ఆర్థిక మంత్రిత్వ శాఖ
2015 ఆర్థిక సంవత్సరంలో 3.42 కోట్ల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4.33 కోట్లకు పెరిగిన ఉన్నత విద్య నమోదు.. 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26.5% పెరుగుదల.
2015 ఆర్థిక సంవత్సరంలో 1.57 కోట్ల నుంచి 2021-22లో 2.07 కోట్లకు పెరిగిన ఉన్నత విద్యలో మహిళా నమోదు.
Posted On:
22 JUL 2024 2:38PM by PIB Hyderabad
విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలలో తృతీయ, పాఠశాల అనంతర చదువులతో కూడిన ఉన్నత విద్యా రంగంలో గత ఎనిమిదేళ్లలో వృద్ధిలో ఉన్న 'నమోదు సమానత్వం' తో పాటు మొత్తం నమోదు కూడా వేగంగా పెరుగుతోంది. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్ఈ) 2021-22 ప్రకారం, ఉన్నత విద్యలో మొత్తం నమోదు 2021 ఆర్థిక సంవత్సరంలో 4.14 కోట్ల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4.33 కోట్లకు పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 3.42 కోట్లుగా ఉన్న నమోదుతో పోల్చితే 26.5 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24ఆర్థిక సర్వే తెలిపింది.
ఉన్నత విద్యలో పెరుగుతున్న సమానత్వం
ఉన్నత విద్యలో ప్రవేశాలు పెరగడానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి బడుగు బలహీన వర్గాలు కారణమని, అన్ని విభాగాల్లో మహిళల నమోదు వేగంగా పెరుగుతోందని సర్వే పేర్కొంది. ఉన్నత విద్యలో మహిళల నమోదు 2015 ఆర్థిక సంవత్సరంలో 1.57 కోట్ల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో 2.07 కోట్లకు పెరిగింది. అంటే 31.6 శాతం పెరుగుదల నమోదైంది. ఉన్నత విద్యలో పెరుగుతున్న సమానత్వం వెనుకబడిన వర్గాలకు మెరుగైన ఉపాధి అవకాశాలను సూచిస్తుంది.
విద్యను అందించే విధానాన్ని మార్చివేస్తోన్న డిజిటల్ పద్ధతులు
భారత్‌లో పాఠశాలల్లో 26.52 కోట్ల మంది, ఉన్నత విద్యలో 4.33 కోట్ల మంది, నైపుణ్య సంస్థల్లో 11 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని సర్వే పేర్కొంది. ఈ విస్తారమైన విద్యా వ్యవస్థలో 14.89 లక్షల పాఠశాలలు, 1.50 లక్షల మాధ్యమిక పాఠశాలలు, 1.42 లక్షల ఉన్నత విద్యా సంస్థలు, 1,168 విశ్వవిద్యాలయాలు, 45,473 కళాశాలలు, 12,002 స్వతంత్ర సంస్థలు, పాఠశాల విద్యలో 94.8 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యలో 15.98 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
జీవితం మొత్తం నేర్చుకునేందుకు పునాదిగా ఉన్న రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్‌కు 2023 ఏప్రిల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ప్రకటించిన నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (ఎన్‌సీఆర్ఎఫ్) రక్షణ కవచంగా నిలుస్తోంది. డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు(డీపీఐ) వంటి డిజిటల్ పరిష్కారాల విస్తృత శ్రేణి ఉపయోగం చట్టపరమైన ఆర్కిటెక్చర్‌కు
బలం చేకూరుస్తుంది. భారతదేశ విద్యా డీపీఐలలో ప్రధానమైనది ఏపీఏఏఆర్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, ఇది విద్యా రంగంలోని ప్రతి భాగస్వామికి ప్రత్యేక గుర్తింపునివ్వటం, జీవితకాలంలోని చదువులకు సంబంధించి ఆధారాలను సృష్టించడం ద్వారా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. ఏపీఏఏఆర్‌కు అనుబంధంగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) ఉంది, ఇది అకడమిక్ క్రెడిట్‌లకు ఆన్‌లైన్ భాండాగారం. ఇది క్రెడిట్‌ల గుర్తింపు, ,సేకరణ, బదిలీ, తదితరాలకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ద్వారా ఉన్నత విద్యా సంస్థల(హెచ్ఈఐ) మధ్య విద్యార్థుల మారటాన్ని సులభతరం చేస్తుంది. ఏపీఏఏఆర్ ఐడీ సృష్టించిన తర్వాత, ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థుల క్రెడిట్‌ను వారి ఐడీకి మ్యాప్ చేస్తాయి. ఇలాంటి అన్ని క్రెడిట్లు ఏబీసీ(అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్) రూపంలో ఉంటాయి.
గుర్తింపు, అకడమిక్ ఆధారాల రియల్ టైమ్ వెరిఫికేషన్‌ను అనుమతించడం ద్వారా ఏపీఏఏఆర్, ఏబీసీలు అందించే వివిధ పరిష్కారాలు ఆసక్తికరమైన అంశాలకు ఉపయోగించుకోవచ్చు. ఒక నిర్దిష్ట అర్హత కోసం వివిధ సంస్థల నుండి క్రెడిట్ కోర్సులను అభ్యసించే అవకాశం (ఇప్పుడు ఇది వీలవుతుంది) ఉంటుంది లేదా అకడమిక్ ప్రొఫైల్స్ ఉపయోగించి ఉపకారవేతనాలు/ ఇంటర్న్‌షిప్‌లు/ విద్యా రుణాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. జూలై 2024 నాటికి, 2037 హెచ్ఈఐలు(ఉన్నత విద్యా సంస్థలు)ఏబీసీతో అనుసంధానం అయ్యాయి. ఉన్నత విద్య, పాఠశాల విద్య , నైపుణ్య సంస్థల విద్యార్థుల కోసం 30.13 కోట్ల ఏపీఏఏఆర్ ఐడీలు సృష్టించారు.
విద్య రంగానికి సంబంధించి ముందడుగు
భారతదేశ అభివృద్ధికి విద్య అత్యంత కీలకమైన రంగాలలో ఒకటి కాబట్టి, విద్య నాణ్యతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి బాగా రూపొందించిన, సదుద్దేశంతో కూడిన కార్యక్రమాలను మిషన్-మోడ్‌లో తక్కువ ఖర్చుతో అమలు చేయడం చాలా అవసరం. ప్రాథమిక విద్య లేకుండా తదనంతర విద్య తక్కువ విలువ చేకూరుస్తుందని సర్వే అభిప్రాయపడింది. దీనిని సాకారం చేసుకోవడానికి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య రంగంపై కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఐక్యత, సమిష్టి కృషి అవసరమని పేర్కొంది.
విద్య విషయంలో ప్రభుత్వ వ్యయ-సమర్థతను పెంచడానికి బోధన, పాలనపై ఖర్చు చేయాల్సిన అవసరాన్ని కూడా సర్వే తెలిపింది. బోధన నాణ్యతను పర్యవేక్షించడానికి పర్యవేక్షక స్థానాలను భర్తీ చేయడం…మంచి, చెడు ఉపాధ్యాయుల పనితీరును గుర్తించడం… పాఠ్యపుస్తకం ప్రకారం చదువు పూర్తి చేసినా పాఠ్య ప్రమాణాల కంటే చాలా వెనుకబడి ఉంటే 'సరైన స్థాయిలో బోధన' అందించేందుకు స్థానిక వాలంటీర్లను నియమించడం ఇందులో ఉండవచ్చు.
పరిశోధన, అభివృద్ధిలో భారత్ పురోగతి
2020 ఆర్థిక సంవత్సరంలో 25,000 కంటే తక్కువ పేటెంట్ గ్రాంట్లతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,00,000 పేటెంట్లను మంజూరు చేయడంతో భారతదేశం పరిశోధన, అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోందని సర్వే ప్రధానంగా తెలిపింది.
డబ్ల్యూఐపీవో ప్రకారం పేటెంట్ ఫైలింగ్లో 2022లో భారత్ అత్యధిక వృద్ధి (31.6%) సాధించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)లో తన స్థానాన్ని భారత్ స్థిరంగా మెరుగుపరుచుకుంటోంది. ఇందులో 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2023 నాటికి 40వ స్థానానికి ఎగబాకింది.
మానవ వనరుల విషయానికొస్తే, భారతదేశంలో మొత్తం పీహెచ్‌డీ నమోదు 2015 ఆర్థిక సంవత్సరంలో 1.17 లక్షల కాగా, దీనితో పోల్చితే 2022 ఆర్థిక సంవత్సరంలో 81.2 శాతం పెరుగుదతో 2.13 లక్షలకు చేరుకుంది. దేశంలో స్థూల పరిశోధన, అభివృద్ధి వ్యయం (జీఈఆర్‌డీ) సంవత్సరాలుగా స్థిరంగా పెరుగుతోంది. 2011 ఆర్థిక సంవత్సరంలో రూ .60,196.8 కోట్ల నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో ₹ 127,381 కోట్లకు అనగా రెట్టింపు అయ్యింది. అధిక-నాణ్యత పరిశోధనలో భారతదేశం ఎదుగుదలకు గుర్తుగా, నేచర్స్ ఇండెక్స్ 2023లో ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లను అధిగమించి 9వ స్థానానికి భారత్ చేరుకుంది. అధిక-నాణ్యత పరిశోధన వ్యాసాలలో భారతదేశం వాటా (ఖచ్చితమైన సంఖ్యల పరంగా లెక్కించారు, శాతాల పరంగా కాదు) గత నాలుగేళ్లలో 44 శాతం పెరిగింది. అంటే 2019 లో 1039.7 నుండి 2023 లో 1494.7కు పెరిగింది.
పీహెచ్‌డీ, డాక్టరేట్ అనంతర పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అంతాకుండా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్టం, 2023 చట్టం కింద) 'అనుసంధన్' అనే స్వంత జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ పరిశోధన, అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అత్యున్నత సంస్థగా పనిచేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్లో 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాన్ని అవలంబిస్తూ దేశంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్ల నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
***
(Release ID: 2035180)
Visitor Counter : 224