ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ స్పీకర్, ఆయన ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి భేటీ
భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సహకరించుకోగల కీలక అంశాలపై చర్చ
సాంప్రదాయిక తయారీ రంగం; సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, హరిత-స్వచ్ఛ ఇంధనాలు వంటి ఆధునిక రంగాల్లో సహకారం పటిష్ఠతపై చర్చ
భారతీయ యువతకు జపాన్ భాషా శిక్షణ సహా శిక్షణ, సామర్థ్యాల నిర్మాణంపై కూడా చర్చ
Posted On:
01 AUG 2024 9:25PM by PIB Hyderabad
జపాన్ ప్రతినిధుల సభ స్పీకర్ నుకాగా ఫుకుషిరో; జపాన్ పార్లమెంటు సభ్యులు, జపాన్ కు చెందిన ప్రధాన కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యాపార ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శక్తివంతమైన భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి భాగస్వామ్యం గురించి కూడా వారు ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కీలక రంగాల్లో సహకారం, పరస్పర ప్రయోజనకర రంగాల్లో ప్రజల మధ్య సహకారం విస్తరణ గురించి; భారత, జపాన్ దేశాల మధ్య పార్లమెంటరీ ప్రతినిధివర్గాల మార్పిడి ప్రాధాన్యం గురించి కూడా పునరుద్ఘాటించారు.
భారత, జపాన్ దేశాల మధ్య 2022-27 సంవత్సరాల మధ్య కాలంలో 5 లక్షల కోట్ల జపాన్ యెన్ ల పెట్టుబడుల లక్ష్యంలో పురోగతి పట్ల వారు సంతృప్తిని ప్రకటించారు. అలాగే 2027 తర్వాత ఉభయ దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే మార్గాలపై కూడా చర్చించారు. అంతే కాదు సాంప్రదాయిక తయారీ రంగాలు; సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, హరిత-స్వచ్ఛ ఇంధనం వంటి ఆధునిక రంగాల్లో సహకారం పటిష్ఠతపై కూడా వారు చర్చించారు. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు సకాలంలో, విజయవంతంగా పూర్తి చేయడానికి గల ప్రాధాన్యాన్ని కూడా వారు గుర్తించారు.
భారత, జపాన్ దేశాలు కొత్త తరం కార్మిక శక్తికి జపాన్ భాష, సంస్కృతి, పని విధానాలు సహా విభిన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి కృషి చేయాలని, తద్వారా వారిని నిపుణులుగా తీర్చి దిద్దాలని నుకాగా ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ప్రైవేటు రంగం పాత్ర గురించి ఆయన నొక్కి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక పరిజ్ఞానం సాధించిన వ్యక్తులు (రీసోర్స్ పర్సన్లు) రెండు దేశాల మధ్య వారధులుగా ఉంటారని ఆయన అన్నారు.
జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు, టెక్నాలజీ ఆకర్షించేందుకు భారతదేశంలో నెలకొన్న అనుకూల వ్యాపార వాతావరణం గురించి, చేపట్టిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా వివరించారు. ఈ ప్రయత్నాలన్నింటిలోనూ భారత ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని దేశంలో పర్యటిస్తున్న ప్రతినిధివర్గానికి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
***
(Release ID: 2040636)
Visitor Counter : 75
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam