యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

క్రీడారంగంలో భారత్‌ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు నైపుణ్య అభివృద్ధి ప్రాధాన్యతను వివరించిన కేంద్రమంత్రి డా. మన్సుఖ్ మాండవీయ


'కీర్తి' రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి


'భారతదేశం భిన్నత్వం, సామర్థ్యాలతో నిండి ఉంది. దేశంలో మనో శక్తికి, మానవ శక్తికి, ప్రతిభావంతులకు ఎన్నడూ కొదవలేదు' - డాక్టర్ మాండవీయ


'కీర్తి' కార్యక్రమంలో భాగంగా 100 రోజుల్లో లక్ష మంది వర్ధమాన యువ క్రీడాకారుల గుర్తింపు

Posted On: 19 JUL 2024 3:08PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ నేడు దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కీర్తి (ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్) రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు శ్రీ మనోజ్ తివారీ, శ్రీమతి కమల్జీత్ సెహ్రావత్, ప్రముఖ క్రీడాకారులు, యువజన వ్యవహారాలు, క్రీడలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులు ఎంసిడి పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి డా. మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, “భారతదేశం భిన్నత్వంతో, సామర్థ్యాలతో నిండి ఉందన్నారు. భారత్ లో మనో శక్తికి, మానవ శక్తికి, ప్రతిభావంతులకు ఎన్నడూ కొదవలేదన్నారు. కేవలం దేశంలోని నగరాల్లోనే కాదు, సుదూర ప్రాంతాలైన ఈశాన్య భారతం, కోస్తా తీరాలు, హిమాలయ, గిరిజన ప్రాంతాల్లో సైతం ఉత్తమ క్రీడాకారులు ఉన్నారు. ఈ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం వారి నైపుణ్యాలను అభివృద్ధి పరచడమే కీర్తి కార్యక్రమ లక్ష్యం" అని అన్నారు.

'మన జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ప్రస్తావిస్తుంటారు. క్రీడా రంగంలో భారత్ ను ప్రపంచంలో సూపర్ పవర్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యల ఫలితం, ఒలింపిక్స్ సహా వివిధ ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో దేశం సాధించిన పతకాల పట్టిక ప్రతిబింబిస్తుంది. ఈ అత్యుత్తమ క్రీడాకారుల గెలుపు స్థిర ప్రవాహాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడే క్రీడా నైపుణ్యానికి దోహదపడే 'కీర్తి' ప్రాజెక్టు పనిచేస్తుంది అని డా. మాండవీయ అన్నారు.

 

ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి డా. మాండవీయ మాట్లాడుతూ, 'మీలో కచ్చితంగా ఒక ఒలింపిక్ ఛాంపియన్ ఉంటారు. మీ తల్లిదండ్రులు మీకు క్రీడలు ఆడేందుకు మద్దతు ఇస్తున్నారనే విషయాన్ని అభినందిస్తున్నాను". ఏదో ఒక రోజు మీరు ఒలింపిక్ పతకం సాధించినప్పుడు, మీరు లేదా మీ తల్లిదండ్రులు జెఎల్ఎన్ స్టేడియంలో నేటి రోజును గుర్తుంచుకుంటారని కేంద్ర మంత్రి అన్నారు.

 

కీర్తి కార్యక్రమం కింద 100 రోజుల్లో లక్ష మంది యువ క్రీడాకారులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని డా. మాండవీయ తెలిపారు. కీర్తి కార్యక్రమం క్రీడాకారులు పల్లెలో ఉన్నా, నగరంలో ఉన్నా, పేదరిక నేపథ్యమైనా, మరేదైనా... ప్రతి ఒక్కరూ తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

 

2047 నాటికి ఒలింపిక్స్ లో భారత్ ను ఉత్తమ 5 దేశాల సరసన ఒకటిగా నిలిపేందుకు దేశవ్యాప్త ప్రతిభా గుర్తింపునకు నేటి కార్యక్రమం నాంది పలికింది. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 117 మంది క్రీడాకారుల్లో 28 మంది ఖేలో ఇండియా నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.

 

ప్రపంచంలో అత్యత్తమ విధానాలను, ఐటీ టూల్స్ ని  ఉపయోగించి కీర్తీ టాలెంట్ ఐడెంటిఫికేషన్ మోడల్ ను శాస్త్రీయ పద్దతిలో ప్రణాళిక రచించారు. యువ క్రీడాకారులకు వారి సామర్థ్యాల ఆధారంగా క్రీడా మార్గాన్ని ఎంచుకోవడానికి దిశానిర్దేశం చేయడం ఈ కీర్తి కార్యక్రమ లక్ష్యం.

 

 ఈ కీర్తి ప్రాజెక్టు వికేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తూ, ప్రతిభను గుర్తిస్తూ రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతుంది. అవి ఒకటి సామాజిక భాగస్వామ్యం, రెండవది క్రీడల్లో శ్రేష్టత. కీర్తి ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో వంద రోజుల్లో లక్ష మందికి క్రీడల మదింపు ప్రక్రియ చేపడతారు. ఈ విధంగా ఏడాదిలో 20 లక్షల మందికి ఈ ప్రక్రియను నిర్వహించి ప్రతిభను గుర్తించి అభివృద్ధిపరుస్తారు.

 

దిల్లీలో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) సహకారంతో మొత్తం 12 జోన్లలో 25 వేల మందికి పైగా ఎంసిడి విద్యార్థులకు కీర్తి ప్రాజెక్టులో భాగంగా ప్రతిభను వెలికితీసే ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ మదింపు మొత్తం 27 రోజుల పాటు కొనసాగుతుంది. అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో వంటి 5 ప్రధాన క్రీడల్లో వీటిని నిర్వహించనున్నారు.

 

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ల్ లో భాగంగా 6-10 సంవత్సరాల వయస్సు గల ఎంసిడి విద్యార్థుల కోసం ఫుట్ బాల్, వాలీబాల్ వంటి వివిధ క్రీడల పట్ల దిల్లీ అంతటా వివిధ క్రీడా శిబిరాలను నిర్వహించింది.

 

మూడో దశ కీర్తి ప్రాజెక్టులో, ఖేలో ఇండియా పథకంలోని మొత్తం 20 విభాగాలను కీర్తీ ప్రాజెక్టులో భాగం చేయనున్నారు.

 

మార్చి 12, 2024వ తేదీన చండీగఢ్ లో కీర్తి మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించారు.

 

కీర్తి ప్రాజెక్టు రెండవ దశ ప్రారంభోత్సవాన్ని వీక్షించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

 

కీర్తి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

***



(Release ID: 2034558) Visitor Counter : 41