ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వికసిత భారత్ - వికసిత చ‌త్తీస్‌గ‌ఢ్‌ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం


ఛత్తీస్‌గఢ్‌లో రూ.34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి
ప్రాజెక్టులకు ప్రారంభోత్సం.. జాతికి అంకితం.. శంకుస్థాపన;

ఇవన్నీ రోడ్లు.. రైల్వేలు.. బొగ్గు.. విద్యుత్.. సౌరశక్తి వగైరా రంగాల్లో కీలక ప్రాజెక్టులే;

ఎన్టీపీసీ ‘లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్’ తొలిదశ
జాతికి అంకితం.. 2వ దశ నిర్మాణానికి శంకుస్థాపన;

‘‘ఛత్తీస్‌గఢ్ ప్రగతి.. ప్రజా సంక్షేమమే మా ద్వంద్వ చోదక ప్రభుత్వ ప్రాథమ్యాలు’’;

‘‘పేదలు.. రైతులు.. యువత.. నారీశక్తి సాధికారతతోనే వికసిత ఛత్తీస్‌గఢ్ సాకారం’’;

‘‘వినియోగదారుల విద్యుత్ బిల్లును సున్నా స్థాయికి తేవడంపై ప్రభుత్వం కృషి చేస్తోంది’’;

‘‘మోదీకి మీరే కుటుంబం.. మీ కలలే ఆయన సంకల్పాలు’’;

‘‘రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించే
సమయానికి ఛత్తీస్‌గఢ్ కూడా సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహిస్తుంది’’;

‘‘అవినీతి అంతంతో అభివృద్ధి ఆరంభమై... అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’

Posted On: 24 FEB 2024 1:30PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘వికసిత భారత్-వికసిత ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.34,400 కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాప‌న చేశారు. ఇవన్నీ రోడ్లు, రైల్వేలు, బొగ్గు, విద్యుత్, సౌరశక్తితో సహా పలు కీలక రంగాలకు సంబంధించినవి కావడం గమనార్హం. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి అనుసంధానమైన లక్షలాది కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. యువత, మహిళలు, పేదలు, రైతుల సాధికారత ద్వారానే వికసిత ఛత్తీస్‌గఢ్ నిర్మాణం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆధునిక మౌలిక సదుపాయాలు వికసిత ఛత్తీస్‌గఢ్ పునాదిని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నేడు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు.

   ఎన్టీపీసీ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఇవాళ జాతికి అంకితం చేయడంతోపాటు 1600 మెగావాట్ల సామర్థ్యంగల రెండోదశ నిర్మాణానికి శంకుస్థాపన గురించి ప్రధాని ప్రస్తావించారు. ఇకపై పౌరులకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సదుపాయం లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను సౌరశక్తి కూడలిగా మార్చడంపై ప్రభుత్వ కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సమీప ప్రాంతాలకు రాత్రివేళ కూడా విద్యుత్ సరఫరా చేయగల రాజ్‌నంద్‌గావ్, భిలాయ్‌లలోని సౌరశక్తి ప్లాంట్లను జాతికి అంకితం చేయడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. ‘‘వినియోగదారుల విద్యుత్ బిల్లును సున్నా స్థాయికి తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ప్రధాని మోదీ  వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరాకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం’ గురించి వివరించారు. ఈ మేరకు ఇళ్ల పైకప్పు మీద సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు కోసం ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేస్తుందన్నారు. అలాగే 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తూ, ఆ ఫలకాల ద్వారా ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్తును ప్రభుత్వమే వారినుంచి కొనుగోలు చేస్తుందన్నారు. తద్వారా పౌరులకు రూ.వేలలో  అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు. బంజరు భూముల్లో చిన్నతరహా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రైతులకు ఆర్థిక సహాయం అందించి, అన్నదాతను కరెంటు దాతగా మార్చేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

   ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఇంజన్ల ప్రభుత్వం పలు హామీలను నెరవేర్చిందంటూ ప్రధాని ప్రశంసించారు. రాష్ట్రంలోని లక్షలాది రైతులకు రెండేళ్లుగా రాని బోనస్ ఇప్పటికే అందిందని చెప్పారు. అలాగే తెండు ఆకుల సేకరణకర్తల పారితోషికాన్ని పెంచడంపై ఎన్నికల వాగ్దానాన్ని కూడా అమలు చేసిందని ఆయన తెలిపారు. ‘‘పీఎం ఆవాస్, హర్ ఘర్ నల్ సే జల్’’ వంటి పథకాలు కొత్త వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. వివిధ పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తు సాగుతున్నదని, ‘మెహతారీ వందన్ యోజన’ ప్రయోజనం పొందుతున్న రాష్ట్ర మహిళలను ప్రధాని అభినందించారు.

   ఛత్తీస్‌గఢ్‌ను వికసిత రాష్ట్రం చేయగలిగే శ్రమజీవులైన రైతులు, ప్రతిభావంతులైన యువతతోపాటు అపార సహజ సంపద కూడా అందుబాటులో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాల హ్రస్వదృష్టి, స్వార్థ రాజకీయాలవల్ల రాష్ట్రం అభివృద్ధిపరంగా వెనుకబడిందని విమర్శించారు. ‘‘మోదీకి మీరే కుటుంబం... మీ కలలే అతని సంకల్పాలు. అందుకే నేనివాళ వికసిత భారత్-వికసిత ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడుతున్నాను’’ అన్నారు. అలాగే ‘‘దేశంలోని 140 కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్కరికీ ఈ సేవకుడు తన నిబద్ధత, కృషిపై హామీ ఇస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి భారతీయుడూ గర్వించేలా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను ఉజ్వలంగా ప్రకాశింపజేస్తానని 2014లో తానిచ్చిన హామీని గుర్తుచేశారు. మరోవైపు పేదల సొమ్మును దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారినుంచి రాబట్టిన డబ్బును పేదల సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. పేదలకు ఉచిత రేషన్‌, ఉచిత వైద్యం, అందుబాటు ధరలో మందులు, ఇళ్లు, కొళాయిల ద్వారా నీరు, గ్యాస్‌ కనెక్షన్‌, మరుగుదొడ్లు తదితరాలను కూడా ఆయన ప్రస్తావించారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మోదీ గ్యారంటీ వాహనం ప్రతి పల్లెకూ వెళుతోందని చెప్పారు.

   దశాబ్దం కిందట తానిచ్చిన హామీని గుర్తుచేస్తూ- మన పూర్వీకుల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం గురించి ప్రస్తావించారు. ఆ మేరకు నేడు వికసిత భారతం ఆవిర్భవిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. అలాగే డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి కూడా ప్రధాని  ప్రస్తావించారు. ప్రత్యక్ష చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవస్థలు, చెల్లింపు స్వీకరణ ప్రతిస్పందన తదితరాలను ఆయన ఉదాహరించారు. ఇవన్నీ నేడు వాస్తవ రూపం దాల్చాయని నొక్కిచెప్పారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్రత్యక్ష బదిలీ ద్వారా దేశ ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల్లో రూ.34 ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా జమ చేసినట్లు పేర్కొన్నారు. ముద్ర ప‌థ‌కం కింద యువతకు ఉపాధి-స్వయం ఉపాధి కోసం రూ.28 లక్షల కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.75 లక్షల కోట్ల మేర రైతులకు చేయూతనిచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో పారదర్శకత లోపంవల్ల నిధుల బదిలీలో స్వాహాపర్వం చోటుచేసుకున్నదని ఆయన గుర్తుచేశారు. ‘‘అవినీతి అంతమైతే అభివృద్ధి ఆరంభమవుతుంది... అది అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’ అన్నారు. సుపరిపాలన ఫలితంగా ఆరోగ్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పన, కొత్త రహదారులు/రైలు మార్గాల నిర్మాణం వగైరాలను కూడా ఆయన ప్రస్తావించారు.

   ఇలాంటి కార్య‌క్ర‌మాలు వికసిత చ‌త్తీస్‌గ‌ఢ్ సృష్టికి తోడ్పడతాయని, రానున్న ఐదేళ్లలో భార‌త‌దేశం ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవతరించాక, ఛత్తీస్‌గఢ్ కూడా అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతుందని ప్రధాని అన్నారు. ‘‘తొలిసారి ఓటర్లు... ముఖ్యంగా పాఠశాల, కళాశాలల్లో చదివే యువతరానికి ఇదొక సదవకాశం. వికసిత ఛత్తీస్‌గఢ్ వారి కలలను నెరవేరుస్తుంది’’ అని చెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఎన్టీపీసీ ‘లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్’ తొలిదశను (2x800 మెగావాట్ల) జాతికి అంకితం చేశారు. అలాగే రాయ్‌గఢ్ జిల్లాలో (మరో 2x800 మెగావాట్ల) ఇదే ప్రాజెక్టు 2వ దశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలిదశను దాదాపు రూ.15,800 కోట్లతో నిర్మించగా, రెండో దశ ప్రాజెక్టును కూడా ఇదే ప్రాంగణంలో అందుబాటులోగల స్థలంలోనే నిర్మించాల్సి ఉంది. కాబట్టి, విస్తరణకు అదనపు భూమి అవసరం లేకపోయినా, రూ.15,530 కోట్ల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. అత్యంత సమర్థ సూపర్ క్రిటికల్ సాంకేతికత (తొలిదశ)తోపాటు అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ (రెండోదశ)తో కూడిన ఈ ప్రాజెక్ట్ తక్కువ స్థాయిలో నిర్దిష్ట బొగ్గు వినియోగంసహా  కర్బన ఉద్గార పరిమాణానికి హామీ ఇస్తుంది. ఈ రెండు దశల కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే 50 శాతం విద్యుత్తును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికే కేటాయించారు. అయినప్పటికీ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, దమన్-దయ్యు, దాద్రా-నాగర్ హవేలీ వంటి అనేక ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పరిస్థితి మెరుగు దిశగానూ ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది.

   ఆగ్నేయ భారత బొగ్గు క్షేత్రాల లిమిటెడ్ (ఎస్ఇసిఎల్‌) సంబంధిత మూడు కీలకమైన ‘ఫస్ట్ మైల్ కనెక్టివిటీ’ (ఎఫ్‌ఎంసి) ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. వీటి కోసం రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేయగా, బొగ్గు సత్వర-పర్యావరణ హిత, సమర్థ యాంత్రిక తరలింపు ప్రక్రియలో ఇవి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టులలో ‘ఎస్ఇసిఎల్‌’ డిప్కా ఏరియా, ఛాల్‌లోని డిప్కా ‘ఒసిపి’ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, రాయ్‌గఢ్ ప్రాంతంలోని బరౌడ్ ‘ఒసిపి’ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఉన్నాయి. భూగర్భ తవ్వకపు బిలం ఉపరితలం నుంచి బొగ్గు నిర్వహణ ప్లాంట్లకు సిలోస్, బంకర్‌, కన్వేయర్ బెల్టుల ద్వారా వేగవంతమైన లోడింగ్ వ్యవస్థతో బొగ్గు యాంత్రిక తరలింపునకు ‘ఎఫ్ఎంసి’ ప్రాజెక్టులు తోడ్పడతాయి. రోడ్డు ద్వారా బొగ్గు రవాణా తగ్గింపువల్ల ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాల తగ్గుదలసహా బొగ్గు గనుల చుట్టూ పర్యావరణం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పడతాయి. తద్వారా గనుల చుట్టూ నివసించే ప్రజల జీవన స్థితిగతులను ఈ ప్రాజెక్టులు మెరుగుపరుస్తాయి. అలాగే తవ్వకపు బిలం ఉపరితలం నుంచి రైల్వే సైడింగ్‌లకు బొగ్గు తరలించే ట్రక్కుల కోసం వాడే డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తుంది. తద్వారా రవాణా ఖర్చులు కూడా ఆదా అవుతాయి.

   ఈ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపు దిశగా రాజ్‌నంద్‌గావ్‌లో సుమారు రూ.900 కోట్లతో నిర్మించిన సౌర ఫొటో వోల్టాయిక్ ఫలకాల ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది ఏటా 243.53 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ మేరకు 25 ఏళ్లలో దాదాపు 4.87 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది అంతేకాలంలో దాదాపు 8.86 మిలియన్ వృక్షాలు సంగ్రహించే కర్బనానికి సమానం కావడం గమనార్హం.

   ఈ ప్రాంతంలో రైల్వే మాలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించి... దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన బిలాస్‌పూర్-ఉస్లాపూర్ ఫ్లైఓవర్‌ను జాతికి అంకితం చేశారు. దీనివల్ల బిలాస్‌పూర్‌లో కత్నీ వైపు వెళ్లే ట్రాఫిక్ రద్దీ, బొగ్గు రాకపోకలు నిలిచిపోతాయి. భిలాయ్‌లో 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ప్రధాన మంత్రి అంకితం చేశారు. నడుస్తున్న రైళ్లలో సౌరశక్తి వినియోగానికి ఇది తోడ్పడుతుంది.

   ఇక రోడ్లకు సంబంధించి ఎన్‌హెచ్‌-49 పరిధిలో 55.65 కిలోమీటర్ల పొడవైన విభాగాన్ని రెండువైపులా తీర్చిదిద్ద రెండు వరుసల మార్గంగా మార్చారు. కీలకమైన బిలాస్‌పూర్, రాయ్‌గఢ్ నగరాల మధ్య అనుసంధానం మెరుగుపరిచే ఈ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. మరోవైపు ఎన్‌హెచ్‌-130 పరిధిలో 52.40 కిలోమీటర్ల పొడవైన విభాగాన్ని కూడా ఇదేవిధంగా అభివృద్ధి చేయగా, ఇది అంబికాపూర్ నగరాన్ని రాయ్‌పూర్, కోర్బాలతో అనుసంధానిస్తుంది. తద్వారా ఈ ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహతం చేస్తుంది.


(Release ID: 2008945) Visitor Counter : 111