ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్ము, కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన అంతర్జాతీయ యోగ దినం వేడుకలలో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం

Posted On: 21 JUN 2024 9:11AM by PIB Hyderabad

యోగ కుధ్యానానికి నిలయం అయిన కశ్మీర్ కు అంతర్జాతీయ యోగ దినం నాడు నేను రావడం నా అదృష్టం.  కశ్మీర్ యొక్కశ్రీనగర్ యొక్క పరిసరాలు, శక్తిఇంకా అనుభవాలు యోగ నుండి లభించే శక్తిని మనం తెలుసుకొనే అవకాశాన్ని మనకు ఇస్తున్నాయి.  యోగ దినం సందర్భంగా దేశ ప్రజలందరితో పాటు ప్రపంచం లోని ప్రతి చోట యోగ సాధన చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలను నేను కశ్మీర్ గడ్డ మీద నుండి తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

అంతర్జాతీయ యోగ దినం పది సంవత్సరాల చరిత్రాత్మకమైన యాత్రను ముగించింది.  అంతర్జాతీయ యోగ దినాన్ని జరుపుకొందాం అంటూ ఐక్య రాజ్య సమితి లో 2014 లో నేను ప్రతిపాదించాను.  భారతదేశం పెట్టిన ఈ ప్రతిపాదనను 177 దేశాలు బలపరిచాయి.  ఇది ఒక రికార్డు.  అప్పటి నుంచియోగ దినం కొత్త కొత్త రికార్డులను నెలకొల్పుతూ వస్తోంది.  2015లో, 35,000 మంది దిల్లీ లోని కర్తవ్య పథ్ లో జరిగిన యోగ సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆ ఘట్టం కూడా ప్రపంచ రికార్డును స్థాపించింది.  కిందటి ఏడాది, అమెరికా లో ఐ.రా.స. ప్రధాన కేంద్రం లో జరిగిన యోగ దినం సంబంధ కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది.  నూట ముప్ఫై కి పైగా దేశాల ప్రజలు ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.  యోగకు సంబంధించిన ఈ ప్రస్థానం నిరంతరాయంగా  సాగుతోంది.  భారతదేశంలో యోగ అభ్యాసకుల కోసం ఆయుష్ విభాగం ‘యోగ ధ్రువీకరణ మండలి’ని ఏర్పాటు చేసింది.  ప్రస్తుతం దేశంలో 100కు పైగా ప్రధాన సంస్థలు ఈ మండలి   గుర్తింపును దక్కించుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.  విదేశాలకు చెందిన పది ప్రధాన సంస్థలు కూడా ఈ మండలి నుండి గుర్తింపును అందుకొన్నాయి. 

మిత్రులారా,

ప్రపంచ వ్యాప్తంగా యోగ సాధనలో నిమగ్నమవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  యోగ అంటే ఆకర్షితులు అవుతున్న ధోరణి కూడా వృద్ధి చెందుతోంది.  యోగ వల్ల ప్రయోజనాలు ఏమిటనేది ప్రజలకు తెలిసిరావడం అధికం అవుతోంది.  ప్రపంచంలో ఏ మూలన అయినా సరే ప్రపంచ నేతలతో నేను భేటీ అయినప్పుడల్లా వారిలో దాదాపు గా ప్రతి ఒక్కరు యోగ ను గురించి నాతో మాట్లాడుతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా సీనియర్ నేతలు నాతో యోగ ను గురించి చర్చించడంతో పాటు ఎంతో కుతూహలంతో ప్రశ్నలు వేస్తూ ఉంటారు.  అనేక దేశాలలో ప్రజల దైనందిన జీవితంలో యోగ ఒక భాగంగా మారుతోంది.  2015లో తుర్క్ మెనిస్తాన్ లో ఒక యోగ సాధన కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి నాకు ఇంకా జ్ఞాపకం ఉంది.  యోగ అక్కడ ఎంతగానో ప్రజాదరణకు నోచుకొన్నది.  తుర్క్ మెనిస్తాన్ లో ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో యోగ ప్రధానమైన చికిత్స పద్ధతిని చేర్చడమైంది.  సౌదీ అరేబియా అయితే యోగను విద్య వ్యవస్థలోకి ప్రవేశపెట్టడమైంది.  మంగోలియా లో మంగోలియన్ యోగ ఫౌంఢేషన్ ఆధ్వర్యంలో అనేక యోగ పాఠశాలలు నడుస్తున్నాయి.  యోగ ను సాధన చేసే ధోరణి యూరోప్ లోని పలు దేశాలలో శరవేగంగా విస్తరిస్తున్నది.  ప్రస్తుతం జర్మనీ లో దాదాపు ఒకటిన్నర కోట్ల మంది యోగ సాధకులుగా మారిపోయారు.  ఫ్రాన్స్ కు చెందిన 101 ఏళ్ళ వయస్సున్న యోగ మహిళా టీచరు కు ఈ సంవత్సరం భారతదేశంలో పద్మ శ్రీ ని ఇచ్చిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.  ప్రపంచం అంతటా ప్రధాన సంస్థలువిశ్వవిద్యాలయాలు యోగ పై పరిశోధనలను నిర్వహించడంతో పాటు పరిశోధన పత్రాలను కూడా ప్రచురిస్తున్నాయి. 

 

మిత్రులారా,

గత పది సంవత్సరాలలో యోగ వ్యాప్తి యోగ తో ముడిపడిన దృక్పథం లో మార్పు ను తీసుకు వచ్చింది.  యోగ ప్రస్తుతం పరిమిత సరిహద్దులకు అతీతంగా ఉనికి లోకి వస్తున్నది.  ఒక కొత్త యోగ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడాన్ని ప్రపంచం గమనిస్తున్నది.  భారతదేశంలో రుషికేష్ మొదలుకొని కాశీ నుండి కేరళ వరకు యోగ ప్రధానమైన పర్యటన అనే ఒక కొత్త ధోరణిని గమనించవచ్చు.   ప్రపంచంలో అన్ని మూలల నుండి పర్యటకులు భారతదేశానికి వస్తున్నారు.  దీనికి కారణం వారు సరి అయిన పద్ధతులలో యోగను గురించి నేర్చుకోవాలని కోరుకుంటూ ఉండడమే.  యోగ రిట్రీట్ కార్యక్రమాలనుయోగ రిసార్ట్ లను ఏర్పాటుచేయడం జరుగుతోంది.  విమానాశ్రయాలలోహోటళ్ళలో అచ్చంగా యోగ కోసమంటూ విభాగాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది.  బజారులో యోగ సంబంధ సామగ్రినియోగ సాధకులు ధరించవలసిన ప్రత్యేకమైనటువంటి దుస్తులను విక్రయించడం జరుగుతోంది.  అనేక మంది వారి దేహ దారుఢ్యం కోసం వ్యక్తిగత యోగ శిక్షకుల నుంచి సేవలను అందుకోవడం కోసం కొంత రుసుముతో వారిని నియమించుకొంటున్నారు.  ఉద్యోగులకు వెల్ నెస్ ప్రధానమైన కార్యక్రమాలను అమలు పరచడంలో భాగంగా వ్యాపార సంస్థలు సైతం యోగతో పాటు మైండ్ ఫుల్ నెస్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నాయి.   ఇవన్నీ యువజనులకు నూతన అవకాశాలనుఉద్యోగాలను అందిస్తున్నాయి.

 

 

మిత్రులారా

 ఈ సంవత్సరం యోగ అంతర్జాతీయ దినం కోసం ‘‘వ్యక్తి కోసంసమాజం కోసం యోగ’’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేయడమైంది.  ప్రపంచం యోగను ప్రపంచ హితానికి ఉద్దేశించిన ఒక శక్తివంతమైన వాహకంగా భావిస్తున్నది.  గతం గురించిన ఆలోచనల భారం ఏదీ మనపైన పడకుండా మనం వర్తమానంలో జీవించేందుకు సహాయకారిగా యోగ ఉంటుంది.  యోగ మనలను మనం అర్థం చేసుకోవడానికిమన అంతరంగ భావాలతో మమేకం కావడానికి ఒక లంకెను అందిస్తుంది.  యోగ మనస్సునుశరీరాన్నిఆత్మను ఒక్కటిగా చేస్తుంది.  యోగ మన క్షేమం అనేది మన చుట్టూరా ఉన్న ప్రపంచం యొక్క క్షేమంతో సంబంధం కలిగినటువంటిదని మనం గ్రహించేటట్లు దోహదం చేస్తుంది.  మనం ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనం ప్రపంచం పైన కూడా సానుకూల ప్రభావాన్ని ప్రసరించ గలుగుతాం.

 

 

మిత్రులారా,

యోగ ఒక్క క్రమశిక్షణ యే కాకుండా అది ఒక విజ్ఞానశాస్త్రమని కూడా చెప్పాలి.  ఇప్పుడున్న సమాచార విప్లవకాలంలో అన్నివైపుల నుంచి సమాచార వనరులు వెల్లువెత్తుతుంటే ఒక అంశం పైన దృష్టిని కేంద్రీకరించడం అనేది మానవ మస్తిష్కానికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది.  దీనికి సైతం ఒక సమాధానాన్ని యోగ అందిస్తుంది.    మానవ మేధకు ఉన్న అత్యంత గొప్పదైన శక్తి ఏకాగ్రత అని మనకు తెలుసు.   ఈ సామర్థ్యాన్ని కూడా యోగ ద్వారాను, ధ్యానం ద్వారాను పెంపొందింప చేసుకోవచ్చు.  ఈ కారణంగా యోగను సైన్యం మొదలుకొని క్రీడల వరకు అనుసరించవలసిందంటూ సూచించడం జరుగుతోంది.  వ్యోమగాములకు వారి అంతరిక్ష కార్యక్రమ సంబంధ శిక్షణ లో యోగనుధ్యానాన్ని బోధించడం జరుగుతోంది.  ఇది పనితీరునుసహనశక్తిని వృద్ధి చేస్తుంది.  ప్రస్తుత కాలంలో అనేక జైళ్ళలో ఖైదీలు యోగ సాధన చేసేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని వల్ల వారు వారి మనస్సులలో సానుకూలమైన ఆలోచనల పైన దృష్టిని కేంద్రీకరించ గలుగుతారన్న మాట.  సమాజంలో సానుకూలమైన మార్పులకు యోగ బాటను పరుస్తోంది.

 

 

మిత్రులారా,

యోగ నుంచి లభించే ప్రేరణ మన సానుకూల ప్రయాసలకు బలాన్ని ఇస్తూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను. 

 

 

మిత్రులారా,

ఇవాళ వర్షం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురై, కాస్తంత ఆలస్యం జరిగింది. అయితే జమ్ముకశ్మీర్ లో ప్రత్యేకించి శ్రీనగర్ లో ప్రజలకు యోగ అంటే ఉన్న ఆకర్షణ ను మరియు ఉత్సాహాన్ని నేను నిన్నటి నుండే గమనించాను.  యోగాభ్యాసం లో పాలుపంచుకోవాలి అని వారు కుతూహల పడుతున్నారు.  ఇది జమ్ముకశ్మీర్ లో పర్యటనను పటిష్ట పరచేందుకు ఒక అవకాశాన్ని అందిస్తోంది.  ఈ కార్యక్రమం ముగిసిన తరువాత నేను యోగ సాధనలో పాల్గొన్న వారిని కలుసుకుని తీరుతాను.  వర్షం కారణంగా ఈ రోజున ఇక్కడి కార్యక్రమాన్ని మనం ఆపివేయవలసి వచ్చింది. అయితే ఈ యోగ కార్యక్రమం లో జమ్ముకశ్మీర్ లో యాభై వేల నుంచి అరవై వేల మంది దాకా పాల్గొనడం ఒక మహత్తరమైనటువంటి విజయం అని నేననుకుంటున్నాను.  జమ్ముకశ్మీర్ ప్రజలకు నేను అభినందనలను తెలియజేస్తున్నాను.  మరో సారి, యోగ దినం సందర్భం లో నేను మీ అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.  ప్రపంచ వ్యాప్తంగా యోగ ఔత్సాహికులకు ఇవే నా శుభాకాంక్షలు. 

 

మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. 

 

 

అస్వీకరణ: ప్రధాన మంత్రి సందేశానికి ఇది భావానువాదం. ఆయన హిందీ భాష లో ప్రసంగించారు.

 

 

***


(Release ID: 2031012) Visitor Counter : 45