రజలను శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ మార్పును తీసుకురావడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) పాత్రను ఆయన అభినందించారు. ఈ సాంకేతికత పట్ల విశ్వాసాన్ని తీసుకురావడానికి దేశంలో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయని పేర్కొన్నారు.
కేవలం డిజిటల్ పద్ధతిలో పని చేసే బ్యాంకులు, నియో-బ్యాంకింగ్ వంటి అధునాతన విధానాలను ప్రస్తావిస్తూ, “21వ శతాబ్దపు ప్రపంచం వేగంగా మారుతోంది. కరెన్సీ నుంచి క్యూఆర్(క్విక్ రెస్పాన్స్)కు ప్రయాణానికి కొంత సమయమే పట్టింది. మనం ప్రతిరోజూ ఆవిష్కరణలను చూస్తున్నాం.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ట్విన్స్ సాంకేతికతను ప్రశంసిస్తూ, ఇది ప్రమాద నిర్వహణను మదింపు, మోసాలను గుర్తించడం, వినియోగాదారులకి మెరుగైన సేవలు అందించడంలో ప్రపంచం అనుసరిస్తున్న మార్గాన్ని మార్చేస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) ద్వారా కలిగే ప్రయోజనాలను పేర్కొంటూ, ఇది ఆన్‌లైన్ షాపింగ్‌ను సమ్మిళితం చేస్తోందని, చిన్న వ్యాపారాలు, సంస్థలను పెద్ద అవకాశాలతో అనుసంధానం చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవాళ, సంస్థల నిర్వాహణను సులభతరం చేయడం కోసం అకౌంట్ ఆగ్రిగేటర్లు డేటాను వినియోగించుకుంటున్నారని అన్నారు. వాణిజ్య వేదికలు, వివిధ మార్గాల్లో వినియోగిస్తున్న ఇ-రుపి లాంటి డిజిటల్ వోచర్ల వల్ల చిన్న సంస్థల్లో నగదు ప్రవాహం పెరుగుతున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులు ప్రపంచంలోని మిగతా దేశాలకూ సమానంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు.
“ఏఐకి ప్రపంచ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని భారత్ పిలుపునిచ్చింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్‌లతో పాటు సౌండ్ బాక్సులు వినియోగించడం ఇలాంటి ఒక ఆవిష్కరణనే అని తెలిపారు. ప్రభుత్వ బ్యాంక్ సఖి కార్యక్రమాన్ని అధ్యయనం చేయాలని భారతదేశ ఫిన్‌టెక్ రంగాన్ని ప్రధాని కోరారు. ప్రతి గ్రామంలో బ్యాంకింగ్, డిజిటల్ అవగాహనను వ్యాప్తి చేస్తూ, ఫిన్‌టెక్ కోసం ఒక కొత్త విఫణిని అందిస్తున్న ఆడబిడ్డల ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
ఫిన్‌టెక్ రంగానికి తోడ్పాటును అందించడానికి ప్రభుత్వం విధానపరంగా అవసరమైన మార్పులు చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఏంజెల్ ట్యాక్స్ ను రద్దు చేయడం, దేశంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయడం వంటి వాటిని ఉదాహరణలుగా ప్రస్తావించారు. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని చెబుతూ, డిజిటల్ విద్యను పెంపొందించడానికి భారీ కార్యక్రమాలు చేపట్టాలని రెగ్యులేటర్లను ప్రధానమంత్రి కోరారు. దేశంలో ఫిన్‌టెక్, అంకుర సంస్థల వృద్ధికి సైబర్ మోసాలు అడ్డంకి కాకుడా చూడటం కూడా సామన స్థాయిలో ముఖ్యమేనని పేర్కొన్నారు.
“ఇవాళ భారతదేశానికి సుస్థిర ఆర్థికవృద్ధి ప్రాధాన్యం”, అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక మార్కెట్లను అధునాతన సాంకేతికతలు, నియంత్రణా నిబంధనలతో బలోపేతం చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థలను తయారుచేస్తోందని అన్నారు. గ్రీన్ ఫైనాన్స్, ఆర్థిక సమ్మిళితంలో, పూర్తిస్థాయిలో సుస్థిరవృద్ధికి సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, భారతదేశ ప్రజలకు నాణ్యమైన జీవనశైలిని అందించడంలో భారతదేశ ఫిన్‌టెక్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “భారతదేశ ఫిన్‌టెక్ వ్యవస్థ ప్రపంచం మొత్తంలో సులభతర జీవనాన్ని పెంపొందిస్తుంది. అయితే, ఈ దిశగా మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత జీఎఫ్ఎఫ్ 10వ కార్యక్రమంలో కూడా పాల్గొంటానటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిసే ముందు ప్రధాని ఆహుతులతో సెల్ఫీ దిగారు. ఏఐని వినియోగించడం ద్వారా ఈ ఫోటోలో ఉన్న ఎవరైనా నమో యాప్‌లోని ఫోటో సెక్షన్‌కు వెళ్లి వారి సెల్ఫీని అప్‌లోడ్ చేయడం ద్వారా తమను తాము చూసుకోవచ్చన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్, జీఎఫ్ఎఫ్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జన్స్ కౌన్సిల్ కలిసి సంయుక్తంగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన సుమారు 800 మంది విధాన రూపకర్తలు, రెగ్యులేటర్లు, సీనియర్ బ్యాంకర్లు, పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు ఈ సదస్సులోని 350 ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రసంగించనున్నారు. ఫిన్‌టెక్ రంగంలో తాజా ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తారు. సుమారు 20 శ్వేతపత్రాలు, ఆలోచనా పూర్వక నాయకత్వ నివేదికలను జీఎఫ్ఎఫ్ 2024లో ఆవిష్కరిస్తారు. ఇవి పరిశ్రమకు సంబంధించి అంశాలను, లోతైన సమాచారాన్ని అందిస్తాయి.
***
MJPS/VJ/TS/RT
(Release ID: 2050355)
Visitor Counter : 61
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam