భారత ఎన్నికల సంఘం

కశ్మీర్ వలస ఓటర్లకు కీలక ఉపశమనం; జమ్ము.. ఉధంపూర్‌లలో నివసించే వలసదారులకు ఫామ్-ఎం బెడద తొలగించిన ‘ఇసిఐ’


ఈ రెండు ప్రాంతాల వెలుపలి వలసదారులకు ఫామ్-ఎం వర్తించినా.. గజిటెడ్
అధికారి ధ్రువీకరణకు బదులు స్వీయ-నిర్ధారణ పత్రంతో సమర్పించవచ్చు;

జమ్ము.. ఉధంపూర్‌లలోని అన్ని వలస జోన్లలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

Posted On: 12 APR 2024 5:40PM by PIB Hyderabad

   ప్రస్తుత (2024) సార్వత్రిక ఎన్నికలలో కశ్మీర్ వలసదారుల ఓటు హక్కు వినియోగానికి సౌలభ్యం కల్పిస్తూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయ నుంచి నిర్వాసితులై జమ్ము, ఉదంపూర్‌లలో నివసించే వారు ఫామ్-ఎం సమర్పించే నిబంధనను రద్దు చేసింది. ఇక ఈ రెండు ప్రాంతాల వెలుపల నివసించే వలసదారులకు ఫామ్-ఎం వర్తించినప్పటికీ వారు గజిటెడ్ అధికారి ధ్రువీకరణతో నిమిత్తం లేకుండా స్వీయ-నిర్ధారిత పత్రంతో సమర్పించే వీలు కల్పించింది. ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధులతో సంయుక్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) శ్రీ రాజీవ్ కుమార్ తన అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఈ మేరకు నిర్ణయించింది.

   ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఫామ్-ఎం నింపడంలో చిక్కుల ఫలితంగా ఓటు హక్కు వినియోగంలో తమకు కలుగుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతూ కశ్మీర్ వలస ప్రజలు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఫామ్-ఎం సమర్పణలో అధికార యంత్రాంగం పరంగా తమకు పలు అవరోధాలు ఎదురవుతున్నాయని వారు వివరించారు. మరోవైపు ఈ ఫామ్ నింపే ప్రక్రియ సంక్లిష్టంగానే కాకుండా గందరగోళంగానూ ఉంటుంది. నిర్దిష్ట పత్రాలు, వలస స్థితి సంబంధిత రుజువులు చూపడంతోపాటు వాటికి గజిటెడ్ అధికారి ధ్రువీకరణ కూడా అవసరమవుతుంది. వలసదారుల దురవస్థపై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన అనంతరం జమ్ముకశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి కూడా 09.04.2024న కేంద్ర ఎన్నికల సంఘానికి తన అభిప్రాయంతో కూడిన పత్రాలను సమర్పించారు. ఫామ్-ఎం సమర్పణ విధానంపై కశ్మీర్ వలస సమూహాల నుంచి అందిన పలు విజ్ఞప్తులు, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి వ్యాఖ్య సహితంగా అందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తదనుగుణంగా 2024 సార్వత్రిక ఎన్నికలలో కశ్మీర్ వలసదారులు తాత్కాలిక శిబిరాల్లో వ్యక్తిగతంగానూ, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిని ఖరారు చేస్తూ 11.04.2024నాడు నం.3/J&K-HP/2024(NS-I) కింద ఆదేశాలు జారీచేసింది.

ఈ ఆదేశాల ప్రకారం జమ్ము, ఉధంపూర్ వలస ఓటర్ల కోసం:

  1. మొత్తం 22 (జమ్ములో 21, ఉదంపూర్‌లో 1) ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు వేర్వేరుగా శిబిరాలు/జోన్‌ల వారీగా గుర్తించబడతాయి. ప్రతి జోన్‌లో కనీసం ఒక ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలిలి. ఒకే జోన్‌లో పలు కేంద్రాలుంటే జోనల్ అధికారులు ప్రతి జోన్ ఓటర్ల సమూహానికి వాటి దూరం/సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి కేంద్రం పరిధిలో అంతర ఇంట్రా-జోనల్ అధికార పరిధిని కేటాయించాలి. ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లేని జోన్ ఏదైనా ఉంటే, అక్కడ ఏర్పాటు చేయడంపై కమిషన్ జారీచేసిన ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలతో సంప్రదించిన మీదట సముచిత ప్రభుత్వ భవనంలో కొత్త కేంద్రం ఏర్పాటుకు సంబంధిత ‘ఎఆర్ఒ’ ప్రతిపాదించాలి. దీనికి అనగుణంగా ఈ జోన్లు/శిబిరాల్లోని ఓటర్లను జమ్ము, ఉదంపూర్‌లలోని సంబంధిత ‘ఎఇఆర్ఒ’లు ఆయా వలసదారులకు పోలింగ్ కేంద్రాల పరిధిని నిర్దేశిస్తారు.
  2. ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల వివరాలు వాటి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాథమిక ఓటర్ల జాబితా నుంచి తొలగించబడతాయి. వేరుపరచిన ముసాయిదా ఓటర్ల జాబితా నకళ్లు ఆయా ప్రత్యేక పోలింగ్ కేంద్రాల జాబితాలుగా ఉపయోగించబడతాయి. ప్రతి జోన్‌కు సంబంధించి జమ్ము, ఉధంపూర్‌లలోని సంబంధిత ‘ఎఇఆర్ఒ’ ద్వారా వలసదారులకు సమాచారం ఇవ్వబడుతుంది. దీంతోపాటు వార్తాపత్రికలలో ప్రచురణ సహా వివిధ మాధ్యమ వేదికలలో ఉంచడం ద్వారా విస్తృత ప్రచారం ఇవ్వబడుతుంది. జోన్ కార్యాలయం సహా దాని పరిధిలోని నిర్దేశిత ప్రాంతాలు, వలసదారుల కోసం జమ్ముకశ్మీర్ సహాయ-పునరావాస కమిషనర్ కార్యాలయం, వెబ్‌సైట్‌ల వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ప్రదర్శించబడతాయి. ముసాయిదా ఓటర్ల జాబితా నకలు ప్రకటన తర్వాత కింద పేర్కొన్న అంశాలకు సంబంధించి 7 రోజులలోగా ఓటర్లు జమ్ము, ఉదంపూర్‌లలోని సంబంధిత (వలసప్రాంత) సహాయ రిటర్నింగ్ అధికారులను (ఎఇఆర్ఒ) సంప్రదించవచ్చు.
  • ముసాయిదా జాబితాలలో అర్హులైనవారి పేరు కనిపించనపుడు;
  • అతడు/ఆమె పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని అభిలషిస్తే;
  • అతడు/ఆమె కశ్మీర్ లోయలోని తమ వాస్తవ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని అభిలషిస్తే;
  • ముసాయిదా ప్రకటనలో కేటాయించిన కేంద్రం కాకుండా అప్పటికే తాము సమర్పించిన ఫామ్-ఎం ప్రకారం తామెంచుకున్న ప్రత్యేక పోలింగ్ కేంద్రం జాబితాలో పేరు కొనసాగించాలని భావిస్తే;

నిర్దేశిత 7 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత (వలస ప్రాంత) ‘ఎఇఆర్ఒ’లు ప్రతి ప్రత్యేక పోలింగ్ కేంద్రం సంబంధిత తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్ నాడు సంబంధిత కేంద్రాల్లో ప్రకటిత జాబితానే ఉపయోగించాలి. ఈ జాబితా నకలును కశ్మీర్‌లోని వాస్తవ పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలో గుర్తించడం కోసం ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు/అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌లకు (వలస ప్రాంత) ‘ఎఇఆర్ఒ’లు తక్షణం పంపుతారు.

  1. పోస్టల్ బ్యాలెట్ (పిబి) ద్వారా ఓటు వేయడం కోసం ఫామ్-12సి సమర్పించిన ఓటర్లకు సదరు పోస్టల్ బ్యాలెట్ పంపి ఉన్నట్లయితే, అటువంటి వారు ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయకుండా పటిష్ట నిర్ధారణ దిశగా ఈ పథకం కింద పోస్టల్ బ్యాలెట్‌  నోడల్ అధికారిగా వ్యవహరించే జమ్ములోని (వలసప్రాంత) ‘ఎఆర్ఒ’ తమ పరిధిలోని ఓటరు జాబితాలో సదరు ఓటరు పేరుకు ఎదురుగా ‘పిబి’ గుర్తు నమోదు చేస్తారు.

జమ్ము, ఉధంపూర్ వెలుపలి ప్రాంతాల వలస ఓటర్ల కోసం:

   ఇప్పటిదాకా ఫామ్-ఎం సమర్పణకు గజిటెడ్ అధికారి ధ్రువీకరణ కోసం వలసదారులు పడుతున్న అవస్థలు తాజా విధానంతో తొలగిపోయాయి. ఈ మేరకు ప్రస్తుతం ఫామ్‌-ఎం సమర్పణకు ‘స్వీయ నిర్ధారణ’ పత్రం జతచేస్తే సరిపోతుంది. అయితే, ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల తారుమారు కాకుండా చూడటం కోసం ఓటరు గుర్తింపు కార్డు (ఇపిఐసి) లేదా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు నిమిత్తం కమిషన్ నిర్దేశించిన ప్రత్యామ్నాయ పత్రాలను ఓటర్లు చూపాల్సి ఉంటుంది. (ఈ ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల జాబితాను https://www.eci.gov.in/eci-backend/public/api/download?url=LMAhAK6sOPBp%2FNFF0iRfXbEB1EVSLT41NNLRjYNJJP1KivrUxbfqkDatmHy12e%2FzPjtmHy12e%2FzPjtY18FZ 2199MM81QYarA39BJWGAJqpL2w0Jta9CSv%2B1yJkuMeCkTzY9fhBvw%3D%3D) లో చూడవచ్చు.

కశ్మీర్ వలసదారుల కోసం పథకం... నేపథ్యం

   ప్రస్తుత (2024) సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు: 1- బారాముల్లా, 2-శ్రీనగర్ మరియు 3-అనంతనాగ్-రాజౌరీలకు సంబంధించి వలసదారులు సులువుగా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఒక పథకం ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక శిబిరాలలో వ్యక్తిగతంగా లేదా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తూ 22.03.2024నాడు నం.464/J&K-HP/2024 కింద ఆదేశాలిచ్చింది.

   దీని ప్రకారం... ఢిల్లీ సహా జమ్ము, ఉధంపూర్‌లలోని వివిధ సహాయ శిబిరాల్లో నివసిస్తున్న కశ్మీర్ వలసదారులు 2024 లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలలో తమ అభీష్టం మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా వ్యక్తిగతంగా ఓటు వేయవచ్చు. తదనుగుణంగా ఫామ్-ఎం సమర్పణ ద్వారా ఢిల్లీ (4), జమ్ము (21), ఉధంపూర్ (1)లలో ఏర్పాటు చేసే ఏదైనా నిర్దిష్ట పోలింగ్ కేంద్రంలో తమ హక్కు వినియోగించుకోవచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఓటర్లు అందుకోసం నిర్దేశిత ఫామ్-12సి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

   జమ్ము, ఉధంపూర్, ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాలలోగల వలస ఓటర్లు వ్యక్తిగతంగా లేదా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు. ఇందుకోసం కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఫామ్-ఎం, ఫామ్-12సి డౌన్‌లోడ్ చేసుకుని, నింపి సమర్పించాలి. ఆ తర్వాత ఓటర్లు నివసించే ప్రాంత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి వీటిని పరిశీలించి, ధ్రువీకరిస్తారు. ఈ తనిఖీ ప్రక్రియ కోసం వారికి ‘ఇఆర్ఒ-నెట్’ ద్వారా కశ్మీర్‌లోని వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నమోదైన వలస ఓటర్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ వివరాల ప్రాతిపదికన సంబంధిత ఇఆర్ఒ ఫామ్-ఎం లోని వివరాలను నిర్ధారించుకుని, తదుపరి చర్యల నిమిత్తం వాటిని స్కాన్ చేసి ఢిల్లీ, జమ్ము, ఉధంపూర్‌లలోని వలసప్రాంత ‘ఎఆర్ఒ’లకు ఎలక్ట్రానిక్‌ పత్రాల రూపంలో అప్‌లోడ్ చేస్తారు.

   ఈ నేపథ్యంలో లోక్‌సభకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో దశలవారీ పోలింగ్ నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) కింది షెడ్యూల్‌ను ప్రకటించింది.

దశలు

పోలింగ్ కేంద్రం పేరు.. నం.

పోలింగ్ తేదీ

షెడ్యూల్ 1ఎ

4-ఉధంపూర్

19.04.2024

షెడ్యూల్ 2బి

5-జమ్మూ

26.04.2024

షెడ్యూల్-III

3- అనంతనాగ్-రాజౌరి

07.05.2024

షెడ్యూల్-IV

2-శ్రీనగర్

13.05.2024

షెడ్యూల్-V

1-బారాముల్లా

20.05.2024

***



(Release ID: 2017928) Visitor Counter : 85