ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-రష్యా 22వ వార్షిక సదస్సు అనంతర సంయుక్త ప్రకటన
Posted On:
09 JUL 2024 9:54PM by PIB Hyderabad
భారత్-రష్యా: నిరంతరం విస్తరించే శాశ్వత భాగస్వామ్యం
1, భారత్-రష్యా 22వ వార్షిక సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 8-9 తేదీలలో రష్యా అధ్యక్షులు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు.
2. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’తో గౌరవనీయ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సత్కరించారు. భారత్-రష్యా ప్రత్యేక-విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరణ సహా రెండుదేశాల ప్రజానీకం మధ్య స్నేహ సంబంధాల వృద్ధికి విశేష కృషి చేసినందుకుగాను శ్రీ మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.
రాజకీయ సంబంధాలు
3. భారత్-రష్యా ప్రత్యేక-విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతూ నిరంతరం విస్తరిస్తుండటంపై అధినేతలిద్దరూ హర్షం వెలిబుచ్చారు.
4. వ్యూహాత్మక సమన్వయం, పరస్పర అవగాహన, విశ్వాసం ప్రాతిపదికగా కాల పరీక్షకు నిలిచిన ఈ బంధానికిగల ప్రత్యేక లక్షణాన్ని వారిద్దరు ఎంతగానో ప్రశంసించారు. ఈ మేరకు భారత్ 2023లో షాంఘై సహకారం సంస్థ (ఎస్‌సిఒ), జి-20లకు అధ్యక్షత వహించినపుడు, రష్యా 2024లో ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్షత వహించిన సమయంలోసహా అన్ని స్థాయులలో ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరం కొనసాగడం ద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతమై లోతుగా విస్తరించిందని ఈ సందర్భంగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
5. భారత్-రష్యా సంబంధాల్లో బహుముఖ, పరస్పర ప్రయోజనకర అంశాలపై సమీక్ష సందర్భంగా వారిద్దరూ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజకీయ, వ్యూహాత్మక, సైనిక, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, శాస్త్ర-సాంకేతిక, అణు-అంతరిక్ష, సాంస్కృతిక, విద్య, మానవతావాద తోడ్పాటు సహా అన్ని రంగాల్లో సహకార విస్తరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయ రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకుంటూ, మరింత విస్తరణ దిశగా కొత్త మార్గాల అన్వేషణలో ఉభయపక్షాలు చురుగ్గా కృషి చేయడంపైనా వారు హర్షం వెలిబుచ్చారు.
6. ప్రపంచంలో భౌగోళిక-రాజకీయ స్థితిగతుల పరంగా నేడు సంక్లిష్టత, సవాళ్లు, అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనూ భారత్-రష్యా సంబంధాలు చెక్కుచెదరక పోవడాన్ని ఉభయ పక్షాలూ ప్రశంసించాయి. సమకాలీన, సమతుల, పరస్పర ప్రయోజనకర, సుస్థిర, దీర్ఘకాలిక భాగస్వామ్య సృష్టికి రెండు పక్షాలు కృషి చేశాయి. సహకారం కొనసాగుతున్న అన్ని రంగాలలో భారత్-రష్యా సంబంధాల అభివృద్ధిని ఉమ్మడి విదేశాంగ విధాన ప్రాధాన్యంగా వారు పరిగణించారు. ఈ మేరకు వ్యూహాత్మక భాగస్వామ్యం సంపూర్ణ సామర్థ్య సద్వినియోగానికి అన్నివిధాలా కృషి చేయాలని వారు నిశ్చయానికి వచ్చారు.
విదేశాంగ మంత్రుల స్థాయిలో సహకారం
7. నిరంతర పరిణామశీల, సంక్లిష్ట భౌగోళిక-రాజకీయ నేపథ్యంలో మారే పరిస్థితులకు తగినట్లు ద్వైపాక్షిక భాగస్వామ్య బలోపేతం, కొనసాగింపుపై రెండు దేశాల విదేశాంగ శాఖల మధ్య సన్నిహిత సహకారం, మంత్రుల మధ్య తరచూ సమావేశాలు, సంప్రదింపులను అధినేతలిద్దరూ అభినందించారు. పరస్పర కీలక ప్రయోజనాలు, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాల మార్పిడి, వివిధ ప్రపంచ, బహుపాక్షిక వేదికలపై లోతైన అవగాహనకు ఈ సన్నిహిత సంభాషణలు దోహదం చేశాయని వారు ప్రశంసించారు.
8. భారత్-రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య 2024-28 కాలానికి సంబంధించి విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల విధివిధానాలపై 2023 డిసెంబరులో సంతకాలు చేయడంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ-ప్రాంతీయ అంశాల్లో తీవ్ర సమస్యలపై అభిప్రాయ మార్పిడితోపాటు సంభాషణలకు ఇది పునాది వేసింది. అలాగే ద్వైపాక్షిక, ఐరాస సంబంధిత, ఉగ్రవాద వ్యతిరేక, దౌత్య, ఆస్తి సంబంధిత అంశాలు సహా పరస్పర ప్రయోజనంగల ప్రాంతీయ-అంతర్జాతీయ సమస్యలపై విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు క్రమం తప్పకుండా సాగడంపైనా వారు సంతృప్తి వెలిబుచ్చారు.
పార్లమెంటరీ సహకారం
9. సన్నిహిత అంతర్-పార్లమెంటరీ సంభాషణల ప్రాముఖ్యాన్ని ఉభయపక్షాలూ గుర్తించాయి. ముఖ్యంగా భారత్-రష్యా సంబంధాల్లో ఇదొక విలువైన అంశమని ఏకాభిప్రాయానికి వచ్చాయి. తదనుగుణంగా ఇంటర్-పార్లమెంటరీ కమిషన్, ఉభయ సభల పార్లమెంటరీ మిత్రబృందాల మధ్య నిరంతర సమావేశాల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పాయి. ఈ నేపథ్యంలో జి20 9వ పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా సమాఖ్య కౌన్సిల్ స్పీకర్ 2023 అక్టోబరులో న్యూఢిల్లీలో పర్యటించడాన్ని వారు ప్రశంసించారు.
జాతీయ భద్రత మండళ్ల మధ్య సహకారం
10. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై రెండు దేశాల జాతీయ భద్రత మండళ్లు, జాతీయ భద్రత సలహాదారుల స్థాయులలో భద్రతపై చర్చల ప్రాధాన్యాన్ని దేశాధినేతలిద్దరూ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే పరస్పర ఆసక్తి, ఆందోళనలతో ముడిపడిన ద్వైపాక్షిక, అంతర్జాతీయ-జాతీయ అంశాలపై రెండు దేశాల మధ్య మరింత వ్యూహాత్మక అవగాహన, సమన్వయ సౌలభ్యం కల్పించే సాధారణ పరస్పర చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య-ఆర్థిక భాగస్వామ్యం
11. రెండు దేశాల దేశాల మధ్య 2023లో ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయ వృద్ధిపై ఉభయ పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది 2025నాటికి నిర్దేశించుకున్న 30 బిలియన్ అమెరికా డాలర్ల లక్ష్యానికి రెట్టింపు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక సమతుల, సుస్థిర ద్వైపాక్షిక వాణిజ్యం ఆవశ్యకతను అధినేతలిద్దరూ నొక్కి చెప్పారు. ఈ మేరకు పారిశ్రామిక సహకార బలోపేతం కొత్త సాంకేతిక... ప్రత్యేకించి అధునాతన ఉన్నతస్థాయి సాంకేతిక రంగాల్లో పెట్టుబడి భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం, సరికొత్త మార్గాలు, సహకార నమూనాల అన్వేషణ ద్వారా రష్యాకు భారత ఎగుమతులు పెరగాలని నిర్దేశించారు.
12. ద్వైపాక్షిక వాణిజ్యంలో సత్వర వృద్ధి, కొనసాగింపు లక్ష్యంగా 2030 నాటికి వాణిజ్య లక్ష్యాన్ని 100 బిలియన్ అమెరికా డాలర్లుగా నిర్ణయించేందుకు నేతలిద్దరూ అంగీకరించారు.
13. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ (ఐఆర్ఐజిసి-టిఇసి) 24వ సదస్సు, భారత్-రష్యా వాణిజ్య వేదిక సమావేశాలను 2023 ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలో నిర్వహించడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే రవాణా, పట్టణాభివృద్ధి, రైల్వే రంగాల్లో కార్యాచరణ బృందాలు, ఉప-కార్యాచరణ బృందాల సన్నాహక సమావేశాలను కూడా స్వాగతించారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో మరింత వైవిధ్యం, విస్తరణ దిశగా కమిషన్ కృషిని వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ‘ఐఆర్ఐజిసి-టిఇసి’ తదుపరి సదస్సును 2024 రెండో అర్థ భాగంలో రష్యాలో నిర్వహించాలని నిర్ణయించారు.
14. వాణిజ్యం, ఆర్థిక సహకారం మరింత విస్తరించేలా అదనపు ప్రోత్సాహం అవసరాన్ని నాయకులిద్దరూ గుర్తించారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య వస్తుసేవల వాణిజ్యంలో గతిశీల వృద్ధి ధోరణిని కొనసాగింపు ఆకాంక్షతో పరిమాణాత్మకంగా గణనీయ పెరుగుదలను నిర్దేశించారు. ఇందుకు తగినట్లు 2030దాకా భారత్-రష్యా ఆర్థిక సహకార (కార్యాచరణ ప్రణాళిక-2030) వృద్ధికి అవకాశంగల రంగాలపై ప్రణాళిక రూపొందించాలని సంబంధిత సంస్థాగత యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రణాళికలో నిర్దేశించే కార్యక్రమాలు, ప్రాజెక్టులు, చర్యలు, కార్యకలాపాల అమలులో సహకారానికి ఉభయ పక్షలు సంపూర్ణ సంసిద్ధతను పునరుద్ఘాటించాయి. వీటన్నిటినీ ‘ఐఆర్ఐజిసి-టిఇసి’ ద్వారా సమన్వయం చేసుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా కార్యాచరణ ప్రణాళిక-2030 పర్యవేక్షణ, నియంత్రణ, మద్దతు దిశగా కార్యాచరణ, ఉప-కార్యాచరణ బృందాలు చేపట్టాల్సిన చర్యలను రెండు దేశాల్లోని సంబంధిత సంస్థలకు అప్పగించారు.
15. జాతీయ కరెన్సీల వినియోగం ద్వారా ద్వైపాక్షిక పరిష్కార వ్యవస్థను ప్రోత్సహించడంలో సంయుక్త కృషి కొనసాగింపునకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. తమతమ ఆర్థిక సందేశ వ్యవస్థల పరస్పర నిర్వహణ సౌలభ్యంపై సంప్రదింపులు కొనసాగించాలని కూడా నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో మరింత మెరుగుదల ప్రాతిపదికగా బీమా, రీఇన్సూరెన్స్ అంశాలపై పరస్పర ఆమోదయోగ్య పరిష్కారాన్వేషణ ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు.
16. వాణిజ్యంలో రక్షణాత్మక చర్యలు, పాలనపరమైన అడ్డంకులు సహా నాన్-టారిఫ్/టారిఫ్ పరమైన అవరోధాల తొలగింపు లక్ష్యంగా 2024 మార్చిలో సన్నాహక సమావేశం నిర్వహణపై ఉభయపక్షాలూ ప్రశంసించాయి. ఈ సందర్భంగా భారత్-యురేషియా ఎకనమిక్ యూనియన్ మధ్య వస్తువుల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పూర్తిస్థాయి చర్చలకు నిర్ణయించడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. అలాగే సేవలు, పెట్టుబడుల సంబంధిత ద్వైపాక్షిక స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందంపై సంతకం దిశగా చర్చలు చేపట్టే అవకాశాలను అన్వేషించాలని కూడా వారు సంబంధిత అధికారులను ఆదేశించారు.
17. ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిలో పారిశ్రామిక సహకారానికిగల ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ- రవాణా ఇంజనీరింగ్, మెటలర్జీ, రసాయన పరిశ్రమలతోపాటు పరస్పర ఆసక్తిగల ఇతర రంగాల్లో తయారీ సహకార బలోపేతంపై తమ ఉమ్మడి ఆకాంక్షను ఉభయపక్షాలూ స్పష్టంగా ప్రకటించాయి. ప్రాధాన్యాంశాల్లో ఆశావహ ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టేందుకు సానుకూల పరిస్థితులను సృష్టిపై రెండు పక్షాలూ తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. అలాగే పారిశ్రామిక ఉత్పత్తుల పరస్పర వాణిజ్య కార్యకలాపాల విస్తరణతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యంలో తమ వాటా పెంచుకోవడంలోని ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలూ నొక్కిచెప్పాయి.
18. ఫెడరల్ కస్టమ్స్ సర్వీస్ ఆఫ్ రష్యా, భారత కేంద్రీయ పరోక్ష పన్నుల బోర్డు-కస్టమ్స్ విభాగాల మధ్య 2024 మే నెలలో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు దేశాల వ్యవస్థల పరిధిలోని అధీకృత ఆర్థిక కార్యకలాపాల సంస్థలకు పరస్పర గుర్తింపు ఇచ్చేందుకు ఉభయపక్షాలూ అంగీకరించాయి. రష్యా-భారత్ వాణిజ్య పరిమాణం పెంపు, నామ పరిభాష నిర్ధారణ సహా సరఫరా శ్రేణి భద్రతకు ఈ ఒప్పందం అదనపు ఊపునివ్వగలదు.
19. రష్యా-భారత ప్రభుత్వాల మధ్య వలస-రవాణా భాగస్వామ్య ఒప్పందంపై చర్చను కొనసాగించాలని ఉభయపక్షాలూ అంగీకరించాయి.
20. ఎరువులపై భారత్-రష్యా సంయుక్త కమిటీ చట్రం పరిధిలో కంపెనీల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాల ప్రాతిపదికన భారతదేశానికి ఎరువుల సుస్థిర సరఫరాపై సహకారం కొనసాగింపునకు ఉభయ పక్షాలు అంగీకరించాయి.
21. మాస్కోలో 2024నాటి భారత్-రష్యా పెట్టుబడుల వేదిక తొలి సమావేశం, పెట్టుబడి ప్రాధాన్య ప్రాజెక్టులపై కార్యాచరణ బృందం 7వ విడత చర్చలను దేశాధినేతలిద్దరూ స్వాగతించారు. ఈ సందర్భంగా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ కింద రష్యా వ్యాపారాల భాగస్వామ్య సౌలభ్యం కల్పనకు రెండు పక్షాలు అంగీకరించాయి. అలాగే రష్యా పెట్టుబడి ప్రాజెక్టులతో భారత కంపెనీల భాగస్వామ్యానికీ నిర్ణయించారు. భారత ప్రభుత్వ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమం కింద కొత్త పారిశ్రామిక నగరాల్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు రష్యా వాణిజ్య సంస్థలను భారత పక్షం ఆహ్వానించింది.
22. టెలికమ్యూనికేషన్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, ప్రభుత్వ పరిపాలన డిజిటలీకరణ, పట్టణ పర్యావరణం, మొబైల్ కమ్యూనికేషన్లు, సమాచార భద్రత వగైరాలు సహా కమ్యూనికేషన్ సాంకేతికతల రంగంలో సహకార విస్తరణకు ఉభయ పక్షాలు తమ ఆసక్తిని ప్రకటించాయి.
రవాణా - అనుసంధానం
23. సుస్థిర, సమర్థ రవాణా కారిడార్ల నిర్మాణంలో సరికొత్త విధానాలను ఉభయపక్షాలూ పంచుకుంటాయి. అలాగే ‘గ్రేటర్ యురేషియన్ స్పేస్’ ప్రణాళిక అమలు సహా యురేషియాలో వర్ధమాన ఉత్పత్తి-మార్కెటింగ్ శ్రేణుల రూపకల్పనపై నిశితంగా దృష్టి సారిస్తాయి. ఈ నేపథ్యంలో ఉత్తర సముద్ర మార్గ సామర్థ్య వినియోగం సహా ‘చెన్నై-వ్లాడివోస్తోక్ ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్’ల అమలు, మౌలిక సదుపాయాల సామర్థ్యం పెంపుతోపాటు రవాణా సంధానాల విస్తరణ దిశగా చురుకైన కృషికి రెండు పక్షాలూ సంసిద్ధత వ్యక్తం చేశాయి.
22. సరకు రవాణా వ్యయం, సమయం ఆదాసహా యురేషియా పరిధిలో అనుసంధానం ప్రోత్సాహానికి ‘ఐఎన్ఎస్‌టిసి’ మార్గం వినియోగం పెంపు దిశగా రెండు పక్షాలు ఉమ్మడి కృషిని కొనసాగిస్తాయి. పారదర్శకత, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యాలు, ఆర్థిక స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం వంటి సూత్రాలపై రవాణా, సంబంధిత రంగాల్లో సహకారం ఆధారపడి ఉంటుంది.
23. ఉత్తర సముద్ర మార్గం ద్వారా రష్యా-భారత్ మధ్య నౌకాయానం అభివృద్ధిపై సహకారానికి రెండు పక్షాలు మద్దతిస్తాయి. దీనిపై ఉత్తర సముద్ర మార్గంలో సహకారం దిశగా ‘ఐఆర్ఐజిసి-టిఇసి’ పరిధిలో ఉమ్మడి కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
24. పౌర విమానయానంపై ఉప-కార్యాచరణ బృందం (2023 ఫిబ్రవరి) మాస్కోలో సమావేశం కావడంపై ఉభయ పక్షాలూ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పౌర విమానయానంతోపాటు ఈ రంగంలో భద్రతపైనా సహకారానికి అంగీకారం కుదిరింది.
ఇంధన రంగంలో భాగస్వామ్యం
25. ప్రత్యేక-విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక మూలస్తంభం వంటి ఇంధన రంగంలో బలమైన, విస్తృత సహకారం ప్రాధాన్యాన్ని రెండు పక్షాలు పునరుద్ఘాటించాయి. ఈ సందర్భంగా ఇంధన వనరులలో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రత్యేక ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ కొత్త దీర్ఘకాలిక ఒప్పందాలపై మార్గాన్వేషణకు అంగీకరించాయి.
26. బొగ్గు రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని ఉభయ పక్షాలు ప్రశంసించాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారతదేశానికి కోకింగ్ బొగ్గు సరఫరాను మరింత పెంచడంతోపాటు ఆంత్రాసైట్ బొగ్గు ఎగుమతి అవకాశాల అన్వేషణకూ అంగీకరించాయి.
దూరప్రాచ్యం.. రష్యా పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారం
27. దూరప్రాచ్యం, రష్యా పరిధిలోని ఆర్కిటిక్ మండలిలో వాణిజ్యం-పెట్టుబడి సహకారం విస్తరణకు రెండు పక్షాలూ సంసిద్ధత తెలిపాయి. దీనికి సంబంధించి 2024-2029 మధ్య రష్యా దూరప్రాచ్యంలోని వాణిజ్య-ఆర్థిక-పెట్టుబడి రంగాల్లో సహకార కార్యక్రమంతోపాటు రష్యా పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలోనూ సహకారం సూత్రాల మీద భారత్-రష్యా మధ్య ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని స్వాగతించాయి. ఈ రెండు అంశాల్లో ఉభయ దేశాల మధ్య మరింత సహకారానికి ఈ ఒప్పందం ఒక చట్రాన్ని సమకూరుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, ఇంధనం, మైనింగ్, మానవశక్తి, వజ్రాలు, ఫార్మాస్యూటికల్స్, సముద్ర రవాణా వగైరా రంగాల్లో ఇది కొనసాగుతుంది.
28. రష్యా దూరప్రాచ్య ప్రాంతాలు, భారతదేశంలోని రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సంప్రదింపులు కొనసాగింపుతోపాటు వ్యాపార, వాణిజ్య, విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఆదానప్రదానం, ప్రాజెక్టులు చేపట్టడంపై సంయుక్త సంబంధాలు నెలకొల్పుకోవడాన్ని ప్రోత్సహించడం అవసరమని రెండు రుపక్షాలు పునరుద్ఘాటించాయి.
29. రష్యా దూరప్రాచ్యంలోని ‘టెరిటరీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్’లో అత్యాధునిక సాంకేతికత పెట్టుబడి ప్రాజెక్టుల అమలుపై ఆసక్తిగల భారతీయ పెట్టుబడిదారులను రష్యా బృందం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో 2024 జనవరిలో నిర్వహించిన ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సులో ‘రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ఫార్ ఈస్ట్ అండ్ ఆర్కిటిక్ డెవలప్‌మెంట్’ ప్రతినిధి బృందం పాల్గొనడాన్ని భారత్ ప్రశంసించింది. అలాగే ‘సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్’ (జూన్ 2023)సహా, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (సెప్టెంబర్ 2023) కార్యక్రమాల్లో భారత ప్రతినిధుల భాగస్వామ్యాన్ని రష్యా స్వాగతించింది. ఈ ఆర్థిక వేదికల కార్యక్రమాల్లో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక-పెట్టుబడి సహకారాన్ని ప్రోత్సహించేలా భారత్-రష్యా వాణిజ్య సంప్రదింపులను రెండు పక్షాలు ప్రశంసించాయి.
30. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ చట్రం సహా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన వ్యాపార రంగాల్లో సహకార విస్తరణ ప్రాముఖ్యాన్ని కూడా ఉభయపక్షాలు కొనియాడాయి.
పౌర అణుశక్తి.. అంతరిక్ష రంగాల్లో సహకారం
31. వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశంగా అణుశక్తి శాంతియుత వినియోగంపై సహకారం ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో కూడంకుళం వద్ద ఆగిపోయిన అణు విద్యుత్ ప్లాంట్ యూనిట్ల నిర్మాణంలో సాధించిన ప్రగతిపై హర్షం ప్రకటించాయి. అంతేకాకుండా సరఫరాల చేరవేతకు సమయపాలన సహా నిర్దిష్ట కార్యక్రమ పట్టికకు కట్టుబడాలని అంగీకరించాయి. ఇప్పటికే సంతకాలు పూర్తయిన ఒప్పందాల మేరకు- భారతదేశంలో రెండో సైట్‌పై తదుపరి చర్చల ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. ‘వివిఇఆర్-1200’పై రష్యా డిజైన్ మీద సాంకేతికత పరమైన చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. అలాగే పరికరాల స్థానికీకరణ, ఎన్‌పిపి విడిభాగాల ఉమ్మడి తయారీసహా తృతీయపక్ష దేశాల్లో సహకారంపైనా సాంకేతిక చర్చల కొనసాగింపునకు అంగీకరించాయి. ఇంధన చక్రం, ‘కెకెఎన్‌పిపి’లు, నాన్-పవర్ అప్లికేషన్ల నిర్వహణకు లైఫ్ సైకిల్ సపోర్ట్ సహా అణుశక్తిలో సహకార విస్తృతిపై నిశ్చయించినట్లు ఉభయ పక్షాలు ధ్రువీకరించాయి.
34. అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి గల ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఉభయపక్షాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, రష్యన్ ప్రభుత్వ స్పేస్ కార్పొరేషన్ ‘‘రాస్ కాస్మోస్’’ మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని స్వాగతించాయి. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం,మానవ సహిత అంతరిక్ష కార్యకమ్రాలు, ఉపగ్రహ నావిగేషన్, గ్రహాణ్వేషణ వంటి అంశాలలో ఈ విస్తృత భాగస్వామ్యన్ని ఉభయ పక్షాలు స్వాగతించాయి. అంతరిక్ష అణ్వేషణలో ముందడుగుగా భారతదేశం చంద్రయాన్ –3, చంద్రుడిపై విజయవంతంగా దిగడాన్ని , శాస్త్ర, ఇంజనీరింగ్ రంగంలో ఇండియా సాధించిన అద్భుత ప్రగతిని రష్యా అభినందించింది. ఇది భవిష్యత్ సహకారానికి పరస్పరం ప్రయోజనకరంగా ఉండగలదని పేర్కొంది. రాకెట్ ఇంజిన్ అభివృద్ధి , ఉత్పత్తి, ఉపయోగానికి సంబంధించి ఉభయపక్షాలకు ప్రయోజనకరమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రెండు వైపులా అంగీకారం కుదిరింది.
మిలటరీ, మిలటరీ సాంకేతిక సహకారం:
35. ఇండియా, రష్యాలమధ్య సంప్రదాయికంగా, ప్రత్యేక, విశేష భాగస్వామ్యానికి మిలటరీ, సాంకేతిక సహకారం ఒక ముఖ్యస్తంభంగా ఉంటూవచ్చింది. మిలటరీ సాంకేతిక సహకారంపై (ఐఆర్‌ఐజిసి`ఎం అండ్ ఎంటిసి) ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మార్గనిర్దేశంలో పలు దశాబ్దాల సంయుక్త కృషి కారణంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతూ వచ్చాయి. ఎస్.సి.ఒ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా 2023 ఏప్రిల్లఓ న్యూడిల్లీలో జరిగిన ఇరుదేశాల రక్షణ మంత్రుల సమావేశంపైన, ఉభయ దేశాల సాయుధ బలగాల సంయుక్త విన్యాసాలపైన ఉభయపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. 2024
ద్వితీయార్థంలో మాస్కోలో ఐఆర్‌ఐజిసి` ఎం.అండ్ ఎం టిసి 21 వ రౌండ్ సమావేశాలు నిర్వహించేందుకు
ఉభయపక్షాలూ అంగీకారం తెలిపాయి. స్వావలంబనకు ఇండియా సాగిస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉభయదేశాలు నిర్ణయించాయి. ఉభయ దేశాల భాగస్వామ్యం సంయుక్త పరిశోధన, అభివృద్ధి, సహ అభివృద్ధి, అధునాతన రక్షణ సాంకేతికత ,ఉమ్మడి ఉత్పత్తి, సిస్టమ్ల ఏర్పాటుకు తమ మధ్య భాగస్వామ్యాన్ని ఇవి పునర్ నిర్వచించాయి. సంయుక్త సైనిక సహకార కార్యకలాపాలు, సైనిక ప్రతినిధి బృందాల మార్పిడి విషయంలో మరింత ముందుకు పోయేందుకు ఉభయ పక్షాలు తమ చిత్తశుద్ధిని ప్రకటించాయి.
36. రష్యాలో తయారైన ఆయుధాల నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, కాంపొనెంట్లు, అగ్రిగేట్లు , ఇతర ఉపకరణాలు, ఉత్పత్తులను , డిఫెన్స్ పరికరాలను, సాంకేతికత బదిలీ ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఇండియాలో తయారు చేసేందుకు నిర్ణయించారు. అలాగే భారత సాయుధ బలగాల అవసరాలను తీర్చేందుకు, పరస్పర స్నేహ సంబంధాలు కలిగిన తృతీయ దేశాలకు అవతలి పక్షం అనుమతితో తదుపరి ఎగుమతులు చేసేందుకు జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి.ఇందుకు సంబంధించి ఉభయ పక్షాలు , సాంకేతిక సహకారంపై ఒక కొత్త వర్కింగ్ గ్రూపును ఏర్పాటుచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయమై విధివిధానాలను తదుపరి ఐఆర్ఐజిసి– ఎంఅండ్ ఎంటిసి సందర్భంగా చర్చిస్తారు.
విద్య, శాస్త్రవిజ్ఞానం,సాంకేతికతలలో సహకారం:
37. శాస్త్ర,సాంకేతిక, ఆవిష్కరణల రంగాలలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. విద్య, శాస్త్ర విజ్ఞాన సంస్థల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఇవి గుర్తించాయి. విద్యా సంబంధ రాకపోకల విధానల రూపకల్పన,విద్యా కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం, ఆసక్తిగల రష్యా విద్యా సంస్జతలు, శాస్త్ర విజ్ఞాన సంస్థలు ఇండియాలో తమ శాఖల ఏర్పాటులో సహకారానికి ప్రాధాన్యతను ఉభయ పక్షాలూ గుర్తించాయి.
38. రష్యన్ ఫెడరేషన్ కు సంబంధించిన శాస్త్ర విజ్ఞాన, ఉన్నత విద్యా మంత్రిత్వశాఖకు , భారత ప్రభుత్వ డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి మధ్య 2021లో రూపుదిద్దుకున్న రోడ్మ్యాప్ విజయవంతంగా అమలు కావడాన్ని ఉభయపక్షాలు గుర్తించాయి. అలాగే ఉభయ దేశాలకు చెందిన శాస్త్ర విజ్ఞాన ఫౌండేషన్లు, వివిధ మంత్రిత్వశాఖల ద్వారా రష్యా– ఇండియా రిసెర్చ్ ప్రాజెక్టులు విజయవంతంగా అమలు కావడాన్ని కూడా ఉభయ పక్షాలూ గుర్తించాయి.
39. శాస్త్ర,సాంకేతిక, ఆవిష్కరణల రంగంలో సంయుక్త పరిశోధన ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, రోడ్ మ్యాప్ ఫర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నొవేషన్ కో ఆపరేషన్ ఆఫ్ 2021కు అనుగుణంగా కలిసి పనిచేయడానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఇది ఆవిష్కరణల సంబంధించి రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడానికి ,ఈ సాంకేతికతలను వాణిజ్యస్థాయికి తీసుకువెళ్లడంపై దృష్టిపెట్టేందుకు, సామాజిక, ఆర్ధిక ప్రభావాన్ని కలిగిఉండే సంయుక్త ప్రాజెక్టులకు పూర్తి స్థాయి మద్దతునిచ్చేందుకు దోహదపడుతుంది. ఇన్నొవేటివ్ ఎంటర్ ప్రెన్యుయర్షిప్ల ఏర్పాటు ను, వివిధ క్లస్టర్లమధ్య సాంకేతిక భాగస్వామ్యాన్ని మెరుగు పరిచేందుకు అవకాశాలను పరిశీలించేందుకు ఉభయపక్షాలు అంగీకరించాయి.
40. వ్యవసాయం, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ, నౌకా నిర్మాణం, మరమ్మతులు, బ్లూ ఎకానమీ, మెరైన్ పరిశ్రమ, సముద్ర వనరులు, కెమికల్ సైన్స్, టెక్నాలజీ, ఇంధనం, నీరు, వాతావరణం,సహజవనరులు, ఆరోగ్యం, వైద్య సాంకతికత, జీవశాస్త్రాలు, బయోటెక్నాలజీ, అనువర్తిత గణితం, డాటా సైన్స్,సాంకేతిక విజ్ఞానం, మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ,ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ధృవ ప్రాంత పరిశోధన, నానోటెక్నాలజీ వంటి కీలక రంగాలను పరస్పర సహకారానికి ఉభయదేశాలూ గుర్తించాయి.
41. భారత ప్రభుత్వ డిపార్టమెంట్ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, అలాగే రష్యా కు చెందిన సైన్స్, ఉన్నత విద్య మంత్రిత్వశాఖ, రష్యా సైన్స్ ఫౌండేషన్లు పరస్పర ప్రయోజనాల దృష్టితో చేపట్టిన సంయుక్త ప్రాజెక్టుల సంయుక్త బిడ్ల విజయవంతంగా అమలవుతుండడాన్ని ఉభయపక్షాలు గుర్తించాయి.
42. ఐ.ఆర్.ఐ.జి.సి– టి.ఇ.సి ఫ్రేమ్ వర్క్కు లోబడి ఉన్నత విద్యపై వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసేందుకు ఉభయ పక్షాలూ తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఇందులో రెండు దేశాలకు చెందిన ఆసక్తి కలిగిన విభాగాలు, సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయడానికి , ఈ రంగంలో వివిధ సమకాలీన అంశాలపై చర్చలకు ఆసక్తి కనబరచాయి.
43. విద్య, అకడమిక్ డిగ్రీల పరస్పర గుర్తింపునకు సంబంధించి తమ సంప్రదింపులను కొనసాగించాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
44. రష్యా–ఇండియా రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు, కాన్ఫరెన్సులు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు, తద్వారా ద్వైపాక్షిక విద్య, శాస్త్ర విజ్ఞాన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయే చర్యలకు ఉభయపక్షాలు తమ మద్దతు తెలిపాయి.
45. విద్యారంగంలో ఇండియా , రష్యాల మధ్య సాంప్రదాయికంగా గల బలమైన సహకారాన్ని గుర్తిస్తూ, ఇరుదేశాల విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానతను ప్రోత్సహించే చర్యలు కొనసాగించేందుకు ఉభయపక్షాలూ అంగీకారం తెలిపాయి. అలాగే 2024 ఏప్రిల్లో ఇండియా నిర్వహించిన విద్యా సమ్మేళన్నాన్ని, అందులో రష్యాకు చెందిన 60 విశ్వవిద్యాలయాలు పాల్గొనడాన్ని ఉభయదేశాలు స్వాగతించాయి.
సాంస్కృతిక సహకారం, పర్యాటకం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు:
46. రష్యా– ఇండియా ప్రత్యేక,ప్రివిలేజ్ కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాంస్కృతిక సంబంధ బాంధవ్యాలు కీలకమైనవన్న విషయాన్ని ఇరువైపులా అంగీకరించారు. లైబ్రరీలు, మ్యూజియంలు, సృజనాత్మక విశ్వవిద్యాలయాలు, నాటకరంగ సంస్థలు, కళా సాంస్కృతిక సమాజాల మధ్య నేరుగా సంబంధాలు, మరింత సహకారానికి ఉభయపక్షాలు మద్దతు, ప్రోత్సాహం అందించనున్నాయి.
47. సంప్రదాయికంగా ఉభయదేశాల మధ్య గల అద్భుత సాంస్కృతిక సంబంధాలను గుర్తిస్తూ,2021–24 సంవత్సరానికి, భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ, రష్యన్ ఫెడరేషన్కు చెందిన సాంస్కృతిక శాఖ మధ్య సాంస్కృతిక బృందాల పరస్పర రాకపోకలను విజయవంతంగా అమలు చేసినందుకు ఉభయపక్షాలు అభినందనలు తెలిపాయి. ఇది ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపకరిస్తుంది. పరస్పరం ప్రయోజనకరంగా ఉండేందుకు సాంస్కృతిక ఉత్సవాలు, చిత్రోత్సవాలు నిర్వహించడాన్ని కొనసాగించాలని ఉభయపక్షాలు అంగీకరించాయి. సాంస్కృతిక ఎక్స్చేంజ్లను భౌగోళికంగా మరింత విస్తరింపచేయాల్సిన అవసరాన్ని ఇందులో కూడా ముఖ్యంగా యువత, జానపద కళాకారుల బృందాలను చేర్చాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిశగా 2023 సెప్టెంబర్లో రష్యాలోని 8 నగరాలలో భారతీయ సాంస్కృతిక ఉత్సవాలను , 2024లో ఇండియాలో రష్యన్ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఉభయపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
48. ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో యువత కీలక పాత్రను ప్రస్తావిస్తూ, 2024 మార్చిలో జరిగిన సోచి ప్రపంచ యువజన ఉత్సవాలలో భారత ప్రతినిధులు, యువ ఎంటర్ప్రెన్యుయర్లు పాల్గొనడంపట్ల అలాగే, భారతీయ క్రీడాకారులు, అథ్లెట్లు గేమ్స్ ఆఫ్ ఫ్యూచర్ లో, 2024 మార్చి, జూన్ నెలల్లో కజన్లో జరిగిన బ్రిక్స్ క్రీడలలో పాల్గొనడం పట్ల ఉభయ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
49. సాంస్కృతిక సంబంధాలు, రాకపోకలతోపాటు ఇరుదేశాల గురించి మరింత సమకాలీన అవగాహనను పెంపొందించాల్సిన అవసరాన్ని ఉభయపక్షాలు ప్రత్యేకంగా నొక్కిచెప్పాయి. సాంస్కృతిక బృందాల రాకపోకలతోపాటు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు, సైన్స్ టెక్నాలజీ , గ్రీన్ ఎనర్జీ, అంతరిక్ష రంగాలలో ఎక్సేంజ్ కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఉభయపక్షాలు ప్రస్తావించాయి. ఇందుకు క్రాస్, మల్టీ సెక్టరల్ ఇయర్స్ ఆప్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలను ఇరుదేశాలలో నిర్వహించేందుకు అంగీకరించారు. దీనిద్వారా ప్రజలమధ్య మరింత ఎక్కువ స్థాయిలో రాకపోకలకు వీలుకలగడంతోపాటు, ఆర్ధిక, విద్య, శాస్త్రవిజ్ఞానం, పౌరసమాజ రంగాలు మరింత దగ్గరకావడానికి వీలు కలుగుతుంది.
50. భారతదేశంలో రష్యాభాషను , రష్యాలో భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు సమష్టి కృషిని కొనసాగించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఇందుకు సంబంధిత విద్యా సంస్థలతో సంబంధాలను అభివృద్ధిచేసుకునేందుకు అంగీకరించారు.
51. నిపుణులు, మేధావులు, ఇండియా, రష్యాలకు చెందిన సంస్థలకు చెందిన వారి రాకపోకలను మరింత పెరగడం పట్ల ఉభపక్షాలు అభినందనలు తెలిపాయి. గత కొద్ది సంవత్సరాలుగా చేపడుతున్న చర్చలు ఇండియా , రష్యాల మధ్య వ్యూహాత్మక, విధాన నిర్ణేతలలో, వ్యాపార వర్గాలలో పరస్పర అవగాహన మరింత పెరగడానికి దోహదపడ్డాయి. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడడానికి ఉపకరించింది.
52. ఇండియా– రష్యాలమధ్య పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతుండడం పట్ల ఉభయపక్షాలూ సంతోషం వ్యక్తం చేశాయి. పర్యాటక రంగంలో సహకారాన్ని మరింత పెంచేందుకు , పర్యాటకుల రాకపోకలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం స్థాయిలో సహకారానికి ఉభయపక్షాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో భారతీయ టూర్ ఆపరేటర్లు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల టూర్ ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల పర్యాటక విభాగాలు ఇంక్రెడిబుల్ ఇండియా టీమ్ నాయకత్వంలో , మాస్కో ఇంటర్నేషనల్ టూరిజం ట్రావెల్ ఎక్స్ పో 2023, 2024 అలాగే ఒటిడివైకెహెచ్ –2023 లలో పాల్గొన్న విషయాన్ని ఉభయపక్షాలు గుర్తించాయి.
53. వీసా విధివిధానాలను సులభతరం చేయడాన్ని ఉభయపక్షాలు స్వాగతించాయి. ఇరు దేశాలు ఈ –వీసానుప్రవేశపెట్టడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. భవిష్యత్లో వీసా విధానాలను మరింత సులభతరం చే దిశగా తమ పనిని కొనసాగించేందుకు వారు అంగీకరించారు.
ఐక్యరాజ్యసమితిలో , బహుళ పక్ష వేదికలపై సహకారం:
54. ఐక్యరాజ్యసమితిలోని అంశాలపై ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ చర్చలు, సహకారం అవసరాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించాయి. ప్రపంచవ్యవహారాలలో ఐక్యరాజ్యసమితి కేంద్ర సమన్వయ పాత్ర పోషిస్తూ, బహుళపక్షవిధానాలను మరింత శక్తిమంతం చేయాల్సిన ఆవశ్యకతను ఉభయపక్షాలు అంగీకరించాయి. అంతర్జాతీయ చట్టానికి గౌరవం కల్పించడం అత్యంత కీలకమని పేర్కొంటూ ఉభయ పక్షాలూ,ఇందుకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. సభ్యదేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదన్న సూత్రంతోపాటు ఐక్యరాజ్యసమితి చార్టర్లో పేర్కొన్న సూత్రాలు, ప్రయోజనాలకు తమ కట్టుబాటును ప్రకటించాయి.
56.ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఇండియా 2021–23 పదవీ కాలాన్ని రష్యా అభినందించింది. యుఎన్ఎస్సిలో ఇండియా ప్రాధాన్యతలు, సంస్కరణలతో కూడిన మల్టీలేటరలిజం, ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వాటిని రష్యా అభినందించింది. యుఎన్ఎస్సిలో ఇండియా ఉండడం ఐక్యరాజ్యసమితి ముందున్న పలుకీలక అంశాలను మరింత సమన్వయం చేయడానికి దొరికిన అద్భుత అవకాశంగా ఉభయపక్షాలు ప్రముఖంగా పేర్కొన్నాయి.
57. 2023లో ఇండియా అధ్యక్షతన జి 20 లో, ముఖ్యంగా ‘‘ వసుధైవ కుటుంబకం’’లేదా ‘‘ఒక భూమి, ఒక కుటుంబం,ఒక భవిష్యత్తు” నినాదాలు, అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన సుస్థిరాభివృద్ధికి జీవన విధానాలు (ఎల్.ఐ.ఎఫ్.ఇ) వంటి వాటి విషయంలో ఫలవంతమైన సహకారం గురించి ఉభయపక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జి 20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా అత్యంత సమర్ధంగా నిర్వహించినందుకు హిజ్ ఎక్సలెన్సీ శ్రీ వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ జి20 సమావేశాలు అందరికీ న్యాయం, సమానత్వంతో కూడిన అభివృద్ధికి నొక్కిచెప్పాయని అన్నారు. ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డిపిఐ) వంటి వాటికి మద్దతునిస్తూనే మానవ కేంద్రిత అభివృద్ధికి ఇది పెద్దపీట వేసిందని పుతిన్ పేర్కొన్నారు.ఇది బహుళపక్షవిధానంపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. ఇండియా జి 20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడంలో రష్యా నిరంతర మద్దతును భారత్వైపునుంచి ప్రశంసించారు.
58. ఇండియా జి 20 అధ్యక్ష బాధ్యతల సందర్భంగా అంతర్జాతీయ ఆర్ధిక, ద్రవ్య సహకార ముఖ్య ఎజెండాలో, గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను సుస్థిరపరచడంతోపాటు, ఫోరం పూర్తి స్థాయి మెంబర్ల జాబితాలో ఆఫ్రికన్ యూనియన్ను తీసుకువచ్చిన విషయాన్ని ఉభయపక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మేళనాలను 2023 జి 20 అధ్యక్షబాధ్యతలలో ఇండియా ఉన్నప్పుడు నిర్వహించడాన్ని ఉభయపక్షాలు స్వాగతించాయి. బహుళ ధ్రువ ప్రపంచ విధానం రూపకల్పనకు ఇది ముఖ్యమైన సందేశాన్ని పంపిందని ,ఇది ప్రపంచ వ్యవహారాలలో వర్ధమాన దేశాల పాత్రను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్ధిక సవాళ్లకు సమిష్టి పరిష్కారం సాధించేందుకు , క్లైమేట్ ఫైనాన్స్ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, న్యూఢిల్లీ జి20 లీడర్స్ గ్రీన్ డవలప్మెంట్ డిక్లరేషన్ లో పేర్కొన్న సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు , అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలలో న్యాయమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు , ప్రత్యేకించి మల్టీలేటరల్ డవలప్మెంట్ బ్యాంకులలో సంస్కరణలకు కృషిచేసేందుకు జి20 పరిధికి లోబడి తమ మధ్య సహకారాన్ని బలోపతేం చేసుకునేందుకు ఉభయపక్షాలు అంగీకరించాయి.
59. బ్రిక్స్కు లోబడి తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సన్నిహిత సమన్వయాన్ని బలోపేతం చేసుకోవలసిన ప్రాధాన్యతను ఉభయదేశాలు నొక్కి చెప్పాయి. బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్యను విస్తృతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉభయదేశాలు స్వాగతించాయి. ఈ నిర్ణయాన్ని జోహెన్నెస్ బెర్గ్లో జరిగిన 15 వ సమావేశంలో తీసుకున్నారు.బ్రిక్స్స్పూర్తికి కట్టుబడి పరస్పర గౌరవం, అవగాహన, సమానత్వం, సంఘీభావం, స్వేచ్చాతత్వం, సమ్మిళితత్వం, ఏకాభిప్రాయం వంటి వాటిపట్ల నిబద్దతను ప్రకటించాయి. బ్రిక్స్ సహకారాన్ని మరింత పటిష్ట పరుచుకుంటూ దీనిని కొనసాగించడానికి, బ్రిక్స్లోకి కొత్త సభ్యులను నిరంతరాయంగా చేర్చుకోవడానిఇక, బిక్స్ భాగస్వామ్య దేశం నమూనాను ఏర్పాటు చేసేందుకు తగిన విధి విధానాల రూపకల్పనకు ఉమ్మడి కృషి చేయడానికి ఉభయ దేశాలు అంగీకరించాయి. 2024లో రష్యా అధ్యక్షతన చేపట్టే ప్రాధాన్యతలకు ఇండియా మద్దతు ప్రకటించడం పట్ల రష్యా కృతజ్ఞతలు తెలిపింది.
60. విస్తృతమైన బ్రిక్స్ కుటుంబంలోకి కొత్త సభ్య దేశాలకు ఇరుపక్షాలు ఆహ్వానం పలికాయి. కేవలం ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేసే ఇతివృత్తంగా 2024 లో రష్యా బ్రిక్స్ అధ్యక్ష స్థానానికి భారతదేశం పూర్తి మద్దతు తెలియజేసింది. 2024 అక్టోబర్‌లో కజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్ విజయవంతానికి కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి.
61. రష్యా, భారతదేశం మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి షాంఘై సహకార సంస్థ చట్రంలో ఉమ్మడిగా పనిచేయడం ముఖ్యమని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
62. తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరిహద్దు వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత సవాళ్ళను ఎదుర్కోవడం వంటి కీలక రంగాలపై ఎస్సిఓలో తమ ఫలవంతమైన సహకారం పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేసాయి. 2022-23 నాటి భారతదేశ ఎస్సిఓ ఛైర్‌షిప్‌ను రష్యా ప్రశంసించింది. ఎస్సిఓలో సహకారం విస్తృత రంగాలకు కొత్త ఊపును అందించాయని రష్యా కితాబు ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో, స్థిరమైన, బహుళ ధ్రువ ప్రపంచ క్రమం ఏర్పాటులో పెరిగిన ఎస్సిఓ పాత్రను వారు స్వాగతించారు. వారు ఇరాన్, బెలారస్‌లను ఎస్సిఓ కొత్త సభ్యులుగా స్వాగతించారు. అంతర్జాతీయ రంగంలో ఎస్సిఓ పాత్రను పెంపొందించడం, ఐక్యరాజ్య సమితి, దాని ప్రత్యేక ఏజెన్సీలతో అలాగే ఇతర బహుపాక్షిక సంస్థలు, సంఘాలతో సంస్థ పరిచయాల సమగ్ర అభివృద్ధికి ఇరుపక్షాలు మద్దతు ఇస్తాయి.
కౌంటర్ టెర్రరిజం
63. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, అది తీవ్రంగా ఖండించదగ్గది అని నాయకులు నిర్ద్వంద్వంగా వెల్లడించారు. సరిహద్దులలో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసే నెట్‌వర్క్‌లు, సురక్షిత స్థావరాలు ఇలా అన్ని ఉగ్రవాద చర్యలను వారు ఖండించారు. 2024 జూలై 8న జమ్మూ, కాశ్మీర్‌లోని కతువా ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై, జూన్ 23న డాగేస్తాన్‌లో, మార్చి 22న మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై జరిగిన తీవ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడులు భయంకరమైన గుర్తులని అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ పటిష్టమైన ప్రాతిపదికన రహస్య ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడం వంటి ప్రాముఖ్యతలను ఇరు పక్షాలు ప్రస్తావించాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, తీవ్రవాదం, అవి ఏ రూపంలో ఉన్నా, రాజీలేని పోరాటానికి ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా, యుఎన్ భద్రతా మండలి, యుఎన్ జనరల్ అసెంబ్లీ సంబంధిత తీర్మానాలను గట్టిగా అమలు చేయవలసిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు, అలాగే యుఎన్ గ్లోబల్ కౌంటర్-టెర్రరిజం వ్యూహాన్ని అమలుపై కూడా ఇరు పక్షాలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాయి.
64. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశాలు, తమ సమర్థ అధికార వ్యవస్థల ప్రాథమిక బాధ్యతను ఉటంకిస్తూ, ఉగ్రవాద సవాళ్ల నిరోధం, వాటిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం తమ బాధ్యతలను పూర్తిగా పాటించాలని ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. తీవ్రవాదాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసాయి. ఐక్యరాజ్య సమితి విధాన చట్రం లోబడి అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒడంబడికను త్వరితగతిన ఖరారు చేయడం, ఆమోదించడంపై ఇరు పక్షాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యుఎన్ జిఏ, యుఎన్ ఎస్సి తీర్మానాలను అమలు చేయాలని పిలుపునిచ్చాయి.
65. ఉగ్రవాదాన్ని ఏ మతంతో, జాతీయతతో, నాగరికతతో లేదా జాతితో ముడిపెట్టరాదని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారందరినీ, వారి మద్దతుదారులను అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యులను చేసి న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని నేతలు పునరుద్ఘాటించారు.
66. సిటిసి భారత అధ్యక్షతన అక్టోబర్ 2022లో భారతదేశంలో జరిగిన యుఎన్ ఎస్సి కౌంటర్ టెర్రరిజం కమిటీ (సిటిసి) ప్రత్యేక సమావేశాన్ని ఇరుపక్షాలు ఎంతో మెచ్చుకున్నాయి. ఉగ్రవాదులు తమ ప్రయోజనాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఎదుర్కోవడంపై ఏకగ్రీవంగా ఆమోదించిన ఢిల్లీ ప్రకటనను స్వాగతించారు. పేమెంట్ టెక్నాలజీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, నిధుల సేకరణ పద్ధతులు, మానవరహిత వైమానిక వాహనాల (యుఏవి లేదా డ్రోన్‌లు) దుర్వినియోగం వంటి సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉగ్రవాద దోపిడీకి సంబంధించిన ప్రధాన ఆందోళనలను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రకటన లక్ష్యం అని వారు పేర్కొన్నారు.
67. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడం, మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
68. 2016 అక్టోబర్ 15 నాటి అంతర్జాతీయ సమాచార భద్రత సహకార ఒప్పందం ఆధారంగా ఐసీటీల ఉపయోగంలో భద్రతా రంగంలో సమాలోచనలను బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. రాష్ట్రాల సమానత్వం, వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి సార్వభౌమాధికార సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు స్పష్టమైన అభిప్రాయాన్ని గట్టిగ వెల్లడించాయి. ఈ దిశగా ఇరు పక్షాలు సార్వత్రిక అంతర్జాతీయ చట్టపరమైన సాధనాలను అవలంబించాలని, ఐసీటీ నేరాలను ఎదుర్కోవడంలో సమగ్ర సమావేశంతో సహా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రయత్నాలను స్వాగతించాలని కోరాయి.
69. బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక సుస్థిరత సమస్యలతో సహా, బాహ్య అంతరిక్షం శాంతియుత ఉపయోగాల పై యుఎన్ కమిటీ (యుఎన్ కోపస్)లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
70. సామూహిక విధ్వంసక ఆయుధాల వ్యాప్తి నిరోధానికి ప్రపంచ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వానికి రష్యా తన బలమైన మద్దతును తెలియజేసింది. ప్రపంచ శాంతి భద్రతలను పెంపొందించడానికి, పరస్పర విశ్వాసం స్థాయిని పెంపొందించే దిశగా అంతర్జాతీయ సమాజంలోని సభ్యులందరూ కృషి చేయాలని ఇరుపక్షాలు కోరాయి.
71. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ), కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ), ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసిఏ)లో రష్యా చేరడం కోసం భారతదేశం సానుకూల వైఖరిని అవలంబించింది.
72. ఇరు దేశాల భద్రతా మండలి మధ్య చర్చల విధానంతో సహా ఆఫ్ఘనిస్తాన్‌పై భారతదేశం, రష్యా మధ్య సన్నిహిత సమన్వయాన్ని ఇరుపక్షాలు ప్రశంసించుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితి, ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఉగ్రవాదం, రాడికలైజేషన్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమస్యలతో సహా ఇరుపక్షాలు చర్చించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఉగ్రవాదం, యుద్ధం, మాదకద్రవ్యాల నుండి స్వతంత్ర, ఐక్య, శాంతియుత రాజ్యంగా ఇరు పక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. ఆ దేశం పొరుగువారితో శాంతితో జీవించడం, ఆఫ్ఘన్ సమాజంలోని అత్యంత దుర్బలమైన వర్గాలతో సహా ప్రాథమిక మానవ హక్కులు, స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని నిర్ధారించడం వంటివి దీనిలో కొన్ని అంశాలు. ఆఫ్ఘన్ పరిష్కారాన్ని సులభతరం చేయడానికి మాస్కో నమూనా సమావేశాల ముఖ్యమైన పాత్రను వారు నొక్కిచెప్పారు.
73. అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులు, ప్రత్యేకంగా ఐఎస్ఐఎస్, ఇతర గ్రూపుల తీవ్రవాద వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను ఇరు పక్షాల నాయకులు స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరాటం సమగ్రంగా, ప్రభావవంతంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి రాజకీయ డిమాండ్లు లేకుండా ఆఫ్ఘన్ ప్రజలకు అత్యవసరమైన, నిరంతరాయంగా మానవతా సహాయం అందించాల్సిన అవసరాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
74. ఇరు పక్షాల మధ్య చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ చుట్టూ ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఇరుపక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, సంపూర్ణంగా, యుఎన్ చార్టర్ ఆధారంగా సంఘర్షణను శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంతో మధ్యవర్తిత్వం, మంచి సంబంధాలు స్థాపన ప్రతిపాదనలపై వారు సానుకూలంగా స్పందించారు.
75. గాజాపై ప్రత్యేక దృష్టి సారించిన ఇరు పక్షాలు, మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో వారు సంబంధిత యుఎన్ జిఏ తీర్మానాలు, యుఎన్ ఎస్సి తీర్మానం 2720ని సమర్థవంతంగా అమలు చేయాలని, గాజా స్ట్రిప్ అంతటా ఉన్న పాలస్తీనా పౌరులకు నేరుగా మానవతా సహాయాన్ని తక్షణమే సురక్షితంగా, అడ్డంకులు లేకుండా అందించాలని పిలుపునిచ్చాయి. శాశ్వత స్థిరమైన కాల్పుల విరమణ కోసం యుఎన్ ఎస్సి తీర్మానం 2728ని సమర్థవంతంగా అమలు చేయాలని కూడా వారు పిలుపునిచ్చారు. బందీలుగా ఉన్న వారందరినీ తక్షణం, షరతులు లేకుండా విడుదల చేయాలని అలాగే వారి వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించడానికి మానవతా ప్రాప్తి కోసం పిలుపునిచ్చారు. వారు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రాతిపదికన రెండు-రాష్ట్రాల పరిష్కార సూత్రానికి తమ అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
76. సమానమైన, అవిభాజ్యమైన ప్రాంతీయ భద్రత వ్యవస్థను నిర్మించడానికి, ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, గ్రేటర్ యురేషియన్ స్పేస్ లో, భారతీయ, పసిఫిక్ మహాసముద్రాల ప్రాంతాలలో ఏకీకరణ, అభివృద్ధి కార్యక్రమాల మధ్య పరిపూరకమైన సంప్రదింపులను తీవ్రతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
77. తూర్పు ఆసియా సమ్మిట్, ఆసియాన్ రీజినల్ ఫోరమ్ ఆన్ సెక్యూరిటీ (ఏఆర్ఎఫ్), ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడిఎంఎం-ప్లస్)తో సహా ప్రాంతీయ శాంతి భద్రతలను మరింతగా పెంచే లక్ష్యంతో వివిధ ప్రాంతీయ వేదికల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి.
78. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను విస్తరించడం, వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యుఎన్ ఎఫ్సిసిసి), పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించడం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి. ఈ విషయంలో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గార కోటా విధానాలు, ఆపరేషన్‌పై అనుభవ మార్పిడి, ఈ రంగంలో రష్యా-భారత ఉమ్మడి పెట్టుబడి ప్రాజెక్టుల అమలుతో సహా తక్కువ-కార్బన్ అభివృద్ధి, అలాగే స్థిరమైన మరియు "గ్రీన్" ఫైనాన్సింగ్, వాతావరణ మార్పులను నిరోధించడం, దానికి అనుగుణంగా ఉండే రంగంలో సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
79. అంతర్జాతీయ సరఫరా గొలుసుల సుస్థిరతను పెంపొందించడం, పునరుద్ధరణను అభివృద్ధి చేయడం, స్వేచ్ఛా, సరసమైన వాణిజ్య నియమాలను పాటించడం, వాతావరణ మార్పు వంటి కీలక అంశాలపై జి20, బ్రిక్స్, ఎస్సిఓ లో సమాలోచనలు కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 2024లో బ్రిక్స్‌లో రష్యన్ ఛైర్‌షిప్‌లో ఎన్విరాన్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ విధాన చట్రంలో వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై బ్రిక్స్ కాంటాక్ట్ గ్రూప్ ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు.
80. భారతదేశం-రష్యా సాహసోపేతమైన ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం, వారి విదేశాంగ విధాన ప్రాధాన్యతల ఏకీకృత, పరిపూరకరమైన విధానాలను ఇరుపక్షాలు సానుకూలంగా గుర్తించాయి. దానిని మరింత బలోపేతం చేయడం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. భారతదేశం, రష్యాలు ప్రధాన శక్తులుగా ప్రపంచ శాంతి, బహుళ ధ్రువ ప్రపంచంలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాయని వారు స్పష్టం చేసారు.
81. రష్యా అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ మాస్కోలో తనకు తన ప్రతినిధి బృందానికి మర్యాదపూర్వకమైన ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేసారు. 2025 లో జరిగే 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాని ఆహ్వానించారు.
***
(Release ID: 2033926)
Visitor Counter : 111
Read this release in:
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
English
,
Marathi
,
Malayalam