సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఆర్థిక సమ్మిళిత వృద్ధికే కాదు, సామాజిక, ఆర్థిక పరివర్తనకు దోహదకారి జన్ ధన్ యోజన: శ్రీ జితేంద్ర సింగ్
ప్రతి భారతీయుడినీ శక్తిమంతం చేస్తూ పదేళ్లు పూర్తి చేసుకున్న జన్ ధన్ యోజన: డాక్టర్ సింగ్
జన్ ధన్ ఖాతాదారుల్లో 55.6 శాతం మహిళలే, మహిళాసాధికారతలో కీలకం జన్ ధన్ యోజన: శ్రీ జితేంద్ర సింగ్
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పనికొచ్చిన సామాజిక ఆర్థిక పరివర్తన ఫలితాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
28 AUG 2024 4:38PM by PIB Hyderabad
భారతదేశ ఆర్థిక చరిత్రలో గొప్ప మార్పు తెచ్చిన కార్యక్రమాల్లో ఒకటి- ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎం జె డి వై). ఈ కార్యక్రమం ఈ రోజు 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన ఈ పథకం ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనలో ప్రపంచస్థాయి ప్రమాణంగా మారింది. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నవారితో సహా ప్రతి భారతీయుడికీ ఈ కార్యక్రమం బ్యాంకింగ్ సేవలను అందజేస్తోంది.
కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఐఏఎన్ ఎస్ మీడియాతో మాట్లాడుతూ జన్ ధన్ పథకం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పరిపాలన మొదలైన కొన్ని నెలల్లోనే ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనలో ప్రభుత్వ నిబద్దతను చాటుతోందని ఆయన స్పష్టం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ఈ పథకం గురించి దుష్ప్రచారం చేశారని, కానీ, ఈ పథకం ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను సులభతరం చేయడం ద్వారా దాదాపు 80 కోట్ల కుటుంబాల్లో ఆకలి చావులను నివారించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు.
ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనలో పీఎంజేడీవై అత్యంత కీలకంగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ పథకం అందిస్తున్న ప్రయోజనాలను గురించి గుర్తు చేస్తూ, జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఎలాంటి ఖర్చు లేకుండా రూపే కార్డు, రూపే డెబిట్ కార్డు కలిగిన వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 వేల ఓవర్ డ్రాప్ట్ సదుపాయం ఉందని తెలిపారు.
ఈ పథకంవల్ల వచ్చిన సామాజిక ఆర్థిక ఫలితాల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. పీఎంజేడీవైని వినియోగించుకుంటున్న ప్రతి మహిళ సాధికారత సాధించిందని, జన్ ధన్ ఖాతాదారుల్లో 55.6 శాతం మంది మహిళలేనని, ఈ పథకాన్ని ప్రారంభించాలనే నిర్ణయం వెనక ఘనత ప్రధానిదేనని చెబుతూ ప్రధానికి అభినందనలు తెలిపారు. ఈ పథకం కారణంగా పీఎం కిసాన్ చెల్లింపులు సమాయానికి పూర్తయ్యాయని, వాటికి సంబంధించిన దుర్వినియోగం ఆగిపోయిందని కేంద్ర మంత్రి అన్నారు. పీఎంజేడీవైని భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా పేర్కొన్నారు. దీని ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తి బ్యాంకుల సేవలు పొందుతున్నారని తద్వారా ఆర్ధిక సమ్మిళిత వృద్ధి సాధనలో భారతదేశం ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పిందని అన్నారు.
పీఎంజేడీవై పథకం సామాన్య ప్రజల్లో ఆకాంక్షలను రగిలించిందని , వారికి బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని వారి నిత్యజీవితంలో భాగంగా చేసిందని కేంద్ర మంత్రి అన్నారు. ఒకప్పుడు సామాన్య ప్రజలకు బ్యాంకులు దూరంగా ఉంటే, నేడు అవి అందరి జీవితాల్లో భాగమయ్యాయని ఆయన వివరించారు. పీఎంజేడీవై బ్యాంక్ సేవలను ప్రపంచీకరణ చేయడమే కాకుండా సామాన్య ప్రజల్లో ఆకాంక్షలను పెంపొందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
****
(Release ID: 2049600)
Visitor Counter : 43