ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులందరూ విజేతలే: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


భారత ఒలింపిక్ క్రీడాకారులతో ప్రధానమంత్రి మాటామంతీ;

Posted On: 15 AUG 2024 5:03PM by PIB Hyderabad

   పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలో వారితో కాసేపు ముచ్చటించారు. క్రీడా పోటీల్లో వారి అనుభవాలు, అనుభూతుల గురించి వాకబు చేశారు. మైదానంలో వారు శక్తివంచన లేకుండా శ్రమించారని, అసాధారణ ప్రతిభానైపుణ్యాలు ప్రదర్శించారని ప్రశంసించారు.

పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులందరూ విజేతలేనని శ్రీ మోదీ అభివర్ణించారు. క్రీడారంగానికి కేంద్ర ప్రభుత్వం సదా వెన్నుదన్నుగా నిలుస్తుందని, క్రీడాకారులకు అవసరమైన అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పనకు భరోసా ఇస్తుందని ఆయన అన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

   ‘‘పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ క్రీడాకారుల బందంతో భేటీ నాకెంతో సంతోషాన్నిచ్చింది. క్రీడా ప్రాంగణంలో వారి అనుభవాలు, అనుభూతుల గురించి అడిగి తెలుసుకున్నాను. మైదానంలో వారు ప్రదర్శించిన అసాధారణ ప్రతిభానైపుణ్యాలను ప్రశంసించాను.’’ అలాగే...

   ‘‘పారిస్ వెళ్లిన క్రీడాకారులందరూ చాంపియన్లే... క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తుంది. క్రీడారంగానికి అవసరమైన అత్యుత్తమ మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి హామీ ఇస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 2045763) Visitor Counter : 69