ప్రధాన మంత్రి కార్యాలయం

వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ఆగస్టు 3న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపునకు మళ్ళడం అనే అంశం ఈ సమావేశానికి ఇతివృత్తంగా ఉంది

ఈ సమావేశం స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థలు, ఇంకా డిజిటల్ అగ్రికల్చర్ లో ముందంజలు సహా, భారతదేశ వ్యావసాయిక పురోగతిని కళ్లకు కడుతుంది

సుమారు 75 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు

Posted On: 02 AUG 2024 12:17PM by PIB Hyderabad

వ్యవసాయ ఆర్థికవేత్తల ముప్ఫై రెండో అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసిఎఇ) శనివారం, అంటే 2024 ఆగస్టు 3న, న్యూ ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (ఎన్ఎఎస్‌సి) కాంప్లెక్స్ లో ఉదయం సుమారు 9 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

ఇంటర్‌నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్ స్ ఆధ్వర్యంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటయ్యే ఈ సమావేశాన్ని 2024 ఆగస్టు 2 - 7 తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఐసిఎఇ కి భారతదేశం 65 సంవత్సరాల తరువాత వేదిక అవుతోంది.

ఈ సంవత్సరంలో నిర్వహించనున్న సమావేశానికి ‘‘ట్రాన్స్‌ఫర్మేషన్ టువార్డ్స్ సస్‌టేనబుల్ అగ్రి-ఫుడ్ సిస్టమ్స్’’ (స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థ వైపునకు మళ్ళడం) ఇతివృత్తంగా ఉంది. వాతావరణంలో మార్పులు, ప్రాకృతిక వనరుల క్షీణత, ఉత్పత్తి ఖర్చులు ఎగబాకుతూ ఉండడం, సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్ళ నేపథ్యంలో స్థిర వ్యవసాయం సంబంధ ముఖ్యావసరాన్ని తీర్చుకోవాలనేది ఈ సమావేశం లక్ష్యంగా ఉంది. ప్రపంచంలో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ళను గురించి ముందస్తు ఆలోచనలను చేస్తూ, వాటి పరిష్కారానికి తగిన దృష్టి కోణాన్ని అనుసరిస్తున్న భారతదేశ వైఖరితో పాటు వ్యవసాయ సంబంధ పరిశోధనలు, వ్యవసాయ సంబంధ విధానాలలో దేశం సాధిస్తున్న పురోగతిని ఈ సమావేశం ప్రముఖంగా చాటిచెప్పనుంది.

యువ పరిశోధకులు, అగ్రగామి వృత్తి నిపుణులు వారి కృషిని వెల్లడించేందుకు ప్రపంచంలో తమ సమకాలికులతో సంబంధాలను ఏర్పరచుకొనేందుకు ఒక వేదికగా ఐసిఎఇ 2024 ఉంటుంది. ఈ సమావేశం పరిశోధక సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య భాగస్వామ్యాలను బలపరచడం, జాతీయ, ప్రపంచ స్థాయిలలో విధాన రూపకల్పనను ప్రభావితం చేయడంతో పాటు భారతదేశంలో డిజిటల్ అగ్రికల్చర్, స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థల పరంగా నమోదైన పురోగతి లు సహా వ్యవసాయ రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని కళ్ళకు కట్టడం సమావేశం లక్ష్యంగా ఉంది. సుమారు 75 దేశాల నుంచి సుమారు ఒక వేయి మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

***



(Release ID: 2040633) Visitor Counter : 53