ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎఇ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 13 FEB 2024 5:33PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘యుఎఇ’లో అధికార పర్యటనలో భాగంగా ఇవాళ అబుధాబి చేరుకున్నారు. యుఎఇ అధ్యక్షుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేకంగా సాదర స్వాగతం పలుకగా, ఆ తర్వాత అధికార లాంఛనాలతో స్వాగతించారు.

   ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ ముఖాముఖి సంభాషణలతోపాటు ప్రతినిధి స్థాయి చర్చల్లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు కొత్త రంగాల్లో సహకారంపై చర్చించారు. వాణిజ్యం-పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికార్థిక, సాంస్కృతిక, ఇంధన, భౌతిక మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాలు సహా అనేక రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. అలాగే, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.

దేశాధినేతలిద్దరూ కింది అంశాలకు సంబంధించి ఆదానప్రదానాల్లో పాల్గొన్నారు:

  • ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం: రెండు దేశాలలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. కాగా, ‘యుఎఇ’తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రెండింటిపైనా భారత్ సంతకం చేసింది.
  • విద్యుత్ సంధానం-వాణిజ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం: ఇంధన భద్రత, ఇంధన వాణిజ్యం సహా ఇంధన రంగంలో కొత్త అంశాల్లో సంయుక్త కృషికి బాటలు వేస్తుంది.
  • భారత్-మధ్యప్రాచ్య ఆర్థిక కారిడార్‌పై భారత్-యుఎఇ అంతర-ప్రభుత్వ ముసాయిదా ఒప్పందం : ఈ అంశంపై మునుపటి అవగాహన, సహకారాన్ని ఈ ఒప్పందం పెంపొందిస్తుంది. అలాగే  రెండు దేశాల మధ్య సహకారాన్ని, ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
  • డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో సహకారంపై అవగాహన ఒప్పందం: డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి సహకారం సహా విస్తృత సంయుక్త కృషి దిశగా ఇది ఒక చట్రాన్ని రూపొందిస్తుంది. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, అనుభవాల ఆదానప్రదానానికి కూడా వీలు కల్పిస్తుంది.
  • రెండుదేశాల జాతీయ పురావస్తు రంగంలో సహకార ఒడంబడిక: పురావస్తు సరంజామా పునరుద్ధరణ-సంరక్షణసహా ఈ రంగంలో విస్తృత ద్వైపాక్షిక సహకారానికి ఇది రూపమిస్తుంది.
  • వారసత్వం-మ్యూజియంల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం: గుజరాత్‌లోని లోథాల్‌లోగల సముద్ర వారసత్వ ప్రాంగణానికిమద్దతిచ్చే లక్ష్యంతో రెండు దేశాల మధ్య చర్చలకు ఇది దోహదం చేస్తుంది.
  • భారత్-యుఎఇ తక్షణ చెల్లింపు వేదికలు యూపీఐ-ఎఎఎన్ఐ అంతర-సంధాన ఒప్పందం: రెండు దేశాల మధ్య నిరంతర సరిహద్దు లావాదేవీల సౌలభ్యానికి ఇది తోడ్పడుతుంది. నిరుడు జూలైలో గౌరవనీయ ప్రధానమంత్రి అబుధాబి పర్యటన సందర్భంగా సంతకం చేసిన చెల్లింపులు-సందేశాల వ్యవస్థలపై అంతర-సంధాన అవగాహన ఒప్పందానికి అనుగుణంగా తాజా ఒప్పందం రూపొందింది.
  • భారత్-యుఎఇ డెబిట్/క్రెడిట్ కార్డులు రూపే-జేవాన్ అంతర సంధాన ఒప్పందం: ఆర్థిక రంగ సహకార విస్తృతి దిశగా ఇదొక కీలక చర్య. దీనివల్ల యుఎఇ అంతటా రూపే సార్వత్రిక ఆమోదం పెరుగుతుంది.

   డిజిటల్ ‘రూపే’ క్రెడిట్/డెబిట్ కార్డు దొంతర ప్రాతిపదికగా యుఎఇ దేశీయకార్డు జేవాన్‌ను ప్రారంభించడంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అనంతరం జేవాన్ కార్డు ద్వారా నిర్వహించిన లావాదేవీని అధినేతలిద్దరూ తిలకించారు.

   ఇంధన రంగంలో భాగస్వామ్య బలోపేతంపైనా వారిద్దరూ చర్చించారు. ముడిచమురు, వంటగ్యాస్ రంగాల్లో యుఎఇ అతిపెద్ద వనరులలో ఒకటి కాగా, దీంతోపాటు ప్రస్తుతం ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జి) కోసం దీర్ఘకాలిక కాంట్రాక్టులపై వారు హర్షం వ్యక్తం చేశారు.

   కాగా, ప్రధాని పర్యటనకు ముందు ‘రైట్స్’ లిమిటెడ్ సంస్థ, గుజరాత్ మారిటైమ్ బోర్డు అబుధాబి రేవుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓడరేవుల మౌలిక సదుపాయాల నిర్మాణంతోపాటు రెండు దేశాల మధ్య అనుసంధానం మెరుగుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయి.

   అబుధాబిలో ‘బిఎపిఎస్’ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంలో ఔదార్యం ప్రదర్శించడంతోపాటు మద్దతు తెలిపినందుకుగాను గౌరవనీయ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. యుఎఇ-భారత్ మధ్య లోతైన స్నేహ, సాంస్కృతిక బంధానికి బిఎపిఎస్ ఆలయం గర్వకారణం మాత్రమేగాక సహనం, సామరస్యం, శాంతియుత సహజీవనంపై యుఎఇ అంతర్జాతీయ నిబద్ధతకు ప్రతీకగా ఉభయపక్షాలూ అభివర్ణించాయి.



(Release ID: 2005981) Visitor Counter : 53