ప్రధాన మంత్రి కార్యాలయం

అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 03 AUG 2024 12:03PM by PIB Hyderabad

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్  గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో ఈ ఐసీఏఈ సదస్సు జరగడం సంతోషంగా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి మీరు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని 120 మిలియన్ల రైతుల తరపున మీ అందరికీ స్వాగతం. భారతదేశంలోని 30 మిలియన్లకు పైగా మహిళా రైతుల తరపున మీ అందరికీ స్వాగతం. దేశంలోని 30 మిలియన్ల మత్స్యకారుల తరపున మీ అందరికీ స్వాగతం. దేశంలోని 80 మిలియన్లకు పైగా పశు పాలకుల తరపున మీకు స్వాగతం. 550 మిలియన్ పశువులు ఉన్న దేశంలో మీరు ఉన్నారు. వ్యవసాయ  ఆధార దేశమైన, జీవులను ప్రేమించే  భారతదేశానికి మీకు స్వాగతం, అభినందనలు.

మిత్రులారా,

భారతదేశం ఎంత ప్రాచీనమైనదో, వ్యవసాయం, ఆహారానికి సంబంధించి మన నమ్మకాలు, అనుభవాలు కూడా అంతే ప్రాచీనమైనవి. భారతీయ వ్యవసాయ సంప్రదాయంలో విజ్ఞానశాస్త్రానికి, తర్కానికి  ప్రాధాన్యత ఇవ్వబడింది. నేడు ప్రపంచంలో ఆహారం, పోషకాహారం (పోషణ) గురించి చాలా ఆందోళన ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితమే మన గ్రంధాలలో - అన్నం హి భూతానాం జ్యేష్ఠంతస్మాత్ సర్వౌషదం ఉచ్యతే, అని చెప్పబడింది. అంటే, ఆహారం అన్ని పదార్థాలలో ఉత్తమమైనది, అందుకే ఆహారాన్ని అన్ని ఔషధాల స్వరూపం, వాటి మూలం అని పిలుస్తారు. ఆయుర్వేదం అనేది ఔషధ ప్రభావాలతో మన ఆహార పదార్థాలను ఉపయోగించే శాస్త్రం. ఈ సాంప్రదాయిక విజ్ఞాన వ్యవస్థ భారతదేశ సామాజిక జీవనంలో ఒక భాగం.

మిత్రులారా,

జీవనానికి, ఆహారానికి సంబంధించి ఇది వేల సంవత్సరాల నాటి భారతీయ జ్ఞానం. ఈ జ్ఞానం ఆధారంగా భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. భారతదేశంలో సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం 'కృషి పరాశర' పేరుతో రాసిన గ్రంథం మొత్తం మానవ చరిత్రకు వారసత్వం. ఇది శాస్త్రీయ వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర పత్రం, దీని అనువాదం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ గ్రంథం లో వ్యవసాయంపై గ్రహాలు, రాశుల ప్రభావం... మేఘాల రకాలు... వర్షపాతం కొలత, అంచనా, వర్షపునీటి సంరక్షణ... సేంద్రీయ ఎరువులు... పశువుల సంరక్షణ, విత్తనాలను ఎలా కాపాడుకోవాలి, ఎలా నిల్వ చేయాలి... ఇటువంటి అనేక విషయాల గురించి ఈ గ్రంథం లో విశదీకరించబడ్డాయి.. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ,  భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన విద్య, పరిశోధనలకు సంబంధించి బలమైన పర్యావరణ వ్యవస్థ సృష్టించబడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసిఏఆర్) కు చెందిన వందకు పైగా పరిశోధనా సంస్థలు ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ విషయాల అధ్యయనానికి భారతదేశంలో 500కు పైగా కళాశాలలు ఉన్నాయి. భారతదేశంలో 700 కి పైగా కృషి విజ్ఞాన  కేంద్రాలు ఉన్నాయి, ఇవి రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో సహాయపడతాయి.

మిత్రులారా,

భారతీయ వ్యవసాయానికి మరో విశిష్టత ఉంది. దేశంలో ఇప్పటికీ ఆరు రుతువులను(సీజన్లను) దృష్టిలో ఉంచుకుని మేము ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. మన దేశంలోని 15 వ్యవసాయ వాతావరణ ప్రాంతాలు తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. భారతదేశంలో, మీరు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే, వ్యవసాయం  తీరు మారిపోతుంది. మైదాన ప్రాంతాల సాగు వేరు, హిమాలయ వ్యవసాయం భిన్నంగా ఉంటుంది... ఎడారి... పొడి ఎడారి వ్యవసాయం భిన్నంగా ఉంటుంది... నీరు తక్కువగా ఉన్న చోట వ్యవసాయం భిన్నంగా ఉంటుంది. తీర ప్రాంత వ్యవసాయం భిన్నంగా ఉంటుంది. ఈ వైవిధ్యం ప్రపంచ ఆహార భద్రతకు భారత్ ను ఒక ఆశాకిరణంలా నిలుపుతోంది.

మిత్రులారా,

చివరిసారిగా ఇక్కడ ఐసీఏఈ సదస్సు జరిగినప్పుడు భారతదేశానికి అప్పుడే స్వాతంత్ర్యం లభించింది. భారతదేశ ఆహార భద్రత, వ్యవసాయానికి సంబంధించి సవాలుతో కూడిన సమయం అది. ప్రస్తుతం భారత్ ఆహార మిగులు దేశంగా ఉంది. నేడు భారతదేశం పాల ఉత్పత్తిలో, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల సాగులో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, చేపల పెంపకం, తేయాకు  ఉత్పత్తిలో భారతదేశం రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఒకప్పుడు భారత ఆహార భద్రత ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు భారతదేశం ప్రపంచ ఆహార భద్రత, ప్రపంచ పోషకాహార భద్రతకు పరిష్కారాలను అందించడంలో నిమగ్నమై ఉంది. అందువల్ల, 'ఆహార వ్యవస్థ పరివర్తన' వంటి అంశంపై చర్చించడానికి భారతదేశ అనుభవాలు విలువైనవి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చడం ఖాయం.

మిత్రులారా,

విశ్వ బంధుగా ‘భారత్’ మానవాళి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. జి-20 సందర్భంగా, 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే దార్శనికతను ముందుకు తెచ్చింది.. భారతదేశం పర్యావరణాన్ని కాపాడే జీవనశైలిని, అంటే మిషన్ లైఫ్ అనే మంత్రాన్ని కూడా ఇచ్చింది. భారతదేశం 'ఒకే భూమి-ఒకే ఆరోగ్యం' చొరవను కూడా ప్రారంభించింది. మేం మనుషుల ఆరోగ్యాన్ని, జంతువుల ఆరోగ్యాన్ని, మొక్కల ఆరోగ్యాన్ని వేరు వేరుగా చూడలేం. సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవైనా. . . వీటిని 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే సమగ్ర విధానంతోనే పరిష్కరించుకోవచ్చు.

మిత్రులారా,

వ్యవసాయం మా ఆర్థిక విధానానికి కేంద్ర బిందువు. మా దేశంలో దాదాపు 90 శాతం  రైతు కుటుంబాలకు భూమి తక్కువగా ఉంది. ఈ చిన్న రైతులే భారతదేశ ఆహార భద్రతకు అతిపెద్ద బలం. ఆసియాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇదే పరిస్థితి ఉంది. అందువల్ల, సుస్థిర వ్యవసాయానికి ఒక ఉదాహరణగా భారతదేశ నమూనా అనేక దేశాలకు ఉపయోగపడుతుంది. భారతదేశంలో రసాయన రహిత ప్రకృతి సేద్యాన్ని మేం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఇది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది బడ్జెట్లో కూడా సుస్థిర వ్యవసాయం, వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంపై పెద్ద ఎత్తున దృష్టి సారించడం జరిగింది. మా రైతులకు మద్దతు ఇవ్వడానికి మేము మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. వాతావరణానికి అనుగుణంగా ఉండే పంటల పరిశోధన, అభివృద్ధిపై భారతదేశం చాలా దృష్టి పెట్టింది. భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగల 1900 రకాల కొత్త వంగడాలను గత పదేళ్లలో రైతులకు అందించాం.. ఇది భారతదేశ రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చింది. సాంప్రదాయక వరితో పోలిస్తే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే వరి రకాలు కూడా మా దేశంలో ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, బ్లాక్ రైస్ ఒక సూపర్ ఫుడ్ గా ఉద్భవించింది.  మణిపూర్, అస్సాం, మేఘాలయ లకు చెందిన బ్లాక్ రైస్ (నల్ల బియ్యం) మన దేశంలో ఔషధ విలువకు ప్రసిద్ధి చెందింది, వాటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రపంచ సముదాయంతో తన అనుభవాలను పంచుకోవడానికి భారతదేశం ఆసక్తిగా ఉంది.

మిత్రులారా,

ప్రస్తుత కాలంలో నీటి ఎద్దడి, వాతావరణ మార్పులతో పాటు పోషకాహారం కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి భారత్ వద్ద పరిష్కారం కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. ప్రపంచం సూపర్ ఫుడ్ అని పిలిచే దానికి శ్రీ అన్న అనే గుర్తింపు ఇచ్చాం. ఇవి కనిష్ట నీరు, గరిష్ట ఉత్పత్తి సూత్రాన్ని అనుసరిస్తాయి. ప్రపంచ పోషకాహార సమస్యను పరిష్కరించడంలో భారతదేశంలోని వివిధ సూపర్ ఫుడ్స్ పెద్ద పాత్ర పోషిస్తాయి. మా సూపర్ ఫుడ్ బాస్కెట్ ను ప్రపంచంతో పంచుకోవాలని భారత్ కోరుకుంటోంది. అలాగే, భారత్ చొరవతో ప్రపంచమంతా గత ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకుంది.

మిత్రులారా,

గత దశాబ్ద కాలంలో వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడానికి మేం అనేక ప్రయత్నాలు చేశాం. నేడు, సాయిల్ హెల్త్ కార్డుల సహాయంతో రైతు ఏమి పండించాలో తెలుసుకోవచ్చు. సౌర శక్తి సహాయంతో పంపులను నడుపుతూ బంజరు భూమిలో సౌర వ్యవసాయం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అతను కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ-నామ్ అంటే డిజిటల్ అగ్రికల్చర్ మార్కెట్ ఆఫ్ ఇండియా ద్వారా తన ఉత్పత్తులను విక్రయించవచ్చు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా తన పంటల భద్రతకు భరోసా లభిస్తుంది. రైతుల నుండి అగ్రిటెక్ స్టార్టప్ ల వరకు, ప్రకృతి సేద్యం నుంచి వ్యవసాయ క్షేత్రం, ఫార్మ్ టు టేబుల్ ఏర్పాట్ల వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలు భారత్ లో నిరంతరం లాంఛనప్రాయంగా సాగుతున్నాయి. గత పదేళ్లలో 90 లక్షల హెక్టార్ల వ్యవసాయాన్ని సూక్ష్మ సేద్యంతో అనుసంధానించాం. మా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వ్యవసాయం, పర్యావరణం రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తోంది. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపడం లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతున్నాం.

మిత్రులారా,

భారతదేశంలో వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, ఒక క్లిక్ తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 30 సెకన్లలో నగదు బదిలీ అవుతుంది. డిజిటల్ పంట సర్వేల కోసం డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నాం. మా రైతులకు రియల్ టైమ్ సమాచారం లభిస్తుంది, వారు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మా ఈ చొరవ వల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. రైతులకు వారి భూముల డిజిటల్ గుర్తింపు సంఖ్య కూడా ఇస్తారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని చాలా వేగంగా ప్రోత్సహిస్తున్నాం. డ్రోన్ల ద్వారా సాగు చేసే పనిని మహిళలకు, మన డ్రోన్ దీదీలకు అప్పగిస్తున్నారు. ఈ చర్యలు ఏవైనా, అవి భారతదేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తాయి.

మిత్రులారా,

రానున్న 5 రోజుల్లో మీరంతా ఇక్కడ బహిరంగంగా చర్చించబోతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొనడం చూసి నేను మరింత సంతోషిస్తున్నాను. మీ ఆలోచనలను అందరూ గమనిస్తారు. సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థలతో ప్రపంచాన్ని అనుసంధానించే మార్గాలను ఈ సదస్సు ద్వారా అన్వేషించగలమని నేను ఆశిస్తున్నాను.. మనం ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటాము... ఒకరికొకరు నేర్పిస్తాం.

మిత్రులారా,

మీరు వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉన్నవారు అయితే, నేను మీకు మరొక సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా రైతు విగ్రహం ఉందో, లేదో నాకు తెలియదు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అని మనం విన్నాం. అయితే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో రైతాంగ శక్తిని మేల్కొలిపి రైతులను స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం భారతదేశంలో ఉందని తెలిసి వ్యవసాయ రంగ ప్రజలు చాలా సంతోషిస్తారు. ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు ఎత్తులో ఉంది. ఈ విగ్రహం ఒక రైతు నాయకుడిది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ విగ్రహం తయారు చేస్తునప్పుడు, భారతదేశంలోని ఆరు లక్షల గ్రామాల రైతులకు మీరు పొలాల్లో ఏ ఇనుప పనిముట్లను ఉపయోగిస్తారో , మీ పొలాల్లో ఉపయోగించే పనిముట్లలో కొంత భాగాన్ని మాకు ఇవ్వండి అని చెప్పారు. అలా ఆరు లక్షల గ్రామాల పొలాల్లో ఉపయోగించే ఇనుప పనిముట్లను తీసుకొచ్చి , కరిగించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైతు నాయకుడి విగ్రహాన్ని రూపొందించారు.  ఈ దేశానికి చెందిన ఒక రైతు కుమారుడికి ఇంత గొప్ప గౌరవం లభించిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, బహుశా ప్రపంచంలో మరెక్కడా జరగలేదు. మీరు ఇక్కడికి వచ్చారంటే, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా ప్రతిమ)ని చూడటానికి మీరు ఖచ్చితంగా ఆకర్షితులవుతారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు..

***



(Release ID: 2041355) Visitor Counter : 37