హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద అహ్మదాబాద్‌లో 188 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


లక్షలాది మందికి పౌరసత్వంతోపాటు న్యాయం, హక్కులను సిఎఎ కల్పిస్తుంది.

ఇప్పటి వరకూ శరణార్థులు: నేటి నుంచి భరతమాత బిడ్డలు

మూడు తరాల అన్యాయం అంతం: కోట్లాది శరణార్థులకు ప్రధాని మోదీ న్యాయం

విభజన సమయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రస్తుత ప్రతిపక్షం

అసమర్థ విధానంతో కోట్లాది శరణార్థులకు పౌరసత్వం లేకుండా చేయడాన్ని మించిన పాపం లేదు

చొరబాటుదారులకు హక్కులు ఇచ్చి, శరణార్థుల హక్కులను కాలరాసిన ప్రస్తుత ప్రతిపక్షం

విభజన సమయంలో బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా 27%, నేడు 9% మాత్రమే.

శరణార్థి హోదా కలిగినవారు నిర్భయంగా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి

Posted On: 18 AUG 2024 5:54PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకారశాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA) శరణార్ధులైన 188 మంది సోదరీసోదరులకు పౌరసత్వ పత్రాలను పంపిణీ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో స్థిరపడిన లక్షలాది శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారికి న్యాయం, హక్కులను కూడా సిఎఎ కల్పిస్తుందన్నారు. గత ప్రభుత్వాల బుజ్జగింపు విధానాల వల్ల 1947 నుంచి 2014 వరకు దేశాన్ని ఆశ్రయించిన ప్రజలకు హక్కులు, న్యాయం దక్కలేదన్నారు. పొరుగు దేశాల్లోనే కాకుండా ఇక్కడ కూడా వారు కష్టాలు పడినట్లు మంత్రి పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు మూడు తరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని, అయితే ప్రతిపక్షాలు అనుసరించిన అసమర్థ విధానాల వల్ల వారికి న్యాయం జరగలేదని శ్రీ షా విమర్శించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోట్లాది మంది శరణార్థులకు న్యాయం చేశారన్నారు.

 స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించారని, ఆ సమయంలో తీవ్ర అల్లర్లు జరిగాయని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న కోట్లాది మంది హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు వారు పడిన కష్టాలను మరిచిపోలేరన్నారు. అనేక కుటుంబాలు నాశనం అయ్యాయన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నవారు పొరుగు దేశాల నుంచి వచ్చే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన, క్రైస్తవ వర్గాలకు చెందిన వారికి భారత పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఎన్నికల సమయానికి అప్పటి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. 1947, 1948, 1950లలో ఇచ్చిన హామీలను వారు మరిచిపోయారని శ్రీ షా పేర్కొన్నారు. వారి ఓటు బ్యాంకులకు కోపం వస్తుందన్న కారణంతోనే అప్పటి ప్రభుత్వం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వలేదన్నారు. వారి బుజ్జగింపు విధానం వల్ల లక్షలాది మంది పౌరసత్వం కోల్పోయారని, దీనికంటే పెద్ద పాపం మరొకటి లేదని ఆయన అన్నారు.   

కోట్లాది మంది ప్రజలు వలసపోయి కష్టాలు పడ్డారని, చాలా మంది తమ కుటుంబాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారికి భారతదేశంలో పౌరసత్వం కూడా లభించలేదని శ్రీ అమిత్ షా తెలిపారు. 1947 -2019,  2019-2024 మధ్యకాలంలో జరిగిన పరిణామాలు దేశచరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. ఆత్మగౌరవాన్ని కోరుకుంటూ పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి ఎందుకు పౌరసత్వం ఇవ్వలేకపోయారని షా ప్రతిపక్షాలను ప్రశ్నించారు. సరిహద్దులు దాటి దేశంలోకి అక్రమంగా చొరబడిన కోట్లాది మందిని అక్రమంగా బారత పౌరులుగా మార్చిన నేటి ప్రతిపక్షం, మరోవైపు- చట్ట ప్రకారం వ్యవహరించిన శరణార్థులను చట్టపరమైన నిబంధనలు లేవంటూ మోసం చేసిందని శ్రీ షా దుయ్యబట్టారు.

ప్రజల మేలు కోసమే చట్టం ఉందని, చట్టం కోసం ప్రజలు కాదని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అన్నారు. సిఎఎ తీసుకొస్తామని 2014లో హామీ ఇచ్చిన మేరకు, 2019లో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఇన్నాళ్లు న్యాయం జరగని కోట్లాది మంది హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతోందని అన్నారు. ఈ చట్టాన్ని 2019లోనే ఆమోదించామనీ, అప్పటికీ ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టాయన్నారు. అంతేగాక ముస్లింల పౌరసత్వాన్ని ఈ చట్టం రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేశారని శ్రీ షా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం ఎవరు తీసుకోవాలన్న నిబంధన లేదని, పౌరసత్వం ఇవ్వాలన్నదే చట్టం ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. మన దేశంలో మన దేశ ప్రజలే నిస్సహాయంగా బతికే పరిస్థితి ఉండేదని, ఇంతకంటే దౌర్భాగ్యం, విడ్డూరం ఏముంటుందని షా ప్రశ్నించారు. ప్రతిపక్షాల అసమర్థ విధానాల వల్ల ఎన్నో ఏళ్లుగా సాధ్యంకానిది ప్రధాని మోదీ సుసాధ్యం చేసి 2019లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని షా తెలిపారు.

2019లో ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా కొందరు దేశంలో అల్లర్లను ప్రేరేపించడం, అలాగే మైనారిటీలను రెచ్చగొట్టడంతో ఈ కుటుంబాలకు 2024 వరకు పౌరసత్వం లభించలేదని అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. సిఎఎ గురించి దేశంలో పుకార్లు వ్యాపింపజేశారని పేర్కొన్నారు. ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయదని, హిందూ, జైన, సిక్కు, బౌద్ధ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశమని అన్నారు. నేటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని శ్రీ షా విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న శరణార్థులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిర్భయంగా ముందుకురావాలని, దీని వల్ల వారి ఉద్యోగాలు, ఇళ్లు మొదలైన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

ఈ చట్టంలో ఎలాంటి నేర సంబంధ విచారణ నిబంధన లేదని, అందరికీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు మంత్రి తెలిపారు. పౌరసత్వం ఇవ్వడంలో జాప్యం గత ప్రభుత్వాల వల్లే జరిగిందని, ప్రజల వల్ల కాదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న శరణార్థులకు న్యాయం, గౌరవం కల్పించేందుకు ఈ చట్టం పనిచేస్తుందని, శరణార్థులపై జరిగిన అకృత్యాలకు ఇది ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు.

 దేశ విభజన జరిగినప్పుడు బంగ్లాదేశ్‌లో 27 శాతం మంది హిందువులు ఉండగా, నేడు హిందూ జనాభా కేవలం 9 శాతం మాత్రమే ఉండడం శోచనీయమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన హిందువులు ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. బలవంతంగా హిందువులను మతమార్పిడి చేయించారని అన్నారు. మా ఆశ్రయం కోరి వచ్చిన వ్యక్తులు ఆత్మగౌరవంతో జీవిస్తూ వారికి నచ్చిన మతాన్ని ఆచరించవచ్చన్నారు. పొరుగు దేశంలో గౌరవంతో జీవించలేక మన ఆశ్రయానికి వస్తే వారి విషయంలో మనం మౌనంగా చూస్తూ ఉండలేమన్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ కచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు.

 

ఈ చట్టాన్ని తీసుకురావాలని శరణార్థులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.  2019లో ప్రధాని మోదీ గట్టి నిర్ణయం తీసుకుని ఈ చట్టం ఆమోదానికి కృషి చేశారని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. అయితే చివరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దరఖాస్తుదారులకు పౌరసత్వ హక్కు ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన నియమావళిని తీసుకురాగలిగామని చెప్పారు.

 ఈ దేశ ప్రజాస్వామ్యం బంధుప్రీతి, కులతత్వం, బుజ్జగింపులు, అవినీతి అనే నాలుగు దురాచారాలతో బాధపడుతోందని 2014లో శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత పదేళ్లుగా మోదీ ఈ నాలుగు దురాచారాలను రూపుమాపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీన వారసత్వ రాజకీయాలకు స్వస్తిపలకాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుండి లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని మోదీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. కుల దురాచారాన్ని అంతం చేసేందుకు పేదలు, మహిళలు, యువత, రైతులు అనే నాలుగు కులాలను మోదీజీ ప్రకటించారని షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ కొత్త తరహా రాజకీయ విధానాలను దేశం ముందు ఉంచి, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికారని అమిత్ షా పేర్కొన్నారు.

 గతంలో దశాబ్దాల తరబడి దేశాన్ని ఎన్నో సమస్యలు చుట్టిముట్టి ఉన్నాయని దేశీయ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఉదాహరణకు, 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే పనిని మోదీజీ పూర్తి చేశారన్నారు. అదేవిధంగా, ఔరంగజేబు నాశనం చేసిన కాశీ విశ్వనాథ దేవాలయాన్నీ, మహ్మద్ బేగడ నాశనం చేసిన పావగఢ్ శక్తిపీఠాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. భారత్‌లో ట్రిపుల్‌ తలాక్‌ దురాచారాన్ని అంతమొందించే గొప్ప కార్యాన్ని కూడా నరేంద్ర మోదీ పూర్తి చేశారని అన్నారు. ఉగ్రవాదులను తయారు చేయడం, ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కారణమైన ఆర్టికల్ 370ని కూడా ప్రధాని మోదీ రద్దు చేశారని శ్రీ షా అన్నారు. అదేవిధంగా, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయడం ద్వారా శ్రీ నరేంద్ర మోదీ జీ తమ హక్కులను కోల్పోయిన కోట్లాది మంది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన సోదరులకి న్యాయం చేశారన్నారు.

 దేశ వ్యాప్తంగా ఉన్న శరణార్థులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే వారు భయాందోళనలకు గురికావద్దని శ్రీ అమిత్ షా కోరారు. మైనారిటీలను తప్పుదోవ పట్టించే వారు... మైనారిటీలకు స్వయంగా వారే అన్యాయం చేస్తున్న విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ఈ చట్టాన్ని తీసుకు వచ్చే ధైర్యం వాళ్లకు లేదని, కనీసం దీనిని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. 

***


(Release ID: 2046632) Visitor Counter : 102