హోం మంత్రిత్వ శాఖ

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనతో తలెత్తిన పరిస్థితులపై పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఈ విపత్కర సమయంలో కేరళ ప్రజలకు, ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.



ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వయనాడ్‌లో జరుగుతున్న సహాయక చర్యలపై నిరంతరం సమాచారాన్ని తెలుసుకుంటున్నారు


విపత్తుల విషయంలో భారత్ 2014 కు ముందు 'కాపాడటమే ప్రధానమైన' విధానాన్ని అవలంబించిందని, మోదీ ప్రభుత్వం మరణ నష్టాలను లేకుండా పనిచేస్తుందన్నారు.



సహాయక చర్యల్లో కేంద్రం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు, సహాయక చర్యలు, పునరావాసం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.



ప్రపంచంలోనే అత్యంత అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ భారత్‌లో ఉంది.


మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఉపయోగించుకుని విపత్తు నిర్వహణలో అనేక రాష్ట్రాలు సున్నా మరణాలను నమోదు చేశాయి.



కేరళ ప్రభుత్వానికి 23 జూలై 2024 నుండి ముందస్తు హెచ్చరికలు తెలియజేయడం జరిగింది.



కొండచరియలు విరిగిపడటంతో భారత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 9 బృందాలను జూలై 23న కేరళకు తరలించింది.


జూలై 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాని

Posted On: 31 JUL 2024 5:30PM by PIB Hyderabad

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తలెత్తిన పరిస్థితులపై కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేడు పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

 

ఉభయ సభల్లో వయనాడ్ దుర్ఘటనపై అమిత్ షా ప్రసంగిస్తూ, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సంతాపం తెలిపారు అలాగే విపత్తులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విపత్కర సమయంలో మోదీ ప్రభుత్వం కేరళ ప్రజలకు, కేరళ ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని తెలిపారు. వయనాడ్‌లో సహాయ, పునరావాసానికి మోదీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు.

 

విపత్తుల విషయంలో భారత్ 2014 కు ముందు, కాపాడటమే ప్రధానమైన విధానాన్ని అవలంబించిందని, అనంతరం మోదీ ప్రభుత్వం మరణ నష్టాలే జరకుండా చూసేందుకు పనిచేస్తోందన్నారు. కేంద్ర సమాచారం ప్రకారం, సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యల్లో భారత ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వయనాడ్ లో కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలపై నిరంతరం సమాచారాన్ని తెలుసుకుంటున్నారని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.

 

విపత్తుకు ఏడు రోజుల ముందు, జూలై 23 వ తేదీన, కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక జారీ చేసిందని, అనంతరం, జూలై 24, 25 వ తేదీల్లో కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు, రాజ్యసభలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. జూలై 26వ తేదీన 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురుస్తాయని, కొండచరియలు విరిగిపడి, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. ఆరోపణలు చేస్తున్న వారు ఈ ముందస్తు హెచ్చరికలు చదివి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

 

ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఉపయోగించి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మరణ నష్టాలు లేకుండా లేదా స్వల్పంగా ఉండేలా ప్రమాద విపత్తు నిర్వహణను నివేదించాయని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఒడిశా, గుజరాత్ ఉదంతాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఒడిశా ప్రభుత్వానికి ఏడు రోజుల ముందుగానే తుపాను హెచ్చరిక జారీ చేశామని, విపత్తులో కేవలం ఒకే ప్రాణనష్టం జరిగిందని ఆయన చెప్పారు. మూడు రోజుల ముందే గుజరాత్ రాష్ట్రానికి హెచ్చరికలు పంపామని, ఒక్క జంతువుకు కూడా హాని జరగలేదని ఆయన చెప్పారు.

 

భారత ప్రభుత్వం ప్రజల భద్రత కోసం, 2014 నుంచి రూ.2,323 కోట్లను ముందస్తు హెచ్చరిక వ్యవస్థల కోసం ఖర్చు చేసిందని తెలిపారు. హెచ్చరికల సమాచారాన్ని భాగస్వాములతో  పంచుకుంటున్నామని శ్రీ అమిత్ షా తెలిపారు. విపత్తులు సంభవిస్తాయని అనుకున్న వారం రోజుల ముందుగానే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపుతున్నామని, ఆ సమాచారం వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు.

 

2014లో భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రపంచంలోనే అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కృషి జరిగినట్లు కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. విపత్తులను ఏడు రోజుల ముందే అంచనా వేయగల సామర్థ్యం ఉన్న అత్యుత్తమ నాలుగైదు దేశాల్లో భారత్ ఒకటని ఆయన అన్నారు. చాలా దేశాలకు మూడు రోజుల ముందే ఇలాంటి అంచనాలు వేసే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు.

 

వర్షపాతం, సైక్లోన్‌లు, తుఫానులు, వడగాలులు, చలిగాలులు, సునామీలు, భూకంపం, కొండచరియలు విరిగిపడటంతో పాటు పిడుగులు పడే విషయాన్ని కూడా నివేదించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల గురించి ప్రతిపక్షాలకు నిజంగా తెలియకపోతే అది మంచి పరిస్థితి కాదని, వారికి అవగాహన ఉండి కేవలం రాజకీయాలు చేస్తే అది దురదృష్టకరమని ఆయన అన్నారు. అనేక రాష్ట్రాలు దీనిని ఉపయోగించుకుంటూ, సానుకూల ఫలితాలు పొందినట్లు ఆయన తెలిపారు.

 

విపత్తును ముందుగానే గుర్తించి 23 జూలై 2024 వ తేదీన భారత ప్రభుత్వం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు తరలించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు.  కేరళ ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే, రాష్ట్రాలు ఎస్డీఆర్ఎఫ్ నుంచి 10 శాతం నిధులను విడుదల చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి 100 శాతం నిధులను వినియోగించుకోవచ్చని అమిత్ షా తెలిపారు. 2014 నుంచి 2024 వరకు పశ్చిమ బెంగాల్‌కు రూ.6,244 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికే రూ.4,619 కోట్లు విడుదల అయినట్లు తెలిపారు.

 

కేరళ రాష్ట్రానికి 23 జూలై 2024 న పంపిన ఎన్డిఆర్ఎఫ్‌కు చెందిన తొమ్మిది బెటాలియన్లతో పాటు, నిన్న మరో మూడు బెటాలియన్లను పంపినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. కేరళ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విపత్కర సమయంలో కేరళ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 2040063) Visitor Counter : 26