ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల ఆంగ్ల అనువాద సారాంశం

Posted On: 22 JUL 2024 11:41AM by PIB Hyderabad

ఈరోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారంఈ పవిత్రమైన రోజున ముఖ్యమైన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా నా దేశప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలు సానుకూలంగానిర్మాణాత్మకంగా సాగుతాయని ఆశిస్తున్నాను. ప్రజల కలలను సాకారం కోసం బలమైన పునాది వేయాలని ఆశిస్తూ యావద్దేశం ఈ సమావేశాలను నిశితంగా గమనిస్తోంది.

మిత్రులారా,

భారత ప్రజాస్వామ్య అద్భుతమైన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నేను భావిస్తున్నాను. దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం, అలాగే ఈ మూడో హయాంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నాకూనా సహచరులందరికీ గర్వకారణం. భారత ప్రజాస్వామ్యంలో ఒక గౌరవప్రదమైన సంఘటనగా దేశం దీనిని చూస్తుంది. ఇవి బడ్జెట్ సమావేశాలునేను దేశానికి చేసిన వాగ్దానాలను క్రమంగా అమలు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. ‘అమృతకాల్‌’కి ఈ బడ్జెట్‌ కీలకం. మనకు ఐదేళ్ల సమయం ఉంది, నేటి బడ్జెట్ ఈ ఐదేళ్లలో మనం చేయాల్సిన పని గురించి దిశానిర్దేశం చేస్తుంది. మనం 100 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాలు జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధించడానికి ఇది బలమైన పునాది వేస్తుంది. గడిచిన మూడేళ్లలో 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తూభారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవడం ప్రతి పౌరుడు గర్వించదగిన విషయం. నేడుభారత్ సానుకూల దృక్పథంపెట్టుబడి అనుకూల వాతావరణం, పనితీరు అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాయిఇది మన అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

మిత్రులారా,

పార్లమెంటు సభ్యులకు నా విన్నపం. జనవరి నుంచీ ఒకరిపై ఒకరం పోరాడుకున్నాం. మన అభిప్రాయాలను ప్రజల  ముందు ఉంచాం. ప్రజలకు కొందరు మార్గనిర్దేశం చేసేందుకు ప్రయత్నిస్తేమరికొందరు వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అయితేఆ కాలం ముగిసిపోయింది. ప్రజలు తమ తీర్పును అందించారు. ఇప్పుడుఎన్నికైన ఎంపీలందరి కర్తవ్యం, అన్ని రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత ఒకటే, పార్టీ పోరాటాల నుండి మన దృష్టిని రాబోయే ఐదేళ్లు దేశం కోసం పనిచేయడం వైపు మళ్లించాలని పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంట్ సభ్యులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మనం మరింత చిత్తశుద్ధితో, అంకితభావంతో వ్యవహరించాలి. అన్ని రాజకీయ పార్టీలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగాలి. రాబోయే నాలుగు - నాలుగున్నరేళ్లు దేశానికి సేవ చేయడానికి పార్లమెంటు వంటి గౌరవప్రదమైన వేదికను ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను.

 

జనవరి 2029 తర్వాతఎన్నికల కోసం మీరు మళ్లీ ఆరు నెలల పాటు రాజకీయాలు చేయవచ్చు. అయితే అప్పటి వరకుదేశంలోని పేదలురైతులుయువత, మహిళల సాధికారత కోసం ఒక సామూహిక ఉద్యమాన్ని కొనసాగిస్తూ 2047 స్వప్నాన్ని సాకారం చేసుకోవడంపై మన ప్రయత్నాలన్నింటినీ కేంద్రీకరించాలి. 2014 నుండి కొందరు ఎంపీలు ఐదేళ్ల కోసం ఎన్నికయ్యారు. కొందరికి పదేళ్లు పనిచేసే అవకాశం లభించింది. అయితే వారిలో చాలామంది ఎంపీలకు వారి నియోజకవర్గాల గురించి మాట్లాడే అవకాశం లభించలేదు. వారి అభిప్రాయాలను పంచుకునే సమయం దొరకలేదు. కొన్ని పార్టీల ప్రతికూల రాజకీయాలే దీనికి కారణం. వారు తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అమూల్యమైన పార్లమెంటరీ సమయాన్ని దుర్వినియోగం చేశారు. తొలిసారిగా ఎంపీలుగా ఎంపికైన వారికి చర్చల సమయంలో వారి అభిప్రాయాలను తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని అన్ని పార్టీలను నేను కోరుతున్నాను. వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతించాలి. తమకు సేవ చేయమని 140 కోట్ల భారతీయులు పంపిన ఈ ప్రభుత్వ గొంతునొక్కే అప్రజాస్వామిక ప్రయత్నం మొదటి సమావేశాల్లోనే జరిగింది. ప్రజాస్వామ్యంలో నిశ్శబ్దానికి తావు ఉండకూడదు. అలాంటిది రెండున్నర గంటల పాటు ప్రధానిని మాట్లాడనీయకుండా చేశారు, అయినా వారిలో కాసింతైనా పశ్చాత్తాపం లేదు.

 

ప్రజలు మనల్ని దేశానికి సేవ చేయడం కోసం సభకు పంపారు తప్ప పార్టీలకు సేవ చేసేందుకు కాదని ఈ రోజు నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ సభ దేశం కోసం ఉందిపక్షపాత ప్రయోజనాల కోసం కాదు. ఈ సభ ఎంపీలకే కాదు మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గౌరవ ఎంపీలందరూ బాగా సన్నద్ధమై వచ్చి చర్చలకు సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. విభిన్న అభిప్రాయాలు విలువైనవే అయితే అవి ప్రతికూలమైనవి అయినపుడు హానికరం అవుతాయి. దేశానికి ప్రతికూల ఆలోచనల అవసరం లేదు. మన దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చే ప్రగతిఅభివృద్ధి అనే సిద్ధాంతంతో మనం ముందుకు సాగాలి. భారతదేశంలోని సామాన్య ప్రజల ఆశలు,  ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం ఈ ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటామని నేను ఆశిస్తున్నాను.

 

మిత్రులారా. ధన్యవాదాలు.

 

***


(Release ID: 2050153) Visitor Counter : 63