కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్పామ్, మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ, మరింత సురక్షితమైన టెలికాం వ్యవస్థ జేసీఓఆర్‌తో ట్రాయ్ సమావేశం
Posted On:
28 AUG 2024 9:01AM by PIB Hyderabad
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నిన్న న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రెగ్యులేటర్ల సంయుక్త కమిటీ(జేసీఓఆర్)తో సమావేశం నిర్వహించింది. ఐఆర్‌డీఏఐ, పీఎఫ్ఆర్‌డీఏ, ఆర్బీఐ, సెబీ, ఎంఓసీఏ, ట్రాయ్ నుంచి జేసీఓఆర్ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. టెలికమ్యూనికేషన్ల విభాగం, హోంశాఖ నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ డిజిటల్ యుగంలో నియంత్రణకు సంబంధించిన చిక్కులను పరిశీలించడానికి, నియంత్రణ నిబంధనలను రూపొందించడం కోసం కలిసి పని చేయడానికి జేసీఓఆర్ సంయుక్త వేదికగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా ట్రాయ్ చైర్మన్ శ్రీ అనీల్ కుమార్ లాహోటి మాట్లాడుతూ... స్పామ్ మెసేజ్‌లు, కాల్స్ సమస్యను ఎదుర్కోవడానికి ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (i) అనుమతి కలిగిన యూఆర్ఎల్, ఏపీకే, ఓటీటీ లింకులు, కాల్ బ్యాక్ నెంబర్ల జాబితాను ఎస్ఎంఎస్ ద్వారా పంపించడం, (ii) ప్రస్తుత టెలిమార్కెటర్లు ప్రకటనలకు సంబంధించిన కాల్స్‌ను డీఎల్‌టీ వేదికగా 140 శ్రేణి నుంచి చేసేలా మార్చడం, (iii) పీఈ-టీఎం కోసం పని చేసే టెలిమార్కెటర్ల జాబితా ప్రకటన అమలుపై రెగ్యులేటర్లు చర్చించి వీలు కల్పించాలని ఆయన కోరారు.
టెలికాం మాధ్యమాల ద్వారా యూసీసీ, మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన సంయుక్త చర్యలు, వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో చర్చించిన కీలక అంశాలు ఇవి:-
- కంటెంట్ టెంప్లేట్లలో అనుమతి కలిగిన యూఆర్ఎల్‌లు, ఏపీకేలు, ఓటీటీ లింక్‌లు, కాల్ బ్యాక్ నెంబర్ల జాబితా తయారు చేయడంలో సంస్థల పాత్ర, అన్ని మెసేజ్‌లు పంపించిన వారి నుంచి అందుకునే వారి వరకు జాడ కనుగొనేలా చూడటం - హెడర్లు, టెంప్లేట్ల దుర్వినియోగానికి సంబంధించి అనేక ఘటనల గుర్తింపు. మెసేజ్‌లలోని కొన్ని భాగాలను ఉపయోగించి హానికరమైన లింకులను పంపించి మోసాలు చేస్తున్నారు. ఒకవేళ హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను దుర్వినియోగం చేసినప్పుడు ఏ సంస్థ మెసేజ్‌లను పంపించిందో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఇటీవలి మార్గదర్శకాల్లో నిర్దేశించిన కాలపరిమితుల మేరకు అనుమతి గల యూఆర్ఎల్‌లు, ఏపీకేలు, ఓటీటీ లింకులు, కాల్ బ్యాక్ నెంబర్ల జాబితా రూపొందించడం, పీఈ-టీఎం కోసం పని చేసే టెలిమార్కెటర్ల జాబితా ప్రకటించడం తప్పనిసరి.
- అయాచిత కాల్స్ చేయడానికి సంస్థలు పీఆర్ఐ/ఎస్ఐపీ చానళ్ల వినియోగం - చాలా వ్యాపార సంస్థలు వాణిజ్యపరమైన వాయిస్ కాల్స్ చేసేందుకు వందలాది ఇండికేటర్లతో ఎస్ఐపీ/పీఆర్ఐ లైన్లను వినియోగించడం ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలాంటి సంస్థలు ప్రకటనలకు సంబంధించిన కాల్స్ చేసేందుకు కేటాయించిన 140 శ్రేణికి మారడం తప్పనిసరి. పీఆర్ఐ/ఎస్ఐపీ/బల్క్ కనెక్షన్లను ఉపయోగించి ప్రకటనల వాయిస్ కాల్స్/రోబో కాల్స్/ముందే రికార్డు చేసిన కాల్స్ చేస్తున్న మోసగాళ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
- వినియోగదారుల నుంచి డిజిటల్ పద్ధతిలో సమ్మతి పొందడానికి టెలికం సేవలు అందించే సంస్థల కోసం ఏర్పాటు చేసిన డీసీఏ వ్యవస్థ వినియోగం - మెసేజింగ్ సేవలతో పాటు వాయిస్ కాల్స్ కోసం సంస్థలకు డీసీఏ వ్యవస్థ చాలా విలువైనది. డీఎన్‌డీ ప్రాధాన్యతలు ఎలా ఉన్నప్పటికీ మెసేజ్‌లు పంపేందుకు, కాల్స్ చేసేందుకు ఇది అనుమతి ఇస్తుంది. డీసీఏకు అవసరమైన సాంకేతికత సదుపాయాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. నియంత్రణ సంస్థలు తమ పరిధిలోని సంస్థలు ఈ సదుపాయాన్ని సమాయానుగుణంగా వినియోగించమని చెప్పాల్సిందిగా కోరారు.
- సేవా, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ చేసేందుకు 160 శ్రేణిని సంస్థలు ఉపయోగించడం ద్వారా వినియోగదారులు సులువుగా గుర్తు పట్టగలరు - 160 శ్రేణిని ప్రత్యేకంగా సేవా, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసమే కేటాయించారు. వివిధ అవకాశాల సాధ్యాసాధ్యాలపై ట్రాయ్, ఆర్బీఐ చేపట్టిన మార్గదర్శ అధ్యయనం ద్వారా తెలుసుకున్న అంశాలపై చర్చ జరిగింది.
- టెలికాం వనరులను వినియోగించి జరిగే మోసాల నియంత్రణ కోసం రెగ్యులేటర్ల మధ్య సమాచార మార్పిడిని పెంపొందించడం - వివిధ రెగ్యులేటర్లు వాటి వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకొని, మోసాలను నియంత్రించడానికి సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు.
ఈ సమస్యలను సమష్టిగా ఎదుర్కొని, వినియోగదారులను మోసపూరిత, స్పామ్ కాల్స్ వల్ల నష్టాల నుంచి కాపాడటం, మరింత భద్రమైన, సమర్థవంతమైన టెలికాం వ్యవస్థ ఉండేలా చూడటం జేసీఓఆర్ లక్ష్యం.
***
(Release ID: 2049421)
Visitor Counter : 86