మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పొగాకు రహిత విద్యా సంస్థల (టిఓఎఫ్ఈఐ) పై దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన విద్యా మంత్రిత్వ శాఖ

Posted On: 24 JUN 2024 4:29PM by PIB Hyderabad

భారత్‌లో నివారించదగిన మరణాలు, వ్యాధులకు ప్రధానమైంది పొగాకు వాడకం ఒకటి. దేశంలో ప్రతి ఏడాది దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు ఇది కారణమవుతుంది. పొగాకు వినియోగంలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జివైటిఎస్) 2019 ప్రకారం, దేశవ్యాప్తంగా 13 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థులలో 8.5 శాతం మంది వివిధ రూపాల్లో పొగాకును వినియోగిస్తున్నారు.

పాఠశాల భవనాలు, ప్రాంగణాల చుట్టు పక్కన ప్రాంతాల్లో వివిధ రకాల పొగాకు ఉత్పత్తులు సులభంగా లభ్యం కావడమే ఈ పరిస్థితికి దోహదపడే ప్రధాన కారకాలలో ఒకటిగా భావిస్తున్నారు.

జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్టిసిపి) లో భాగంగా, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిల్లలను, యువతను పొగాకు వాడకం నుండి రక్షించడానికి 'పొగాకు రహిత విద్యా సంస్థ (టిఓఎఫ్ఇఐ) మార్గదర్శకాల' ను జారీ చేసింది.

విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం పాఠశాలల కోసం "టిఓఎఫ్ఇఐ అమలు కరదీపిక" ను రూపొందించింది.  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవమైన 31 మే 2024 న దీనిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు టిఓఎఫ్ఇఐ మార్గదర్శకాలను పాటించేలా చేసి పొగాకు రహిత ప్రాంతాలుగా మార్చడమే దీని లక్ష్యం.

పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యాన్ని పెంపొందించడానికి, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి, పాఠశాలలు, సమీప ప్రాంతాల్లో ఈ క్రింది సూచనాత్మక కార్యకలాపాలను చేపట్టడం ద్వారా టిఓఎఫ్ఇఐ అమలు కరదీపిక ప్రకారం పొగాకు రహిత విద్యా సంస్థల (టిఓఎఫ్ఇఐ) మార్గదర్శకాలను తగిన రీతిలో పాటించాలని అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు వివరణాత్మక సలహాను జారీ చేశారు;
నిర్దేశిత వ్యక్తి సమాచారంతో, విద్యా సంస్థ ఆవరణలో 'పొగాకు రహిత స్థలం' అనే సూచిక బోర్డును ఏర్పాటు చేయాలి.
నిర్దేశిత వ్యక్తి సమాచారంతో విద్యాసంస్థ యొక్క ప్రవేశ ద్వారం/సరిహద్దు గోడ వద్ద "పొగాకు రహిత విద్యాసంస్థ" అనే సూచికను ప్రదర్శించాలి.
విద్యాసంస్థల ఆవరణలో సిగరెట్/బీడీలు లేదా పారేసిన గుట్కా/పొగాకు సంచులు, ఉమ్మివేసిన మరకలు వంటి పొగాకు వాడకానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండకూడదు.
విద్యా సంస్థల ఆవరణలో పొగాకు వల్ల కలిగే నష్టాలపై పోస్టర్, ఇతర అవగాహనా అంశాలను ప్రదర్శించాలి.
విద్యా సంస్థల్లో కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారి పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
'పొగాకు పర్యవేక్షకుడి' అభ్యర్థిత్వం, వారి పేర్లు, హోదా, ఫోన్ నెంబర్‌ను సూచిక బోర్డులో పేర్కొనాలి.
విద్యా సంస్థల ప్రవర్తనా నియమావళిలో "పొగాకు వాడక రహిత" మార్గదర్శకాలను చేర్చాలి.
విద్యాసంస్థ యొక్క ప్రహరీ గోడ/కంచె వెలుపలి పరిమితి నుండి 100 గజాల వైశాల్యాన్ని గుర్తించాలి.
  విద్యా సంస్థకు 100 గజాల పరిధిలో ఉన్న దుకాణాల్లో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు.
టిఓఎఫ్ఇఐ అమలు కరదీపిక అనుబంధం-III ప్రకారం పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలి.

వీధి నాటకాలు, వీడియో చిత్రాలు, స్వచ్ఛంద సంస్థలు, రిసోర్స్ పర్సన్లు మొదలైన వాటి ద్వారా పొగాకు వ్యసనంపై అవగాహన సందేశాలను వ్యాప్తి చేయడంలో పౌర సమాజం పాత్రను ఉద్ఘాటించారు. తదనుగుణంగా, పొగాకు నివారణ, వినియోగంపై అవగాహన కల్పించడానికి ప్రాంతాల్లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు, స్వచ్ఛంద సంస్థలను పాల్గొనేలా చేసేందుకు పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు, ఎన్ఎస్ఎస్ విద్యాంజలి-స్కూల్ వాలంటీర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది చొరవ తీసుకునే మార్గాలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.


టిఓఎఫ్ఇఐ మాన్యువల్‌ కోసం లింక్ క్లిక్ చేయండి: https://dsel.education.gov.in/sites/default/files/guidelines/im_tofel.pdf
 

****



(Release ID: 2028477) Visitor Counter : 32