ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళలోని వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించిన అనంతరం ప్రధానమంత్రి స్పందన
Posted On:
10 AUG 2024 8:23PM by PIB Hyderabad
గౌరవ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్రప్రభుత్వంలో నా గౌరవ సహచరులు, ఈ భూమి పుత్రుడు శ్రీ సురేశ్ గోపిజీ
ఈ విపత్కర సంఘటన గురించి తొలుత సమాచారం అందినప్పటి నుంచి నేను నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ, తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇలాంటి విపత్కర సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా కేంద్రప్రభుత్వం సంబంధిత శాఖలన్నింటినీ సమీకరించడం అత్యవసరం. అలాగే మనందరం విపత్తు బాధితులను అదుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలి.
ఇది సాధారణమైన విషాదం కాదు. లెక్కలేనన్ని కుటుంబాల ఆశలు, కలలు అన్నింటినీ అది ఛిద్రం చేసేసింది. ఈ ప్రకృతి విలయతాండవం తీవ్రతను నేను స్వయంగా వీక్షించాను. సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్న ఎన్నో బాధిత కుటుంబాలను సందర్శించాను. వారందరి భయంకరమైన అనుభవాలను నేను ప్రత్యక్షంగా విన్నాను. ఈ వైపరీత్యంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా వ్యక్తిగతంగా కలిశాను.
ఇలాంటి సంక్షోభ సమయంలో మనందరి ఉమ్మడి ప్రయత్నాలు మాత్రమే అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. విపత్తు సంభవించిన రోజు ఉదయమే నేను గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని వనరులను సమీకరిస్తున్నామని, వీలైనంత వేగంగా అక్కడకు చేరగలమని హామీ ఇచ్చాను. అప్పటికప్పుడే మా ప్రభుత్వంలో సహాయమంత్రిని సంఘటన జరిగిన ప్రాంతానికి పంపాను. అలాగే వివిధ సంస్థలు కూడా అమిత వేగంగా స్పందించాయి. ఎస్ఆర్ డిఎఫ్, ఎన్ఆర్ డిఎఫ్, సాయుధ దళాలు, పోలీసులు, స్థానిక మీడియా, ఎన్ జిఓలు అన్నీ బాధితులను ఆదుకునేందుకు తక్షణం రంగంలోకి దిగాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన వారికి జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చడం మానవ సామర్థ్యానికి అతీతమైన పని. అయినప్పటికీ వారి కలలు, వారి భవిష్యత్తుకు మరింత నష్టపోకుండా కాపాడవలసిన ఉమ్మడి బాధ్యత మనందరి పైన ఉంది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం, జాతి ఐక్యంగా బాధితులకు అండగా నిలుస్తాయి.
నిన్న మా అంతర్గత మంత్రుల సమన్వయ బృందాన్ని అక్కడకు పంపాను. వారు గౌరవ ముఖ్యమంత్రిని, స్థానిక అధికారులను కలిసి నష్టాన్ని మదింపు చేయడం పూర్తి చేశారు. తాను సవివరమైన వినతిపత్రం అందిస్తానని గౌరవ ముఖ్యమంత్రి నాకు తెలియచేశారు. వారు ఏ మాత్రం ఏకాకి కాదని బాధిత కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో రాష్ర్ట ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం లేదా పౌరులు కావచ్చు అందరం వారికి మద్దతు అందించడానికి ఐక్యంగా ఉన్నామని తెలియచేస్తున్నాను.
సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విపత్తు సహాయంగా అధిక శాతం నిధులను ప్రభుత్వం కేటాయించింది. మిగతా మొత్తాన్ని కూడా తక్షణం విడుదల చేశాం. ప్రభుత్వం నుంచి వినతిపత్రం అందగానే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహకరించి అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. ఎలాంటి ప్రయత్నాలకైనా నిధుల కొరత అవరోధం కాబోదని నేను నమ్ముతున్నాను.
ప్రాణనష్టం విషయానికి వస్తే మనం బాధిత కుటుంబాలకు ప్రత్యేకించి యావత్తు కోల్పోయిన బాలలకు మరింత ఊరట అందిచాల్సిన అవసరం ఉంది. వారికి మద్దతు అందించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. రాష్ర్ట ప్రభుత్వం అందుకు అవసరమైన వివరణాత్మక వ్యూహం రూపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఎలాంటి అదనపు సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ముఖ్యమంత్రి నాకు నివేదించిన విధంగానే నేను కూడా ఇదే తరహా విపత్తును చవి చూశాను. 1979లో అంటే 40, 45 సంవత్సరాల క్రితం గుజరాత్ లోని మోర్బి డామ్ భారీ వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసమయింది. డామ్ కుప్పకూలిన కారణంగా అందులోని నీరంతా మోర్బి నగరంలోకి ప్రవేశించింది. నగరం అంతటా 10 నుంచి 12 అడుగుల నీరు నిలిచిపోయింది. నాటి దుర్ఘటనలో 2500 మంది వరకు ప్రజలు మరణించారు. అది మట్టితో నిర్మించిన డామ్ కావడం వల్ల ప్రతీ ఒక్క ఇల్లూ బురదమయంగా మారిపోయింది. నేను ఒక వలంటీర్ గా ఆరు నెలల పాటు అక్కడ పని చేశాను. బురద కారణంగా ఏర్పడిన సమస్యను, అది విసిరిన సవాలును నేను ప్రత్యక్షంగా చూశాను. వలంటీర్ గా అప్పటి నా అనుభవంతో ఈ తరహా కష్టాలపై నాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. బురదలో చిక్కుకుపోయిన కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించగలను. ఇంత విపత్తులో కూడా సజీవంగా ఉన్న వారు ఎంతో అదృష్టవంతులు. భగవంతుని ఆశీస్సులతోనే వారు బయటపడ్డారనిపిస్తుంది.
పరిస్థితి తీవ్రత నాకు పూర్తిగా అర్ధమయింది. బాధితులకు సహాయం అందించే విషయంలో దేశం నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ప్రయత్న లోపం ఏదీ ఉండబోదని మీకు హామీ ఇస్తున్నాను. మీరు వివరాలు అందించిన వెంటనే ఇళ్లు, పాఠశాలలు, రోడ్డు మౌలిక వసతుల నిర్మాణం నుంచి బాధిత బాలల భవిష్యత్తుకు భరోసా వరకు అన్నింటికీ ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇస్తున్నాను. నా పర్యటన వల్ల బాధితులను కాపాడే పనులు, సహాయక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని నేను మొదట భావించాను.
కాని పరిస్థితిని క్షుణ్ణంగా మదింపు చేసిన తర్వాత తాజా పరిస్థితిపై ప్రత్యక్ష అవగాహన పొందడం ద్వారా సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుందని నేను గుర్తించాను. ముఖ్యమంత్రి ఆశించిన మేరకు అన్ని రకాల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు
గమనిక : ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే.
***
(Release ID: 2046713)
Visitor Counter : 49
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam