సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
అనుభవ్ పురస్కారాలను ప్రదానం చేయనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్ కార్యశాలను ప్రారంభించనున్న కేంద్రమంత్రి
28 ఆగస్ట్ 2024 న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌ను ప్రారంభించనున్న డా. జితేంద్ర సింగ్
సూపర్ సీనియర్ పెన్షనర్లపై దృష్టి సారించి, వాయిదాలో ఉన్న పింఛను కేసుపై అఖిల భారత పెన్షన్ అదాలత్ కు అధ్యక్షత వహించనున్న మంత్రి
Posted On:
27 AUG 2024 3:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ (డిఓపిపిడబ్ల్యు) 2015 మార్చిలో 'అనుభవ్' పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. పదవీ విరమణ చేస్తున్న/ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో సాధించిన గణనీయమైన విజయాలను ప్రదర్శించడానికి ఇది ఒక వేదికగా నిలుస్తోంది.
2016లో ప్రారంభమైన ఈ పురస్కారాల ప్రదానం, 28 ఆగస్టు 2024 న 7వ అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు 6 వేడుకల్లో 54 అనుభవ్ పురస్కారాలు, 09 జ్యూరీ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది.
ఈ ఏడాది, 22 మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి వివిధ రచనలు ప్రచురించారు, వీటిలో అత్యుత్తమ రచనలకు ఐదింటికి అనుభవ్ పురస్కారాలు, 10 జ్యూరీ సర్టిఫికేట్లను సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ ప్రదానం చేయనున్నారు. మొత్తం 15 మంది అవార్డు గ్రహీతల్లో 33 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం 'అనుభవ్' చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ఇది పాలనలో పెరుగుతున్న మహిళల పాత్ర, సహకారాన్ని సూచిస్తోంది. 15 మంది అవార్డు గ్రహీతల వృత్తిపరమైన విజయాలను వివరిస్తూ, డిఓపిపిడబ్ల్యు ఒక లఘు చిత్రాన్ని, సైటేషన్ బుక్‌లెట్‌ను విడుదల చేయనున్నది.
కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్రసింగ్ అధ్యక్షతన, పెన్షన్, పింఛనుదారుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 55వ ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్ కార్యశాలను ఆగస్టు 28వ తేదీన విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాలులో నిర్వహిస్తారు.
పదవీ విరమణ చేయబోయే అధికారులకు పదవీ విరమణ ప్రక్రియలో వెసులుబాటు కల్పించేందుకు , పెన్షన్, పింఛనుదారుల సంక్షేమ శాఖ సుపరిపాలనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పిఆర్‌సి) కార్యశాలలను నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యశాల పెన్షనర్ల 'సులభతర జీవనం' దిశలో ఒక విప్లవాత్మక ముందు అడుగుగా చెప్పవచ్చు. ఇందులో పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్ మంజూరు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు.
పదవీ విరమణ చేసే ఉద్యోగుల బదిలీ సజావుగా సాగేందుకు భవిష్య పోర్టల్, ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, పదవీ విరమణ ప్రయోజనాలు, ఫ్యామిలీ పెన్షన్, సీజీహెచ్ఎస్ చట్టాలు, ఆదాయ పన్ను చట్టాలు, అనుభవ్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, పెట్టుబడి అవకాశాలు, తదితర అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదవీ విరమణకు ముందు అనుసరించాల్సిన ప్రక్రియ, నింపాల్సిన ఫారాల గురించి, పదవీ విరమణ అనంతరం వారికి లభించే ప్రయోజనాల గురించి సమాచారం అందించడానికి ఈ కార్యక్రమాలను రూపొందించారు.
పదవీ విరమణ పొందిన వారు తమ రిటైర్మెంట్ నిధులను, పెట్టుబడిని సకాలంలో ప్లాన్ చేసుకోవడానికి వీలుగా వివిధ పెట్టుబడి మార్గాలు, వాటి ప్రయోజనాలు, ప్రణాళికలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సిజిహెచ్ఎస్ వ్యవస్థ, సిజిహెచ్ఎస్ పోర్టల్, అందించిన సౌకర్యాలు, సిజిహెచ్ఎస్ ప్రయోజనాలను పొందడానికి అనుసరించాల్సిన విధానాలపై కూడా వివరణాత్మక కార్యక్రమం ఉంటుంది.
ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్ కార్యశాలలో భాగంగా "బ్యాంక్స్ ఎగ్జిబిషన్" కూడా నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 18 పెన్షన్ పంపిణీ బ్యాంకులు పాల్గొంటాయి. పింఛనుదారులకు సంబంధించిన అన్ని బ్యాంకింగ్ సేవలను భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పదవీ విరమణ చేసిన వారికి పింఛను ఖాతా తెరవడం, వారికి అనువైన వివిధ పథకాల్లో పెన్షన్ నిధులను పెట్టుబడిగా పెట్టడంపై బ్యాంకులు వారికి మార్గనిర్దేశం చేస్తాయి.
సుమారు 1,200 మంది అధికారులు 31 మార్చి 2025 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. వీరందరికీ ఈ ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్ కార్యశాల ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు సజావుగా, సౌకర్యవంతమైన సేవలను అందించడానికి సుపరిపాలనలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇటువంటి కార్యశాలలను నిర్వహిస్తోంది. పదవీ విరమణ తర్వాత కూడా వారు అన్ని ప్రయోజనాలను పొందడానికి వీలుగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వారికి తెలియజేయడానికి మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది.
పెన్షన్, పింఛనుదారుల సంక్షేమ శాఖ 11వ దేశవ్యాప్త పెన్షన్ అదాలత్‌ను 28 ఆగస్టు 2024వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు.
పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం. పెన్షనర్ల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖ ద్వారా పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నారు, దీనిలో అనేక మంది భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అక్కడికక్కడే పరిష్కరిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని పెన్షన్ అదాలత్‌లలో 17,760 కేసులను పరిష్కరించారు. (పరిష్కార రేటు 74 శాతం).
11వ పెన్షన్ అదాలత్ దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న సూపర్ సీనియర్స్ పెన్షన్ కేసుల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. పెన్షన్ అదాలత్ లో హోం మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖతో సహా 22 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇందులో పాల్గొంటాయి. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 298 కేసులపై చర్చిస్తారు.
పింఛనుదారులు, వయోవృద్ధుల కోసం కామన్ సింగిల్ విండో పోర్టల్ ను అందించడానికి భవిష్య ప్లాట్‌ఫాంను ప్రాతిపదికగా తీసుకొని పెన్షన్, పింఛనుదారుల సంక్షేమ శాఖ "ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్"ను అభివృద్ధి చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ పెన్షన్ పోర్టళ్లను ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టళ్లతో అనుసంధానించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమావేశం ద్వారా ఈ బృదంలో చేరనుంది. ప్రస్తుతం ఈ బ్యాంకులు నెలవారి పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికేట్ స్థితి, పెన్షనర్ సబ్మిషన్ ఫారం 16, చెల్లించిన పెన్షన్ బకాయిలు, డ్రా చేసిన వివరాలు అనే 4 సౌకర్యాలను అందిస్తున్నాయి. ఏకీకృత వినియోగదారు అనుభవం కోసం అన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ బ్యాంకులను ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యం.
***
(Release ID: 2049232)
Visitor Counter : 72