సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ - సీజన్ 1’ వేవ్స్ ఫైనలిస్టులు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను ప్రదర్శించడానికి సహాకారాన్ని అందించనున్న భారత ప్రభుత్వం
చాలెంజ్‌లు నిర్వహించనున్న యానిమేషన్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, సంగీతం, దృశ్యకళలు వంటి వివిధ అంశాలకు చెందిన పరిశ్రమ సంఘాలు, సంస్థలు
జాతీయ స్థాయి పోటీ, గుర్తింపు ద్వారా భారతదేశ మాంగా, యానిమీ దృశ్యాన్ని ప్రోత్సహించనున్న యానిమే ఛాలెంజ్; వృద్ధి చెందడంతో పాటు శక్తివంతమైన అభిమానగణాన్ని తయారుచేసుకోనున్న పరిశ్రమ
భారతీయ కళాకారులకు వినూత్న నూతన వేదికలను అందించనున్న ఏఐ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఛాలెంజ్, కమ్యూనిటీ రేడియో పోటీ
కొత్త ప్రతిభ, సృజనాత్మకతతో భారత కామిక్ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్న కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్
Posted On:
23 AUG 2024 5:31PM by PIB Hyderabad
ప్రపంచ శ్రవ్య, దృశ్యమాన, వినోద సదస్సు(వేవ్స్)లో నిర్వహిస్తున్న ‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ - మొదటి సీజన్’లో భాగంగా 25 చాలెంజ్‌లు జరగనున్నాయి. యానిమేషన్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, సంగీతం, దృశ్యకళలు తదితర విస్తృత అంశాల్లో పరిశ్రమ సంఘాలు, సంస్థలు ఈ చాలెంజ్‌లను నిర్వహించనున్నాయి.
వేవ్స్ ఫైనలిస్టులకు అంతర్జాతీయ అవకాశాలు
ఈ 25 అంశాల్లో ఫైనల్‌కు చేరిన వారిని ఒక్కచోటకు చేర్చి, వేవ్స్ ప్రధాన వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవకాశాలు కల్పిస్తోంది. వేర్వేరు పోటీల్లో ఫైనల్‌కి ఎంపికయిన వారు ప్రపంచవ్యాప్తంగా ఆయా అంశాలకు సంబంధించిన భారీ వేదికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు, యానిమేషన్ చిత్ర నిర్మాణంలో విజేతను భారీ నిర్మాణ సంస్థలతో జత చేసి వారి ప్రాజెక్టు పూర్తి చేసుకునేందుకు చేయుతను అందిస్తుంది. తది ప్రాజెక్టుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారాన్ని అందించి, అన్నెసీ యానిమేషన్ చలనచిత్రోత్సవం వంటి వాటి ప్రఖ్యాత చలన చిత్రోత్సవాలకు తీసుకెళుతుంది. యానిమి పోటీలో విజేతలు జపాన్‌లో జరిగే భారీ యానిమి వేడుకలో పాల్గొనేందుకు సహకరిస్తుంది.
ప్రధాన వేడుక జరగడానికి ముందుగా ఈ పోటీలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వ్యక్తుల సమూహాన్ని మొత్తం నిమగ్నం చేయడం దీని లక్ష్యం.
1. భారతదేశ ప్రజా ప్రసార మాధ్యమం ప్రసార భారతి బాటిల్ ఆఫ్ ది బాండ్స్, సింఫనీ ఆఫ్ ఇండియా పోటీలను నిర్వహిస్తోంది.
ది బాటిల్ ఆఫ్ ది బాండ్స్: అధునాతన, జానపద సంగీత వాయిద్యాల కలయికతో ప్రయోగం నిర్వహించేందుకు బ్యాండులకు ‘‘ది బాటిల్ ఆఫ్ ది బాండ్స్’’ వేదికను కల్పిస్తుంది. భారతదేశ సంగీత సంప్రదాయాల వైవిధ్యాన్నీ, వాటి అందాన్నీ కొత్త తరాలను పరిచయం చేయడంతో పాటు విస్తృతంగా ప్రేక్షకులను ఆకర్షించేలా చేసే సామర్థ్యం ఈ వినూత్న కార్యక్రమానికి ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు పరిశ్రమ నిపుణులతో కలవడం ద్వారా ఇందులో పాల్గొనే బ్యాండ్లు అందరికీ తెలుస్తారు. అభిమానగణాన్ని నిర్మించుకోవచ్చు, భాగస్వామ్యానికి అవకాశాలను పదిలం చేసుకోవచ్చు.
సింఫనీ ఆఫ్ ఇండియా: మరోవైపు, ‘సింఫనీ ఆఫ్ ఇండియా’ పోటీ సంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యం కలిగిన సోలో ప్రదర్శన ఇచ్చే కళాకారులు, బృందాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఉద్దేశించినది. ప్రతిభావంతులైన కళాకారులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదికను కల్పించడం ద్వారా భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాలను పరిరక్షించడంతోపాటు, గుర్తింపును ప్రోత్సహించాలనేది ప్రసార భారతి లక్ష్యం. వేగంగా ప్రయాణించే నేటి ప్రపంచంలో ప్రజాదరణ పొందిన వాటి ముందు సంప్రదాయ కళలు తరచూ విస్మరణకు గురవుతున్నందున ఇది చాలా ముఖ్యమైనది.
2. యానిమేషన్ ఫిల్మ్ మేకర్స్ పోటీ: ఔత్సాహిక దర్శకులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పరిశ్రమలోని ప్రముఖులతో కలవడానికి, నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవసరమైన వేదికను కల్పించి భారతదేశ యానిమేషన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది యానిమేషన్ ఫిల్మ్‌మేకర్స్ పోటీ లక్ష్యం. దేశంలో యానిమేషన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నైపుణ్యాభివృద్ధి, గుర్తింపు వంటి అంశాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. దర్శకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు, గణనీయమైన ప్రభావాన్ని కల్పించేందుకు ఈ వేదిక సాటిలేని అవకాశాన్ని కల్పిస్తుంది. శక్తివంతమైన కథా ప్రదర్శనకు ప్రసిద్ధి చెందిన లాస్ఏంజెల్స్‌కు చెందిన యానిమేషన్ అభివృద్ధి స్టూడియో ‘‘డాన్సింగ్ ఆటమ్స్’’ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు పరిశ్రమ నిపుణులను కలిసేందుకు, మార్గదర్శకత్వం పొందేందుకు, విస్తృత అవకాశాలను అందించడం ద్వారా వారు వృత్తి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. నూతన ప్రతిభను ప్రోత్సహించడం, పెంపొందించడం ద్వారా భారతీయ యానిమేషన్‌లోని నాణ్యతను, వైవిధ్యాన్నీ పెంపొందించే, ఈ రంగంలో దేశంలో ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు ఈ పోటీకి సామర్థ్యం ఉంది.
ఈ ప్రక్రియలో ఆన్‌లైన్ ద్వారా ఎంపిక, మాస్టర్‌క్లాస్‌లు, ఆ తర్వాత పిచ్ డెక్ సమర్పించడం, శద్ధీకరించడం వంటివి ఉంటాయి. వ్యక్తిగత మార్గదర్శకత్వం, వీడియో పిచ్ సమర్పణ ద్వారా ఫైనలిస్టుల సంఖ్య 15కు తగ్గుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ పనిని ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. ఈ రంగంలోని కీలకమైన వారిని కలిసేందుకు, వారి ఖ్యాతిని పెంచుకునేందుకు, భాగస్వామ్యం, పంపిణీ కోసం అవకాశాలను ఆకర్షించేందుకు, వారి ఆలోచనలను ఫలప్రదం చేయడానికి నిధులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అదనంగా, ఈ పోటీలో విజేతలకు సుప్రసిద్ధ స్టూడియోలు, నిర్మాతలు, పంపిణీదారులు, డీడీ వంటి ప్రసారకర్తలతో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది.
3. యానిమీ ఛాలెంజ్: సృష్టికర్తలు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి, పరిశ్రమ నిపుణులను కలిసేందుకు అవసరమైన వేదికను కల్పించడం ద్వారా భారతీయ యానిమి, మాంగా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే యానిమీ చాలెంజ్ లక్ష్యం. దేశంలో ఈ కళారూపాలకు ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ గుర్తింపు, సహకారం విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కళాకారులకు గుర్తింపు పొందేందుకు, గణనీయ ప్రభావాన్ని సంపాదించుకునేందుకు ఈ పోటీ సాటిలేని అవకాశాన్ని కల్పిస్తుంది.
మీడియా, ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 11 నగరాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ఈ పోటీని నిర్వహిస్తుంది. మాంగా, వెబ్‌టూన్, యానిమీ వంటి వివిధ విభాగాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా, అన్ని నేపథ్యాలు, శైలులకు చెందిన క్రియేటర్లు వారి పనిని ప్రదర్శించేందుకు అవకాశం కలిగింది.
మార్గదర్శకత్వం, గుర్తింపు, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా యానిమీ రంగంలో వృద్ధిని పెంపొందించడంతో పాటు బలమైన అభిమానగణాన్ని తయారుచేయడమే 'యానిమీ ఛాలెంజ్' లక్ష్యం. నూతన ప్రతిభకు సహకారాన్ని అందించడం, ప్రోత్సహించడం ద్వారా భారతీయ యానిమీ, మాంగాలోని వైవిధ్యత, నాణ్యతను పెంపొందించే, ఈ సృజనాత్మక రంగాల్లో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపే సామర్థ్యం ఈ పోటీకి ఉంది.
4. గేమ్ జామ్: భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమలో సృజనాత్మకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో గేమ్ జామ్ పోటీని ఇండియా గేమ్ డెవెలపర్ కాన్ఫరెన్స్(ఐజీడీసీ) నిర్వహిస్తోంది.
ఈ పోటీలో రెండు దశలు ఉన్నాయి. మొదటి దశలో భారత్‌లోని ఆరు జోన్లవ్యాప్తంగా నిర్వహించిన వర్చువల్ గేమ్ జామ్‌లో పాల్గొనేవారు 48 గంటల పాటు పోటీ పడతారు. దీని తర్వాత ప్రతి జోన్‌లో 10 మంది ఉత్తమ ఫైనలిస్టులకు ఫిజికల్ గేమ్ జామ్ ఉంటుంది. విజేతలు ఎస్‌టీపీఐకి చెందిన ఇమేజ్ సీఓఈ కోహార్ట్ లో స్థానం దక్కించుకుంటారు. వారు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు లభిస్తాయి. గేమ్ డెవెలపర్లు వెలుగులోకి వచ్చేందుకు, మార్గదర్శకత్వ అవకాశాలు పొందేందుకు, వృత్తిపరంగా మరింత ముందుకు వెళ్లేందుకు పెద్ద స్థాయి వేదికలు, పరిశ్రమ సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పోటీ అవకాశాలు కల్పిస్తుంది.
5.ఏఐ ఆర్ట్ ఇస్టలేషన్ పోటీ: కళ, సాంకేతికతల మేళవింపును విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించి ‘‘ఇంటర్నెట్ ఆండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’’ నిర్వహిస్తున్న ఏఐ ఆర్ట్ ఇన్ స్టలేషన్ ఛాలెంజ్ ఒక అద్భుతమైన పోటీ. ఏఐని ఉపయోగించి కళాకారులు, డిజైనర్లు, ఏఐ ఔత్సాహికులు లీనమయ్యేలా, ఇంటెరాక్టీవ్ కార్యక్రమాలు తయారుచేయడానికి ఆహ్వానించడం ద్వారా ఈ పోటీ ప్రయోగాలు, ఆవిష్కరణలు, కొత్త కళాత్మకతను అన్వేషణను ప్రోత్సహిస్తుంది.
కళాత్మక ప్రాముఖ్యతను మించి పరిశ్రమలో ఈ పోటీకి అపారమైన విలువ ఉంది. కళలలో ఏఐని వినూత్నంగా వినియోగించడాన్ని ప్రదర్శించేందుకు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, వినియోగదారుల్లో అవగాహనను, ఆసక్తిని పెంపొందించడానికి ఈ పోటీ వేదికగా నిలుస్తుంది. కళాత్మక ఆవిష్కరణలకు, ఏఐ ఆధారిత సృజనాత్మక రంగంలో వృద్ధికి, వేగంగా అభివృద్ధిచెందుతున్న ఈ రంగంలో భారత దేశాన్ని ముందంజలో నిలపడానికి ఈ ఏఐ ఆర్ట్ ఇన్ స్టలేషన్ చాలెంజ్ ప్రేరణ కలిగిస్తుంది.
6. వేవ్ స్ హ్యాకథాన్: యాడ్ స్పెండ్ ఆప్టిమైజర్ పోటీ. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ పోటీ ఆర్ఓఐని మెరుగుపర్చడం, డాటా ఆధారిత నిర్ణయ సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వినియోగదారుల అనుభవాన్ని పెంపొందించడం ఈ పోటీ లక్ష్యాలు. నేటి పోటీ డిజిటల్ రంగంలో ప్రకటనకర్తలు వారు సమర్థవంతంగా డబ్బు వెచ్చించడానికి, ప్రకటనలపై వెచ్చించిన మొత్తంపై ఆర్ఓఐని పెంచుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. డేటా భారం పెరిగిపోవడం, మాధ్యమంలోని సంక్లిష్టత, క్రియాశీల విపణి పరిస్థితులు, ఫలితం పొందడంలో సవాళ్లు నిర్ణయం తీసుకోవడంలో అటంకాలు కలిగిస్తున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించుకోవడం ప్రకటనకర్తలకు, పరిశ్రమకు చాలా కీలకం. ఫలితాలు ఇవ్వని ప్రకటనలపై డబ్బులు వెచ్చించడం వల్ల వనరులు వృథా అవడం, ఉత్పత్తి ప్రతిష్ఠ దెబ్బతినడం, అవకాశాలను కోల్పోవడం వంటివి జరగొచ్చు. ఇందులో పాల్గొనడం ద్వారా ఆయా బృందాలు మరింత సమర్థవంతమైన, వినియోగదారుల కేంద్రీకృత డిజిటల్ ప్రకటనల వ్యవస్థకు దోహదపడతాయి.
7. కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్: ఈ పోటీని కమ్యూనిటీ రేడియో అసోసియేషన్ నిర్వహిస్తోంది. భారతీయ సామాజిక రేడియో రంగంలో సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన పోటీ ఇది. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియో కేంద్రాలు వాటి ఉత్తమ కార్యక్రమాలను ఏదైనా ఫార్మాట్ లేదా కళా ప్రక్రియలో సమర్పిస్తాయి. ప్రతి సమర్పిత అరగంట కార్యక్రమమైనా లేదా ఏదైనా సిరీస్‌లోని ఒక ఎపిసోడ్ అయినా అయి ఉండాలి. సపోర్టింగ్ మెటీరియల్ సైతం ఉండాలి. ఈ సమర్పణలను నిపుణుల బృందం పరిశీలించి 5 ఉత్తమమైన వాటిని తుది దశకు ఎంపిక చేస్తుంది.
అత్యంత వినూత్నమైన, ప్రభావవంతమైన కార్యక్రమాలను సమర్పించమని సీఆర్ఎస్‌లను ప్రోత్సహించడం ద్వారా, ఆయా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు వాటి స్థానిక సమాజాలను అందిస్తున్న విశిష్ట సేవలను ప్రదర్శించేందుకు ఈ పోటీ బలమైన వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విభిన్న స్వరాలకు ప్రాచుర్యం కల్పించడం, నైపుణ్యాన్ని గుర్తించడం, ఈ రంగంలో ఒక కమ్యూనిటీని తయారుచేయడంతో పాటు అంతిమంగా భారతదేశంలో కమ్యూనిటీ రేడియో భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగపడుతుంది.
8. సినిమా పోస్టర్ రూపకల్పన పోటీ: నేషనల్ ఫిల్మ్ అర్కైవ్ ఆఫ్ ఇండియా - ఎన్ఎఫ్‌డీసీ ఫిల్మ్ పోస్టర్ రూపొందించే పోటీని నిర్వహించింది. కళ, చలనచిత్రం ఇందులో జమిలీగా కాసే ప్రత్యేక కార్యక్రమం ఇది. చూడగానే ఆకట్టుకునేలా, చేతితో ప్రఖ్యాత సినిమాలకు పోస్టర్లను రూపొందించమని ఇందులో పాల్గొన్నవారికి పోటీ నిర్వహించడం ద్వారా ఇది సృజనాత్మకతను, ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. చలనచిత్ర పోస్టర్ రూపకల్పన అనే కళకు తగిన గుర్తింపు లభిస్తుంది.
అనేక కారణాలతో చలనచిత్ర రంగానికి సంబంధించి ఈ పోటీకి ప్రాముఖ్యత ఉంది. ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పరిశ్రమలో గుర్తింపు పొందేందుకు ఇది మొదట ఒక వేదికగా ఉపయోగపడుతుంది. చలనచిత్ర సారాంశాన్ని అర్థం చేసుకోగల, ప్రేక్షకులను ఆకర్షించగల శక్తిమంతమైన మార్కెటింగ్ సాధనాలుగా చలనచిత్ర పోస్టర్ ప్రాముఖ్యతను చాటడం రెండోది. జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న చిత్రాలపై ప్రధాన దృష్టి సారించడం ద్వారా భారతదేశ ఘనమైన చలనచిత్ర వారసత్వానికి గుర్తింపు లభించడంతో పాటు కొత్త తరం కళాకారులకు అలనాటి పాత చిత్రాలతో పరిచయం చేసేందుకు అవకాశం లభిస్తుంది.
9. హ్యాండ్‌హెల్డ్ ఎడ్యుకేషనల్ వీడియో గేమ్ డెవెలప్‌మెంట్ కాంపిటీషన్: ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ (ఐడీజీఎస్) హ్యాండ్‌హెల్డ్ ఎడ్యుకేషనల్ వీడియో గేమ్ డెవెలప్‌మెంట్ కాంపిటీషన్‌ను నిర్వహిస్తుంది. ఇది వీడియో గేమ్స్ లో సృజనాత్మకతను, విద్యాసంబంధమైన వీడియో గేమ్‌ల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు, ప్రత్యేకంగా పిల్లలు గణితం నేర్చుకునేందుకు, పజిల్స్ ను పరిష్కరించేందుకు, వారి అభిజ్ఞ నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉపయోగపడే ఆకర్షణీయమైన పరికరాలను రూపొందించడం దీని లక్ష్యం. తక్కువ ఖర్చుతో సృజనాత్మక పరికరాల ఎంపికను ఈ పోటీ నొక్కి చెబుతుంది. పాల్గొనేవారు ప్రోటోటైప్ నమూనాలు, తర్వాత కాన్సెప్ట్ ఆధారాలు సమర్పిస్తారు. విద్యాసంబంధమైన సాంకేతికత అభివృద్ధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆటల ద్వారా నేర్చుకునే సామర్థ్యానికి ప్రాముఖ్యతను తీసుకురావడం వంటి అంశాల కారణంగా ఈ పోటీ చాలా కీలకమైనది.
10. కామిక్స్ తయరీ పోటీ: ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ కామిక్స్ క్రియేటర్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. భారత్‌లో కామిక్ పుస్తకాల సృష్టి, సంస్కృతిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. కొత్త, నిపుణులైన కళాకారులు వారికి ఇష్టమైన కళా శైలిని ఉపయోగించి కామిక్‌లను తయారుచేయవచ్చు. ఈ పోటీలో మూడు దశలు ఉంటాయి. చివరగా ఫైనల్స్ జరుగుతుంది. ఇందులో విజేతల ఎంట్రీలను ప్రచురించచడంతో పాటు వాటికి బహుమతులు అందిస్తారు. కామిక్స్ పరిశ్రమకు ఈ పోటీ చాలా ముఖ్యం. క్రియేటర్లు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, ప్రచురణకర్తల వ్యవస్థను పెంచుకోవడానికి, భారత్‌లో కామిక్స్ వ్యవస్థ వృద్ధికి దోహదపడేందుకు ఇది ఒక వేదికను అందిస్తుంది.
ఈ పోటీలు క్రియేటర్లకు గుర్తింపును అందుకునే అవకాశంతో పాటు వృద్ధి చెందుతున్న, శక్తిమంతమైన క్రియేటర్స్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే విలువైన అవకాశాన్ని కల్పిస్తాయి. భారతీయ కళాకారులు తమ ప్రత్యేక కల్పనలను ప్రదర్శించేందుకు వేదికను కల్పించడం ద్వారా ఈ పోటీలు ప్రపంచ యానిమేషన్ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు సాయపడతాయి. మొత్తంగా వివిధ విభాగాల్లో పోటీదారులు ప్రతిపాదిత నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఆండ్ గేమింగ్, కామిక్స్ – ఎక్సెటెండెడ్ రియాలిటీ సమాచార నిధి పరిధిలో ఉంటారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏవీజీసీ-ఎక్స్ఆర్‌కు చెందిన వివిధ అంశాల్లో ఇంక్యుబేషన్ సౌకర్యాలు, వివిధ యాక్సిలేటర్ కార్యక్రమాలను నిర్వహించాలని అనుకుంటోంది.
(Release ID: 2048522)
Visitor Counter : 104