ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో మార్చి 12న ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న‌


రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్‌ శక్తి’ కసరత్తును తిలకించనున్న ప్రధాని;

‘భారత్ శక్తి’ పేరిట త్రివిధ దళాల వ్యూహ-యుద్ధ విన్యాసాలు రక్షణ
రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ బలమైన ముందడుగుకు నిదర్శనం;

అహ్మదాబాద్‌లో రూ.85,000 కోట్ల విలువైన వివిధ రైల్వే
ప్రాజెక్టులకు శంకుస్థాపన.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని;

ప్రత్యేక రవాణా కారిడార్ ప్రాజెక్టులో భాగమైన పలు
కీలక విభాగాలను జాతికి అంకితం చేయనున్న ప్రధాని;

మరో 10 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి;

కొచ్రాబ్ ఆశ్రమ ప్రారంభోత్సవంతోపాటు సబర్మతిలో గాంధీ ఆశ్రమ
స్మారకం బృహత్ ప్రణాళికను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 10 MAR 2024 5:19PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 12న గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ముందుగా ఉదయం 9:15 గంటలకు గుజరాత్‌లో రూ.85,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. అటుపైన ఉదయం 10 గంటలకు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడంతోపాటు గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళిను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ పేరిట రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించే త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధానమంత్రి నేరుగా తిలకిస్తారు.

పోఖ్రాన్‌లో ప్రధానమంత్రి

   రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలపై త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ ప్రత్యక్ష యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధాని వీక్షిస్తారు. ‘భారత్ శక్తి’ పేరిట నిర్వహిస్తున్న ఈ కసరత్తులో భాగంగా స్వయం సమృద్ధ భారతం కార్యక్రమానికి అనుగుణంగా రూపొందించిన దేశీయ ఆయుధ వ్యవస్థలు, వేదికల శక్తిసామర్థ్యాలను త్రివిధ దళాలు ప్రదర్శిస్తాయి. ఈ మేరకు ఇది నింగి, నేల, నీరుతోపాటు సైబర్, అంతరిక్ష రంగాల్లో ఎదురయ్యే ముప్పులను దీటుగా తిప్పికొట్టడంలో భారత సాయుధ దళాల సమీకృత కార్యాచరణ సామర్థ్యాన్ని ఈ వాస్తవిక-సమీకృత-బహుళ రంగ  కార్యకలాపాలను ఈ కసరత్తు కళ్లకు కడుతుంది.

   ఈ విన్యాసాల్లో ప్రదర్శించే కీలక ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలలో- టి-90 (ఐఎం) ట్యాంకులు, ధనుష్/సారంగ్ గన్ వ్యవస్థలు, ఆకాష్ ఆయుధ వ్యవస్థలు, రవాణా డ్రోన్, రోబోటిక్ మ్యూల్,  అడ్వాన్స్‌ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్‌), మానవరహిత వైమానికదళ వాహనాలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ భారత సైనికదళాల అధునాతన క్షేత్రస్థాయి యుద్ధ, గగనతల నిఘా సామర్థ్యాలను ప్రస్ఫుటం చేస్తాయి.

   మరోవైపు భారత నావికాదళం నౌకా విధ్వంసక క్షిపణులు, స్వయంచలిత గగనతల రవాణా వాహనాలు, విస్తరిత గగనతల లక్ష్యాలు తదితర సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇవన్నీ భారత సముద్రతల శక్తిసామర్థ్యాలు, అత్యాధునిక సాంకేతికతను చాటిచెబుతాయి. అలాగే భారత వైమానిక దళం కోసం దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను ప్రదర్శిస్తుంది. ఈ ఆయుధ వ్యవస్థలు ఆకాశంలో భారత యుద్ధ పాటవాన్ని, బహుముఖ ప్రజ్ఞను స్పష్టం చేస్తాయి.

   సమకాలీన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు స్వదేశీ పరిష్కారాలతో వాటిని దీటుగా తిప్పికొట్టడంలో భారత్ సర్వ సన్నద్ధతకు ఇవన్నీ సంకేతాలుగా నిలుస్తాయి. ఈ మేరకు ప్రపంచ వేదికపై భారత దేశీయ రక్షణరంగ శక్తిసామర్థ్యాల పునరుత్థానం, ఆవిష్కరణల బలాన్ని విశదం చేస్తాయి. భారత సాయుధ బలగాల శక్తియుక్తులు, కార్యాచరణ సామర్థ్యం, స్వదేశీ రక్షణ పరిశ్రమ మేధస్సు, నిబద్ధతను ప్రదర్శించడం ద్వారా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ బలమైన పురోగమనానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తాయి.

అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి

   రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానానికి ఉత్తేజమిస్తూ, అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.85,000 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.

   శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు: రైల్వే వర్క్‌షాప్‌లు, లోకో షెడ్లు, పిట్ లైన్‌లు/కోచింగ్ డిపోలు; ఫాల్టాన్-బారామతి కొత్త మార్గం; విద్యుత్ ప్రసార వ్యవస్థ ఉన్నతీకరణ పనులు ఉన్నాయి. అలాగే తూర్పు ‘డిఎఫ్‌సి’ పరిధిలోని న్యూ ఖుర్జా-సాహ్నేవాల్ (401 రూట్ కి.మీ) విభాగం, పశ్చిమ ‘డిఎఫ్‌సి’ కార్యకలాపాల నియంత్రణ కేంద్రం పరిధిలోని న్యూ మకర్‌పురా-న్యూ ఘోల్వాడ్ 244 రూట్ కి.మీ) విభాగాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

   అంతేకాకుండా అహ్మదాబాద్-ముంబై సెంట్రల్, సికింద్రాబాద్-విశాఖపట్నం, మైసూరు-డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై), పాట్నా-లక్నో, న్యూ జల్పాయ్ గురి-పాట్నా, పూరీ-విశాఖపట్నం, లక్నో- డెహ్రాడూన్, కలబురగి- సర్ ఎం.విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు, రాంచీ-వారణాసి, ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మార్గాల్లో పది కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.

   వీటితోపాటు నాలుగు వందేభారత్ రైళ్ల గమ్యాల పొడిగింపు నేపథ్యంలో వాటిని కూడా ప్రధాని జెండా ఊపి సాగనంపుతారు. ఈ రైళ్లలో అహ్మదాబాద్-జామ్‌నగర్ రైలును ద్వారకదాకా; అజ్మీర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా రైలును చండీగఢ్ వరకూ; గోరఖ్‌పూర్-లక్నో రైలును ప్రయాగ్‌రాజ్ దాకా; తిరువనంతపురం-కాసర్‌గోడ్ రైలును మంగళూరు వరకు పొడిగించబడ్డాయి. మరోవైపు అసన్సోల్- హతియా; తిరుపతి-కొళ్లం మార్గాల్లో రెండు కొత్త ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

   ఇక ప్రత్యేక రవాణా కారిడార్ పరిధిలోని న్యూ ఖుర్జా జంక్షన్, సాహ్నేవాల్, న్యూ రేవారీ, న్యూ కిషన్‌గఢ్, న్యూ ఘోల్వాడ్, న్యూ మకర్‌పురా తదితర ప్రాంతాల నుంచి సరకు రవాణా రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి సాగనంపుతారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన 50 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి విక్రయ కేంద్రాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ కేంద్రాల్లో ప్రజలకు చౌకధరతో నాణ్యమైన జనరిక్ మందులు లభ్యమవుతాయి.

   అంతేకాకుండా 51 ‘గతిశక్తి బహుళ సరకు రవాణా కూడళ్ల’ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ కూడళ్ల నుంచి వివిధ రవాణా సాధనాల ద్వారా సరకు రవాణా నిరంతరాయంగా సాగుతుంది.

   ఈ రైల్వే ప్రాజెక్టులతోపాటు 80 సెక్షన్లలో 1045 రూట్ కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వయం చలిత సిగ్నలింగ్‌ వ్యవస్థను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. ఈ ఉన్నతీకరణ కార్యక్రమాల వల్ల రైలు కార్యకలాపాల్లో భద్రత-సామర్థ్యం ఇనుమడిస్తాయి. ఇవేకాకుండా 2,646 స్టేషన్ల డిజిటల్ నియంత్రణ సదుపాయాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. తద్వారా రైళ్ల నిర్వహణ సామర్థ్యం, భద్రతను మెరుగవుతాయి.

   ఈ పర్యటనలో ప్రధానమంత్రి 35 రైల్ కోచ్ రెస్టారెంట్లను జాతికి అంకితం చేస్తారు. వీటిద్వారా రైల్వేలకు ప్రయాణిక చార్జీయేతర ఆదాయం సమకూరడంతోపాటు ప్రయాణికులుసహా, ఇతర ప్రజల ఆహార అవసరాలు కూడా తీరుతాయి.

   ఇక దేశవ్యాప్తంగా 1500కుపైగాగల ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ విక్రయ కేంద్రాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ విక్రయ కేంద్రాలు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు స్థానిక చేతివృత్తులవారు, హస్తకళాకారుల ఆదాయార్జనకు తోడ్పడతాయి.

   గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి దేశంలోని 975 ప్రాంతాల్లో సౌరశక్తి సదుపాయం కల్పించబడిన రైల్వే స్టేషన్లు/ఇతర ప్రభుత్వ భవనాలను జాతికి అంకితం చేస్తారు. ఈ వినూత్న కార్యక్రమం భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు దోహదం చేయడంతోపాటు రైల్వే రంగంలో కర్బన ఉద్గారాల తగ్గుదలకు తోడ్పడుతుంది.

   దేశవ్యాప్తంగా కొత్తగా విద్యుదీకరించబడిన సెక్షన్లు, ట్రాక్‌ డబ్లింగ్/మల్టీ-ట్రాకింగ్, రైల్వే గూడ్స్ షెడ్‌ల నిర్మాణం, వర్క్‌ షాప్‌లు, లోకో షెడ్‌లు, పిట్ లైన్‌లు/కోచింగ్ డిపోలు వంటి అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇవన్నీ అత్యాధునిక, పటిష్ట రైల్వే నెట్‌వర్క్‌ నిర్మాణంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచే ప్రాజెక్టులు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ పెట్టుబడులతో అనుసంధానం మెరుగుపడటంతోపాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందిరావడంసహా ఆర్థిక వృద్ధికి ఎనలేని తోడ్పాటు లభిస్తుంది.

సబర్మతిలో ప్రధానమంత్రి

   సబర్మతి ఆశ్రమ సందర్శనలో భాగంగా నవీకృత కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇది దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి మహాత్మాగాంధీ 1915లో తిరిగి రాగానే స్థాపించిన తొలి ఆశ్రమం. దీన్ని గుజరాత్ విద్యాపీఠం నేటికీ ఒక స్మారక చిహ్నంగా, పర్యాటక ప్రదేశంగా సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళికను కూడా ప్రధాని ఆవిష్కరిస్తారు.

   మహాత్మా గాంధీ ప్రబోధిత ఆశయాలు/ఆదర్శాలను కొనసాగించడం, గౌరవించడమే కాకుండా అనుసరించే మార్గాలను రూపొందిస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీ ఆశ్రమ స్మారక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మహాత్ముని ప్రబోధాలు, సిద్ధాంతాలను ప్రస్తుత, భవిష్యత్తరాలకు అందించడంలో ఈ కృషి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ మేరకు రూపొందించిన బృహత్ ప్రణాళిక కింద ప్రస్తుత ఐదెకరాల ఆశ్రమాన్ని 55 ఎకరాలకు విస్తరింపజేస్తారు. అలాగే ఇక్కడున్న 36 భవనాలను పునరుద్ధరిస్తారు. వీటిలో గాంధీ నివసించిన ‘హృదయ్ కుంజ్’ సహా 20 భవనాల పరిరక్షణతోపాటు మరో 13 పునరుద్ధరణ, ఇంకొక 3 పునర్నిర్మాణం చేయబడతాయి.

   ఈ ప్రణాళికలో పరిపాలన సౌకర్యాలు, ఓరియంటేషన్ సెంటర్ వంటి సందర్శకుల సౌకర్యాలు, చరఖా వడకడంపై పరస్పర అభ్యసన వర్క్‌ షాప్‌లు, చేతితో కాగితం తయారీ, చేనేత, చర్మ వస్తు తయారీ, ప్రజా సదుపాయాలు తదితరాల కోసం కొత్త భవనాలు ఏర్పాటవుతాయి. వీటిలో గాంధీజీ జీవితం, ఆశ్రమ వారసత్వం తదితర అంశాలను ప్రదర్శనసహా పరస్పర ప్రదర్శనాత్మక కార్యకలాపాలు నిర్వహించబడతాయి.

   గాంధీజీ ఆలోచన విధాన సంరక్షణ/పరిరక్షణతోపాటు వ్యాప్తి దిశగా గ్రంథాలయం, ప్రాచీన భాండాగారం కోసం భవనాలు నిర్మించాలని బృహత్ ప్రణాళికలో ప్రతిపాదించారు. తద్వారా ఆశ్రమాన్ని సందర్శించే మేధావులు, పండితులకు వీటిని ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. విభిన్న అంచనాలతో, బహు భాషలలో సందర్శకులకు మార్గనిర్దేశం చేయగల ఒక వివరణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలో నిర్దేశించబడింది. తద్వారా సందర్శకుల అనుభవాలు సాంస్కృతికంగా/మేధోపరంగా మరింత ఉత్తేజితం, సుసంపన్నం కాగలవు.

   ఈ స్మారకం భవిష్యత్తరాలకు స్ఫూర్తినిస్తూ గాంధేయ ఆలోచన విధానాన్ని సజీవంగా ఉంచడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ధర్మకర్తృత్వ సూత్రావళి ప్రబోధించే ప్రక్రియల ద్వారా గాంధేయ విలువల సారాన్ని పునరుత్తేజితం చేస్తుంది.



(Release ID: 2013396) Visitor Counter : 75