భారత ఎన్నికల సంఘం
భారత సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రత్యక్ష పరిశీలనకు అతిపెద్ద ప్రపంచ ప్రతినిధి బృందం
భారత ఎన్నికల పరిమాణం.. ప్రక్రియ.. తద్వారా ప్రస్ఫుటమయ్యే సామర్థ్యాల పాత్ర ప్రపంచం కోసం భారీ ‘ప్రజాస్వామ్య విస్తృతి’కి రూపమిస్తాయి: ‘సిఇసి’ రాజీవ్ కుమార్;
ప్రతి ఎన్నికల తర్వాత వెలువడే ఫలితాలపై ప్రజల విశ్వాసమే
భారతదేశంలోని బలమైన ప్రజాస్వామ్య ప్రక్రియలకు నిదర్శనం
Posted On:
05 MAY 2024 4:01PM by PIB Hyderabad
ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అత్యున్నత ప్రమాణాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు పారదర్శక సంస్కృతిని పెంపొందించే సంప్రదాయాన్ని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) నిరంతరం చాటుకుంటోంది. తదనుగుణంగా ఈసారి ‘అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం’ (ఐవిఇపి) కింద ప్రపంచంలోని 23 దేశాల నుంచి 75 మంది ప్రతినిధులు భారత సార్వత్రిక ఎన్నికల ప్రత్యక్ష పరిశీలనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సిఇసి) శ్రీ రాజీవ్ కుమార్, కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఎన్నికల పరిమాణం, ఎన్నికల సంఘం కృషి ప్రపంచ విస్తృత ప్రజాస్వామ్య ప్రక్రియలో గణనీయ పాత్ర పోషిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ, తద్వారా ఉద్భవించే సామర్థ్యం పరంగా చూస్తే దీన్ని ‘ప్రజాస్వామ్య విస్తృతి’గా వ్యవహరించ వచ్చునని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రాధాన్యం తగ్గుదల లేదా క్షీణతపై ఆందోళన పెచ్చుమీరుతున్న నేపథ్యంలో భారత సార్వత్రిక ఎన్నికలకు గణనీయ ప్రాముఖ్యం ఉందన్నారు. అలాగే భారతీయ ఎన్నికల ప్రక్రియ ఎంతో విశిష్టమైనదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల జాబితాలో నమోదు లేదా ఓటు వేయడం అన్నది ఇక్కడ తప్పనిసరి కాదని శ్రీ కుమార్ పేర్కొన్నారు. అందువల్ల పౌరులు స్వచ్ఛందంగా ఈ ప్రక్రియలో పాల్గొనేలా ఒప్పించాల్సిన వాతావరణంలో ‘ఇసిఐ’ పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు ఎన్నికల జాబితాలో పేరు నమోదుసహా ఓటు హక్కు వినియోగించుకునేలా క్రమబద్ధ అవగాహన కార్యక్రమాల ద్వారా వారికి ప్రేరణనిస్తామని వివరించారు. ఒక్క వాక్యంలో చెబితే- ‘‘జనాభా-ఓటర్ల నిష్పత్తి పరంగా ఓటర్ల జాబితాలలో దాదాపు పూర్తి సంతృప్తత, ఎన్నికలలో అత్యధికంగా నమోదయ్యే ఓటింగ్ శాతం వంటివి మేం చేపట్టే ప్రక్రియల విశ్వసనీయతను ప్రస్ఫుటం చేస్తాయనడం అత్యంత సముచితం’’ అని ఆయన విశదీకరించారు.
భారతదేశంలో ఎన్నికల నిర్వహణ కసరత్తు గురించి వివరిస్తూ- దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా, 15 లక్షల మందికిపైగా సిబ్బంది 97 కోట్లమేర భారీ సంఖ్యలోగల ఓటర్లను స్వాగతిస్తారని చెప్పారు. ఇక పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా దేశంలోని ఓటర్లలో వైవిధ్యాన్ని ప్రతినిధులు పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా చూడవచ్చునని శ్రీ కుమార్ తెలిపారు. భారతదేశం అనేక పండుగలకు నిలయమని, అందులో భాగమైన ప్రస్తుత ప్రజాస్వామ్య మహోత్సవ అనుభవాన్ని ప్రత్యక్షంగా చవిచూడాలని ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్ దేశాల ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ప్రతినిధి బృందాలతో ‘ఇసిఐ’ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది.
అంతకుముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఇవిఎం)-వీవీప్యాట్, ఐటీ కార్యక్రమాలు, ప్రచురణ-ప్రసార, సామాజిక మాధ్యమాల పాత్ర సహా భారత సార్వత్రిక ఎన్నికలు-2024 సంబంధిత వివిధ అంశాలపై ప్రతినిధులకు సమగ్రంగా వివరించబడింది. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ శ్రీ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యాన అధికారులు ఎన్నికల ప్రక్రియపై స్థూలంగా వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ శ్రీ ఆర్.కె.గుప్తా పర్యవేక్షించారు. అనంతరం ‘ఇవిఎం-వీవీప్యాట్’ గురించి మరో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ శ్రీ నితీష్ కుమార్ ప్రదర్శనాత్మకంగా విశదీకరించారు. అలాగే సమాచార సాంకేతికతల పరంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలు, కార్యక్రమాల గురించి ఆ విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీమతి నీతా వర్మ వివరించగా, ప్రచురణ-ప్రసార, సామాజిక మాధ్యమాల పరంగా చేపట్టిన చర్యలను సంయుక్త డైరెక్టర్ (మీడియా) అనుజ్ చందక్ తెలియజేశారు.
ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రపంచ దేశాల ప్రతినిధులు బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళతారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహాలు, నిర్వహణ ప్రక్రియను వారు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఈ సందర్శన కార్యక్రమం 2024 మే 9న ముగుస్తుంది. భారత ఎన్నికల వ్యవస్థలోని సూక్ష్మాంశాలు సహా ఉత్తమ నిర్వహణాత్మక పద్ధతులను విదేశీ ఎన్నికల సంఘాల ప్రతినిధులకు ఈ కార్యక్రమం పరిచయం చేస్తుంది.
సార్వత్రిక ఎన్నికలు-2024 స్థాయి, పరిమాణాలకు తగినట్లుగా ఈసారి ప్రపంచంలోని మొత్తం 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల, సంఘాలకు చెందిన అతిపెద్ద ప్రపంచ ప్రతినిధుల బృందం భారత్ సందర్శిస్తోంది. ఈ మేరకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, పపువా న్యూగినీ, నమీబియా దేశాల ప్రతినిధులు వచ్చారు. వారితోపాటు ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్’ (ఐఎఫ్ఇఎస్), సభ్యులుసహా భూటాన్, ఇజ్రాయెల్ దేశాల మీడియా బృందాలు కూడా పాల్గొంటున్నాయి.
***
(Release ID: 2019691)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam