పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

వాయు నాణ్యత, వాతావరణ మార్పులు, అడవులు, సహజ వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు, వన్యప్రాణులు అంశాలుగా భారత్ భూటాన్ ద్వైపాక్షిక భేటీ

Posted On: 12 JUL 2024 11:38AM by PIB Hyderabad

భూటాన్ దేశ ఇంధన సహజ వనరుల శాఖ మంత్రి శ్రీ జెమ్ షెరింగ్ నేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధి బృందం, కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి  శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ తో సమావేశమై,  వాయు నాణ్యత, వాతావరణ మార్పులు, అడవులు, సహజ వనరులు, వన్యప్రాణులు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాలకి సంబంధించిన అంశాలను చర్చించారు.

మన దేశం ప్రారంభించిన ‘బిగ్ క్యాట్ అలయన్స్’ కూటమిలో సభ్య దేశంగా చేరినందుకు భూటాన్  మంత్రికి   శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ కృతజ్ఞతలు తెలియచేసారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల పరంగానే కాక, ప్రజాస్వామిక విలువల పరంగా కూడా ఇరు దేశాలు ఒకే రకమైన పరిస్థితులని/దృక్కోణాన్ని కలిగి ఉన్నాయని మంత్రి అన్నారు. వాతావరణ మార్పులు ఇరు దేశాలకు కలవరపాటు కలిగించే అంశమేనని అన్నారు.

ఏప్రిల్ 2024లో పారో పట్టణంలో పులుల సంరక్షణ ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ‘సస్టెయినబుల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్ కాన్ఫరెన్స్’ సదస్సును విజయవంతంగా నిర్వహించామని శ్రీ  షెరింగ్ వెల్లడించారు. కర్బన ఉద్గారాల విడుదలలో తమ దేశం ‘కార్బన్ నెగిటివ్’ స్థాయిలోనే ఉందని, తమ ముఖ్య ఇంధన వనరు జలవిద్యుత్తని పేర్కొన్నారు. 

వాతావరణ మార్పు, వాయు నాణ్యత, వన్యప్రాణుల సంరక్షణ/నిర్వహణ, పర్యావరణ/వాతావరణ మార్పుల రంగాల్లో వనరుల అభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ( జే.డబ్ల్యూ.జీ.) ను ఏర్పాటు చేయగలమని భారత్ చెప్పింది. 

***



(Release ID: 2032924) Visitor Counter : 63