ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ నెల 13న ముంబైలో ప్రధానమంత్రి పర్యటన
ఈ మహానగర పరిధిలో రూ.29,400 కోట్లకుపైగా విలువైన
వివిధ ప్రాజెక్టుల ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన;
థానే-బొరివలి జంట సొరంగం ప్రాజెక్టుసహా గోరెగాఁవ్-ములుంద్
లింక్ రోడ్ ప్రాజెక్ట్ వద్ద సొరంగం పనులకు శంకుస్థాపన;
నవీ ముంబైలో కల్యాణ్ యార్డ్ పునర్నవీకరణ.. గతి శక్తి
బహుళ సరకు రవాణా కూడలి నిర్మాణానికి శంకుస్థాపన;
లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద కొత్త ప్లాట్‌ఫామ్‌లు సహా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లో నం.10/11 ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ జాతికి అంకితం;
రూ.5,600 కోట్ల అంచనా వ్యయంతో ‘ముఖ్యమంత్రి
యువ కార్య ప్రశిక్షణ్ యోజన’కు ప్రధాని శ్రీకారం;
ముంబైలో ‘ఇండియన్ న్యూస్ సర్వీస్’ (ఐఎన్ఎస్) టవర్లకు ప్రారంభోత్సవం;
Posted On:
12 JUL 2024 5:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 13వ తేదీన ముంబై నగరంలో పర్యటిస్తారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని గోరెగాఁవ్‌లో నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ రహదారులు, రైల్వేలు, ఓడరేవుల రంగాలకు సంబంధించి రూ.29,400 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:00 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌కు వెళ్లి, ‘ఐఎన్ఎస్’ టవర్లను ప్రారంభిస్తారు.
అనంతరం థానే-బొరివలి మధ్య రూ.16,600 కోట్లతో నిర్మించే జంట సొరంగం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ జంట సొరంగం థానే-బొరివలి మధ్యగల సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ దిగువగా వెళ్తుంది. ఇది బొరివలి వైపున్న పశ్చిమ ఎక్స్ ప్రెస్ హైవేతో థానే వైపుగల థానే ఘోడ్‌బందర్ రోడ్డుతో నేరుగా అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు పొడవు 11.8 కిలోమీటర్లు కాగా, దీనివల్ల థానే-బొరివలి మధ్య దూరం 12 కిలోమీటర్లు తగ్గడంతోపాటు గంటదాకా ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
అలాగే గోరెగాఁవ్-ములుంద్ లింక్ రోడ్ (జిఎంఎల్ఆర్) ప్రాజెక్ట్ వద్ద రూ.6,300 కోట్లతో నిర్మించే సొరంగం పనులకు శంకుస్థాపన ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది
గోరేగావ్ వద్ద పశ్చిమ ఎక్స్ ప్రెస్ హైవేతో ములుంద్ వద్ద తూర్పు ఎక్స్ ప్రెస్ హైవేని అనుసంధానిస్తుంది. ‘జిఎంఎల్ఆర్’ పొడవు సుమారు 6.65 కిలోమీటర్లు కాగా, దీనివల్ల నవీ ముంబై, పూణే ముంబై ఎక్స్ ప్రెస్‌వే వద్ద ప్రతిపాదిత కొత్త విమానాశ్రయంతో పశ్చిమ శివారు ప్రాంతాలకు ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుంది.
నవీ ముంబైలోని తుర్భేలో కల్యాణ్ యార్డ్ పునర్నవీకరణ, గతిశక్తి బహుళ సరకు రవాణా కూడలికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. సుదూర-శివారు రవాణాను విభజించడంలో కల్యాణ్ యార్డ్ తోడ్పడుతుంది. అలాగే ఈ పునర్నిర్మాణంతో మరిన్ని రైళ్ల నిర్వహణ దిశగా యార్డ్ సామర్థ్యం పెరుగుతుంది. రద్దీ తగ్గడంతోపాటు రైలు కార్యకలాపాల సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తం 32,600కుపైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ కూడలి ద్వారా స్థానికులకు అదనపు ఉపాధి అవకాశాలు అందివస్తాయి. అంతేగాక సిమెంటు, ఇతర సరకుల నిర్వహణకు అదనపు వెసులుబాటు లభిస్తుంది.
లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద కొత్త ప్లాట్‌ఫామ్‌లతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లో నం.10/11 ప్లాట్‌ఫామ్‌ల విస్తరణను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ రెండు కొత్త పొడవైన ప్లాట్‌ఫామ్‌లతో మరింత పొడవైన రైళ్ల నిర్వహణకు అదనపు సదుపాయం సమకూరుతుంది. దీంతోపాటు ప్రతి రైలులో మరింత ఎక్కువ మంది ప్రయాణికులకు వెసులుబాటు లభిస్తుంది. అలాగే రైళ్ల రాకపోకల పెరుగుదలకు తగినట్లు స్టేషన్ నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లోని 10, 11 ప్లాట్‌ఫామ్‌లు శుభ్రం చేయదగిన యాప్రాన్ సహా 382 మీటర్ల మేర పొడిగించబడ్డాయి. దీంతో 24 కోచ్‌ల పొడవైన రైళ్లను వీటిలో నిలిపే వీలుంటుంది కాబట్టి, ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 5600 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనున్న ‘ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ్ యోజన’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ప్రవేశపెడుతున్న పరివర్తనాత్మక శిక్షణార్థి పథకమిది. దీనికింద 18-30 ఏళ్ల మధ్యగల యువతకు నైపుణ్యం పెంపుతోపాటు పరిశ్రమల్లో ఉపాధి పొందగలిగే అవకాశాలు లభిస్తాయి.
ఈ కార్యక్రమాలన్నిటిలో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌ను ప్రధానమంత్రి సందర్శిస్తారు. అక్కడ కొత్తగా నిర్మించిన ‘ఐఎన్ఎస్’ టవర్లను ఆయన ప్రారంభిస్తారు. ‘ఐఎన్ఎస్’ సభ్యత్వం ఉన్న సంస్థల భవిష్యత్ అవసరాలకు తగిన సమర్థ, ఆధునిక కార్యాలయ సదుపాయాలు ఈ కొత్త భవనాల్లో లభ్యమవుతాయి. తద్వారా ముంబైలోని పత్రికా ప్రచురణ పరిశ్రమకు ఈ కేంద్రం జీవనాడిగా రూపొందుతుంది.
***
(Release ID: 2032917)
Visitor Counter : 63
Read this release in:
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam