శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అమెరికా-భారత పౌర అణు వాణిజ్యంపై ద్వైపాక్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారత్-అమెరికా అంతరిక్ష సహకారంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చేరనున్న భారత వ్యోమగామి – కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎస్ఎమ్ఆర్ సహకారాల ద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలను మెరుగుపరుచనున్న భారత్: డాక్టర్ సింగ్
Posted On:
25 AUG 2024 12:49PM by PIB Hyderabad
అమెరికా-భారత్ పౌర అణు వాణిజ్యంపై పృథ్వీ భవన్‌లో జరిగిన కీలకమైన ద్వైపాక్షిక సమావేశానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ అలాగే స్వచ్ఛ ఇంధనం వంటి కీలక రంగాలలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
గగన్ యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చేరనున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఇది భారత్-అమెరికా అంతరిక్ష సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో సెమీకండక్టర్లు, మందుల తయారీ. అలాగే స్వచ్ఛ ఇంధన సాంకేతికత వంటి రంగాల్లో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, అణు శక్తి విభాగం, అంతరిక్ష శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛనుల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారీ పరిశ్రమలు, రవాణా అలాగే విద్యుత్ ఉత్పత్తి రంగంలో కర్భన ఉద్గారాలను పూర్తిగా తగ్గించడంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను భారత వ్యూహానికి మూలస్తంభంగా అభివర్ణించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికతల రంగంలో నూతన ఆవిష్కరణలను కొనసాగించుటలో, ప్రపంచ వాతావరణ లక్ష్యాల సాధనలో ఈ మిషన్ కీలకమని ఆయన పేర్కొన్నారు. బలమైన పని విధానాలు అలాగే అంతర్జాతీయ సహకారాల ద్వారా, సుస్థిరమైన, మంచి ఇంధన భవిష్యత్తు వైపు మార్పు దిశగా ముందుకుసాగడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
భారత ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వామ్యాలను అన్వేషిస్తోందని, పరిశోధన, అభివృద్ధి రంగంలో పెట్టుబడులు పెడుతుందని అలాగే చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎమ్ఆర్ల) విస్తరణకు ఊతమివ్వడానికి నియంత్రణ పనివిధాలను పరిశీలిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారతదేశం క్లీన్ ఎనర్జీ దిశగా పరివర్తన చెందుటలో ఎస్ఎమ్ఆర్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, అలాగే ఇవి ఇంధన స్వావలంబనకు, వాతావరణ ఒప్పందాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ "అనుసంధాన్" నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్) అలాగే అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) మధ్య సారుప్యతలను వివరించడం ద్వారా డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో రెండు సంస్థల కీలక పాత్రను వివరించారు. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం, కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల వరకు తగ్గించడం, తద్వారా 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించడం పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక "పంచామృత్"ను ఆయన గుర్తు చేశారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ ఎ. కె. సూద్, భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను వివరించారు, ఇది కేవలం జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే కాకుండా భవిష్యత్తును రూపొందించే పరిష్కారాలను సమష్టిగా రూపొందించడమని పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు కోసం కొత్త మార్గాలను సుగమం చేయడంలో ఈ సహకార సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి డాక్టర్ రవి చంద్రన్, సముద్ర ఇంధనం, కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సిసియుఎస్) సాంకేతికతలలో భాగస్వామ్య పురోగతిని వివరించారు, అలాగే బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, జీవద్రవ్యరాశిని ఇంధనంగా మార్చడంపై భారతదేశం దృష్టి సారించుటని అలాగే మొదటి, రెండో తరం జీవ ఇంధనాలను విజయవంతంగా అమలు గురించి నొక్కిచెప్పారు.
డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌తో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో భారతదేశ పురోగతిని గురించి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రంగాలలో ఆవిష్కరణల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి, లిథియం-అయాన్ బ్యాటరీ అభివృద్ధిలో అలాగే స్వదేశీ బ్యాటరీ తయారీలో భారతదేశ పురోగతిని చర్చించారు, అలాగే సుస్థిరమైన, సర్క్యులర్ ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ వాతావరణ విధానం కోసం యూఎస్ఏ అధ్యక్షుని సీనియర్ సలహాదారు జాన్ పొడెస్టా, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ డేవిడ్ టర్క్ నేతృత్వంలోని ఉన్నత-స్థాయి యూఎస్ ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆర్థికవృద్ధి, జాతీయ భద్రత అలాగే సాంకేతిక పురోగతిలో ప్రపంచ నాయకత్వాన్ని మెరుగుపరచడంలో పరస్పర ప్రయోజనాలతో, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో తమ సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం ద్వారా సమావేశం ముగిసింది.
***
(Release ID: 2048821)
Visitor Counter : 86