పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అడవులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వేదిక 19వ సమావేశంలో అటవీ సంరక్షణ, సుస్థిర అటవీ నిర్వహణ కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించిన భారతదేశం

Posted On: 12 MAY 2024 11:18AM by PIB Hyderabad

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి  ప్రధాన కార్యాలయంలో 2024 మే 6 నుంచి 10 వరకు  జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ (యుఎన్ఎఫ్ఎఫ్) 19వ సమావేశంలో  భారతదేశం పాల్గొంది. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ, స్థిరమైన అటవీ నిర్వహణలో భారతదేశం సాధించిన  గణనీయమైన పురోగతిని భారత ప్రతినిధి బృందం వివరించింది.  భారతదేశం అమలు చేస్తున్న విధానాల వల్ల  గత పదిహేనేళ్లలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 2010- 2020 ల  మధ్య నమోదైన  సగటు వార్షిక అటవీ ప్రాంతం విస్తరణలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.

జీవ వైవిధ్యం,వన్యప్రాణుల సంరక్షణకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సంరక్షణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా  వెయ్యికి పైగా వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, టైగర్ రిజర్వ్‌లు, బయోస్పియర్ రిజర్వ్‌లు, ఇతర వన్యప్రాణుల ఆవాసాలు అభివృద్ధి చెందాయి. ఇటీవల భారతదేశంలో  అమలు జరుగుతున్న   ప్రాజెక్ట్ టైగర్‌కి 50 సంవత్సరాలు , ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌కు 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దేశంలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేసిన భారతదేశం వన్య జాతుల పరిరక్షణ, నివాస పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించింది. పెద్ద పిల్లి జాతికి చెందిన పులి, సింహం,  చిరుత,  మంచు చిరుత వంటి ఏడు పెద్ద పిల్లి జాతులను రక్షణ, సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్  బిగ్ క్యాట్ అలయన్స్ ను సమావేశంలో  భారతదేశం ప్రముఖంగా ప్రస్తావించింది. 

పర్యావరణ పరిరక్షణ  కార్యక్రమాలను మరింత పటిష్టం చేయడానికి  చెట్ల పెంపకం , క్షీణించిన అటవీ భూముల పునరుద్ధరణ కార్యక్రమాలను  ప్రోత్సహించేందుకు రూపొందించిన ‘గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్’ వివరాలను భారత ప్రతినిధి బృందం వివరించింది. 

గతంలో 2023 అక్టోబర్ లో  భారతదేశం డెహ్రాడూన్‌లో యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్  సహకారంతో నిర్వహించిన సమావేశంలో  40 దేశాలు, 20 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో   అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ , అటవీ ధృవీకరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశం సిఫార్సులను  యుఎన్ఎఫ్ఎఫ్ 19 వ సమావేశానికి  భారతదేశం సమర్పించింది.

  యుఎన్ఎఫ్ఎఫ్ 19 వ సమావేశంలో భాగంగా భూసార పరిరక్షణ కోసం అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నిర్వహణలో అంతర్జాతీయ సహకారం అనే అంశంపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. పోర్చుగల్, కొరియా అటవీ సేవలు, ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ (ITTO) ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ ఫైర్ మేనేజ్‌మెంట్ సహకారంపై  మంత్రిత్వ శాఖ సమావేశాన్ని  నిర్వహించింది. 

 అటవీ నిర్మూలన, అడవులు నశించి పోకుండా చూడడానికి  అడవుల కోసం ఐక్యరాజ్య సమితి రూపొందించిన  వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయడానికి తక్షణ చర్యలు అమలు చేయాలని సూచిస్తూ యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ 10వ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది.   ప్రపంచ అటవీ లక్ష్యాల సాధన  సహా భూమి క్షీణతను నివారించడానికి అత్యవసర,  వేగవంతమైన చర్యలు అమలు జరగాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు. 

భారత  ప్రతినిధి బృందానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ , భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ జితేంద్ర కుమార్ నాయకత్వం వహించారు.

***



(Release ID: 2020441) Visitor Counter : 191