వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ప్రభావితమైన వినియోగదారులకు బుకింగ్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆన్‌లైన్ ప్రయాణ వేదిక ‘యాత్ర’ను ఆదేశించిన కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ


‘యాత్ర’ ద్వారా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న రూ. 2.5 కోట్లు, వినియోగదారులకు దాదాపు రూ. 23 కోట్ల చెల్లింపు

వినియోగదారుల ఫిర్యాదుల నిరంతర పరిష్కారం కోసం ఏజెన్సీ ద్వారా ఐదుగురు నిపుణులను నియమించిన జాతీయ వినియోగదారీ హెల్ప్ లైన్

Posted On: 09 JUL 2024 12:04PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా రద్దు చేసిన విమాన టికెట్ల ధరలను తిరిగి చెల్లించకపోవడంపై పలు ఫిర్యాదులు దాఖలైనట్టు, విమానయాన సంస్థల నుంచి చెల్లింపులు వాపసు రాలేదని ప్రయాణ సంస్థలు తమకు చెప్పాయని వినియోగదారులు ఆరోపించినట్టు జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (1915-టోల్ ఫ్రీ నంబర్) ద్వారా కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ (సీసీపీఏ)  దృష్టికి వచ్చింది.

ప్రవాసీ న్యాయవిభాగం వర్సెస్ భారత యూనియన్ (W.P.(C)D.No.10966 of 2020) కేసులో 2020 అక్టోబరు 1న ఉన్నత న్యాయస్థానం తన తీర్పులో కింది విధంగా ఆదేశించింది:

" లాక్డౌన్ సమయంలో ప్రయాణం కోసం ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్లు ముందస్తుగా నమోదు చేసుకుని ఉంటే, అలాంటి అన్ని సందర్భాల్లో విమానయాన సంస్థలు చెల్లింపులను వెంటనే పూర్తిగా వాపసు చేయాలి. వాటికి సంబంధించి, ఆ మొత్తాన్ని ఏజెంట్ ద్వారా వెంటనే ప్రయాణికులకు బదిలీ చేయాలి.".

పై అంశాల నేపథ్యంలో, కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా రద్దు చేసిన విమాన టిక్కెట్లకు సంబంధించి చెల్లింపులను తిరిగి ఇవ్వకపోవడంతో యాత్ర’పై సీసీపీఏ సుమోటోగా  చర్యలు చేపట్టింది.

కోవిడ్ -19 వల్ల ప్రభావితమైన టికెట్ నమోదులకు సంబంధించి తిరిగి చెల్లింపుల్లో అపరిష్కృత అంశాలకు సంబంధించి ఆ ప్రయాణ కంపెనీకి 09.03.2021న షోకాజ్ నోటీసు పంపింది. దానికి అనుగుణంగా సీసీపీఏ ఆ సంస్థపై విచారణలు నిర్వహించి, వినియోగదారులకు చెల్లింపుల వాపసులలో పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తున్నది.

2021 జూలై 8 నుంచి 2024 జూన్ 25 వరకు సీసీపీఏ ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక విచారణలు నిర్వహించింది. ఈ చర్యల ఫలితంగా, చెల్లింపు వాపసుల్లో పెండింగ్ సంఖ్యను తగ్గించడంలో ‘యాత్ర’ ఆన్ లైన్ లిమిటెడ్ విశేష పురోగతి సాధించింది. 2021లో రూ. 26,25,82,484 విలువైన 36,276 నమోదు/బుకింగ్లు పెండింగ్ లో ఉన్నాయి. 2024 జూన్ 21 నాటికి ఈ సంఖ్య గణనీయంగా 4,837 బుకింగులకు తగ్గగా, వాటి విలువ రూ.2,52,87,098గా ఉంది. ‘యాత్ర’ వినియోగదారులకు దాదాపు 87% మొత్తాన్ని తిరిగి చెల్లించింది. పెండింగ్‌లో ఉన్న మిగతా 13 శాతం వాపసుల మొత్తాన్నీ విమానయాన సంస్థల ద్వారా సత్వరమే తిరిగి చెల్లించేలా చర్యలు చేపడుతున్నది.

2021లో విమానయాన సంస్థలకు సంబంధించి మొత్తం 5,771 నమోదులు అపరిష్కృతంగా ఉండగా, రూ.9,60,14,463 వాపసు కోసం పెండింగులో ఉన్నాయి. 2024 నాటికి ‘యాత్ర’ విమానయాన సంస్థలను 98కి తగ్గించగా, రూ.31,79,069 బకాయి ఉంది. 2024 జూన్ 27 నాటి ఉత్తర్వుల ద్వారా వినియోగదారులకు రూ.31,79,069 త్వరగా తిరిగి చెల్లించాలని ‘యాత్ర’లోని మిగిలిన 22 విమానయాన సంస్థలను సీసీపీఏ ఆదేశించింది.

మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఇక్సిగో, థామస్ కుక్ వంటి అనేక ఇతర ప్రయాణ వేదికలు సీసీపీఏ ఎదుట జరిగిన విచారణ సందర్భంగా కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా టిక్కెట్లు నష్టపోయిన వినియోగదారులకు మొత్తాన్ని వాపసు చేశాయి.

వినియోగదారులకు చెల్లింపుల వాపసులను సకాలంలో చేయడం కోసం, 2024 జూన్ 27న సీసీపీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (ఎన్ సీహెచ్)లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆ ఆదేశాల్లో ‘యాత్ర’ను ఆదేశించింది. ముఖ్యంగా, కోవిడ్-19 లాక్డౌన్ తో ముడిపడి ఉన్న విమానాల రద్దు కారణంగా పెండింగులో ఉన్న వాపసులను అందజేస్తామని తెలియజేస్తూ మిగతా 4,837 మంది ప్రయాణికులకు ఫోన్ ద్వారా తెలియజేయడానికి జాతీయ హెల్ప్ లైన్ లో ప్రత్యేకంగా ఐదుగురిని యాత్ర కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు సిబ్బంది నియామకానికి అయ్యే వ్యయాన్ని జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ ను నిర్వహించే ఏజెన్సీకి నేరుగా చెల్లింపులు చేయడం ద్వారా యాత్ర పూర్తిగా భరిస్తుంది.

సకాలంలో వాపసుల ప్రాధాన్యానికి సీసీపీఏ ఉత్తర్వు బలం చేకూరుస్తోంది. అపరిష్కృతంగా ఉన్న అన్ని బుకింగులకు పూర్తి పరిష్కారం లభించేలా తమ ఆదేశాలను పాటించాలని ‘యాత్ర’ను నిర్దేశించింది.

 

***



(Release ID: 2031761) Visitor Counter : 30