ఉప రాష్ట్రపతి సచివాలయం
మహిళలపై హింసను ‘రోగ లక్షణం’గా అభివర్ణించడాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా: ఉప రాష్ట్రపతి
‘‘యువతులు.. మహిళల మనసుల్లో భయం జాతీయంగా ఆందోళన కారకం’’;
‘‘లింగ-ప్రాతిపదికగల వేతన అసమానతలను నిర్మూలించాల్సిందే’’;
‘‘దేశంలోని యువతులందరూ ఆర్థికంగా స్వతంత్రులు కావాలి’’;
‘‘ఉమ్మడి పౌరస్మృతితోనే మహిళలకు న్యాయం చేయడం సాధ్యం’’;
‘‘ఇక సహించం’ అన్న రాష్ట్రపతి పిలుపును ప్రజానీకం ప్రతిధ్వనింపజేయాలి’’
Posted On:
30 AUG 2024 3:23PM by PIB Hyderabad
మహిళలపై హింసను ‘రోగ లక్షణం’గా అభివర్ణించడాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధంకడ్ నిర్ద్వంద్వంగా ఖండించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని భారతి కళాశాలలో ‘వికసిత భారతంలో మహిళల పాత్ర’ ఇతివృత్తంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా- ‘‘నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను.. సుప్రీంకోర్టు న్యాయవాద సంఘంలో కీలక స్థానంలోగల పెద్దమనిషి, ఓ పార్లమెంటు సభ్యుడు ఈ విధంగా వ్యవహరించడం నన్నెంతో ఆవేదనకు, ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనేమన్నారు? ‘ఇదొక రోగ లక్షణం.. ఇటువంటి సంఘనలు సర్వసాధారణం’ అంటారా! ఇది సిగ్గుపడాల్సిన విషయం! ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలను ఖండించడానికి మాటలు కూడా చాలడం లేదు. ఇది ఆ ఉన్నత స్థానానికే తీవ్ర అన్యాయం’’ అని శ్రీ ధంకడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతటి ఉన్నత స్థానంలోగల వ్యక్తి ఇలాంటి దారుణ సంఘటనలు సర్వసాధారణమని వ్యాఖ్యానించడంపై ఆవేదన వెలిబుచ్చుతూ- ఇటువంటి ప్రకటనలు సమాజానికే సిగ్గుచేటుగా శ్రీ ధంకడ్ పేర్కొన్నారు. మన ఆడబిడ్డల బాధలను చిన్నచూపు చూడటమేనని ఉప రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘‘ఎందుకిలా... పార్టీ ప్రయోజనాల కోసమా? స్వార్థం కోసమా? మీ అధికారం అండగా మన యువతులకు, మహిళలకు ఇంతటి ఘోర అన్యాయం చేయడానికి ఎలా ఒడిగట్టారు? మానవత్వానికి ఇంతకన్నా అన్యాయం మరేముంటుంది? మన ఆడపిల్లలు పడుతున్న బాధలపై ఇంత చిన్నచూపు చూస్తామా? లేదు... ఇకపై ఇలా కాకూడదు’’ అని స్పష్టం చేశారు.
ఇలాంటి దురంతాలను ‘‘ఇక సహించం’’ అంటూ రాష్ట్రపతి ఇచ్చిన పిలుపును ప్రజానీకం ప్రతిధ్వనింపజేయాలని శ్రీ ధంకడ్ సూచించారు. ‘‘రాష్ట్రపతి ఇక సహించబోం’’ అని స్పష్టం చేశారు. మనమూ అదే బాటను అనుసరిద్దాం. ఆమె ఇచ్చిన పిలుపు దేశవ్యాప్త నినాదంగా మారుమోగాలని ప్రతి ఒక్కరికీ నా వినతి. ‘‘ఒక యువతిని లేదా మహిళను బలిపశువును చేయడాన్ని ఎంతమాత్రం సహించని, ఏమాత్రం అవకాశం ఇవ్వని వ్యవస్థ సృష్టికి సంకల్పం పూనుదాం. మీరు మన నాగరికతకు గండికొడుతున్నారు. దాని ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు. రాక్షసంగా ప్రవర్తిస్తూ... ఆటవికతను అత్యంత క్రూరమైన స్థాయికి తీసుకెళ్తున్నారు. వీటన్నిటినీ అడ్డుకోవడంలో ఏదీ అవరోధం కారాదు. అందుకే రాష్ట్రపతి ఎంతో వివేకం, విచక్షణతో తగిన సమయంలో ఇచ్చిన పిలుపును దేశంలోని ప్రతి ఒక్కరూ పాటించాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు.
దేశంలోని యువతులు, మహిళల మనసులో మెదిలే భయం ఆందోళన కలిగిస్తున్నదని శ్రీ ధంకడ్ పేర్కొన్నారు. ‘‘మహిళలకు, బాలికలకు భద్రత భావన కల్పించలేనిది నాగరిక సమాజం కాబోదు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం మసకబారుతుంది.. మన ప్రగతికి, వర్తమానానికి అతిపెద్ద అవరోధం’’ అని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.
అలాగే ‘‘యువతులు, మహిళల హృదయాలను కుదిపేసే భయం జాతీయంగా ఆందోళనకు దారితీస్తుంది. భరతభూమిలో ఆడపిల్లలకు, మహిళలకు భద్రత లేకపోవడం ఏమిటి? ఒక ఆస్పత్రిలో మానవాళి సేవకు అంకితమై ఇతరుల ప్రాణాలు కాపాడే వైద్యురాలి ఆత్మాభిమానం మీద రాక్షసదాడి ఏమిటి?’’ అంటూ ఉప రాష్ట్రపతి ఆవేదనభరిత వ్యాఖ్యలు చేశారు.
బాలికలకు, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఆవశ్యకతను నొక్కిచెబుతూ- ‘‘మీలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వతంత్రులు కావాలని పిలుపునిస్తున్నాను. మీ శక్తిసామర్థ్యాల సద్వినియోగానికి ఇదెంతో కీలకం’’ అని శ్రీ ధంఖడ్ సూచించారు.
అంతేకాకుండా ‘‘దేశ ప్రగతిలో బాలికలు అత్యంత ప్రధాన భాగస్వాములు. గ్రామీణ, వ్యవసాయ, అనియత ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముక, వెన్నుదన్ను కూడా వారే’’ అన్నారు.
లింగ-ప్రాతిపదికగల అసమానతల నిర్మూలనకు పిలుపునిస్తూ- నేటి సమాజంలో అవకాశాలు, వేతనాల పరంగా లింగ వివక్ష కొనసాగుతున్నదని ఉప రాష్ట్రపతి నొక్కిచెప్పారు. అలాగే ‘‘మరి లింగ వివక్ష అనేది లేదని ఇవాళ మనం చెప్పగలమా? అర్హత ఒకటే అయినా, వేతనంలో సమానత్వం లేదు.. మెరుగైన అర్హతలున్నా సమాన అవకాశాల్లేవు. ఈ ధోరణి మారాలి. నిష్పక్షపాత పర్యావరణ వ్యవస్థ ఏర్పడాలి.. అసమానతలు రూపుమాయాలి’’ అని శ్రీ ధంకడ్ ఆకాంక్షించారు.
భారత్ నేడు వృద్ధి పథంలో పయనించడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- జనాభాలో సగభాగమైన మహిళల సంపూర్ణ భాగస్వామ్యం లేకుండా ఈ పయనం కొనసాగదని ఆయన నొక్కి చెప్పారు. ‘‘బాలికలు, మహిళల భాగస్వామ్యం లేకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందగలదనే ఆలోచన హేతుబద్ధం కాదు. వారిలో శక్తి, ప్రతిభలకు కొదవలేదు. వారి భాగస్వామ్యంతోనే ‘వికసిత భారత్’ మహా సంకల్పం 2047కన్నా ముందే సాకారం కాగలదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను వివరిస్తూ- ‘‘ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ నిర్దేశం. ఇది ఆదేశిక సూత్రావళిలో మనకు కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఆలస్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలాసార్లు ఎత్తిచూపింది. చిరకాలం నుంచీ ఇది సాకారం కాకపోయినా, మీకు న్యాయం చేయడానికి సంబంధించినంత వరకూ ఇదొక చిన్న చర్య మాత్రమే. దీని అర్థమేమిటనే దానిపై ఒకసారి దృష్టి సారించండి. ఇది అనేక విధాలుగా... ముఖ్యంగా మీ లైంగిక సమానత్వానికి చేయూతనిస్తుంది’’ అని ఉప రాష్ట్రపతి చెప్పారు.
పాలనలో మహిళా ప్రాతినిధ్యం దిశగా గణనీయ పురోగమనాన్ని ప్రశంసిస్తూ- ‘‘పార్లమెంటు, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడింట ఒక వంతు స్థానాలు మహిళలకు కేటాయించడం ఒక మేలిమలుపు’’ అని శ్రీ ధంకడ్ అన్నారు. ఈ వినూత్న చర్యతో విధాన రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోగలవని నొక్కిచెప్పారు. అంతేకాకుండా నిర్ణాయక స్థానాల్లో నిర్దిష్ట వ్యక్తులు సముచిత స్థానం పొందగలరని స్పష్టం చేశారు.
దేశంలోని యువతరం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే నిరంతరం దృష్టి సారించడం ఆందోళనకరమని శ్రీ ధంఖడ్ అన్నారు. ‘‘మన యువతరానికి చుట్టూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉండటం నేను స్వయంగా గమనించాను. కానీ, ప్రభుత్వ ఉద్యోగాలపై వారిలో వీడని వ్యామోహం నాకు ఒకింత ఆవేదన కలిగిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ ఉద్యోగాల కోసం శిక్షణ నేడొక వ్యాపారంగా మారిపోవడాన్ని తప్పుబడుతూ- అనుచిత వ్యామోహం నుంచి విముక్తులై అందుబాటులోగల అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
జాతీయ ప్రయోజనాలకు ఎదురవుతున్న సవాళ్లు, వ్యతిరేక కథనాల అవరోధాల అడ్డు తొలగించుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ ధంకడ్ నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచమంతా మనల్ని ప్రశంసిస్తోంది.. కానీ, కొందరు మాత్రం వ్యతిరేక భావనను ఎగదోస్తున్నారు. వారు తమ ప్రయోజనాలకన్నా దేశ ప్రయోజనాలకు ఏమాత్రం విలువ నివ్వరా? అన్నారు. దేశం, జాతీయ ప్రయోజనాలు, ప్రగతి మాటకొస్తే- మనమంతా రాజకీయ, ఏకపక్ష, స్వప్రయోజనాలను పక్కన పెట్టాలి’’ అని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు.
వాతావరణ మార్పుల వల్ల మానవాళి అస్తిత్వానికి ఏర్పడే ముప్పును ప్రస్తావిస్తూ- మన భూగోళాన్ని రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను శ్రీ ధంకఢ్ నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేరకు ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ తమ తల్లులు, నానమ్మల గౌరవార్థం మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంతో పర్యావరణంలో ఇనుమడించే సానుకూల మార్పుతో ప్రభావాన్ని నొక్కిచెబుతూ- ఈ ఉదాత్త లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని ఆయన పౌరులకు పిలుపునిచ్చారు. ‘‘నన్ను నమ్మండి... ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. మీరంతా దీన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ యోగేష్ సింగ్, భారతి కళాశాల చైర్ పర్సన్ ప్రొఫెసర్ కవితా శర్మ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సలోని గుప్తాసహా విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతి పూర్తి ప్రసంగ పాఠాన్ని https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2050045 ఈ లింకుద్వారా చదువుకోవచ్చు.
***
(Release ID: 2050348)
Visitor Counter : 48