మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు షీ-బాక్స్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి


పనిచేసే చోట్ల మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడంలో ఈ పోర్టల్ ప్రధాన ముందడుగు


కొత్త వెబ్ సైట్ కూడా ప్రారంభించిన మంత్రి

Posted On: 29 AUG 2024 4:24PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి నేతృత్వంలోని మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త షీ-బాక్స్ పోర్టల్ ను ప్రారంభించింది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల నమోదు, పర్యవేక్షణలకు  కేంద్రీకృత వేదికగా రూపొందించిన ఈ పోర్టల్ ను, మంత్రిత్వ శాఖ కొత్త వెబ్ సైట్ ను ఆమె గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్త షీ-బాక్స్ పోర్టల్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సహా దేశవ్యాప్తంగా ఏర్పడిన అంతర్గత, స్థానిక కమిటీలకు సంబంధించి కేంద్రీకృత సమాచార భాండాగారంగా ఉపయోగపడుతుంది. ఫిర్యాదుల దాఖలు, అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవడం, అంతర్గత కమిటీల ద్వారా నిర్దేశిత కాల పరిమితితో వాటి పరిష్కారం కోసం ఉమ్మడి వేదికను ఇది అందిస్తుంది.  ఫిర్యాదులకు  కచ్చిత పరిష్కారాన్ని అందించడంతో పాటు, ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. నిర్దేశిత నోడల్ అధికారి ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత భారత్’ దిశగా అడుగులేస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఆర్థిక వృద్ధి సాధించడంలో మహిళా నాయకత్వ పాత్ర ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా మహిళల నేతృత్వంలో అభివృద్ధికి గణనీయమైన ప్రాధాన్యం ఇచ్చింది.

శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి పని ప్రదేశాలు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. తద్వారా మహిళల అభివృద్ధికి, వారు విజయం సాధించడానికి ఇది దోహదపడుతుంది. పనిచేసే చోట్ల  మహిళలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి, వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధ, పరిష్కార) చట్టం-2013 సహాయపడుతుంది. దీనికి అనుగుణంగా, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం, నిర్వహణలో కొత్త షీ-బాక్స్ పోర్టల్ కీలక ముందడుగు.

షీ-బాక్స్ పోర్టల్ తో పాటు కొత్త వెబ్ సైట్ ను కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. డిజిటల్ వేదికల్లో స్పష్టమైన చిత్ర ప్రసారాలతో మరింతమంది జాతీయ, అంతర్జాతీయ వీక్షకులకు చేరువ కావడం  ఈ వెబ్‌సైట్ లక్ష్యం. డిజిటల్ వేదికలు పౌరులకు ప్రధాన సంప్రదిపు కేంద్రాలుగా మారిన నేపథ్యంలో విశిష్టతను బలంగా చాటేలా నిర్వహణ అత్యావశ్యకం.

ఈ సందర్భంగా శ్రీమతి అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ “పని ప్రదేశానికి సంబంధించిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారంలో మరింత సమర్థవంతమైన, సురక్షితమైన వేదికను అందించడంలో ఇది కీలకమైన ముందడుగు. దేశవ్యాప్తంగా మహిళలకు సురక్షిత, సమ్మిళిత పనివాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది మరింత చాటుతుంది” అని అన్నారు. వ్యక్తిగత సమాచారం బహిరంగంగా అందుబాటులో లేకుండా, ఫిర్యాదులను సురక్షితంగా నమోదు చేయడానికి ఈ పోర్టల్ దోహదపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

షీ-బాక్స్ పోర్టల్, మంత్రిత్వ శాఖ కొత్త వెబ్ సైట్లు  https://shebox.wcd.gov.in/https://wcd.gov.in/ లలో అందుబాటులో ఉంటాయి.

 

***


(Release ID: 2049975) Visitor Counter : 128