యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
క్రీడాకారిణుల కోసం 2 'నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లను ప్రకటించిన కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
08 MAR 2024 8:10PM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం, కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా రెండు 'నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో భారతీయ అథ్లెట్లు పతకాలు గెలుచుకునే అవకాశం ఉన్న 23 క్రీడాంశాల్లో ఎన్‌సీవోయీలు శిక్షణ ఇస్తాయి.
రాష్ట్ర స్థాయిలో శిక్షకులు, మౌలిక సదుపాయాల కొరత గురించి బెంగళూరులో మాట్లాడిన శ్రీ ఠాకూర్ "క్రీడలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయినప్పటికీ దేశంలో క్రీడల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. మౌలిక సదుపాయాలు, శిక్షకుల కోసం మనం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మేం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తున్నాం. హాకీ, బాక్సింగ్, అథ్లెటిక్స్ మొదలైనవాటిని ఏ రాష్ట్రం ప్రోత్సహిస్తుందనే దానిపై కేంద్రానికి ఒక ప్రణాళిక, సమాచారం ఉండేలా మూడు కీలక క్రీడలను గుర్తించమని రాష్ట్రాలను కోరాం" అని చెప్పారు.
"ఇప్పటికే ఎన్‌సీవోయీలను ఏకీకృతం చేయడం ప్రారంభించాం. జాతీయ క్రీడా సమాఖ్యలతో కలిసి, మంచి కోచ్‌లను తయారు చేయడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం" అని శ్రీ ఠాకూర్ వెల్లడించారు.
'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' దేశవ్యాప్తంగా 23 'నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'లను ఏర్పాటు చేసింది. ఇక్కడ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సౌకర్యాలు, క్రీడలకు శాస్త్రీయ మద్దతు, పోషకాహార నిపుణులు సూచించిన ఆహారం ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఉత్తమ శిక్షకులు, అర్హత కలిగిన సహాయక సిబ్బంది, సమర్థులైన డైరెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది.
***
(Release ID: 2012911)
Visitor Counter : 144