ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిషాలోని సంబ‌ల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన పలు విద్యుత్ ప్రాజెక్టుల విలువ రూ.28,980కోట్లు;

జాతీయ రహదారుల పరిధిలో రూ.2110 కోట్లతో అభివృద్ధి
చేసిన మూడు రోడ్డు విభాగాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం;

రైల్వే రంగంలో రూ.2146 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం... శంకుస్థాపన;

సంబ‌ల్‌పూర్‌ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన;

పూరీ-సోనేపూర్-పూరి వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ను పచ్చజెండా ఊపి సాగనంపిన ప్రధానమంత్రి ;

సంబల్‌పూర్‌లో ఐఐఎం శాశ్వత ప్రాంగణం ప్రారంభం;

‘‘నేడు భరతమాత ఉత్తమ పుత్రులలో ఒకరైన మాజీ ఉప ప్రధానమంత్రి
లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’’;

‘‘ఒడిషాను విద్య.. నైపుణ్యాభివృద్ధి కూడలిగా
మార్చేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేసింది’’;

‘‘అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి చెందితేనే వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది’’;

‘‘గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఒడిషా ఎంతో ప్రయోజనం పొందింది’’

Posted On: 03 FEB 2024 3:34PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒడిషాలోని సంబల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో ఇంధన రంగానికి ఊపునిచ్చే సహజ వాయువు, బొగ్గు, విద్యుదుత్పాదన వంటివి సహా జాతీయ రహదారులు, రైల్వేలు, ఉన్నత విద్యా రంగం సంబంధిత కీలక ప్రాజెక్టులున్నారు. ఈ సందర్భంగా ఐఐఎం-సంబల్‌పూర్ నమూనాతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా శ్రీ మోదీ తిలకించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ- విద్య, రైల్వే, రోడ్లు, విద్యుత్, పెట్రోలియం రంగాల్లో దాదాపు రూ.70,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు నేడు ప్రారంభించబడటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒడిషా ప్రగతి ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఒడిషాలోని పేదలు, కార్మికులు, రోజుకూలీలు, వ్యాపారులు, రైతులు తదితర అన్నివర్గాల వారికి ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ఫలితాలు అందుతాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఒడిషా యువతకు వేలాది కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయని చెప్పారు.

   భారత మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ లాల్ కృష్ణ అద్వానీకి ‘భారతరత్న’ ప్రదానం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఉప ప్రధానిగానే కాకుండా హోం మంత్రిగా, సమాచార-ప్రసార శాఖ మంత్రిగానూ శ్రీ అద్వానీ అనుపమాన సేవలందించారని కొనియాడారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం పట్ల అత్యంత విధేయతగల పార్లమెంటు సభ్యునిగా దశాబ్దాల అనుభవం ఆయన సొంతమని అభివర్ణించారు. ‘‘అద్వానీ జీని ‘భారతరత్న’తో సత్కరించడం ద్వారా తన సేవకు జీవితాన్ని అంకితం చేసినవారిని దేశం ఎన్నటికీ విస్మరించబోనని చాటింది’’ అని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. శ్రీ ఎల్. కె.అద్వానీ తనపై ప్రేమాభిమానాలు చూపడమేగాక ఆశీర్వదించి, మార్గనిర్దేశం చేయడం తన అదృష్టమని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే పౌరులందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, అద్వానీ జీకి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

   ఒడిషాను విద్య, నైపుణ్యాభివృద్ధి కూడలిగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేసిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు గత దశాబ్ద కాలంలో ‘ఐఐఎస్ఇఆర్’-బెర్హంపూర్ సహా భువనేశ్వర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వంటి ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటుతో ఒడిషా యువత భవితవ్యం ఎంతో మారందన్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక మేనేజ్‌మెంట్ సంస్థగా ఇవాళ ‘ఐఐఎం-సంబల్‌పూర్‌ శాశ్వత ప్రాంగణం ప్రారంభంతో దేశ ప్రగతిలో రాష్ట్రం పాత్ర మరింత బలోపేతం చేయబడిందన్నారు. కాగా, మహమ్మారి సమయంలో ఈ సంస్థకు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) శంకుస్థాపన చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కరోనా విజృంభణ ఫలితంగా ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి దీన్ని పూర్తి చేయడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి చెందితేనే వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తదనుగుణంగా ప్రతి రంగంలో ఒడిషాకు సంపూర్ణ మద్దతునిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ మేరకు గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఒడిషాలో పెట్రోలియం, పెట్రో రసాయనాల రంగంలో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు 12 రెట్లు పెరిగాయని, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో 50,000 కిలోమీటర్ల, రాష్ట్ర పరిధిలో 4,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించినట్లు వివరించారు.

   రాష్ట్రంలో ఇవాళ మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ- ఒడిషా, జార్ఖండ్ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానం సహా ప్రయాణ దూరం కూడా తగ్గుతుందని ప్రధాని తెలిపారు. గనుల తవ్వకం, విద్యుత్తు, ఉక్కు పరిశ్రమలకు సంబంధించి ఈ ప్రాంతం తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అనుసంధాన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం మొత్తంలో కొత్త పరిశ్రమల స్థాపన అవకాశాలు కలుగుతతాయని, తద్వారా వేలాది కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయని పేర్కొన్నారు. సంబల్‌పూర్-తాల్చేర్ విభాగంలో రైలు మార్గం డబ్లింగ్, జార్-తర్భా నుంచి సోన్‌పూర్ సెక్షన్ వరకూ కొత్త రైలు మార్గం ప్రారంభం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘పూరీ-సోన్‌పూర్ ఎక్స్‌ ప్రెస్ ద్వారా సుబర్ణపూర్ జిల్లా కూడా అనుసంధానితమై భక్తులకు జగన్నాథుని దర్శన సౌలభ్యం ఇనుమడిస్తుంది’’ అని ఆయన చెప్పారు. అలాటే ఇవాళ ప్రారంభించిన సూపర్ క్రిటికల్, అల్ట్రా-సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఒడిషాలోని ప్రతి కుటుంబానికి సరిపడా విద్యుత్తును అందుబాటు ధరతో అందించగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అనుసరించిన విధానాల ద్వారా ఒడిషా ఎంతో ప్రయోజనం పొందింది’’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా గనుల తవ్వకం రంగంలో విధాన మార్పుల ద్వారా ఒడిషా ఆదాయం 10 రెట్లు పెరిగిందని ఆయన వెల్లడించారు.  మునుపటి విధానాల వల్ల గనుల తవ్వకం జరిగే ప్రాంతాలు, రాష్ట్రాలకు ఖనిజోత్పత్తి ప్రయోజనాలు దక్కేవి కావని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, తాము జిల్లా మినరల్ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడంతో ఈ సమస్యకు పరిష్కార కావడం ఆ రంగం అభివృద్ధిలో పెట్టుబడులకు భరోసా లభించిందని నొక్కిచెప్పారు. అలాగే ఏ ప్రాంతంలో మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం వస్తున్నదో అక్కడి అభివృద్ధికి ఊతం లభించిందన్నారు. ఇందులో భాగంగా ‘‘ఒడిషాకు ఇప్పటిదాకా రూ.25,000 కోట్లకుపైగా నిధులు దక్కగా, ఆ సొమ్మును మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్నారు’’ అని ప్రధాని తెలిపారు. చివరగా, ఒడిషా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇదే అంకిత భావంతో ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తుందని హామీ ఇస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఒడిషా గవర్నర్ శ్రీ రఘువర్ దాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్, కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపకన శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   దేశ ఇంధన భద్రత బలోపేతం దిశగా ప్రధాని దార్శనికతకు అనుగుణంగా ఒడిషాలోని సంబల్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన సహా మరికొన్ని జాతికి అంకితం చేయబడ్డాయి:-

   ప్రధానమంత్రి ‘జగదీష్‌పూర్-హల్దియా అండ్ బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బిడిపిఎల్‌)’ కింద ‘ధమ్రా-అంగుళ్ పైప్‌లైన్ సెక్షన్’ (412 కి.మీ)ను ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి ఊర్జా గంగా’లో భాగంగా రూ.2450 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిషాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. అలాగే ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్‌లోని ‘నాగ్‌పూర్-ఝార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ విభాగం’ (692 కి.మీ)’ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది రూ.2660 కోట్లకుపైగా వ్యయంతో రూపొందుతుండగా- దీనివల్ల ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు సహజవాయువు సౌలభ్యం మెరుగుపడతుంది.

   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌ధానమంత్రి దాదాపు రూ.28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టుల‌కు శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. ఈ మేరకు ఒడిషాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఎన్టీపీసీ దార్లిపాలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (2x800 మె.వా), ఎన్ఎస్‌పిసిఎల్‌-రూర్కెలా పవర్ ప్రాజెక్ట్-II విస్తరణ ప్రాజెక్ట్ (1x250 మె.వా)లను ఆయన జాతికి అంకితం చేశారు. ఒడిషాలోని అంగుళ్ జిల్లాలో ఎన్టీపీసీ-తాల్చేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, స్టేజ్-III (2x660 మె.వా) ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఒడిషాతోపాటు పలు ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తాయి.

   ఇవే కాకుండా రూ.27000 కోట్లకుపైగా విలువైన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌సి) తాలాబిరా థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. స్వయం సమృద్ధ భారతంపై ప్రధాని దార్శనికతకు అనుగుణంగా ఈ అత్యాధునిక ప్రాజెక్ట్ ద్వారా 24 గంటలూ విశ్వసనీయ రీతిలో అందుబాటు ధరకు విద్యుత్తు అందుతుంది. తద్వారా దేశ ఇంధన భద్రతకు గణనీయంగా దోహదం చేయడమేగాక ఆర్థిక వృద్ధి, శ్రేయస్సులోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

   ‘ఫస్ట్ మైల్ కనెక్టివిటీ’ (ఎఫ్ఎంసి) ప్రాజెక్టులుసహా మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు- వీటిలో రూ.2,145 కోట్లతో నిర్మించిన అంగుళ్ జిల్లాలోని తాల్చెర్ బొగ్గు క్షేత్రంల భువనేశ్వరి ఫేజ్-1, లజ్‌కురా రాపిడ్ లోడింగ్ సిస్టమ్ (ఆర్ఎల్ఎస్) ఉన్నాయి. ఇవి ఒడిషా నుంచి  పొడి ఇంధన నాణ్యతతోపాటు సరఫరా వేగాన్ని కూడా పెంచుతాయి. రాష్ట్రంలోని జార్సుగూడ జిల్లాలో రూ.550 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ‘ఐబి వ్యాలీ వాషరీ’ని కూడా ప్రధాని ప్రారంభించారు. ఇది నాణ్యత మెరుగుదిశగా బొగ్గు ప్రాసెసింగ్‌లో ఆవిష్కరణాత్మకత, సుస్థిర సూచించే వినూత్న మార్పు నమూనాకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రూ.878 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 50 కిలోమీటర్ల పొడవైన జార్సుగూడ-బర్పాలి-సర్దేగా రైలు మార్గం ఫేజ్-1 రెండో మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

   రాష్ట్రంలో దాదాపు రూ.2110 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వీటిలో ఎన్‌హెచ్‌-215 (కొత్త నంబర్ 520) పరిధిలోని రిములి-కొయిడా విభాగం నాలుగు వరుసలుగా విస్తరణ; ఎన్‌హెచ్‌-23 (కొత్త నం.143) పరిధిలోని బిరామిత్రపూర్-బ్రహ్మణి బైపాస్ ఎండ్ విభాగం; బ్రాహ్మణి బైపాస్ ఎండ్-రాజముండా విభాగం నాలుగు వరుసలుగా విస్తరణ పనులున్నాయి. ఈ ప్రాజెక్టులవల్ల అనుసంధానం మెరుగు కావడమే కాకుండా ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.

  ప్ర‌ధానమంత్రి దాదాపు రూ.2146 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులలో కొన్నిటికి శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా సంబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. దీన్ని శైలశ్రీ రాజభవనం నిర్మాణశైలి స్ఫూర్తితో అభివృద్ధి చేస్తారు. ఇక సంబల్పూర్-తాల్చేర్ రైలు మార్గం డబ్లింగ్ (168 కి.మీ), జార్తర్భా-సోనేపూర్ కొత్త రైలు మార్గం (21.7 కి.మీ) ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వీటివల్ల ఈ ప్రాంతంలో రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం ఇనుమడిస్తుంది. మరోవైపు ఈ ప్రాంతంలోని రైలు ప్రయాణికులకు అనుసంధాంన మెరుగు దిశగా పూరీ-సోనేపూర్-పూరీ వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ను ప్రధానమంత్రి జెండా ఊపి సాగనంపారు.

   కాగా, ఐఐఎం-సంబల్‌పూర్ శాశ్వత ప్రాంగణానికి ప్రారంభోత్సవం చేయడంతోపాటు జార్సుగూడ ప్రధాన తపాలా కార్యాలయం వారసత్వ భవనాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

 

 

***

DS/TS/RT



(Release ID: 2002466) Visitor Counter : 69