ఆర్థిక మంత్రిత్వ శాఖ
సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా దేశీయ సేవల పంపిణీ, ఎగుమతుల వైవిధ్యీకరణలో వేగవంతమైన భారత్
2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ట్రాఫిక్ 5.2% పెరిగి సుమారు 673 కోట్లకు చేరుకుంది, సరుకు రవాణాలో 5.3% పెరిగి 158.8 కోట్ల టన్నుల రవాణాను నమోదు చేసింది.
2024 ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల విమాన ప్రయాణికులతో 15% పెరుగుదల నమోదు, ఎయిర్ కార్గోలో 7% పెరుగుదలతో 33.7 టన్నులకు పెరిగిన సరుకు రవాణా
2023 సంవత్సరంలో 92 లక్షలకు పైగా విదేశీ పర్యాటకుల రాకతో 43.5% వృద్ధిని సాధించిన పర్యాటక రంగం
2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో గృహ రియల్ ఎస్టేట్ అమ్మకాలు 2013 తర్వాత నుండి అత్యధికంగా నమోదు చేసింది. ఏడాదిలో 33 శాతం వృద్ధిని సాధించింది
భారత్ లో టెక్నాలజీ అంకుర సంస్థలు 2014 సంవత్సరంలో 2,000 కాగా 2023 నాటికి వీటి సంఖ్య 31,000కు పెరిగింది.
2030 నాటికి భారత ఈ-కామర్స్ పరిశ్రమ 350 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా
భారతదేశంలో మొత్తం టెలి సాంద్రత మార్చి 2014 లో 75.2% నుండి మార్చి 2024 నాటికి 85.7% కి పెరిగింది
Posted On:
22 JUL 2024 2:27PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2023-2024 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టరు. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన సేవల పనితీరును చర్చిస్తూ "రెండు ముఖ్యమైన పరివర్తనలు భారతదేశ సేవల ముఖచిత్రాన్ని పునర్నిర్మిస్తున్నాయన్నారు. అందులో ఒకటి వేగవంతమైన సాంకేతిక మార్పు కారణంగా వృద్ధి చెందిన దేశీయ సేవల అందుబాటు కాగా, మరొకటి భారతదేశ సేవల ఎగుమతులలో వైవిధ్యీకరణ" అని మంత్రి పేర్కొన్నారు.
భారతదేశ సేవల రంగం విస్తృత శ్రేణి ఆర్థిక కార్యకలాపాలను కలిగి ఉంది. వీటిని స్థూలంగా రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు:
కాంటాక్ట్-ఇంటెన్సివ్ (ఫిజికల్ కనెక్టివిటీ ఆధారిత సేవలు): ఇందులో వాణిజ్యం, హాస్పిటాలిటీ, రవాణా, రియల్ ఎస్టేట్, సామాజిక, సంఘ, వ్యక్తిగత సేవలు ఉంటాయి.
నాన్-కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు (సమాచార సాంకేతిక సేవలు, టెక్ అంకుర సంస్థలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు): ఫైనాన్షియల్, ఐటీ, ప్రొఫెషనల్, కమ్యూనికేషన్, ప్రసారాలు సేవలను కలిగి ఉంటాయి. ఈ రంగంలో ప్రజా పాలన, రక్షణ సేవలు కూడా ఉన్నాయి.
భౌతిక అనుసంధాన ఆధారిత సేవలు
రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, విమానయాన సంస్థల ద్వారా ప్రయాణీకుల రవాణాను, వస్తు రవాణాను, సమాచారాన్ని షిప్పింగ్ సంస్థలు, సరుకు రవాణా సంస్థలు సులభతరంగా అనేక సేవలు నిర్వహిస్తున్నాయి.
రోడ్డు మార్గాలు: భారతదేశ సరుకు రవాణా ఎక్కువ మొత్తంలో రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయబడుతుంది. తదనుగుణంగా, వివిధ కార్యక్రమాల ద్వారా జాతీయ రహదారులపై (ఎన్ హెచ్) వినియోగదారుల సౌలభ్యాలను పెంచడం జరిగింది:
టోల్ డిజిటలైజేషన్ వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం 2014లో 734 సెకన్ల నుంచి 2024 నాటికి 47 సెకన్లకు తగ్గింది.
జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచడానికి ఇంజనీరింగ్ (రోడ్లు, వాహనాలు), ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ కేర్, ఎడ్యుకేషన్ - సమగ్ర '4ఇ' వ్యూహాన్ని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టిహెచ్) రూపొందించింది.
నెట్వర్క్ ప్లానింగ్, రద్దీ అంచనాల కోసం పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్టల్ ని ప్రభుత్వం ఉపయోగించుకుంది.
భారతీయ రైల్వేలు: వినియోగదారుల అనుభవాన్ని పెంచడానికి, రైలు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు విక్షిత్ భారత్ కోసం సామర్థ్యాన్ని పెంచడానికి భారతీయ రైల్వేలు (ఐఆర్) అనేక సేవలను నిర్వహిస్తుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో ప్రయాణీకుల ట్రాఫిక్ 673 కోట్లు (తాత్కాలిక విలువలు), అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 5.2 శాతం పెరిగింది.
2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే 158.8 కోట్ల టన్నుల ఆదాయాన్ని ఆర్జించే సరుకు రవాణా చేసింది(కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మినహా). ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ప్రయాణీకుల అనుభవాన్ని విస్తృతం చేయడానికి, రైల్వే 6108 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది.
ఓడరేవులు, జలమార్గాలు, షిప్పింగ్: రోజువారీ నౌకల్లో సరుకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి నౌకాయాన రంగం సాగర్ సేతు అప్లికేషన్ ను ఉపయోగించుకుంటోంది, అన్ని సముద్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షిస్తోంది.
సాగర్ సేతు భారతదేశంలోని మొత్తం 13 ప్రధాన ఓడరేవులతో పాటు 22 చిన్న పోర్టులు, 28 ప్రైవేట్ టెర్మినల్స్ తో అనుసంధానించబడింది.
జాతీయ జలమార్గాల్లో రివర్ క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రాత్రింబవళ్లు క్రూయిజ్ ట్రిప్పులు 100 శాతం పెరిగాయి.
విమానయానం: భారతదేశం మూడవ అతిపెద్దదైన దేశీయ విమానయాన మార్కెట్ భారతదేశంలో విమానయాన రంగం గణనీయమైన వృద్ధిని చూపించింది, భారతీయ విమానాశ్రయాలలో నిర్వహించే మొత్తం విమాన ప్రయాణీకులలో 15 శాతం పెరుగుదలతో 2024 ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్లకు చేరుకుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 13 శాతం పెరిగి 30.6 కోట్లకు, అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల రద్దీ 22 శాతం పెరిగి 7 కోట్లకు చేరుకుంది.
భారత విమానాశ్రయాల్లో నిర్వహించే ఎయిర్ కార్గో 2024 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగి 33.7 లక్షల టన్నులకు చేరుకుంది.
మూలధన వ్యయ ప్రణాళికతో ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఆమోదించింది. కొత్త టెర్మినల్ భవనాలను ప్రారంభించింది.
ప్రాంతీయ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, 2016 లో ప్రారంభించిన 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పథకం ప్రారంభమైనప్పటి నుండి 85 అన్ రిజర్వ్‌డ్, అండర్ రిజర్వ్‌డ్ విమానాశ్రయాలను కలిపే వివిధ 579 ప్రాంతీయ అనుసంధాన పథకం మార్గాల్లో 141 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేసింది.
డిజి యాత్ర వంటి కార్యక్రమాలు సాంకేతికత సహాయంతో సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
దేశంలోని పైలట్లలో మహిళలు 15 శాతం ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ, తద్వారా ఈ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. 2023లో మొత్తం 1622 కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీ చేయగా అందులో 18 శాతం మహిళలకు ఇచ్చారు.
పర్యాటకం: భారతదేశంలో పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది, ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ట్రావెల్, టూరిజం డెవలప్‌మెంట్ సూచి(టిటిడిఐ) 2024 లో భారతదేశం 39 వ స్థానంలో ఉంది.
కోవిడ్ మహమ్మారి తరువాత పర్యటక రంగంలో సానుకూల సంకేతాలను కనిపించాయి. 2023 ఏడాదిలో 92 లక్షలకు పైగా విదేశీ పర్యాటకులను భారత్ ఆకర్షించింది. ఇది 43.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
పర్యాటక రంగం ద్వారా భారత్ గణనీయంగా రూ.2.3 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య రాబడులను ఆర్జించింది, ఇది 65.7 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
స్వదేశ్ దర్శన్ 2.0, ఇంటిగ్రేటెడ్ టూరిజం డెస్టినేషన్ అభివృద్ధిపై దృష్టి సారించింది. 32 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని 55 గమ్యస్థానాలను ఇది లక్ష్యంగా చేసుకుంది.
రియల్ ఎస్టేట్: గత దశాబ్దంలో మొత్తం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో స్థిరాస్తి, నివాసాల యాజమాన్యం వాటా 7 శాతానికి పైగా ఉంది.
2023 లో, భారతదేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు 2013 నుండి అత్యధికంగా ఉన్నాయి, 33 శాతం వృద్ధిని సాధించాయి. ఉత్తమ 8 నగరాల్లో మొత్తం 4.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-పట్టణ (పీఎంఏవై-యూ), వస్తుసేవల పన్ను, రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం, దివాలా చట్టం వంటి విధాన సంస్కరణలు, పీఎంఏవై(యూ)-నగదు ఆధారిత సబ్సిడీ పథకం వడ్డీ రాయితీ వంటి పలు కీలక చర్యల కారణంగా గృహనిర్మాణ రంగం వృద్ధికి దోహదపడింది.
క్రిసిల్ నివేదిక ప్రకారం, భారతదేశంలో గృహ రుణ మార్కెట్ 2018 నుండి 2023 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు 13 శాతం సీఏజీఆర్ పెరిగింది. భారతదేశంలో గృహ రుణ మార్కెట్ 13 నుండి 15 శాతం సిఎజిఆర్ పెరుగుతూ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 42 లక్షల కోట్ల రూపాయల నుండి 44 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు, టెక్ అంకుర సంస్థలు, అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు
గత దశాబ్ద కాలంలో, సమాచారం, కంప్యూటర్ సంబంధిత సేవలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. మొత్తం జివిఎలో వాటా 2013 ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతం కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతానికి పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ఈ రంగం 2021 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం నిజ వృద్ధి రేటును సాధించింది. ఐటి సేవల వృద్ధి భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు), టెక్ స్టార్టప్ వ్యవస్థ విస్తరణకు కూడా మద్దతు ఇచ్చింది.
భారతదేశంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జిసిసిలు) గణనీయంగా పెరిగాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో 1,000 కేంద్రాల నుండి 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 2,740 యూనిట్లకు పైగా పెరిగాయి. ఈ కేంద్రాలు అధిక-నాణ్యమైన ఉపాధిని అందించడం ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి. భారతదేశ జిసిసిల నుండి ఆదాయం 2015 ఆర్థిక సంవత్సరంలో 19.4 బిలియన్ డాలర్ల నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 46 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 11.4 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) తో వృద్ధి చెందింది.
భారతదేశంలో సాంకేతిక అంకుర సంస్థలు 2014 లో సుమారు 2,000 నుండి 2023 నాటికి సుమారు 31,000 కు గణనీయంగా పెరిగాయి. నాస్కామ్ నివేదిక ప్రకారం, ఈ రంగం 2023 లో సుమారు 1000 కొత్త టెక్ అంకురాలను ప్రారంభించినట్లు తెలిపింది. అలాగే, నాస్కామ్ ప్రకారం, భారతదేశం యొక్క టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ కంటే గణనీయంగా మెరుగైన పనితీరును ప్రదర్శించింది. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్టార్టప్ ఇండియా తీసుకున్న చొరవ, స్టార్టప్ హబ్ లతో పాటు నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ, డ్రోన్ శక్తి ప్రోగ్రామ్, ఈవీ సంబంధిత క్యాపిటల్ గూడ్స్, యంత్రాలకు కస్టమ్ సుంకం మినహాయింపులు ఈ టెక్ అంకురాల వృద్ధికి దోహదపడ్డాయి. స్టార్టప్ ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకునేందుకు డీప్ టెక్ ఎకోసిస్టమ్ ను వేగవంతం చేయడం, బలోపేతం చేయడం, దేశీయ మూలధన ప్రవాహాన్ని బలోపేతం చేయడం, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టడం వంటి లక్ష్య ప్రయత్నాలను చేపట్టింది.
టెలికమ్యూనికేషన్స్: భారతదేశంలో మొత్తం టెలి సాంద్రత (ప్రతి వందమందికి టెలిఫోన్ల సంఖ్య) మార్చి 2014 లో 75.2 శాతం నుండి మార్చి 2024 నాటికి 85.7 శాతానికి పెరిగింది.
- ఇంటర్నెట్ వినియోగదారులు 2014 మార్చిలో 25.1 కోట్ల నుండి 2024 మార్చి నాటికి 95.4 కోట్లకు పెరిగారు, వీరిలో 91.4 కోట్ల మంది వైర్లెస్ ఫోన్ల ద్వారా అంతర్జాల సేవలను పొందుతున్నారు.
- 2024 మార్చిలో ఇంటర్నెట్ సాంద్రత 68.2 శాతానికి పెరిగింది.
- డేటా ఖర్చు గణనీయంగా తగ్గింది. ప్రతి వినియోగదారుని సగటు వైర్లెస్ డేటా వాడకాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.
- ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ నెట్ వర్క్ లలో భారత్ ఒకటి. ‘భారత్ 5జి పోర్టల్’ దేశం యొక్క 5జి సామర్థ్యాలను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా టెలికాం రంగంలో సృజనాత్మకత, సహకారం జ్ఞాన-భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ-కామర్స్: 2030 నాటికి భారత ఈ-కామర్స్ పరిశ్రమ 350 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.
***
(Release ID: 2036599)
Visitor Counter : 206