రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజి సందర్శన దేశాధ్యక్షుడు.. ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు


రాష్ట్రపతికి ఫిజి అత్యున్నత పౌర పురస్కారం
‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ ప్రదానం;

ఫిజి పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం... వాతావరణ న్యాయంలో ఫిజి సహా
ఇతర సాగర తీర దేశాలతో భారత్ చేయికలిపి నడుస్తుందని ఉద్ఘాటన;

ఫిజిలో భారత సంతతి ప్ర్రజలనుద్దేశించి ప్రసంగం... మన కలలకు దీటైన భారతదేశ నిర్మాణంలో ప్రవాస భారతీయులను కీలక భాగస్వాములుగా పరిగణిస్తామని ప్రకటన

Posted On: 06 AUG 2024 3:07PM by PIB Hyderabad

   భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఫిజి, న్యూజిలాండ్, టిమోర్ లెస్టె దేశాల సందర్శనలో తొలి అంకంగా 2024 ఆగస్టు 6న ఉదయం ఫిజి చేరారు. ఫిజి ప్రధానమంత్రి సిటివెని రబూకా ఆమెకు విమానాశ్రయంలో సాంప్రదాయక స్వాగతం పలికారు. భారత దేశాధినేత ఒకరు ఫిజి సందర్శించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ జార్జి కురియెన్, లోక్ సభ సభ్యులు శ్రీ సౌమిత్ర ఖాన్, శ్రీ జుగల్ కిశోర్ కూడా ఆమె వెంట ఉన్నారు.

   ఫిజి ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రపతి శ్రీమతి ముర్ముకు సాంప్రదాయక స్వాగతం లభించింది. అనంతరం శ్రీమతి ముర్ము అధ్యక్ష భవనాన్ని సందర్శించగా అధ్యక్షుడు రటు విలియం మైవాలిలి కటోనివెరె ఆమెను సాదరంగా ఆహ్వానించారు. భారత-ఫిజి బంధాన్ని మరింతగా విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నాయకులూ చర్చించారు. ఫిజి కీలక భాగస్వామిగాగల పసిఫిక్ ద్వీప దేశాలతో (పిఐసి) బంధాన్ని, అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని రాష్ట్రపతి చెప్పారు.

  అధ్యక్ష భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఫిజి దేశాధ్యక్షుడు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ప్రదానం చేశారు. అటుపైన గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ ఈ దేశంలో చేపట్టిన ‘‘ప్రభుత్వాధినేతల నివాసాల సౌర విద్యుదీకరణ’’ ప్రాజెక్టు పురోగతిని రాష్ట్రపతి శ్రీఈ సందర్భంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఫిజి పార్లమెంటులో ఆమె ప్రసంగించారు. ఉభయదేశాల మధ్య పరిమాణంలో తేడాలున్నా శక్తిమంతమైన ప్రజాస్వామ్యం సహా పలు సారూప్యతలు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని విస్తరింపచేయడంలో  భాగస్వామిగా అనుభవం ఉన్న దేశంగా, మంచి మిత్రునిగా ఫిజితో అన్ని సమయాల్లోనూ భాగస్వామిగా నిలవడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని ఫిజి పార్లమెంటేరియన్లకు ఆమె హామీ ఇచ్చారు.

   వాతావరణ మార్పులు, మానవ సమాజంలోని సంఘర్షణలు అనే రెండు ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి ఉభయ దేశాలు చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాల్లో ఫిజి అందిస్తున్నసహకారం విస్తరిస్తున్న తీరును ప్రపంచం యావత్తూ గుర్తించిందని రాష్ట్రపతి శ్రీమతి ముర్ము అన్నారు. వాతావరణ మార్పుల అంశంపై ప్రపంచ స్థాయి చర్చలకు మార్గం సుగమం చేయడం లేదా సాగర తీర దేశాల ఆందోళనలు వెల్లడి చేయడం ద్వారా ప్రపంచ శ్రేయస్సుకు పాటు పడడం తదితరాల్లో ఫిజి అద్భుత సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిజి పోషిస్తున్న కీలక పాత్రను భారతదేశం ఘనంగా ప్రశంసిస్తున్నదన్నారు.

   హుందాతనంతో కూడిన ఫిజి జీవనశైలి, సంప్రదాయాలు, ఆచారాల పట్ల దేశానికి గల ఎనలేని గౌరవం; ఎలాంటి దాపరికాలు లేని బహుళ సంస్కృతులకు స్థానం కల్పించే వాతావరణం చూసి ఫిజి నుంచి ప్రపంచం ఎంతో నేర్చుకోవలసి ఉందని రాష్ట్రపతి అన్నారు. విభిన్న రంగాల్లో భారత-ఫిజి మైత్రి మరింత బలోపేతం కావడంపై ఆమె హర్షం ప్రకటించారు. దక్షిణార్థ గోళంలో శక్తిమంతంగా గళం వినిపించే దేశమైన భారత్ వాతావరణ న్యాయంలో ఫిజితోనూ, ఇతర సాగరతీర దేశాలతోనూ భుజం కలిపి చేస్తున్న ప్రయాణాన్ని కొనసాగిస్తుందని రాష్ట్రపతి హామీ ఇచ్చారు.

   రాష్ట్రపతి శ్రీమతి ముర్ముతో ఫిజి ప్రధానమంత్రి సిటివెని రబుకా సమావేశమై విస్తృత అంశాలపై చర్చించారు. ఉభయ దేశాల మధ్య చారిత్రక బంధాన్ని మరింత నిర్మించుకోవాలని, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు అంగీకరించారు. వాతావరణ రంగంలో స్థితిస్థాపకతను పెంచుకోవడంతో పాటు స్వచ్ఛ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఫిజితో అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉన్నదని రాష్ట్రపతి అన్నారు.

సువాలో (i) భారత చాన్సరీ హైకమిషన్, భారత సాంస్కృతిక కేంద్ర సముదాయం (ii) 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రాజెక్టు స్థలాల కేటాయింపు పత్రాలు అందించే కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి సిటివెని రబుకా ఉమ్మడిగా అధ్యక్షత వహించారు.

అలాగే సువాలో జరిగిన కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న భారత సంతతి ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.

   దాదాపు 145 ఏళ్ల కిందట ఒక ఒప్పందానికి కట్టుబడి ఫిజి వచ్చిన ‘‘గిర్మితీయ’’ కార్మికుల సంకల్పశక్తి, స్థితిస్థాపకత; ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొంటూ తమ కొత్త మాతృభూమిలో వారు నిలదొక్కుకున్న తీరు ప్రపంచానికే ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె ప్రశంసించారు.

   ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారత సంతతి ప్రజలను నవభారత నిర్మాణ కలను సాకారం చేసుకోవడంలో కీలక భాగస్వాములుగా పరిగణిస్తామని రాష్ట్రపతి అన్నారు. అమర సైనికవీరుల  గౌరవార్ధం సువాలో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించారు.  అలాగే మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్ ను కూడా సందర్శించి బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించారు. చివరగా ఫిజి అధ్యక్షుడు రటు విలియం మైవాలిలి కటోనివెరె రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గౌరవార్ధం అధ్యక్ష భవనంలో విందు ఇచ్చారు. ఫిజిలోని భిన్న రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ- తనకు సాదర స్వాగతం పలికినందుకు అధ్యక్షుడు కటోనివెరె, ప్రధానమంత్రి రబుకాకు, ఫిజి ప్రభుత్వానికి, ఫిజి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

   సువాలో కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా ముగించుకుని, రాష్ట్రపతి ‘నడి’కి వెళ్లారు. అక్కడి నుంచి మర్నాడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు బయలుదేరి వెళ్తారు.

 

****


(Release ID: 2044711) Visitor Counter : 64