వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎం కిసాన్ పథకం కింద ఈ నెల 18న వారణాసిలో 17వ విడత సొమ్ము రూ.20 వేల కోట్లను విడుదల చేయనున్న ప్రధాని
వివరాలు వెల్లడించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్‌సింగ్ చౌహాన్
30 వేల స్వయం సహాయక బృందాలకు కృషి సఖి పేరు మీద ధృవీకరణ పత్రాలను అందజేయనున్న ప్రధాని
Posted On:
15 JUN 2024 3:10PM by PIB Hyderabad
పిఎం కిసాన్ పథకం కింద ఈ నెల 18న వారణాసిలో 17వ విడత సొమ్ము రూ.20 వేల కోట్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయశాఖ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలందించారు. జూన్ 18న ప్రధాని వారణాసిలో పర్యటిస్తారని పీఎం కిసాన్ పథకం కింద 17 వ విడత ఆర్థిక సహాయం రూ.20 వేల కోట్లను విడుదల చేస్తారని కేంద్రమంత్రి వివరించారు. అంతే కాదు ఈ సందర్భంగా 30 వేల స్వయం సహాయక బృందాలకు కృషి సఖి సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్నిఉత్తరప్రదేశ్‌రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర వ్యవసాయశాఖ నిర్వహిస్తోందని కేందమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ సీఎం శ్రీ యోగి ఆదిత్యనాధ్‌తోపాటు పలువురు యూపీ మంత్రులు పాల్గొనబోతున్నారు.
కీలకమైన వ్యవసాయశాఖను తనకు అప్పగించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయశాఖను నిర్వహించే గురుతరమైన బాధ్యత లభించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పునాదిగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటికీ ఉపాధి అవకాశాలను ఎక్కువగా అందిస్తున్న రంగం వ్యవసాయమే అని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
దేశవ్యాప్తంగా గల లక్షలాది ఆహారధాన్యాల గోదాములను దేశ రైతులే నింపుతున్నారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని రైతుల సంక్షేమం కోసం గతంలో అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి అన్నారు. తాజాగా కూడా తమ ప్రభుత్వం రైతులకే ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మొదటి సంతకం రైతులకు 17 విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసే ఫైలుపైనే అని కేంద్ర మంత్రి అన్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల ద్వారా రూ.20 వేల కోట్లను రైతులకు పంపిణీ చేయడం జరుగుతోంది. వారణాసిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కడంద్వారా నిధుల పంపిణీ మొదలవుతుంది.
కేంద్రప్రభుత్వం రూపొందించిన కిసాన్ సమ్మాన్ నిధిని 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ భూమి కలిగిన రైతులందరికీ షరతుల ప్రకారం ఆర్థిక సాయం చేయడం జరుగుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఇంతవరకూ ఈ పథకం కింద 3.04 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ శివరాజ్ సింగ్ వివరించారు. తాజాగా చేయబోయే చెల్లింపులతో ఈ మొత్తం రూ.3.24 లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు.
రైతుల సౌభాగ్యాన్ని కోరుకుంటూ దేశాభివృద్ధికోసం చేసిన తీర్మాన విజయమనేది ఈ నెల 18న వారణాసిలో మొదలవుతున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎందుకంటే ఇదే రోజున పలువురు కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా వున్న 50 కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులతో సంభాషిస్తారని కేంద్ర మంత్రి వివరించారు. వ్యవసాయశాఖకు సంబంధించిన వివిధ పథకాలపై రైతుల్లో అవగాహన పెంచుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్ల మంది రైతులు పాల్గొంటారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వున్న 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, ఒక లక్షకుపైగాగల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐదు లక్షలకుపైగాగల ఉమ్మడి సేవా కేంద్రాలు పాల్గొంటాయని కేంద్ర మంత్రి వివరించారు. తద్వారా రైతుల్లో తగిన చైతన్యాన్ని నింపడం జరుగుతుందని అన్నారు.
మూడుకోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో వున్నారని వారిలో ఒక లక్షలమందిని ఇప్పటికే లక్షాధికారులను చేశారని శ్రీ శివరాజ్ సింగ్ అన్నారు. ఇంకా 2 రెండు కోట్ల మందిని లక్షాధికారులను చేయాల్సి వుంది. దానికి సంబంధించినదే కృషి సఖి అనే కార్యక్రమం అని ఆయన అన్నారు. దేశంలో అన్నదాతలకు సాయం చేయడంకోసం స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ పని చేయడం ద్వారా వారు ప్రతి ఏడాది అదనంగా 60నుంచి 80వేల రూపాయలు సంపాదించుకుంటారని ఆయన అన్నారు. పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్న సందర్భంగా ప్రధాని చేతుల మీదుగా కృషి సఖి సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరుగుతుందని అన్నారు. కృషి సఖి కార్యక్రమాన్ని మొదటి దశలో 12 రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నామని అన్నారు. అవి 1. గుజరాత్ 2. తమిళనాడు 3. ఉత్తర్ ప్రదేశ్ 4. మధ్యప్రదేశ్ 5. చత్తీస్ ఘడ్ 6. కర్నాటక 7. మహారాష్ట్ర 8. రాజస్థాన్ 9. ఒడిషా 10. జార్ఖండ్ 11. ఆంధ్రప్రదేశ్ 12. మేఘాలయ.
కృషి సఖీలకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు. తద్వారా వారు తమ తమ ప్రాంతాల్లోని రైతులకు సహాయకారులుగా వుంటారని ఆయన అన్నారు. రైతులకు ఆర్థిక సాయం చేయడం కోసం పిఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది 6 వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని , ఆ డబ్బును మూడు వాయిదాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చెల్లించడం జరుగుతోందని అన్నారు. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద 4 కోట్ల మందికిపైగా రైతులకు ఆర్థిక భద్రత చేకూర్చడం జరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరల్లోనే ఎరువులను అందిస్తున్నామని ఇందుకోసం రూ. 11 లక్షల కోట్ల రాయితీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.
పిఎం కిసాన్ కార్యక్రమాన్ని డీడీ ఛానెళ్లతోపాటు వివిధ సామాజిక మాధ్యమాలద్వారా ప్రసారమవుతుందని దేశవ్యాప్తంగా వున్న 5 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాల్లో చూడవచ్చని రైతులకు కేంద్రమంత్రి తెలిపారు.
మీడియా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజాతోపాటు డేర్ కార్యదర్శి శ్రీ హిమాన్షు పాఠక్ కూడా పాల్గొన్నారు.
****
(Release ID: 2025830)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada