భారత ఎన్నికల సంఘం

సార్వత్రికం-2024లో యువ.. పట్టణ ఓటర్ల మెరుగైన భాగస్వామ్యం లక్ష్యంగా సామాజిక మాధ్యమ శక్తిని సద్వినియోగం చేస్తున్న ‘ఇసిఐ’


ప్రజాస్వామ్య మహోత్సవంలో యువత.. తొలిసారి ఓటర్ల
పాత్రను మరింత పెంచేవిధంగా ‘టర్నింగ్ 18’ కార్యక్రమం;

ఎన్నికల ప్రక్రియలో ఏ ఓటరూ వెనుకబడకుండా పోలింగ్ యంత్రాంగం సహా
వివిధ భాగస్వాముల ప్రాధాన్యాన్ని చాటుతూ ‘యు ఆర్ ది ఒన్’ కార్యక్రమం;

ఆకర్షణీయ ఇతివృత్తాలు.. జనాదరణగల ‘ఇసిఐ’ దిగ్గజాలు.. నవతరం
సంబంధిత సారాంశం సహితంగా సందేశ వ్యూహాలకు రూపకల్పన;

ఎన్నికల ప్రక్రియపై తప్పుడు వార్తలు-సమాచార నిరోధానికి ప్రత్యేక కార్యక్రమం

Posted On: 07 APR 2024 7:54PM by PIB Hyderabad

   దేశం 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పౌరులందర్నీ ఈ ప్రక్రియలో నిమగ్నం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలు వేదికగా ‘టర్నింగ్ 18’, ‘యు ఆర్ ది ఒన్’ వంటి ప్రత్యేక ప్రచార ఉద్యమాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ‘చునావ్ కా పర్వ్-దేశ్ కా గర్వ్’ (ఎన్నికల పర్వం-దేశానికే గర్వకారణం) పేరిట విస్తృత ఇతివృత్తం కింద సందేశ వ్యూహాలను రూపొందించింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ వంటి ప్రధాన మాధ్యమాల్లో ‘ఇసిఐ’ విభాగాలు ఉన్నాయి. వీటికితోడు ఇటీవల పబ్లిక్ యాప్, వాట్సాప్‌, లింక్డ్‌ఇన్ వేదికలను కూడా జోడించింది.

టర్నింగ్ 18కార్యక్రమం

   ఎన్నికలు నిర్వహించే ప్రతి సందర్భంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎంతగా కృషి చేస్తున్నా పట్టణ-యువతరం ఉదాసీనత ఫలితంగా విఫలమవుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. అందుకే 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు యువతతోపాటు తొలిసారి ఓటు వేయబోయే నవతరంలో అవగాహన పెంపు ప్రధానంగా ‘టర్నింగ్ 18’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. రాబోయే ఎన్నికలలో చురుగ్గా పాలుపంచుకునేలా యువతను ప్రోత్సహించడం, గత ఎన్నికలలో గుర్తించిన మేరకు పట్టణ-యువతరం ఉదాసీనత సంబంధిత సంక్లిష్ట సమస్యల పరిష్కారం వంటివి ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యాలు.

   ఈ ‘టర్నింగ్ 18’ కార్యక్రమం కింద లక్షిత సమూహాల దృష్టిని ఆకట్టుకునేలా వివిధ ఆకర్షణీయ ఇతివృత్తాలు, వ్యూహాలను ‘ఇసిఐ’ ఉపయోగిస్తోంది. ఈ మేరకు సులువుగా గుర్తించగల దిగ్గజ వ్యక్తులు, వారి సందేశాలతో మమేకం చేసే వ్యూహంలో భాగంగా ఇతివృత్త ఆధారిత లోగోలతో వ్యక్తిగత సిరీస్‌ల బ్రాండింగ్ చేపట్టింది. అలాగే మునుపటి-ఇటీవలి ఎన్నికల మధ్య కాలంలో ప్రచార కార్యక్రమం సాధించిన పురోగతిని ‘అప్పుడు-ఇప్పుడు’ శీర్షిక ద్వారా నొక్కిచెబుతోంది. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయాల్సిన అవసరం, ప్రాధానాన్యి ప్రస్ఫుటం చేస్తూ యువ ఓటర్లలో పౌర కర్తవ్య భావనను ప్రేరేపించడానికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా 18-30 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుండటాన్ని సమాచార సహిత చిత్రావళి (ఇన్ఫోగ్రాఫిక్స్) ద్వారా ప్రముఖంగా ప్రదర్శిస్తూ భారత ప్రజాస్వామ్య ప్రక్రియ సమగ్రతను చాటుతుంది.

   ఈ మేరకు రాష్ట్రాల్లోని ప్రధాన ఎన్నికల అధికారులు (సిఇఒ), జాతీయ ప్రసార సంస్థలైన దూరదర్శన్ న్యూస్, ఆకాశవాణి ద్వారా విస్తృతంగా నిర్వహిస్తున్న ‘టర్నింగ్ 18’ ప్రచారం గణనీయ ప్రభావం చూపుతోంది. అంతేగాక దిగ్గజ వ్యక్తుల ద్వారా సందేశంతో ‘ఇసిఐ’ నిర్వహిస్తున్న ప్రసిద్ధ జాతీయ, రాష్ట్రాల స్థాయి ‘స్వీప్’ కార్యక్రమం ఓటర్లను విస్తృతంగా ఉత్తేజపరుస్తోంది. ఈ సమష్టి కృషితో  సమాజంలోని భిన్న వర్గాలలో ఈ కార్యక్రమ సందేశం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. తద్వారా లక్షిత సమూహాలకు ‘ఇసిఐ’ సందేశాన్ని సమర్థంగా చేరవేస్తూ రానున్న ఎన్నికల నాటికి గణనీయ ఫలితాలను ఇవ్వనుంది.

యు ఆర్ ది ఒన్కార్యక్రమం

   ‘టర్నింగ్ 18’ కార్యక్రమ విజయం ప్రాతిపదికగా ‘యు ఆర్ ది ఒన్’ పేరిట మరొక ప్రభావశీల ప్రచారాన్ని ‘ఇసిఐ’ ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వివిధ భాగస్వాముల అమూల్య పాత్రను గుర్తించి, అభినందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఓటర్లు-రాజకీయ పార్టీల నుంచి పోలింగ్ కేంద్రాల స్థాయి అధికారులు (బిఎల్ఒ), క్షేత్రస్థాయి సిబ్బంది. పోలింగ్ బృందాలు, పాలన వ్యవహారాల సిబ్బంది, మాధ్యమాల నిపుణులు, కేంద్ర బలగాలు, భద్రత సిబ్బంది వరకూ ప్రతి భాగస్వామి ఎన్నికల ప్రక్రియ సమగ్రత, సామర్థ్యాన్ని నొక్కిచెప్పడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకట్టుకునే (‘‘ఏదేమైనా సరే-అదనపు బాధ్యత మాదే... కాబట్టి మీరు శ్రమించనక్కర్లేదు’’) వంటి కథలు-దృశ్యాల ద్వారా సాగే ప్రచారం ఆయా వ్యక్తుల అంకితభావం, నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తుంది. ప్రజాస్వామ్య చట్రంలో వారి పాత్ర, కర్తవ్యాల పట్ల గర్వించేలా ప్రేరణనిస్తుంది. ఈ మేరకు కీలక భాగస్వాములు, ఆసక్తికర ఉదంతాలు, మునుపటి ఎన్నికల కథనాలను ప్రముఖంగా చూపుతారు. అలాగే ప్రతి ఓటరుకు చేరువ కావడంలో భాగంగా సవాలు విసిరే దుర్గమ ప్రాంతాలకు సిబ్బంది తరలి వెళ్లడం, తెరవెనుక పోలింగ్ బృందాల అవిశ్రాంత కృషిని విడమరిచే వీడియోలు/లఘు చిత్రాలు వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

ఓటర్ల కోసం ఆకర్షణీయ ప్రత్యేక-ఆసక్తికర ఎన్నికల కథనాలు.. క్రాస్‌వర్డ్‌.. నిఘంటువు

   మునుపటి ఎన్నికలలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశాలు, కథనాలను పంచుకోవడం కోసం ‘చునావి కిస్సే’ (ఎన్నికల కథలు) కార్యక్రమం ప్రారంభించబడింది. భారతీయ ఎన్నికల క్రమంలో ఆది నుంచి అంతం దాకా సంబంధిత నిబంధనలు-ప్రక్రియల గురించి ఇది తెలియజేస్తుంది. ‘ఇసిఐ’తో పదకేళి కూడా పౌరులను ఎన్నికల సంబంధిత పదావళి అన్వేషణలో నిమగ్నం చేసే మరో కార్యక్రమం. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అత్యంత ఔచిత్యంగల ప్రశ్నలకు సమాధానాలు కోరే ‘సవాల్-జవాబ్’ (ప్రశ్నోత్తరాలు) కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ‘ఎన్నికలు-చిత్రాలు’ కార్యక్రమం కింద భారత దేశంలో నాటినుంచి నేటిదాకా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పయనాన్ని ‘ఇసిఐ’ ప్రజలతో పంచుకుంటుంది.

‘విస్తరణకు ముందు నిర్ధారణ’ కార్యక్రమం

   సామాజిక మాధ్యమాల్లో బూటకపు వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తి నిరోధం కోసం  ‘వెరిఫై బిఫోర్ యు యాంప్లిఫై’ (విస్తరణకు ముందు నిర్ధారణ) పేరిట ‘ఇసిఐ’ ఓ కార్యక్రమం చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించినపుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని నొక్కిచెప్పారు. ఆన్‌లైన్‌ (సామాజిక మాధ్యమాల)లో బూటకపు వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తి పెరిగిపోయిందని ఆయన గుర్తుచేశారు. అందువల్ల సమాచార విస్తరణకు ముందు నిర్ధారణ ద్వారా జాగ్రత్త, శ్రద్ధ వహించాలని సూచించారు. సందేశాల సారాంశాన్ని పంచుకునే ముందు దాని కచ్చితత్వం, ప్రామాణికతలను ధ్రువీకరించుకునేలా పౌరులకు సాధికారత కల్పించడం ఈ క్రియాశీల కార్యక్రమ లక్ష్యం. తద్వారానే  తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధం, ఎన్నికల ప్రక్రియ సమగ్రత పరిరక్షణ సాధ్యం.

   అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్‌పై సమాచారం, సమాచార సాంకేతికత అనువర్తనాలతోపాటు కమిషన్ నిర్ణయాలు సహా ఇతర కీలకాంశాలు, ఓటర్ల జాబితాలో పేరు తనిఖీ, పోలింగ్ స్టేషన్ల అన్వేషణ తదితరాల దిశగా కచ్చితమైన, నిర్ధారిత సమాచారాన్ని ఎన్నికల సంఘం చిత్రావళి/లఘు చిత్రాల రూపేణా పౌరులతో పంచుకుంటుంది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ చురుగ్గా, ప్రభావవంతంగా విలేకరుల సమావేశం నిర్వహించడం కూడా ఈసారి వినూత్న ప్రయత్నానికి ఒక ఉదాహరణ. తద్వారా మాధ్యమాలు సహా భాగస్వాములందరికీ తక్షణం చేరువయ్యేలా ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష ట్వీట్‌ వంటివి అందుతాయి.

   ప్ర‌స్తుత (2024) సార్వత్రిక ఎన్నిక‌ల‌లో సృజనాత్మక వ్యూహాలతోపాటు సామాజిక మాధ్యమ శక్తిసామ‌ర్థ్యాల‌ను కేంద్ర ఎన్నికల సంఘం సద్వినియోగం చేసుకుంటోంది. ఈ మేరకు దేశ పౌరులంతా ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటూ భారత ప్రజాస్వామ్య మహోత్సవ విజయంలో తమవంతు పాత్ర పోషించేలా వారికి సాధికారత కల్పించడాన్ని ‘ఇసిఐ’ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సార్వజనీన-భాగస్వామ్య సహిత ఎన్నికల దిశగా ‘ఇసిఐ’ అంకితభావానికి ఈ చర్యలన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి.

***



(Release ID: 2017934) Visitor Counter : 85