గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన ప్రాంతాల్లో పీఎం-జన్మన్ పథకంపై అవగాహన కల్పించనున్న ఐఈసీ


పథకం 100 శాతం సద్వినియోగమయ్యేలా వెనకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రచారం

Posted On: 23 AUG 2024 11:39AM by PIB Hyderabad

దేశంలోని 194 జిల్లాల్లోని 1000 తాలూకాలు, 15వేల గ్రామ పంచాయతీలు, 16,500 గ్రామాల్లో సదస్సులు నిర్వహిచడం ద్వారా 28.7 వేల వెనుకబడిన గిరిజన సమూహాలకు చెందిన 44.6 లక్షల మందికి(10.7 లక్షల కుటుంబాలు) పథకాన్ని చేరువ చేయడమే లక్ష్యం

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మన్)ను వెనుకబడిన గిరిజన తరగతుల(పీవీటీజీ) సమూహాలు, పీవీటీజీ కుటుంబాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకునేలా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టనుంది. దేశంలోని 194 జిల్లాల్లో ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) ప్రచారంతో పాటు లబ్ధిదారుల తక్షణ ఎంపిక శిబిరాలను నిర్వహిస్తారు.

పీఎం-జన్మన్ కింద అందిస్తున్న పథకాల పురోగతి, వాటి ప్రచారంలో ఐఈసీ సన్నద్ధతపై గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరం, సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే  గురువారం సమీక్ష చేశారు. జన జాతీయ గౌరవ్ దివస్ (నవంబర్ 15, 2023) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పీఎం జన్మన్ మిషన్ ను జార్ఖండ్ లోని కుంతి జిల్లాలో ప్రారంభించారు.

 

ప్రచార కార్యక్రమాలు, చేరువ

18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు చెందిన 100 జిల్లాల్లోని 500 బ్లాకులు, 15వేల పీవీటీజీ సమూహాల్లో ఐఈసీ గతేడాది ప్రచారం నిర్వహించింది. ఈ ఏడాది ఈ ప్రచార ఉదృతిని మరింత పెంచి 194 జిల్లాల్లోని 28,700 పీవీటీజీ సమూహాలకు చెందిన 44.6లక్షల మందికి చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రాల నుంచి జిల్లాలు, బ్లాకుల నుంచి గ్రామాలు, పీవీటీజీ సమూహాల వరకు అన్ని స్థాయుల్లోనూ ఇది జరగనుంది. 194 జిల్లాల్లోని 16,500 పంచాయతీలు, 15,000 గ్రామ పంచాయతీలు, 1000 తాలూకాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

పీఎం-జన్మన్ ద్వారా పీవీటీజీ సమూహాల్లోని కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల వివరాలు తెలియజేసి వాటి ఫలితాలు పొందేలా చూడటమే ఈ ప్రచార కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో ఈ మిషన్ పాత్ర గురించి సమాచారాన్ని వారికి వివరిస్తారు. రహదారి, డిజిటల్ అనుసంధానం లేని ప్రతి వెనకబడిన గిరిజన కుటుంబాన్ని చేరుకుని, ఇంటి వద్దే వారి అవసరాలను తీరుస్తారు. హాత్ బజార్, కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, గ్రామ పంచాయతీ, అంగన్వాడి, మల్టీపర్పస్ కేంద్రం, వందన వికాస కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రం తదితర ప్రదేశాలను ఈ కార్యక్రమ నిర్వహణకు వినియోగించుకుంటారు. మై భారత్ వాలంటీర్లు, నెహ్రూ యువ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్వయం సహాయక బృందాలు/ఎఫ్పీవోలు, ఇతర విబాగాలను ఈ కార్యక్రమంలో క్రియాశీలక భాగస్వామ్యులను చేసి ప్రచారాన్ని విజయవంతం చేయనున్నారు.

·         ఈ ప్రచార సమయంలో ఏదైనా పథకం లబ్ధి పొందడానికి అవసరమైన ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, జన్ ధన్ ఖాతాలు, అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ) ప్రకారం పట్టాలు అందజేస్తారు.

·         గిరిజన భాషల్లోనే పీఎం జన్మన్ కార్డులను అందజేస్తారు.

·         ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య, లబ్ధిదారుల ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. వ్యక్తులు/గృహాలకు తక్షణ లబ్ధి చేకూర్చే పథకాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. సికిల్ సెల్ లాంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

·         అవగాహన పెంపొందించే కరపత్రాలు, వీడియోల, క్రియేటివ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, తదితరాలను  స్థానిక గిరిజన భాషల్లోనే రూపొందిస్తారు.

·         పీఎం-జన్మన్ గురించి తెలియచేసే ప్రచార చిత్రాలను గిరిజన సమూహాల్లోని గోడలపై చిత్రిస్తారు.

·         పీవీటీజీల్లోని అర్హులైన వారికి ఉపకారవేతనం, ప్రసూతి ప్రయోజన పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ సమ్మాన్ నిధి, ఎస్సీడీ రోగులకు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకుంటారు.

·         పథకం లబ్ధిదారులు, విజేతల విజయగాథలను ప్రత్యేకంగా వివరించి, సంఘంలోని ఇతరుల్లో స్ఫూర్తి కలిగించేందుకు ప్రయత్నిస్తారు.

ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి అధికారులను నియమించారు. రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రచారం విజయవంతం చేసేందుకు కృషి  చేస్తారు. సంబంధిత శాఖల్లో సాధారణ అధికారులు, సిబ్బందితో పాటు కన్సల్టెంట్లు, దిగువ స్థాయి వరకు ఉన్న ఇతర కాంట్రాక్టు సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన పరిశోధనా సంస్థలు జిల్లా, బ్లాక్, గిరిజన ఆవాస స్థాయిలలో ఈ కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేసి అమలు చేయడంలో సాయపడతాయి. 

మిషన్ లక్ష్యం

పీఎం జన్మన్ మిషన్ తొమ్మిది కీలక మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన 11 క్లిష్టమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి 2025-26 వరకు షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక(డీఏపీఎస్టీ) కింద రూ. 24,104 కోట్లు (కేంద్ర వాటా: రూ. 15,336 కోట్లు కాగా రాష్ట్ర వాటా: రూ. 8,768 కోట్లు) బడ్జెట్ కేటాయించారు.

పీవీటీజీల సమగ్ర అభివృద్ధికి కీలకమైన ఇతర పథకాలు, మంత్రిత్వ శాఖలు/విభాగాలతో కూడిన 10 అంశాలను గుర్తించారు. ఆధార్‌ నమోదు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, పీఎం-జన్ధన్ యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ కార్డ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయడంతో పాటు  వ్యక్తిగత, కమ్యూనిటీ అటవీ హక్కుల పెండింగ్ కేసులను పరిష్కరిస్తారు.

డిసెంబర్ 15, 2023న జరిగిన జాతీయ మంథన్ శిబిరంలో కార్యక్రమ అమలు తీరుపై చర్చించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 700 మందికి పైగా అధికారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డైరెక్టర్లు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఈ ఏడాది జూలై 18, 19 తేదీల్లో పీఎం జన్మన్ కింద చేపట్టిన కార్యకలాపాల పురోగతిని సమీక్షించడానికి మరోసారి మంథన్ శిబిరం నిర్వహించారు. పీఎం జన్మన్ రెండో దశలో చేపట్టాల్సిన నూతన కార్యక్రమాలపై చర్చించారు.

 

***



(Release ID: 2048390) Visitor Counter : 85