వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టంపై సంపూర్ణ బీమా రక్షణతో రైతులకు ఎంతో ప్రయోజనం: శివరాజ్ సింగ్ చౌహాన్


చెల్లింపులో జాప్యంచేస్తే బీమా కంపెనీకి 12 శాతం
జరిమానా; ఆ మొత్తం నేరుగా రైతు ఖాతాలో జమ

Posted On: 06 AUG 2024 3:54PM by PIB Hyderabad

   దేశంలో పంటల బీమా పథకం అమలుపై లోక్‌స‌భ‌లో ఇవాళ పలు ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానాలిచ్చారు. లోగడ పంటల బీమా పథకాల్లో అనేకానేక ఇబ్బందులు ఉండేవని ఆయన తొలుత పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వాల హయాంలో పంటల బీమా పథకాలెన్నో ఉన్నా పంటనష్టం అభ్యర్థనలపై చెల్లింపులు అరకొరగా ఉండేవన్నారు. బీమా రక్షణ మొత్తం కూడా తక్కువని, అభ్యర్థనల పరిష్కారంలో జాప్యానికి అంతేలేదని వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై రైతులు, రైతు సంఘాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసేవని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సరికొత్త ‘‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం’’ (పిఎంఎఫ్‌బివై) తెచ్చారని తాను సగర్వంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు. గతంలో పంటల బీమా కోసం 3 కోట్ల 51 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పుడు 8 కోట్ల 69 లక్షలు వచ్చాయని, చెల్లింపులు కూడా గరిష్ఠంగా రూ.2.71 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రైతులు చెల్లించిన బీమా రుసుము రూ.32,404 కోట్లు కాగా, పంట నష్టపరిహారం అభ్యర్థనల కింద చెల్లింపులు రూ.1.64 లక్షల కోట్లు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇప్పుడు పంట నష్టంపై అభ్యర్థనల పరిష్కారం, పరిహారం చెల్లింపులో బీమా సంస్థ ఆలస్యం చేస్తే, 12 శాతం జరిమానా విధించి ఆ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమచేసేలా నిబంధనను జోడించినట్లు తెలిపారు.

   ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే సంపూర్ణ బీమా రక్షణతో రైతుకు ప్రయోజనం చేకూరుతుందని శ్రీ చౌహాన్ అన్నారు. మునుపటి పథకాల కింద రుణం తీసుకున్న రైతులకు బీమా తప్పనిసరి చేస్తూ, ఆ రసుము మొత్తాన్ని బ్యాంకులు రుణం నుంచి మినహాయించేవని గుర్తుచేశారు. కానీ, నేటి ప్రభుత్వం ఈ వైపరీత్య విధానాన్ని తొలగించి బీమా రక్షణ పొందడాన్ని స్వచ్ఛందం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పంటల బీమా పథకం కింద ఇప్పటిదాకా 5 లక్షల 1 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు రక్షణ లభించగా, 2023 నాటికి 5 లక్షల 98 వేల హెక్టార్లకు పెరగడంతో  3 కోట్ల 57 లక్షల మంది రైతులకు భరోసా లభించిందన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సరళం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

   ఈ మేరకు ప్రధానమంత్రి పంటల బీమా పథకం మూడు విధాలుగా ఉంటుందని శ్రీ చౌహాన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం విధానాలను మాత్రమే రూపొందిస్తుందని, వాటినుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన నమూనాను ఎంచుకుంటాయని తెలిపారు. ఆ తర్వాత (ప్రభుత్వ-ప్రైవేటు) బీమా కంపెనీలు ఈ పథకాన్ని పోటీతత్వంలో అమలు చేస్తాయన్నారు. అయితే, పంటల బీమా పథకం ప్రతి రాష్ట్రానికీ అవసరం లేదని చెప్పారు. బీహార్‌లో బీమా రుసుము అత్యధికంగా ఉండటంపై- ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘పిఎంఎఫ్‌బివై’కి బదులు సొంత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నదని, కాబట్టి, దాని ప్రకారమే రైతులు రుసుము చెల్లించాల్సి రావడమే కారణమని మంత్రి వివరించారు.

   దేశంలోని ప్రతి జిల్లాకూ ‘పిఎంఎఫ్‌బివై’ ఒకేరీతిలో వర్తిస్తుందని శ్రీ చౌహాన్ తెలిపారు. గతంలో సమితి లేదా మండలాన్ని ఒక యూనిట్ యూనిట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు పంచాయితీని యూనిట్‌గా  మార్చామని పేర్కొన్నారు. దీనివల్ల పంచాయితీలో ఒక రైతుకు నష్టం వాటిల్లితే, దానికి పరిహారం చెల్లించవచ్చునని, ఆ విధంగా పాత పథకాల్లోని లోపాలను తొలగించామని పేర్కొన్నారు. అలాగే ప్రతి పంచాయతీలో కనీసం 4 పంట కోత ప్రయోగాల నిర్వహణ తప్పనిసరి చేశారు. ఇక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశం మేరకు వినూత్న రీతిలో 30 శాతం పంటనష్టాన్ని ‘రిమోట్ సెన్సింగ్’ ద్వారా అంచనా వేయడం తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. దీనివల్లనే పరిహారం అభ్యర్థనల పరిష్కారంలో జాప్యం చోటుచేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట దిగుబడి గణాంకాలు లభ్యమైన నెల రోజుల్లోనే పరిహారం మొత్తాన్ని లెక్కిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని సవ్యంగా అమలుచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.

   బీమా చెల్లింపుల్లో జాప్యాన్ని విశ్లేషిస్తే- రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బీమా రుసుము విడుదలలో ఆలస్యమే 98.5 శాతం కారణమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లోపాన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ఉదంతాల్లో దిగుబడి సమాచారం ఆలస్యంగా అందడం 99 శాతం జాప్యానికి దారితీస్తోందని చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు, ఇంకొన్నిసార్లు రైతుల సంఖ్యలు కచ్చితంగా లేకపోవడం కూడా ఆలస్యానికి కారణమని వివరించారు. ఈ నేపథ్యంలో రైతుకు చెల్లింపు జాప్యం కాకుండా చూసే దిశగా రాష్ట్ర వాటాతో నిమిత్తం లేకుండా కేంద్రం తన వాటాను వేరుచేస్తూ నిబంధన జోడించినట్లు చెప్పారు. తదనుగుణంగా కేంద్రం తన వాటాను తక్షణం విడుదల చేస్తోందని, దీనివల్ల రైతుకు కేంద్ర వాటా నుంచి పరిహారం వెంటనే అందుతుందని శ్రీ చౌహాన్ చెప్పారు. బీమా కంపెనీలు ఆలస్యం చేస్తే, 12 శాతం అపరాధ రుసుము విధించి ఆ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేసే నిబంధనను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. ఇక ఈ పథకం మీద సమీక్షకు కమిటీ ఏర్పాటు ప్రశ్నకు బదులిస్తూ- నేడు అలాంటి అవసరం లేదని భావిస్తున్నామని, సభ్యులు ఏదైనా సలహా ఇస్తే స్వీకరించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు.

***


(Release ID: 2042499) Visitor Counter : 103